"ఏమయ్యా సత్యం? ఎప్పుడు చూసినా ముఖం దిగులుగా పెట్టుకుని కూర్చుంటావ్? నే చెప్పిన పని చెయ్! నీ ఆర్థిక సమస్యలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోతాయ్! లేకపోతే నువ్విలాగే ముసలివాడివైపోయి నీ సర్వీసు కాస్తా అయిపోతుంది. ఇన్నేళ్ళ నీ కష్టానికి ప్రతిఫలం లేకుండాపోతుంది!", నల్లటి పెదవుల మధ్యలోంచీ గుప్పుగుప్పుమని తెల్లటి పొగను వదులుతూ, తన చేతిలోని సిగరెట్టువంక చూసి అన్నాడు శరత్.
"సార్! నాకెన్ని కష్టాలొచ్చినా తప్పు పని మాత్రం చెయ్యలేను సార్. మీరు నన్ను చెయ్యమన్నది మన కంపెనీ రూల్స్ కి విరుద్ధం. అలాంటి పని చేసి సంపాదించిన డబ్బు నాకు సుఖాన్నివ్వదు!", వినయంగా ఆన్నాడు సత్యం.
"సర్లే! నీతీనియమంలాంటివి నాకు తెలియదా? మనం ఉంటున్నది కలియుగం! ఇక్కడ మనం తప్పు చెయ్యకూడదని అనుకుంటే ఎప్పటికీ గెలవలేం! అయినా నీకు గుర్తుందో లేదో ఈ కంపెనీ లో మనం ఒకేసారి చేరాం. నేను అలా అలా ప్రమోషన్లు తెచ్చుకుని కెరీర్ లో పైకి ఎదిగిపోయాను. నువ్వు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నావు. ఇరవైరెండేళ్ళు సక్రమంగా పని చేసావ్. లాభమేమీ కలగలేదు. ఒక్కపని అక్రమంగా చేసి చూడు. నీ దశ మారిపోతుంది! నాది గ్యారంటీ. నా మాట వింటే నువ్వే బాగుపడతావ్!", అన్నాడు శరత్.
"అక్రమంగా చేసిన పనితో పైఅధికారులకు దొరికిపోతే ఉన్నది కూడా ఊడుతుంది కద సార్!", అన్నాడు సత్యం.
"చేతకానివాడిలా మాట్లాడకయ్యా! నీకు కష్టం కలగకుండా నేను చూసుకుంటాగా! రేపు ఉదయం ఆఫీసుకు రాగానే నేను చెప్పిన ఫైళ్లల్లో సంతకాలు పెట్టెయ్. ఇంకేం మాట్లాడకు. నా మాట కాదంటే కూడా నీ ఉద్యోగం పోతుందని నీకు తెలుసుగా!", బెదిరించినట్లుగా అంటూ, తన చేతిలోని సిగరెట్టు పీకను కాలికింద నలిపేసి, పార్కింగులో ఉన్న తన కారువద్దకు రివ్వున వెళ్ళిపోయాడు శరత్.
శరత్, సత్యంలు ఒకే వయసువారు. వారు పనిచేస్తున్న కంపెనీలో ఇంచుమించు ఒకేసారి చేరారు. మొదటినుండీ ఇద్దరూ ఒకే శాఖలో పని చేస్తున్నారు కూడా. పత్రాలను సరి చూసి, ఋణాలను మంజూరు చెయ్యడం వారి ఉద్యోగం. ఉద్యోగంలో త్వరగా ఉన్నత స్థానానికి ఎదగాలన్న కోరికతో తప్పుదారిపట్టి, ఇవ్వకూడనివారికి ఋణాలు మంజూరు చేసి, తక్కువ సమయంలో పెద్ద హోదాకు చేరుకున్నాడు శరత్. సత్యం మాత్రం తనకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తూ, నియమనిబంధనలకు అనుగుణంగా ఋణాలను ఆమోదిస్తూ, కష్టానికి వెరవకుండా కేవలం స్వయంకృషిని నమ్ముకుని ఇంకా చిరుద్యోగిగానే ఉన్నాడు.
సత్యానికి ఇద్దరు పిల్లలు - ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి తొమ్మిదేళ్ళవాడు. అమ్మాయి పెళ్ళీడుకొస్తోంది. సత్యం తల్లి లలితమ్మ, తండ్రి సాంబయ్యలు కూడా సత్యంతోనే ఉంటారు. ఇంటిల్లుపాదికీ సత్యం జీతం ఒక్కటే ఆధారం. రోజురోజుకూ ఖర్చులు పెరిగిపోతున్నా తనకు వచ్చే ఆదాయం పెరగకపోయేసరికి అప్పుడప్పుడూ ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులవల్ల అసహనానికి గురవుతూ ఉండేవాడు సత్యం. అందులోనూ పిల్లల చదువులకూ, పెళ్ళిళ్ళకూ డబ్బులు ఆదా చెయ్యడం, తన తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకోవడంవంటి బాధ్యతలు తరచుగా సత్యానికి ఒత్తిడిని కలిగిస్తూ ఉండేవి. ధర్మాన్ని పట్టుకుంటే కష్టాలు తప్పవని అనుకుంటూ, 'లోకంతోపాటే మనం!' అని ఒక నిర్ణయానికొచ్చేసిన సత్యం శరత్ ను సహాయమడిగాడు. అందుకు శరత్ తను ఎంచుకున్న అక్రమమార్గాన్నే సత్యానికీ చూపించాడు. సహజంగా ధర్మబుద్ధి ఉండటంచేత శరత్ చెప్పిన తప్పుడు పని చెయ్యడానికి సత్యం మనసు ఒప్పుకోలేదు.
శరత్ కారెక్కి వెళ్ళిపోగానే తన స్కూటర్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు సత్యం. శరత్ చెప్పిన మాటలు సత్యం చెవుల్లో పదే పదే రింగుమని మోగుతున్నాయి. అతడి మనసంతా ఆలోచనలతో అల్లకల్లోలమైపోతోంది. ఎంత ఆలోచించినా సంతకాల విషయంలో ఏం చెయ్యాలో ఎటూ పాలుపోవట్లేదు సత్యానికి. అంతలో సత్యం పక్కనుండీ శరత్ కారు వెళ్ళింది. అందులో శరత్ పిల్లలు కూడా ఉన్నారు. వారి చేతుల్లో ఐస్ క్రీములున్నాయి. వారు ఖరీదైన బట్టలు ధరించి ఉన్నారు. వారి ముఖాలు ఆనందంతో మెరిసిపోతున్నాయి. సత్యానికి పాత బట్టలు వేసుకుని, 'నాన్నా! ఒక్క ఐస్ క్రీం కొనిపెట్టవా?', అని అడుగుతున్న తన పిల్లలు గుర్తుకువచ్చారు. డబ్బులు లేక 'తర్వాత కొంటాలే!', అంటూ వారి కోరిక తీర్చడం వాయిదా వేసిన సందర్భాలెన్నో సత్యం కళ్లముందు కదలాడాయి.
'మంచితనానికి రోజులుకావివి! ఇంకెన్నాళ్ళు ఇలాగే గొడ్డు చాకిరి చేస్తూ డబ్బులకోసం ఎదురు చూడను?? శరత్ చెప్పినట్లు ఆ ఫైళ్ల మీద రేపు సంతకాలు పెట్టేసి నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటా!', అని తన మనసులో గట్టిగా అనుకున్నాడు సత్యం.
ఆ నిర్ణయంతో ఇక తన కష్టాలన్నీ తీరిపోనున్నాయన్న ఆనందంతో సత్యం తమ ఇంట్లోకి అడుగుపెట్టాడు. సత్యం భార్య శ్రావణి చిరునవ్వుతో సత్యానికి మంచినీళ్ళు అందించింది. వాటిని తాగి సేద తీరడానికి హాల్లోని సోఫాలో విశ్రాంతిగా కూర్చున్నాడు సత్యం. ఆ సమయానికి సత్యం కొడుకు చింటూ తన బామ్మ లలితమ్మ పక్కన కూర్చుని ఏవో సందేహాలు అడుగుతున్నాడు. లలితమ్మ వాటికి ఓపిగ్గా సమాధానాలు ఇస్తోంది. సత్యానికి వారి సంభాషణ తన చిన్నతనాన్ని గుర్తు చేస్తోంది.
"బామ్మా! నువ్వు నాకు మన పురాణాలలోంచీ ఇన్ని కథలు చెప్పావు కదా! నాకొక సందేహం!", అన్నాడు చింటూ.
"ఏమిటదీ?", అడిగింది లలితమ్మ.
"ధర్మాన్ని ఆచరించిన నలచక్రవర్తీ, హరిశ్చంద్రుడూ, రాముడూ, పాండవులూ... అందరూ కష్టాలపాలయ్యారు కదా? అయినా మనం ధర్మాన్నే ఎందుకు ఆచరించాలీ?", అడిగాడు చింటూ.
"నువ్వన్నది నిజమేరా! ధర్మాన్ని ఆచరించడం అంత సులువేమీ కాదు. కానీ ఒక్క విషయం గమనించు. ఎన్ని కష్టాలొచ్చినా ధర్మానికి కట్టుబడి ఉన్న నలచక్రవర్తి, దేవతల అనుగ్రహాన్ని పొంది అఖండ కీర్తిని గడించాడు! తను అష్టకష్టాల పాలైనప్పటికీ సత్యవ్రతాన్ని నియమంగా ఆచరించిన హరిశ్చంద్రుడి వంశంలోనే శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరాముడు అవతరించాడు. శ్రీరాముడు ధర్మ స్వరూపుడు. మానవులంతా ధర్మాన్ని ఆచరించాలి అన్న విషయాన్ని శ్రీరాముడు తానే స్వయంగా ఆచరించి మరీ చూపించాడు. పాండవులు ధర్మాన్ని వదలలేదు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు చిట్టచివరివరకూ వారిని వదలలేదు. ధర్మాన్ని ఆచరించేవారి వెంట భగవంతుడు ఉంటాడు. ధర్మాచరణవల్ల కలిగే కష్టాలన్నీ అశాస్వతమనీ, దానివల్ల కలిగే ఆనందం శాస్వతమనీ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి! నా పిల్లలూ, వారి పిల్లలూ అందరూ ధర్మపరులు కావాలన్నది నా కోరిక! అందుకే మీ నాన్నకు సత్యహరిశ్చంద్ర అని పేరు పెట్టాను. వాడు ధర్మాన్ని పట్టుకోబట్టే ఆర్ధికంగా ఇబ్బందులూ, ఉద్యోగంలో కొద్దిపాటి కష్టాలూ వాడికి వస్తున్నాయి. ఎన్ని ఆటంకాలొచ్చినా వాడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుని ఉద్యోగం చేసి మనందరినీ సంతోషంగా ఉంచగలుగుతున్నాడు. మీ నాన్న ఎప్పటికీ ధర్మమార్గం వదలడు. ఏదో ఒకరోజు అదే వాడికి శుభాన్నీ, సంతోషాన్నీ కలిగిస్తుంది! నువ్వు కూడా అలాగే ధర్మాన్ని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకురా నాన్నా! ", అంది లలితమ్మ చింటూ బుగ్గలను ఆప్యాయంగా తన చేత్తో నిమురుతూ.
"అలాగే బామ్మా! నేనెప్పుడూ నాన్నలా ఉండాలని అనుకుంటాగా!", అంటూ పకపకా నవ్వాడు చింటూ.
"నా బంగారు కొండ!", అంటూ చింటూ నుదుటిపై ముద్దు పెట్టుకుంది లలితమ్మ.
లలితమ్మ, చింటూల మాటలు విన్న సత్యానికి ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టాయి.
'ఎన్నడూ లేనిది నాకెందుకివాళ ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చిందీ?! ఏదో సాధించాలన్న తపనతో సన్మార్గాన్ని విడిచిపెట్టాలని అనుకున్న మూర్ఖుడిని! ఏదేమైనా సరే! నేను తప్పు చెయ్యను! అమ్మకు నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసి భగవత్కృపకు దూరం కాను!', అనుకున్నాడు సత్యం. అతడి కళ్ళు భావోద్వేగంతో చమర్చాయి.
ఆ మర్నాడు సత్యం తమ కార్యాలయానికి చేరుకోగానే శరత్ నుండీ ఫోన్ కాల్ వచ్చింది. శరత్ పంపిన ఫైళ్లపైన సత్యం వెంటనే సంతకాలు పెట్టకపోతే ఆ రోజే ఆ కంపెనీలో సత్యం ఆఖరి పని రోజు అవుతుందని ఆ ఫోన్ కాల్ సారాంశం. 'ఇక ఉపేక్షించి లాభం లేదు!', అనుకున్న సత్యం చకచకా ఆ కంపెనీ సీ.ఈ.ఓ. సీతారాం క్యాబిన్లోకి వెళ్ళి శరత్ సంగతంతా వివరంగా చెప్పేశాడు. అంతావిన్న సీతారాం శరత్ పై మండిపడి అతడిని తక్షణం విధులనుండీ తొలగించడమేకాక శరత్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు శరత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగంలో సత్యం పేరు ఎక్కడా పైకి రాకుండా జాగ్రత్తపడ్డాడు అనుభవజ్ఞుడైన సీతారాం.
సత్యం నిశ్చింతగా తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ రోజు సాయంత్రం సత్యం ఇంటికి వెళ్ళబోతూ ఉండగా సత్యాన్ని తన వద్దకు రమ్మని పిలిచి, "నీవంటి నిజాయితీపరులవల్లే మా సంస్థ ఇవాళ ఇంకా విజయవంతంగా నడుస్తోంది. ఇన్నేళ్ళుగా మావద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న నీకు పదోన్నతి కల్పించకపోవడం నిజంగా మేము చేసిన అతి పెద్ద తప్పు! శరత్ స్థానంలో వచ్చిన ఖాళీని భర్తీ చెయ్యగలిగే సత్తా నీ ఒక్కడికే ఉందని నాకనిపిస్తోంది. నువ్వొప్పుకుంటే ఈ క్షణమే నీకు ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చి అందుకు తగిన ఆదేశాలు జారీ చెయ్యగలను. ఏమంటావ్?," అడిగాడు సీతారాం.
అది విన్న సత్యం ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బైపోతూ సీతారాం అడిగినదానికి తన సమ్మతిని తెలిపాడు. ఇంటికి వెడుతూ మిఠాయిని కొనుక్కుని తీసుకెళ్ళి, ఇంట్లోవారితో శుభవార్తను పంచుకున్నాడు సత్యం.
"నాన్నా! బామ్మ చెప్పినట్లు ధర్మం నీకు మంచి చేసిందన్నమాట!", అన్నాడు చింటూ.
"అవునురా! సరిగ్గా చెప్పావు! ధర్మాచరణవల్ల కలిగే లాభాలెన్నో! మనం ఎట్టి పరిస్థితులలోనూ ధర్మాన్ని తప్పకూడదనే గట్టి సంకల్పమొకటి మన మనసులో చేసుకుంటే, ఆ భగవంతుడి సహాయం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంవల్ల ఎప్పుడైనా మనం తప్పు చెయ్యాలని అనుకున్నప్పుడు, ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు బుద్ధి చెప్పి, మన కళ్ళు తెరిపించి, మనం ఆ తప్పు చెయ్యకుండా చూసుకుంటాడు!", అన్నాడు సత్యం లలితమ్మవంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ.
సత్యం చూపులో భావాన్ని ఇట్టే గ్రహించిన లలితమ్మ, "నాయనా సత్యం! నిన్ను చూస్తూ ఉంటే పిల్లలచేత ధర్మాన్ని ఆచరింపజేయాలన్న నా సంకల్పం నెరవేరిందని అనిపిస్తోందిరా నాన్నా! ధర్మంతో కూడిన సత్సంకల్పాలన్నీ ఆ భగవంతుడు నెరవేరేలా చూస్తాడని మరోసారి ఋజువైంది!" , అంటూ తీయని మిఠాయిని ప్రేమగా సత్యం నోట్లో పెట్టి, అతడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది లలితమ్మ.