-- డా. మధు బుడమగుంట
మనుషులందరిలో ప్రవహించేది ఒకే రక్తమైననూ మానవ సమాజంలో జాతి విభేదాలు ఒకప్పుడు మెండుగా ఉండేవి. నేడు కూడా అక్కడక్కడా కనపడుతున్నాయి. అటువంటి జాతి వైషమ్యాలను తొలగించేందుకు ఎందఱో మహానుభావులు ఎంతో అభ్యుదయ సామాజిక స్పృహతో, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి అదే నిజమైన మానవత్వమని నిరూపించారు. అటువంటి వారు కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించి సమాజంలో మార్పు కొరకై శ్రమించారు. అటువంటి మహోన్నత సంఘ సంస్కర్త మరియు మంచి రచయిత్రి అయిన శ్రీమతి సావిత్రి బాయి ఫూలే నేటి మన ఆదర్శమూర్తి.
1831 జనవరి 3 న, మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ అనే గ్రామంలో సావిత్రి బాయి జన్మించింది. స్వతహాగా రైతు కుటుంబం లోనుండి వచ్చిన సావిత్రి బాయి మొదటి నుండీ ఆనాటి సమాజపు కట్టుబాట్ల మీద, అగ్రవర్ణాల ఆధిపత్యాల మీద సదభిప్రాయం ఉండేది కాదు. అందరికీ అన్ని సంప్రదాయాలు వర్తించాలనేది తన అభిమతం. కానీ నాటి స్థితిగతులు తన ఆలోచనలను తనలోనే ఉంచుకునే విధంగానే ఉండేవి.
బాల్యవివాహాల హవా నడుస్తున్న నాటి కాలంలో సావిత్రి బాయి కి తొమ్మిదవ ఏటనే వివాహం జరిగింది. ఒక విధంగా తనకు వివాహం అవడం ఒక అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకున్న జ్యోతిరావ్ పూలే, ఒక గొప్ప సంఘ సంస్కర్త. కనుకనే ఆయన ప్రోత్సాహంతో అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలని సంకల్పించి అందుకు తగిన శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అదే నాడు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్కూల్ అయింది.
నాటి నిమ్న వర్గాల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప భర్తతో కలిసి నూతన వ్యవస్థ కోసం, బడుగు జీవుల బంగారు బతుకుల కొఱకు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఉద్యమించారు. ఆమె ప్రేమస్వరూపిణి. మనుషులందరూ ఒక్కటే. జాతి బేధాలు, వర్ణ బేధాలు, వర్గ వైషమ్యాలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని ధృడంగా నమ్మిన మహా సాధ్వి మన సావిత్రి బాయ్. ‘బాల హత్య ప్రతిభంధక్ గృహ’ నిర్వహించిన మొట్టమొదటి భారత మహిళా సాధ్వి మన సావిత్రీ బాయ్.
సామాజంలో చైతన్యం తేవాలంటే అన్ని విషయాలలో అవగాహనతో పాటు చక్కటి రచనా పటిమ మరియు అనర్గళంగా ఉపన్యసించే సామర్ధ్యం ఉండాలి. ఆ లక్షణాలన్నీ మన సావిత్రి బాయి లో పుష్కలంగా ఉన్నాయి. తను రచించిన కవితలు మరియు చేసిన ఉపన్యాసాలన్నీ పుస్తక ప్రచురణకు నోచుకొన్నాయి.
గ్రామీణ మహిళలలో చదువు వాళ్ళ కలిగే ఉపయోగాలపై అవగాహన కలిగించి కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించిన మహా విద్యా దానశీలి. ఆ దంపతుల కృషి అంతటితో ఆగిపోలేదు. ఎన్ని అవమానాలు, బెదిరింపులు, దాడులు జరిగినను మొక్కవోని ధైర్యంతో బలమైన ఒకే సంకల్పంతో మొత్తం 52 పాఠశాలలు వారి జీవితకాలంలో నిర్వహించారు. అది నాటి సమాజంలో అతి పెద్ద సాహసమే అని చెప్పాలి.
మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి ‘మహిళా సేవామండల్’ ను 1852లో స్థాపించింది. ఒక సామాజిక అభ్యుదయ వాదిగా ఎన్నో సమస్యలకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఉద్యమించింది. నాటి సమాజ సంప్రదాయాలై, మహిళలను అన్నివిధాలా అణిచివేతకు గురిచేస్తున్న బాల్యవివాహలకు, సతీసహగమన విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మన సావిత్రీ బాయి. కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా వీరు స్థాపించిన సంస్థ అవిరళ కృషిచేసింది.
వైధవ్యమంటే ఏమిటో కూడా తెలియన పసివయసులో సమాజంలో విధవలుగా ముద్రపడిన ఎంతో మంది ఆడపిల్లలను అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలనా చూసిన మహోన్నత మహిళా మూర్తి సావిత్రి. అంతేకాదు, వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా నిరసించి, ఆ క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 1873 సెప్టెంబరు 24న జ్యోతీరావ్ పూలే స్థాపించిన ‘‘సత్యసోధక్ సమాజ్’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థ యొక్క మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది.
1897 లో ప్లేగు వ్యాధి ప్రబలంగా వ్యాపించినప్పుడు పూణే నగరమంతా ఎడారిగా మారింది. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. చివరకు ఆ ప్లేగు వ్యాధే ఆ మహాసాధ్విని కూడా కబళించింది. మార్చి 10, 1897 లో ఆమె స్వర్గస్తులైనారు. అయినా ఆమె మనందరికీ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ రూపంలో సదా గుర్తుండిపోతుంది. ఆమె చేసిన సేవలు, నడిపిన ఉద్యమాల ఫలితాలు నేటి మహిళా జీవితాలలో మనం చూస్తూనే వుంటాం.