సరస్వతీకటాక్షము
కం. లేచియు లేవక మునుపే రాచిలుక కరాన నిలిచి రాజిలు తల్లే ప్రాచుర్యంబును గూర్చుచు నా చిఱుకవితలకుఁ దానె నాందినిఁ బలుకున్ కం. పద(1)సరసీరుహసేవకు పద(2)సరసీజములఁ గూర్చి పలువిధకవితల్ ముద మొదవఁగఁ బలికించెడి పదములసుదతికిని శిరము వంచి నమింతున్ (1) పాదములు (2) మాటలు కం. ఓ తల్లీ! యని పిలిచినఁ జేతమ్మున నిలిచి వీణెఁ జేతను దాల్చున్ మాతతలిరాకుచేతులె యా తంత్రులపై నటించి యమృతముఁ జిందున్ కం. వాక్కే రూపంబయి నా వాక్కున నిత్యంబు నిలిచి స్వరఝరులమెయిన్ చక్కని పద్యశ్లోకము లి క్కరణిన్ బలుకఁజేయు నీశ్వరిఁ గొలుతున్ కం. దక్కిన మాటలు నుడువఁగఁ బిక్కటిలున్ భావశబ్దవిభవము లొకటన్ జిక్కని పాల్మీఁగడ వలె గ్రక్కున రసనకును విందు ప్రభవింపంగన్ కం. పద్దియము లెన్నొ వ్రాయఁగ ముద్దుగ నీ మూర్తినోట మురిపెము లొలుకన్ ‘వద్దనవద్ద’ని యొద్దిక పెద్దవి చిన్నవియుఁ జేరు వివిధార్ణతతుల్(1) (1) రకరకముల పదములు కం. అర్ణార్ణవమునఁ(1) బుట్టిన వర్ణనలే యెదలఁ దాఁకు భంగులు(2); కవితల్ పూర్ణిమవెన్నెల గాఁగాఁ గర్ణములే కనుల కన్నఁ గర్వము నొందున్(3) (1) అక్షరములనెడు సముద్రములో (2) అలలు (3) పున్నమినాడు ఉప్పొంగే అక్షరసముద్రపు అలలైన వర్ణనలు హృదయాలను తాకు నపుడు కలుగు శబ్దతరంగాలను ఒడిసిపట్టే చెవులు దృశ్యాన్ని చూచే కళ్ళకంటే ఎక్కువ ఆనందము అనుభవించి గర్విస్తున్నాయి.
doing great job in literature Telugu. we are delighted thank you for your time. we show Gratitude