Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

బెర్ట్రాండ్ రస్సెల్ (భావాలు అనుభవాలు)

Bertrand-Russell
Photo Credit: Wikipedia

బెర్ట్రాండ్ రస్సెల్, 20వ శతాబ్దంలో వినుతికెక్కిన తత్వవేత్త, తార్కికుడు మరియు గణిత శాస్త్రవేత్త. వీరు 1872 మే 18న వేల్స్ దేశంలో కులీనవర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు. వీరి పితామహులైన జాన్ రస్సెల్ (మొదటి ఎర్ల్ రస్సెల్), యునైటెడ్ కింగ్డమ్ కి రెండు సార్లు 1846 నుండి 1852 వరకు, మరలా 1865 నుండి 1866 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. పుట్టిన తరువాత కనీసం నాలుగేళ్ళయినా నిండక ముందే తల్లిదండ్రులను కోల్పోయిన రస్సెల్ నాన్నమ్మ సంరక్షణలో పెరిగాడు.

రస్సెల్ నాన్నమ్మ ఐన కౌంటెస్ రస్సెల్ మతపరంగా సాంప్రదాయకవాది అయినప్పటికీ మిగతా విషయాల్లో అభ్యుదయ భావాలు కల వ్యక్తి. ఆమె డార్విన్ సిద్ధాంతాన్ని, ఐరిష్ స్వపరిపాలనను సమర్ధించారు. బైబిల్లో ఆమెకు నచ్చిన సూక్తి “Exodus 23:2 : Thou shalt not follow a multitude to do evil”.

ఈ సూక్తి చెప్పే నీతి ఏంటంటే అత్యధికుల నమ్మకాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు అన్నివేళలా ఒప్పవ్వాలని లేదు, కావున అత్యధికుల నమ్మకాలు, అభిప్రాయాలు, నిర్ణయాలతో మనం ప్రభావితులం కాకూడదు, వాటిని గుడ్డిగా అనుసరించకూడదు అని. ఈ సూక్తి బెర్ట్రాండ్ రస్సెల్ కు జీవిత నినాదంగా మారింది.

ఒక మానవవాద మేధావిగా 98 ఏండ్ల నిండు జీవితాన్ని గడిపి ఫిబ్రవరి 2, 1970న మరణించిన రస్సెల్ తన సందేశంగా భావితరాలకు రెండు విషయాలను చెప్పారు, ఒకటి మేధోపరమైనది, మరోటి నైతిక పరమైనది.

మేధోపరమైన విషయం ఏంటంటే, ఏదైనా విషయం గురించి మీరు అధ్యయనం చేస్తున్నపుడు లేదా ఏదైనా తత్త్వం గురించి తెలుసుకుంటున్నపుడు, మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే ఇందులో వాస్తవాలేంటి? ఆ వాస్తవాలు తెలియజేసే సత్యమేంటి? అని,

అలాకాకుండా నీకు దేన్ని నమ్మాలని వుందో? దేన్ని నమ్మితే నీకు లౌకిక లేదా సామాజిక ప్రయోజనాలు ఉంటాయని నీవు భావిస్తున్నావో? వాటి ప్రభావాలకు లోను కావడం సరికాదు.

నీవు కేవలం ఆ విషయంలోని వాస్తవాలను మాత్రమే చూడాలి.

అలానే నైతిక పరమైనది ఏంటంటే? ప్రేమ వివేకవంతమైనది, ద్వేషించడం మూర్ఖత్వం. అంతకంతకూ దగ్గరవుతున్న ఈ ప్రపంచంలో ఒకరిపట్ల ఒకరం సామరస్యంతో మెలగాలి. ప్రజలందరూ ఈ భూమిపై చావకుండా కలిసి బ్రతకాలంటే ఈ భూమిపై మానవజాతి కొనసాగడానికి అవసరమైన సామరస్యంతో మెలగడం మనమందరం నేర్చుకుని తీరాలి.

ఇంతటి విశాలమైన భావాలను వ్యక్తపరచిన రస్సెల్ యుక్త వయసులో నిరాశానిస్పృహలతో ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ బాధపడేవాడట. అలాంటి సమయంలో ప్రకృతి పట్ల ప్రేమ, పుస్తకాల మీద మోజు, గణిత శాస్త్రం పై అనురక్తి తనను ఆ ఆలోచనల నుండి బయట పడేశాయని తన స్వీయచరిత్రలో రస్సెల్ రాశారు.

తన పదిహేనవ సంవత్సరం నుండీ మతం గురించి ఆలోచించడం మొదలుపెట్టిన రస్సెల్ తన పద్దెనిమిదో  ఏటా కల్లా హేతువాదిగా మారాడు. అదే అతన్ని ఓ మేధావిగా తీర్చిదిద్దింది.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in June 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!