దివ్యానుగ్రహం
ప్రవీణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. అతని సహపాఠి ఐన నవీన్ కోరిక మేరకు హనుమంతుని ఆలయానికి వెళ్ళాడు. ఆ రోజు శనివారం కావటాన, పరీక్షలు దగ్గర పడుతున్నందున హనుమాన్ అనుగ్రహాన్ని అర్ధించను చాలా మందే ఆలయానికి వచ్చారు. ఆంజనేయస్వామివారి ఆలయం భక్తులతో కిట కిటలాడి పోతున్నది. ప్రదక్షిణలు, మొక్కులూ, నమస్కారాలూ అన్నీ అయ్యాక, ప్రసాదం స్వీకరించి అక్కడున్న అరుగుమీద ఇద్దరూ కూర్చుని తింటూ మాట్లాడుకోసాగారు.
"ఏమోరా ప్రవీణ్! పరీక్షలు వస్తున్నాయంటే భయంగా ఉంది. మంచి మార్కులు రాకపోతే మనకు మంచి కాలేజీలో సీట్ దొరకడం కష్టం. జీవితం అంతా ఈ పరీక్షలమీదే ఆధారపడి ఉంది, అందుకే నేను 40 రోజులపాటు హనుమాన్ చాలీసా చదువుతానని స్వామివారి దగ్గర మొక్కున్నాను." అన్నాడు నవీన్.
పకపకా నవ్వాడు ప్రవీణ్. "నవీన్! నీ పేరు మాత్రం నవీనంగా ఉంది కానీ నీ భావాలన్నీ పురాతన పాతభావాలురా! భగవంతునికి మొక్కుకున్నంతమాత్రాన ఆయనేమన్నా వచ్చి పరీక్ష వ్రాస్తాడా? మనింట్లోవారి సహకారంతో, మనం బాగా కష్టపడి చదవాలికానీ. ఇవన్నీ నేను నమ్మనురా! ఏదో స్నేహితుడివి పిలిచావని వచ్చానంతే. ప్రసాదం రుచిగా ఉందిరా!"
"ఒరే ప్రవీణ్! భగవంతుని కృప ఈ ప్రసాదం కన్నా రుచిగా ఉంటుందిరా! దాన్ని పొందే మార్గం మనం తెల్సుకోవాలంతే! ఆయన కృప, దయ, ప్రేమ మనకు లభిస్తే మరెవ్వరి దయా, ప్రేమా మనకు అవసరం లేదురా! అంతా ఆయనే చూసుకుంటాడు."
"ఏమోరా! నాకంత నమ్మకంలేదు. మనకు అన్నీ అందించేవారు తల్లిదండ్రులు. వారి దయ, ప్రేమ, సహకారం ఉంటే చాలదా! ఎప్పుడూ మనం చూడని, మనకు తెలీని భగవంతుని దయ అమ్మా నాన్నల దయకంటే ఎక్కువా! ఏం చెప్తున్నావురా! నవీన్!"
"వారి దయ నీ పట్ల ఉండవచ్చు, ఐతే అది నీవు వారి కుమారునిగా ఉంటుంది. నీవు చదివి పెద్దై ఉద్యోగం చేసి వారిని ఆదరిస్తావనీ, తమ కుమారుడు ఇంత గొప్పవాడయ్యాడని చెప్పుకోనూ కావచ్చు, వారికి నీ మీద ప్రేమ ఉండవచ్చు. అది కేవలం భౌతిక సబంధిత ప్రేమ మాత్రమే. భగవతునికి భక్తుల పట్ల ఉండే ప్రేమ అపారమైనది, నిస్వార్ధమైనది. ఆయనకు తన భక్తుల పట్ల ఉండే ప్రేమ ప్రతిఫలాపేక్షలేనిది. అన్ కండిషనల్ లవ్."
"ఏవేవో పెద్దమాటలు చెప్తున్నావ్ రా!"
"కాదురా! యదార్ధం చెప్తున్నాను. నీకు అంత మంచి అమ్మానాన్నలను ఇచ్చిందీ భగవంతుడే కదా! నీకు మీవారు అన్నీ అమరుస్తున్నారా! నీవు ఒక్క పరీక్ష చెడగొడితే అప్పుడు వారు నీ మీద ఎంత ప్రేమ చూపుతారో చూడు. అంతెందుకు నీవు రేపటి నుంచి మొదలయ్యే ప్రీ పబ్లిక్ పరీక్షల్లో ఒక్క పేపర్ చెడగొట్టి తక్కువ మార్కులు తెచ్చుకో! అప్పుడు వారి ప్రేమ గురించీ తెలుస్తుంది. మీ అమ్మా నాన్నా పట్ల నాకేమీ విరోధం లేదు. వారంటే నాకెంతో ఇష్టం. వారిపట్ల సంపూర్ణ గౌరవం. ఐతే నీకు యదార్ధం, లోక వైఖరీ తెలియాలని, భగవతుని దయ మనల్ని ఎలా కాపాడుతుందో నీకు తెలియజేయాలనీ, ఆయన దయ ఉంటే మరెవ్వరి దయకోసం మనం పాకులాడక్కరలేదని మాత్రమే నేను ఇలా అంటున్నాను. మరోలా భావించకు" అని నవీన్ అంటుండగా, వారికి కొద్ది దూరంలో కూర్చుని వారి మాటలు వింటున్న ఒక సాధువు, "నాయనలారా! ఇలా రండి" అని పిలిచాడు.
వెంటనే ఇద్దరూ వెనుతిరిగి ఆయనకేసి చూశారు. నవ్వుముఖంతో ప్రశాంతంగా ఉన్న ఆ సాధువుపట్ల ఇద్దరికీ ఒక గౌరవభావం ఏర్పడింది. వెంటనే లేచి తిన్న ప్రసాదం ఆకులు పక్కనే ఉన్న కుప్పతొట్టెలో వేసి, పక్కనే ఉన్న కొళాయి వద్ద చేతులు కడుక్కుని వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చున్నారు.
"నాయనలారా! మీరు మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇప్పుడు మీకొక చిన్న కధ చెప్తాను.
'కొంతకాలంక్రితం ధనపతి అనే ఒక పెద్ద ధనికుడు ఉండేవాడు. ఆయన బాగా సంపాదించి ఒక పదంతస్తుల భవనం కట్టించి, పదో అంతస్తులో తాను తన భార్యా పిల్లలతో నివసించే వాడు. అతడు చాలా స్తూలకాయుడు. ఒక రోజున అతనికి మీకు నేను కనిపించినట్లు నాలాంటి ఒకసాధువు ఒక తోటలో కనిపించాడు. వారికి మాటలు కలిశాయి.
వారి మాటల మధ్య ఆ సాధువు "ఎంతటి వారికైనా భగవదనుగ్రహం అవసరం. భగవంతుని ప్రేమ ముందు ఎవరిప్రేమా సరితూగవు" అంటాడు.
ఆ ధనికుడు “నాకు ఆయన ప్రేమ అవసరంలేదు. నేనంటే మావారికి చాలా ఇష్టం, చాలా ప్రేమ, నాకోసం ఏదైనా చేస్తారు. భగవంతుని ప్రేమ సైతం మావారి ప్రేమ ముందు సరితూగదు. ముఖమైనా తెలీని ఆ భగవతుని ప్రేమ నాకెందుకు? నావారి ప్రేమ చాలు" అంటాడు.
దానికా సాధువు "ముఖం తెలీని భగవంతుడన్నారే, ఎనాడైనా దేవాలయానికి వెళ్ళి కనీసం మీ ముఖం ఆయనకు చూపారా!” అన్నాడు.
“లేదు. నేను ఏనాడూ ఆలయాలకు వెళ్లలేదు, ఆయన్ని చూడలేదు. నాకా అవసరం లేదు, నా వారి కోసం ఎంతో చేశాను. వారంతా నాకోసం ఏమైనా చేస్తారు” అన్నాడు.
"ఓహో! మీవారు నీకోసం ఏదైనా చేస్తారా? నీమీద అంత ప్రేమా?" అని అడగ్గా, ధనికుడు 'తప్పక చేస్తారు.' అంటాడు.
“ఐతే నేను మీవారిని పరీక్షిస్తాను, నీకు మీవారి ప్రేమ స్వార్ధంతో కూడినదని ఋజువు చేస్తాను. భగవంతుని ప్రేమ ముందు మానవుల ప్రేమ ఎందుకూ పనికిరాదని నీకే తెలిసేలా చేస్తాను." అంటాడు.
ఆ మాటలకు రోషం వచ్చిన ధనికుడు. "అలాగే ప్రయత్నించండి. మీరు మీమాట ఋజువు చేస్తే నేను నా వారినంతా వదిలేసి, మీకు శిష్యుడినై పోతాను. సన్యాసం స్వీకరిస్తాను. నా ఆస్తినంతా దేవాలయాల్లో అన్నదానాలకు ఇచ్చేస్తాను." అని అన్నాడు.
ఐతే ఒక వారంపాటు ధనికుడు ఇంటికి వెళ్ళకుండా ఏదైనా ఊరికి వెళ్తున్నట్లు ఇంట్లో వారికి చెప్పమన్నాడు సాధువు.
ఒక రోజున ఆ సాధువు వంటరిగా ఆ ధనికుని ఇంటికి వెళ్ళి ఆ ధనికుని కోసం వచ్చినట్లు చెప్పాడు. ఆ ధనికుడు తమ మఠానికి కొంత సొమ్ము, ఒక భవనం దానంగా ఇస్తానన్నాడని చెప్పాడు. ఇంట్లోవారు 'ఆయనకేం పనిలేదు, సంపాదించినదంతా ఇలా దాన ధర్మాలు చేస్తే మాకేం మిగులు తుందీ! రానివ్వండి అడుగుతాం.' అన్నారు.
సాధువు వారిని వదల్లేదు. అలా రోజూ వారింటికి వెళ్ళడం, ధనికుని గురించీ అడగడం, ఆ ఇంట్లోవారి మంచి చెడ్డలు విచారించడం, వారికోరికలు మాటల్లో పెట్టి చెప్పించడం చేయసాగాడు. వారంతా తమ తండ్రి ఇచ్చే ధనంతో ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పసాగారు. వారు పెద్దాయన ఇస్తానన్న దానం గురించీ అడగ్గానే కోపగించడం జరుగుతూ వచ్చింది.
వారితో మాట్లాడుతూ ఒకరోజున "ఈ ఆస్తంతా మీ నాయన గారు సంపాదనే కదా! ఈ ఇల్లు మీ నాయన గారు కట్టించారు కదా! ఒకవేళ ఆయన మరణిస్తే ఎలా క్రిందికి దింపుతారు? పదంతస్తుల భవనం మీద నుంచి క్రిందకు దింపను ఈ లిఫ్ట్ చిన్నది, పాడె మీద శవాన్ని ఉంచి దించను ఇది పట్టదు కదా!" అన్న సాధువుతో, పెద్ద కొడుకు, 'మరణించిన వాని కోసం లిఫ్ట్ పాడుచేసుకోం. కాళ్ళకు తాళ్ళు కట్టి శవాన్ని క్రిందికి దింపి, క్రిందనే పాడెకట్టి తీసుకువెళతాం' అని చెప్పాడు.
దానికా సాధువు “మీనాయన గారికి మీరిచ్చే గౌరవం ఇంతేనా? మీ ప్రేమ ఇంతేనా!” అనగా "బ్రతికి ఉన్నంతవరకూ ప్రేమే, చనిపోయిన ఆయనకోసం మా లిఫ్టు విరక్కొట్టలేం కదా!” అంటాడు.
ఆ మాటలన్నీ సాధువు వెళ్ళి ధనికుని చెప్పాక, ధనికుడు వివరాలన్నీ అడిగి తెల్సుకుని నిజం గ్రహించి, సంసారం పట్ల భ్రమ వదిలింది. తాను ఏ ఒక్కరికీ పిడికెడు అన్నం పెట్టక తన కుటుంబంకోసం దాచిన ధనం కళ్ళముందు పెద్ద బంక మట్టిలా కని పించింది. తనవారనుకున్నవారికి తన ధనం మీద తప్ప తన మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు లేనేలేవని బాగా అర్ధమైంది. తన సంపాదనలో సగం ధనాన్ని తన కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేసి, మిగతా సగాన్ని ఆలయాలన్నిటికీ అన్నదానం నిమిత్తం దాన ధర్మాలు చేసేసి సన్యసించాడు." అని చెప్పాడా సాధువు.
ప్రవీణ్ "మీరు చెప్పిన దాన్ని మేమెలా నమ్మాలి? మీరు మాకోసం ఒక కధ అల్లి చెప్పారేమో!" అనగా, ఆ సాధువు నవ్వుతూ "ఆ ధనికుణ్ణి నేనే గనుక మీరు నమ్మాలి." అన్నాడు.
"నాయనలారా! అంతా నా తెలివి అనీ, నా సంపాదన, నావారూ అని, భ్రమపడ్డాను. దైవాన్ని మరచాను. ఒక్క రోజైనా భగవంతుని సన్నిధానానికి వెళ్లలేదు. ఒక్క పండైనా సమర్పించ లేదు. ఐతే ఆ సాధువు ధర్మాన మావారి కపట ప్రేమ వెల్లడై భగవంతుని దరి చేరాను. నిజం తెలిసింది. దైవ ప్రేమ ఒక్కటే త్రికాలల్లో మార్పు లేనిది. మానవ సంబంధాలన్నీ ఎంతో కొంత స్వార్ధంతో కూడినవే. అలాని అమ్మానాన్నలనూ, ఇంటినీ వదిలేయమని చెప్పడం లేదు. భగవత్ భక్తినీ, ఆయన మీద విశ్వాసాన్నీ పెంచుకుంటూ, ప్రశాంత జీవనం సాగించాలి. అమ్మానాన్నలను ప్రేమించాలి, నిస్వార్ధంగా, వారికి ముసలికాలంలో సేవచేయాలి. దయ నిండిన హృదయంతో సమాజ సేవచేస్తూ జీవించాలి. పసితనం నుండే భగవంతుని పట్ల భక్తి, సమాజం పట్ల మన బాధ్యత, తెల్సుకుంటూ ఎదగాలి. ఎంత గొప్ప చదువులు చదివినా, భగవద్విశ్వాసం ఉంటేనే జీవితం సజావుగా సాగుతుంది. నాయనలారా! నేనిప్పుడు నా అన్నదేదీ లేక హాయిగా భగవంతుని 'స్మరిస్తూ జీవిస్తున్నాను. సత్రం భోజనం మఠం నిద్రా'" అని చెప్పి సాధువు లేచి వెళ్లిపోయాడు.
"నవీన్! నిన్నేమన్నా బాధించి ఉంటే మన్నించరా! ఆసాధువు చెప్పిన మాటలు యదార్ధం అనిపిస్తున్నాయి. ఇంతకాలం ఏ దేవాలయానికీ పోక ఏ దేవునీ అర్చించక విర్రవీగాను. ఈ రోజు నీతోరావడం ఎంతమేలైందో! మన ప్రయత్నంతో పాటుగా భగవంతుని దయ ఉంటేనే మనం విజయం సాధించగలం అనే నీమాట నమ్ముతున్నానురా! నాకళ్ళు తెరిపించావు. థాంక్స్" అన్నాడు ప్రవీణ్.
"అంత మాట లెందుకులేరా! నీకు నిజం తెలిసినందుకు సంతోషంగా ఉంది. ఎవరికైనా సరే ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే గట్టెక్కుతారు. దానికి తోడు మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. సరే పద వెళ్దాం లేటైంది." అంటూ నవీన్, ప్రవీణ్ చేయి పట్టుకుని ఇంటికేసి నడిచాడు.
చాలా బాగుంది ఆంటీ మీ కథ. మంచి సందేశం అన్ని తరాలకీ. ధన్యవాదాలు.