'విజయ' నగరాన్ని ధ్వంసం చేయడానికి కారణమేమిటి?
తాళికోట యుద్ధంలో విజయనగరం ఓడిపోయింది. రాజుగా వ్యవహరిస్తున్న రామరాయలు వధించబడ్డాడు. యుద్ధంలో గెలుపోటములు సహజమే. కానీ తాళికోట యుద్ధ ఫలితం యొక్క ప్రభావం రాజకుటుంబంపైన మాత్రమే కాకుండా దక్షిణాపథ ప్రజల సామాజిక సాంస్కృతిక జీవనంపైనా పడింది. నగరంగా విజయనగరం కనుమరుగయ్యింది. విజయనగర సామ్రాజ్యమే బలహీనపడింది.
ఇటీవలే పాత్రికేయులు రాహుల్ కుమార్ గారు "ఆధునిక ప్రపంచం అసలు గుట్టు ఏమిటి?" అనే వ్యాసంలో "ప్రపంచ జనాభా ఇపుడు 800 కోట్లు దాటింది. కానీ క్రీ.శ 1400వ సంవత్సరంలో అది 38 కోట్లు మాత్రమే. ఆనాడున్న 25 పెద్ద నగరాల్లో తొమ్మిది చైనాలో ఉండేవి. చైనాలోని నాన్జింగ్ అత్యంత పెద్ద నగరం. రెండోది కర్ణాటకలోని మన విజయనగరం. ఇక మూడోది కైరో. ప్యారిస్ నాలుగో స్థానంలో ఉండేది" అని రాశారు. అటువంటి నగరం దోపిడీకి మాత్రమే కాకుండా ధ్వంసం కూడా కావడానికి కారణం ఒక వీధి కొట్లాట అనే విషయం తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
రఫీయుద్దీన్ షిరాజీ రాసిన "తజ్ కిరద్ అల్ ములుక్" బీజాపూర్ ఆదిల్షా వంశం గురించి చాలా విలువైన సమాచారం అందిస్తుంది. ఆ గ్రంథంలో విజయనగర విధ్వంస గాథ ఉంది.
రఫీయుద్దీన్ షిరాజీ వర్తకుడు. వ్యాపార నిమిత్తం పర్షియా నుండి భారతదేశం వచ్చాడు. ఇతను క్రీ.శ 1560లో బీజాపూర్ చేరి ఆలీ ఆదిల్ షా - I (1558-80) కొలువులో చేరాడు. ఆలీ ఆదిల్ షా వద్ద సైన్యాధికారి, కోశాధికారి వంటి పదవుల్లో రాణించి బీజాపూర్ కోటకు గవర్నర్ అయ్యాడు. తరువాత ఇబ్రహీం ఆదిల్ షా - II (1580-1627) హయాంలో అహమ్మద్ నగర్ కు రాయబారిగా పంపబడ్డాడు. షిరాజీ తాను గడించిన అనుభవం, సంపాదించిన జ్ఞానం ఆధారంగా "తజ్ కిరద్ అల్ ములుక్" గ్రంథాన్ని క్రీ.శ 1609లో రచించడం మొదలుపెట్టి క్రీ.శ 1611లో పూర్తి చేశారు.
ఈ గ్రంథంలో ఆలీ ఆదిల్ షా I, ఇబ్రహీం ఆదిల్ షా II పరిపాలనా కాలాల గురించి, అదే కాలానికి చెందిన అహ్మద్ నగర్ నిజాంషాలు, గోల్కొండ కుతుబ్షాలు, పర్షియా సఫీలు, విజయనగరం రాజుల గురించి కూడా వివరాలు రాయబడ్డాయి. పది అధ్యాయాలు గల ఈ గ్రంథం బహమనీ రాజుల చరిత్రతో మొదలయ్యి తైమూర్ నుండి సుల్తాన్ సలీమ్ (అనగా క్రీ.శ 1605-1627) వరకు గల మొఘలాయుల చరిత్రతో సమాప్తమవుతుంది.
షిరాజీ తాళికోట యుద్ధ సమయంలో ఆలీ ఆదిల్ షాతోనే ఉన్నాడు. యుద్ధానంతరం ఇరవై రోజులు యుద్ధభూమి వద్దే గడిపిన ముస్లిం సేనలు తరువాత విజయనగరం వైపుకు పయనమయ్యాయి. శతాబ్దాల తరబడి శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిన విజయనగరంలో ప్రజలు ఇళ్లలోనూ, ఆలయాల్లోనూ, గుహల్లోనూ అనంతమైన సంపదను దాచి పెట్టి ఉంచారు. ఈ విషయం ముస్లిం రాజులు ఎరుగుదురు. నగరంలో ప్రవేశించగానే సేనలు సంపదను లూటీ చేయడంలో మునిగిపోయారట. విజయనగరంలో ఎన్నో కొండలు, గుహలు ఉండేవి. కొన్ని గుహలు సుమారు మూడు ఫర్ సక్ ల (ఒక ఫర్ సక్ మూడు మైళ్లకు సమానం) పొడవు ఉండేవట. ముస్లిం సేనలు దాడి చేశాక నగరంలోని ప్రజలు ఈ గుహల్లోనే తలదాచుకున్నారు. అలా వచ్చి వెళ్తున్న వారిని సైన్యం పట్టుకుని సంపదను లాక్కునేదట. అలాంటి సమాచారం తమకు చాలా సార్లు వచ్చిందని షిరాజీ రాశాడు.
ఒకసారి అలాంటి నలుగురు వ్యక్తులను పట్టుకున్నామని, చిత్రహింసలు పెట్టాక స్త్రీలు, పిల్లలు, విలువైన వస్తువులు ఉన్న గుహ గురించి వారు చెప్పారని, తమను వదిలేస్తే విలువైన కిరీటాన్ని బహుకరిస్తామని వారు చెప్పడంతో సంపదపై ఆశతో తాము వారి వెంట బయలుదేరమని షిరాజీ రాశాడు.
తరువాతి విషయం షిరాజీ మాటల్లో :- "కొంతసేపటికి గుహ యొక్క గుమ్మం వద్దకు చేరుకున్నాము. అందులోకి ప్రవేశించగానే గరుకు దార్లతో అనేక మార్గాలు కనబడ్డాయి. ముందుకుపోతే ఇబ్బందుల్లో పడతామనిపించింది. కాగడాలు, బొగ్గు తీసుకున్నాము. దారి గుర్తులుగా అక్కడక్కడా బొగ్గు పెడుతూ ముందుకు సాగాము. అక్కడక్కడా బిలాల గుండా ఆకాశాన్ని చూడగలిగాము. అక్కడి నుండి గుహలోకి కాంతి ప్రసరిస్తుంది. అర ఫర్ సక్ నడిచాక వచ్చిన వాళ్ళు చిన్న రంధ్రం వద్ద నిలిచారు. అక్కడి నుండి మూడు నాలుగు యార్డుల లోతున్న గొయ్యిలోకి దిగాలి. బందీలు ముందుకు దూకి కట్లు తొలగించుకున్నారు. లోపలి నుండి అరుపులు, ఆయుధాల శబ్దాలు వచ్చాయి. బల్లాల మొనలు చూడగానే దాడి చేస్తారనే భయంతో వచ్చిన దారినే పలాయనమై జాగ్రత్తగా వచ్చేశాము. రాజ్యంలోని కొండల్లో అలాంటి గుహలు, బిలాలూ ఇంకా అనేకం ఉన్నాయి."
ఒకరోజు నిజాం షా నగరంలో వాహ్యాళికి తన పరివారంతో బయలుదేరాడు. నగరంలోని ఒక వీధిలో కొంతమంది వీధి వ్యాపారులు, బీజాపూర్ సైన్యంలోని బీదవారు దోచుకున్న సంపదను పంచుకుంటుంటారు. అప్పుడే నిజాం షా తన పరివారంతో అక్కడికి వస్తాడు. నిజాం షా సైన్యంలోని కొందరు ఆ గుంపు వద్దకు వెళ్లి తమకూ అందులో భాగమివ్వమనడంతో గొడవై ఒకరినొకరు గాయపరచుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. ఇదంతా కళ్ళారా చూసిన నిజాం షా ఈ సంపదపై దురాశ ఇంకా పై అధికారుల్లోనూ, రాజుల్లోనూ కలిగితే అందువల్ల తలెత్తే దుష్పరిణామాలు గురించి భయపడి, తన సైన్యంలోని ముఖ్యాధికారుల్ని పిలిచి నగరం మొత్తాన్నీ కాల్చివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. సుమారు 60 మైళ్ళ విస్తీర్ణంలోని కట్టడాలు అగ్నికి ఆహుతయ్యాయి, నేలమట్టమయ్యాయి.
ఇటలీ పర్యాటకుడు సిజారియో ఫెడరిసీ విజయనగరం విధ్వంసమైన రెండేళ్లకు అనగా క్రీ.శ 1567లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. ముస్లిం సేనలు వెళ్ళిపోయాక తిరుమలరాయలు నగరాన్ని మళ్ళీ జనావాసం చేయడానికి ప్రయత్నించినా సఫలం కాలేదట.
దోచిన సంపదలో కోడి గుడ్డంత వజ్రం కూడా ఉంది. దీన్నే హెన్స్ ఎగ్ డైమండ్ అనేవారు. ఈ వజ్రాన్ని రాయలు తన గుర్రపు శిరో వస్త్రానికి తూలికా భరణంగా ఉపయోగించేవాడు. ఆదిల్ షా ఈ వజ్రాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఇది విజయనగరానికి విధి పట్టించిన గతి.
good work we appreciate total team for this work