Menu Close
Kadambam Page Title
సంఘర్షణ లోంచి
గవిడి శ్రీనివాస్

కోర్కెలు ఎక్కుపెట్టే బాణాలు
ఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి.

ఇవి ఎప్పటికీ తడి తడిగా
ఆనందాల్ని విరబూయలేవు.

మనకు మనమే
ఇనుప కంచెలు వేసుకుని
అసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం.

ప్రకృతి జీవి కదా
స్వేఛ్చా విహంగాల పై
కలలను అద్దుకుని బతికేది.

ఎన్ని రెక్కలు కట్టుకు ఎగిరినా
బాధను శ్వాసిస్తే
ఏ కాలం ఏం చెబుతుంది.

ప్రశ్నించు
సమాధానం మొలకెత్తించు
లోలోపల అగ్ని గోళాలని రగిలించు.

ఎప్పుడు గొంతు విప్పాలో
ఎప్పుడు మౌనం వహించాలో
అనుభవం నేర్పిన పాఠాలలోంచి
పరిమళాలు వెదజల్లాలి మనం.

మొక్కని నులిమి ఆలోచనల మధ్య
చెట్టుగా మారటం
పది మందికి నీడ నివ్వటం
సవాలు తో సహవాసం చేయటం లాంటిదే .

అనేక సంఘర్షణల్లోంచి
మొలకెత్తడం
ఆలోచించడం
ప్రకృతిలా వికశించటంలోనే వుంది జీవితం.

Posted in October 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!