"అమ్మలూ...తెల్లవారబోతోంది. ఇంకలేచి గబగబా తయారవ్వమ్మా.." అంటూ నిద్ర లేపింది సీతా వాళ్ళమ్మ కామాక్షి. రోజూ కన్నా కాస్త ముందు లేవడానికి కొద్దిగా బద్ధకిస్తున్న సీతతో "అసలే పండుగ మొదలయ్యింది. నీకీరోజు బోలెడన్ని పనులున్నాయి. త్వరగా లేచి తయారవ్వు", మళ్లీ కంగారుగా చెప్పింది కామాక్షి. అది విన్న సీత, పండుగ సంబరం గుర్తుకు వచ్చి ఉత్సాహంగా ఠక్కున లేచి పక్క బట్టలు మడత పెట్టి ముఖము కడుక్కుని పైపైన తయారయ్యి వాకిట్లోకి వెళ్ళింది.
ఆ రోజు భోగి పండుగ. సీతావాళ్ళుండే వీధి మొత్తం భోగి మంటలు వేసే హడావుడిలో ఉంది. ఇంకా సూర్యోదయం పూర్తిగా కాలేదు. అయినా చిన్నా పెద్దా అందరూ నిద్ర లేచి ఏదో ఒక పనిలో అటూ ఇటూ తిరుగుతూ సందడిగా ఉన్నారు. ఒక పండుగని భేదాలు మరచి హాయిగా అందరూ కలిసి జరుపుకోగలిగితే అంతన్నా ఆనందం వేరే ఉండదు కదా!
* * *
సీతామహాలక్ష్మి వాళ్ళది సంప్రదాయ కుటుంబం. ఏ పండగైనా ఉన్నంతలో పద్ధతిగా జరుపుకోవాలని సీత తల్లిదండ్రుల తాపత్రయం. సీత చిన్నప్పటి నుండి వాళ్ళింట్లో అట్లతద్ది వంటి చిన్న పండుగలు మొదలుకొని దసరా-దీపావళి వంటి పెద్ద పండుగల వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా అన్ని పండగలూ జరుపుతూ ఉంటారు. సీత తండ్రి ఉద్యోగం హైదరాబాద్ లో కావటంవల్ల వాళ్ళు అక్కడే స్థిర పడ్డారు. కామాక్షి కృష్ణా జిల్లా పల్లెటూరిలో పెరిగింది. ఏ పండుగ జరిగినా తన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సీతకిప్పుడు పదిహేను సంవత్సరాలు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సీత చేత బొమ్మల కొలువు పెట్టించి పేరంటం చేస్తుంది కామాక్షి. సీత తండ్రి విశ్వనాధానికి అన్ని పండుగల లోనూ ఉత్సాహంగా పాలుపంచుకుంటూ ఉండటమంటే చాలా ఇష్టం. ఇంటిల్లుపాదినీ ప్రోత్సహిస్తూ పండుగలని ఏ లోటూ లేకుండా జరిపేందుకు వీలుగా కావలసినవన్నీ సమకూరుస్తూ ఉండటం ఆయన పని. ఆయనకు అన్ని విధాలా సహకరించడం, సీత అన్నయ్య కృష్ణ పని. ఈ ఏడు కూడా ప్రతి సంవత్సరంలానే సీత చేత గొబ్బిళ్ళు పెట్టించింది కామాక్షి. అవన్నీ పిడకలుగా చేసి భోగిమంటలకు సిద్ధంగా ఉంచింది. సీత లేచేసరికే విశ్వనాధం, కృష్ణ ఆ వీధి వారితో కలిసి ఎండు పుల్లలని, పిడకముక్కలని కుప్పగా పోసి ఇంటి బయట భోగీ మంటల ఏర్పాట్లు మొదలు పెట్టేసారు.
"కామాక్షీ..అగ్గిపెట్టె అందుకో", బయటినుండి లోపలెక్కడో వంటింట్లో ఉన్న కామాక్షికి వినపడేలా కేక వేశాడు విశ్వనాధం. "సీతా..ఇటొచ్చి ఈ అగ్గిపెట్టె నాన్నకివ్వమ్మా.." అరిచింది కామాక్షి. సీత లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి అగ్గిపెట్టె తీసుకుని భోగి మంటలు ఎక్కడ మొదలైపోతాయోనని క్షణంలో మళ్లీ వాకిట్లోకి వచ్చేసింది.
"సీతా.. భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు", చెప్పింది సీత మేనత్త. వాళ్ళుండేది కూడా ఆ వీధిలోనే. కాసేపట్లో అందరూ భోగి మంటలేసి దాని చుట్టూ గుమిగూడారు. "అబ్బా! ఎంత పెద్ద మంటలో! భలే ఉన్నాయి" అంటూ పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటే "దూరంగా నిలబడి చూడండర్రా" అని హెచ్చరించారు సీతా వాళ్ళ పక్కింటి తాతగారు.
అందరి మనసులలోనూ ఆ భోగీ మంటలు చూస్తూ ఉంటే అంతులేని ఆనందం కలిగింది. ఆ వీధంతా పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజుల పండుగ మరింత సంబరంగా గడవాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఎవరింట్లోకి వారు వెళ్లిపోయారు.
* * *
"చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే పెద్ద కాగు ఉండేది. భోగీ మంటలేసినప్పుడు ఆ కట్టెల పైన ఆ కాగుతో నీళ్లు కాచి తలస్నానం చేసేందుకు ఇంటిల్లుపాదికీ అవే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కాగులూ లేవు అన్ని నీళ్ళూ లేవు", అంటూ అలవాటు ప్రకారం గతం గుర్తుచేసుకుంది కామాక్షి.
అంతలో సీత ఒక్క ఉదుటున ముగ్గు గిన్నె, ముగ్గులో నింపటానికి రంగులు తీసుకుని వాకిట్లోకి పరుగు తీసింది. అప్పటికే ఎదురింటి పద్మ, పక్కింటి గౌరి, సీత మేనత్త కూతురు శాంకరి అందరూ ఎవరి ఇళ్ల ముందు వాళ్ళు ముగ్గులు వెయ్యడం మొదలు పెట్టేసారు. ఎవరి ముగ్గు బావుంటుందో, ఎవరు పెద్ద ముగ్గు వేస్తారో అని ఒకరిని చూసి ఒకరు ఉత్సాహంగా ముగ్గులేసి అందులో రంగులు నింపటం మొదలు పెట్టారు. ఒకపక్క సీత లతలు పువ్వులతో ముగ్గు వేస్తే ఇంకో పక్క కామాక్షి భోగీ నాడు మూసి ఉన్న స్వర్గ ద్వారాలతో వేసే ప్రత్యేకమైన ముగ్గును తీర్చిదిద్దింది. "అక్కా..నా దగ్గర ఆకుపచ్చ రంగు అయిపోయింది. నీదగ్గరుంటే ఇస్తావా?" సీతనడిగింది గౌరీ. "ఓ తప్పకుండా. ఇదిగో నీకెంత కావాలంటే అంత తీసుకో", సంతోషంగా ఇచ్చింది సీత.
"అమ్మలూ...త్వరగా ముగించి లోపలి రా" పిలిచింది కామాక్షి. "తలస్నానం ఇవాళే చేయాలి. పూజ చేసి కొత్త బట్టలు దేవుడికి పెట్టి పట్టు పరికిణి కట్టుకుని అందరినీ బొమ్మల పేరంటానికి పిలవాలి" చెయ్యాల్సిన పనులన్నీ సీతకు చెప్పింది.
సీత గబగబా ముగ్గుని పూర్తి చేసి అందులో రంగులద్ది తలస్నానం చేసి, వాళ్ళ అమ్మ సిద్ధంగా ఉంచిన కొత్త బట్టలకి పసుపు పెట్టి, పట్టుబట్టలు కట్టుకుని నగలు అలంకరించుకుని వచ్చేసరికి విశ్వనాధం, కృష్ణ కలిసి ముందు గదిని రంగు కాగితాలతో, మెరుపు తళుకుల తోరణాలతో ,రంగురంగుల కాంతులు వెదజల్లే విద్యుద్దీపాలతో అలంకరించి, బొమ్మల కొలువు పెట్టేందుకు మెట్లను సిద్ధం చేశారు.
వంటింట్లో పిండి వంటలు చేస్తున్న కామాక్షి మరో పక్క పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ "అమ్మలూ ముందుగా విఘ్నేశ్వరుడిని కొలువుపైన ఉంచి దణ్ణం పెట్టమ్మా.." అని సీత చేత మొదటి బొమ్మ పెట్టించింది. ఆ తరువాత సీత రెండు రోజుల క్రితం కొనుక్కున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని ఈయేడు కొత్త బొమ్మగా కొలువులో పెట్టింది. అన్ని బొమ్మలను చక్కగా కొలువులో అమర్చి దీపారాధన చేసి, కామాక్షి చెబుతూ ఉంటే పూజ, నైవేద్యం కార్యక్రమాలు పూర్తిచేసింది సీత . కొలువులో ఒక పక్క కొద్దిగా రేగిపళ్ళు, మరొక పక్క చెరుకు ముక్కలు పెట్టింది కామాక్షి. ఆ తరువాత నిత్య పూజ చేసి కొత్త బట్టలను దేవుడికి అర్పించి పిండి వంటలతో భోజనాలు వడ్డించింది. అందరూ కలిసి తృప్తిగా భోజనం ముగించారు.
"ఇదుగో అమ్మలూ..మనము రేపటి పేరంటానికి పిలవాల్సిన వాళ్ళ వివరాలు. నువ్వీ కుంకుమ భరిణ తీసుకుని అందరిళ్ళకూ వెళ్లి బొట్టు పెట్టి పేరంటానికి పిలుచుకుని రా. అందరూ నీకు తెలిసిన వారే కదా. మన మూడు వీధుల వారినీ పిలవాలి. నేను బయట నిలబడి నీకేమైనా సందేహం వస్తే తీరుస్తాను. వెళ్లి రా" అని హామీ ఇచ్చి సీత చేతిలో కుంకుమ భరిణ పెట్టి బయటకు పంపింది కామాక్షి.
సీత బయలుదేరబోతున్నంతలో "సీతా! శాంకరీని నీతో పట్టుకెళ్ళు. మేము కూడా బొమ్మల కొలువు పేరంటం చేస్తున్నాము. తనకి మన వీధిలో వారు మాత్రమే తెలుసు. పక్క వీధి వారితో అంత పరిచయం లేదు. కాబట్టి, నువ్వెవరిని పిలిస్తే వారిని తాను కూడా పిలుస్తుంది." అని అంది సీత మేనత్త. తనకో తోడు దొరికినందుకు శాంకరీని తీసుకు వెళ్ళడానికి సంతోషంగా ఒప్పుకుంది సీత.
* * *
"బాగున్నావా అమ్మా సీతా?", ఆప్యాయంగా అడిగారు అదే వీధిలో ఉండే విశాలాక్షిగారు.
"బాగున్నానండీ. రేపు మీరు తప్పకుండా మా ఇంటికి పేరంటానికి రావాలి" చెప్పింది సీత.
"రామ్మా సీతా! ఈ ఏడు కూడా బొమ్మల కొలువు పెట్టుకున్నావా? అమ్మా, నాన్నా, అన్నయ్యా అందరూ కులాసాగా ఉన్నారా? పేరంటం ఇవాళా? రేపా?", వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు కామేశ్వరిగారు. "అందరూ బాగున్నారండీ. పేరంటం రేపు సాయంత్రం చేస్తున్నాము. మీరు తప్పకుండా రావాలి.", అంటూ బొట్టు పెట్టింది సీత.
"సీతా! మా కోడలు బయటవుందమ్మా. గడపకి బొట్టు పెట్టు. పిల్లలు మా చుట్టాలింటికి వెళ్లారు. వాళ్ళు రాగానే నేను చెప్పి పంపుతాలే" అని రాలేమన్న సంగతి చెప్పకనే చెప్పారు కమలాంబగారు.
"అబ్బ! చక్కగా పట్టు పరికిణీ కట్టుకుని సీత పేరంటం పిలవటానికి వచ్చిందంటే సంక్రాంతి పండగ కళ మా వీధికి వచ్చినట్టే" సంతోషంగా అన్నారు విమలగారు.
రెండు వీధుల అవతల ఉండే కాంతమ్మ గారిని అందరూ బామ్మగారని పిలుస్తారు. ఆవిడ ఇల్లు మాత్రం ఆఖరులో పెట్టుకుంది సీత. ఎందుకంటే ఆవిడ కాసేపు కూర్చోబెట్టుకుని ఇంట్లో ఒక్కొక్కరి విశేషాలు వివరంగా అడుగుతారు. ఆవిడ దగ్గరకి వెళ్లిన వారు వెంటనే రాలేరని అందరికీ తెలిసినా ఆవిడ చూపే ఆపేక్ష వల్ల ఆవిడంటే అందరూ ఇష్ట పడతారు. "అప్పుడే ఎంత పెద్దదానివయ్యావు సీతా", బుగ్గలు నిమురుతూ అడిగారు బామ్మగారు. "మీరూ, లాస్యా, సుప్రియా అందరూ రేపు మా ఇంటికి రావాలి బామ్మగారూ. లాస్యకి సుప్రియకి నేను కొనుక్కున్న కొత్త బొమ్మను చూపించాలి", అంటూ సీత బొట్టు పెట్టింది. లాస్య, సుప్రియ బామ్మగారి మనవరాళ్లు. సీత ఈడు వాళ్ళే.
మొత్తానికి కామాక్షి పేరంటానికి పిలువదల్చుకున్న వారందరినీ పిలిచింది సీత. ఒక పక్క కాళ్ళు నొప్పులు పెడుతున్నా పండుగ సంబరంలో అదేమీ పట్టించుకోకుండా "అమ్మా.. మా స్నేహితులని కూడా పేరంటానికి పిలుస్తా. వాళ్ళు ఉండేది కాస్త దూరమే అయినా నేను పిలిస్తే తప్పకుండా వస్తారు. సరేనా?”, గారాబంగా కామాక్షిని సీత బతిమలాడింది.
"సరేనమ్మా..తప్పకుండా పిలు. నేనే చెబుదామనుకున్నా", వెంటనే ఒప్పుకుంది కామాక్షి. సీత తన స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్లి అందరినీ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచింది.
అలసిపోయి ఇంటికి చేరిన సీత అమ్మ పెట్టిన కొన్ని చిరు తిళ్ళు తిని కాసేపు విశ్రాంతి తీసుకుంది. "కొద్దిసేపట్లో మళ్ళీ తయారవ్వు అమ్మలూ..మనమీ రోజు పేరంటానికి వెళ్ళాలి. ఉమగారు, సరళగారూ వాళ్ళ పిల్లలకి సరళగారింట్లో భోగీ పళ్ళు పోస్తారట", అంటూ కట్టుకోవలసిన పట్టు చీరలు బీరువాలో నుండి బయటకు తీసింది కామాక్షి.
కాసేపయ్యాక కామాక్షి, సీతా చక్కగా ముస్తాబయ్యి పేరంటానికి బయలుదేరారు. సీత సంక్రాంతి పండుగకని ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కొత్త బట్టలు వేసుకుని అందరూ మెచ్చుకుంటారేమోనని మురిసిపోతూ తల్లి వెనుక నడిచింది. వాళ్ళు సరళగారింటికి చేరేసరికి పిల్లలను కుర్చీలలో కూర్చోబెట్టి రేగి పళ్ళు, రాగి నాణేలు, అక్షింతలు కలిపి భోగీ పళ్ళు సిద్ధంగా ఉంచారు. ఒకరితరువాత ఒకరు పిల్లలకు భోగీ పళ్ళు పోసిన తరువాత ముతైదువలందరూ హారతి ఇస్తూ సంప్రదాయం ప్రకారం భోగీ పళ్ళ నాటి పాటను పాడి పిల్లలను ఆశీర్వదించారు.
పేరంటం ముగించుకుని ఇంటికి చేరేసమయానికి విశ్వనాధం, కృష్ణ కొత్త బట్టలు కట్టుకుని "రండి. మీ కోసమే చూస్తున్నాము. గుడిలో గోదాకల్యాణం చేశారట. చూసి వద్దాం", అని అన్నారు. అందరూ కలిసి గోదాదేవి, శ్రీకృష్ణులను చూసి దణ్ణం పెట్టుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి చేరారు. అప్పటికి చీకటి పడింది. మరుసటి రోజు కూడా పండుగ కావడంతో అందరూ భోజనం చేసి రోజంతా ఆనందంగా గడిచినందుకు సంతోషపడుతూ జరిగిన విషయాలు తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నారు.
* * *
మర్నాడు సంక్రాంతి - అసలు సిసలైన తెలుగు వారి పండుగ. సూర్యోదయానికి ముందే ఊరంతా పండుగ సంబరాలు మొదలయ్యాయి. "బాబీ! ఇటొచ్చి ఈ మామిడి మండలు అందుకో", కృష్ణను పిలిచాడు విశ్వనాధం. ఇద్దరూ కలిసి పెరట్లో పెంచిన మామిడి చెట్టు రెమ్మలు తుంపి తోరణాలు కట్టే పనిలో ఉన్నారు. వాకిట్లో ఒక పక్క సీత చక్కటి చుక్కల ముగ్గు వేస్తూ ఉంటే పక్కనే కామాక్షి సంక్రాంతినాడు ప్రత్యేకంగా వేసే స్వర్గ ద్వారాలు తెరిచినట్లుండే ముగ్గును వేసింది.
సీత త్వరగా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని వంటింటి వైపు వెళ్లేసరికి కామాక్షి మడి కట్టుకుని వంటచేస్తూ "శెనగలు నీళ్ళల్లో పోసాను. పేరంటానికి వచ్చిన అందరికీ పంచేందుకు తాంబూలాలు సిద్ధం చెయ్యి" అని సీతతో అంది.
అప్పటికే కామాక్షి పేరంటానికి వచ్చే వారికి ఇచ్చేందుకు రంగురంగుల చిన్న సంచులు కొని ఉంచింది. సీతకు చాలా ఇష్టమైన పనులలో పేరంటానికి తాంబూలం, పసుపు కుంకుమలు, పళ్ళు సంచులలో పెట్టి వాటిని పంచేందుకు సిద్ధం చెయ్యడం ఒకటి. అందుకే ఉత్సాహంగా తనకిష్టమైన ఎం స్ సుబ్బులక్ష్మి పాటలు వింటూ చక చకా నలభై సంచులు సిద్ధం చేసింది. "శెనగలు మాత్రం విడిగా ఇద్దాం. ఇంకా నానాలి కదా" అంది తల్లితో. సరేనంది కామాక్షి.
"పేరంటానికి అందరూ వచ్చే వేళకు నీరసించి పోకుండా ఉండాలంటే పొద్దుటి పనులు త్వరగా పూర్తి చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది" అని విశ్వనాధం అంటూ ఉండగానే ఎవరో వచ్చిన అలికిడి అయ్యింది. ఎవరా అని చూస్తే సీత మేనమామ గోపీ, అత్త వాణి వచ్చారు. వారుండేదీ హైద్రాబాద్ లోనే.
"రండి రండి..పండుగ శుభాకాంక్షలు" సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు కామాక్షి, విశ్వనాధం దంపతులు. "ఇదిగో సీతా.. నువ్వు బొమ్మల కొలువు పెట్టుకుంటావని నీ కోసం ఒక బొమ్మ పట్టుకొచ్చాం." అని వస్తూనే సీత చేతిలో కాగితంలో చుట్టి ఉంచిన బొమ్మను పెట్టింది వాణి. సీత ఆత్రంగా అది తెరిచి చూస్తే అందులో అందమైన మీరాబాయి బొమ్మ ఉంది. భక్తి పారవశ్యంతో కృష్ణుడి గురించి పాడుతున్నట్లు ఉన్న ఆ భంగిమ అందరికీ బాగా నచ్చింది. వెంటనే సీతా, కామాక్షీ ఆ బొమ్మను కొలువులో రాధాకృష్ణుల విగ్రహం పక్కన పెట్టారు. కామాక్షి చెబుతూ ఉండగా సీత బొమ్మల కొలువుకు పూజ చేసి నైవేద్యం పెట్టింది. విశ్వనాధం, కామాక్షి కలిసి పద్ధతి ప్రకారం పితృదేవతలను అర్చించి, గుమ్మడి కాయలు దానం చేసి, ఇంట్లో అన్ని శుభకార్యాలూ జరిపించే బ్రాహ్మణుడిని పిలిచి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించారు.
"పండుగ రోజు అందరూ కలిసి భోజనం చేస్తే ఆ సంతృప్తే వేరు" అని కామాక్షి భోజనాలలో సంక్రాంతికని విశ్వనాధం ప్రత్యేకంగా తయారు చేయించిన అరిసెలు వడ్డించింది. అందరూ ఇష్టంగా భోజనకార్యక్రమం ముగించి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కామాక్షి, గోపీ, వాళ్ళ చిన్నప్పటి సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. "ఆ రోజుల్లో సంక్రాంతి అంటే గంగిరెద్దు - సన్నాయి వాళ్ళూ, హరిదాసు పాడే రామదాసు కీర్తనలూ, బుడబుక్కలవాళ్ళు చేసే వింత శబ్దాలూ లేకుండా ఉండేది కాదు కదా! ప్చ్ ..ఇక్కడవేవి లేవు" అని నిట్టూర్చింది కామాక్షి. "పోనీలే అక్కా! ఇంత పెద్ద నగరంలో ఉంటూ కూడా భోగీ మంటలూ, పేరంటం వంటి సంప్రదాయాలు కొనసాగించగలగటం అదృష్టమే కదా!" అని అన్నాడు గోపి.
"ఇంకాసేపట్లో పేరంటం మొదలవుతుంది. ఎలాగో వచ్చారు కాబట్టి పేరంటమయ్యేదాకా ఉండి భోజనాలు చేసి వెడుదురుగాని. పండుగరోజు. కలిసి గడిపే అవకాశం వదులుకోవద్దు" అని బయలుదేరబోతున్న గోపీని, వాణీని ఆపింది కామాక్షి. వాణీకి కూడా పేరంటానికి ఉండాలని ఉండటంతో ఇద్దరూ ఆగిపోయారు.
* * *
సాయంత్రం అయిదు గంటల సమయానికి సీతతో సహా అందరూ పేరంటానికి వచ్చే వారి కోసం చక్కగా తయారయ్యి ఎదురు చూడటం మొదలు పెట్టారు. కామాక్షి గంధము, పన్నీరు, కుంకుమ, పసుపు వెండి పళ్లెంలో అమర్చి సిద్ధంగా ఉంచింది. మగవారందరూ మేడపైకి కుర్చీలు పట్టుకెళ్లి పేరంటమయ్యేంతసేపూ కబుర్లు చెప్పుకుంటామని అన్నారు.
"సుమారుగా ఎంత మందిని పిలిచారో?" అడిగింది వాణి. "ఒక ముప్పై మంది వస్తారని అనుకుంటున్నామత్తయ్యా" బదులిచ్చింది సీత. కానీ మనసులో మాత్రం సీతకు అనుకున్న వారికన్నా ఎక్కువ మంది రావాలని, తన బొమ్మల కొలువు చూసి మెచ్చు కోవాలని ఉంది. నెమ్మదిగా పిలిచిన వారంతా పేరంటానికి ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారు.
"అబ్బా ఎంత అందంగా పెట్టారో బొమ్మల కొలువు" అన్నారు ఒకావిడ. "చాలా ఓర్పుతో అన్ని ఏర్పాట్లూ చేసారే!" మెచ్చుకున్నారు ఇంకొకావిడ. వచ్చిన వారికి పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇవ్వడంలో కామాక్షి నిమగ్నమైతే, వచ్చిన పిల్లలందరికీ తన కొత్త బొమ్మలను సంతోషంగా చూపిస్తూ ఉంది సీత. అంతలో సీత మేనత్త శాంకరితో వచ్చింది. "బొమ్మల కొలువు చాలా బాగుందే సీతా. శాంకరి పెట్టిన కొలువు చూద్దువుగాని. వీలు చేసుకుని అటు రా" అంది. "అలాగే అత్తయ్యా! మా స్నేహితులు వస్తామన్నారు. వాళ్ళు వెళ్ళగానే వస్తాను." చెప్పింది సీత.
కొద్దీ సేపటి తరువాత సీత స్నేహితులంతా రావడం మొదలు పెట్టారు. అందరూ వాళ్ళ అమ్మలని, నాన్నమ్మలని, అక్కలని, చెల్లెళ్లని తీసుకుని వస్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువమంది వచ్చేసరికి సీత ఆనందానికి అవధులు లేవు. తాంబూలాలు పంచి పెట్టడంలో కామాక్షికి సహాయం చేస్తూనే స్నేహితురాళ్ళతో ముచ్చట్లు చెప్తూ గడిపింది సీత. ఇల్లంతా వచ్చిన వారితో సందడిగా ఉంది. అప్పుడు బామ్మగారు లాస్యను, సుప్రియను తీసుకుని వచ్చారు. "బొమ్మలకొలువు చాలా చక్కగా ఉందమ్మా కామాక్షీ. ఈ రోజుల్లో కూడా మన సంప్రదాయం పాటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భాలలోనే ఒకరినొకరు పలకరించుకుని మాట్లాడుకునేది. ఉత్తప్పుడు ఎవరి పనులలో వారు తీరిక లేకుండా ఉంటారు కదా. సంక్రాంతి లక్ష్మి మీ ఇంట్లో కళ కళ లాడుతోంది." అని అన్నారు బామ్మగారు.
అప్పటికి చీకటి పడింది. వచ్చేవాళ్ళు దాదాపుగా అయిపోయారు అని అనుకునేలోపు సీత స్నేహితురాలు శ్రీలలిత బోలెడు మంది పిల్లలతో వచ్చింది."ఎవరే వీరంతా?" ఆశ్చర్యంగా అడిగింది సీత. "వీళ్లా..! కొందరు మా ఇంట్లో అద్దె కుండే వాళ్ళ పిల్లలు, కొందరు వాళ్ళతో ఆడుకోవడానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళ పిల్లలూ, ఇంకా మా చుట్టాల పిల్లలూనూ .. నేను బయలుదేరేసరికి నాతో వస్తామని అందరూ మారాము చేశారు. అందుకే బొమ్మలు చూస్తారని పట్టుకొచ్చా" చెప్పింది సీత స్నేహితురాలు. "చాలా సంతోషం" అంది కామాక్షి.
పిల్లలందరికీ బొమ్మలు చూపిస్తున్న సీతను ఒకసారి లోపలి రమ్మని సైగ చేసింది కామాక్షి. "తాంబూలం సంచులు ఇంకొన్ని సిద్ధం చెయ్యి" అని చెప్పి అందరికీ బొట్లు పెట్టడానికి వెళ్ళింది కామాక్షి. పిల్లలందరూ ఆనందంగా శెనగలు తింటూ ఇంటికి వెళ్లారు.
"అమ్మా..ఇంకెవరైనా వస్తే ఇప్పుడు మిగిలిన శెనగలు సరిపోతాయా?" కంగారుగా అడిగింది సీత. "నువ్వు నలభై అనుకుంటే నేను అరవై మందికి సరిపడా సిద్ధంగా ఉంచాను. ఇంకా ఎంతమంది వచ్చినా ఇబ్బందేమీ లేదు" ధీమాగా చెప్పింది కామాక్షి. సీతా, కామాక్షి కలిసి శాంకరి పెట్టిన కొలువు చూసి తాంబూలం తీసుకుని వచ్చారు. అనుకున్న దానికన్నా వైభవంగా ముగిసింది పేరంటం. ఎన్ని సంవత్సరాలైనా ఈఏటి సంక్రాంతి పండుగ ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని అనుకున్నారంతా.
* * *
మరుసటి రోజు కనుమ. తెల్లవారుతూ ఉంది. సీత లేచేసరికి కామాక్షి వాకిట్లో రధం ముగ్గు వేస్తూ ఉంది. "ఇవాళ కూడా బొమ్మల కొలువుకి పూజ చేసి నైవేద్యం పెట్టాలి" సీతకు చెప్పింది కామాక్షి. సీత వెళ్లి తయారయ్యి వచ్చే సరికి వంటింట్లోంచి గారెల ఘుమఘుమలు వచ్చాయి. "ఆహా! ఇవాళ గారెలు. బలే బలే" ఆనందంగా అన్నాడు కృష్ణ. "కనుమ రోజు మినుము తినాలిరా. అందుకే ఇవాళ తప్పనిసరిగా ఇవి చేస్తారు" చెప్పింది కామాక్షి. "వేడి వేడిగా ఒకటి ఇస్తావా?" అడిగాడు కృష్ణ. "దేవుడికి నైవేద్యం పెట్టగానే తిందువుగాని. ఆగు" చెప్పింది కామాక్షి. "సరే అంతలోపు చదువుకుంటూ ఉంటా" అంటూ తన గదిలోకి వెళ్ళాడు కృష్ణ.
"ఇంక మాకు సెలవిప్పించండి బావగారూ" విశ్వనాధాన్ని అడిగాడు గోపి." కనుమనాడు కాకి కూడా కదలదని అంటారు కదా. రేపెడుదురుగాని" అని చెప్తున్న విశ్వనాధాన్ని సమర్ధించింది కామాక్షి.
"లేదక్కా..మా ఇల్లు ఉన్న ఊళ్ళోనే కాబట్టి అడుగుతున్నా. రేపటి లోగా చెయ్యవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. అందుకే వెళ్లొస్తాం. మళ్ళీ ఆదివారం కలుద్దాం" అన్నాడు గోపి. సరేనని వారిని సాగనంపి సీత చేత బొమ్మల కొలువుకు పూజ చేయించి, నైవేద్యం పెట్టించి, నిత్య పూజ ముగించింది కామాక్షి. "ఇవాళ పశువుల పండుగ కదా. గుడిలో ఉన్న గోవుకు పూజ చేసి వద్దాం" అని కామాక్షి, విశ్వనాధం అనుకుని అందరూ కలిసి గుడికి వెళ్లారు.ఆ తరువాత ఇంటికి వచ్చి కామాక్షి చేసిన గారెలు తిని మిగతా రోజంతా సంతోషంగా గడిపారు.
* * *
చూస్తూఉండగా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. సీత చక్రవర్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర పడింది. వాళ్లకి ఒక్కడే బాబు - నాని. ఆ ఏడు మళ్ళీ సంక్రాంతి వచ్చింది. కానీ సీత దగ్గర ఎటువంటి హడావుడీ లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వారుండే ప్రదేశంలో భారతీయులు అతి తక్కువ. తెలుగు వారు లేరనే చెప్పాలి. తెల్లవారుఝామున నిద్ర లేచి పాలు కాస్తున్న సీతకు తన చిన్ననాటి సంక్రాంతి సంబరాలు ఎంత వద్దన్నా గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఆ భోగిమంటలు, ఆ ముగ్గులు, ఆ మామిడి తోరణాలూ, ఆ బొమ్మల కొలువులూ, ఆ పేరంటాలు, ఆ పండుగ వాతావరణం, అవేవీ ఇక్కడ లేవే అని దిగులు పడుతూ ఆ సంతోషాన్ని తన బిడ్డకు చూపే అవకాశం ఉంటే బాగుండు కదా అని అనుకుంది. అంతలోపు "అమ్మా.. మనం ఇండియా ఎప్పుడు వెడదాము? తాతను, అమ్మమ్మను, నాన్నమ్మనూ చూడాలి" అంటూ వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆరేళ్ళ నాని. "మీ నాన్న గారికి కుదిరినప్పుడు, నీ బడికి సెలవులిచ్చినప్పుడు తప్పకుండా వెడదాము" బదులిచ్చింది సీత. "ఇవాళ పండుగ అని చెప్పావు కదా! ఇవాళే వెడదాము. నేను నాన్నను అడుగుతా" అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు నాని. అది సాధ్యమయ్యే పని కాదని సీత నిట్టూర్చి వంట పనిలో మునిగింది.
నాని అమెరికాలో పెరిగినా వాడికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలపాలని సీత కోరిక. వీలైతే ప్రతి పండుగా జరుపుకోవటంలో ఉన్న ఆనందం నానీ కి రుచి చూపించాలని కూడా తన మనసులో ఉంది. కానీ వారుండే పరిస్థితుల్లో అదంత సులభమేమికాదు.
సీత వంట ముగిస్తూ ఉండగా నానీని వీపు మీద ఎక్కించుకుని వంటింట్లోకి వచ్చాడు చక్రవర్తి. "సీతా! మనము వెళ్లే దూరంలో సంక్రాంతి సంబరాలను తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో సంస్థ నిర్వహిస్తోందట. రోజంతా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారట. సాయంత్రం భోజనం కూడా అక్కడేనట. వెడదామా?" అని సీతతో అన్నాడు. ఆ మాట వింటూనే "ఆ! అవునా! ఇక్కడ కూడా మన తెలుగు పండుగ జరుపుతున్నారా? ఇదిగో నేనూ, నానీ చిటికెలో తయారవుతాం. అందరం కలిసి అరగంటలో బయలుదేరదాము" అని ఎగిరి గంతేసినంత పని చేసింది సీత.
అనుకున్న విధంగా సంక్రాంతి సంబరాలలో సీత కుటుంబం పాలుపంచుకుంది. అక్కడికి వచ్చిన తెలుగు వారిని చూసి, తెలుగు పండుగ వాతావరణంలో కాసేపు గడిపేసరికి సీతకు ప్రాణం లేచొచ్చినట్టయ్యింది.
సరదాగా ఆటపాటలతో ఆనందంగా గడిపి భోజనం చేసి తిరుగు ప్రయాణంలో జరిగిన సంగతులన్నీ చక్రవర్తితోనూ నానితోనూ చెప్తూ తన సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకోవాలని అనుకుంది సీత. స్వదేశానికీ, తెలుగు నేలకూ ఇంత దూరంలో ఉంటూ కూడా మన తెలుగు పండుగనూ, సంప్రదాయాన్నీ తలచుకుంటూ తరువాతి తరానికి మన సంస్కృతిని పరిచయం చేసే అవకాశం ఇచ్చిన గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం వారికి మనసులో సీత కృతజ్ఞతలు చెప్పుకుంది. తన మనసులో ఒక్కసారిగా ఆనందం ఉప్పొంగి కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి.