అదివో అల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము ...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు ...
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే, తందనానా ....
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము...
ఇలా ఒకటి కాదు రెండు కాదు వేలకొలది కీర్తనలు కలియుగ వేంకటేశ్వరుని స్తుతిస్తూ విరచించిన పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య గురించి తెలియని, ఆ కీర్తనలను వినని తెలుగువాడు, దక్షిణ భారత సంగీత అభిమానులు ఉండరనే నా అభిప్రాయం.
మరి ఆ కీర్తనలను స్వర్ణలోయ (శాక్రమెంటో) లోని సంగీత ప్రియులకు వీనుల విందు చేయాలని తలంచిన ఔత్సాహికులకు శ్రీమతి శోభ రాజు గారు ఒక మంచి అవకాశం కల్పించారు.
నలభై వసంతాలుగా కేవలం అన్నమయ్య కీర్తనలను మాత్రమే గానం చేస్తూ, తన గాత్రమాధుర్యంతో ప్రపంచంలోని భారతీయులందరికీ ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తూ తరిస్తున్న ఈ మహా గాయని, మన శాక్రమెంటో లో సెప్టెంబర్ 23న ఆదివారం చల్లని సాయంత్రాన, శ్రీ లక్ష్మీనారాయణ మందిరానికి విచ్చేసి అందరినీ సంగీత సాగరంలో కొలదిసేపు సేద తీరేటట్లు చేశారు.
ఏమాత్రం తరగని గాత్ర శుద్దితో కలియుగ మహాపురుషుడైన ఆ దేవదేవుని స్తుతిస్తూ ఆమె పాడిన పాటలు నిజంగా సుమధురం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరూ తిరుమలలో ఆ కోనేటి రాయుని సన్నిధిలో ఉన్న భావన కలిగింది. ‘అన్నమాచార్య భావన వాహిని’ అనే సంస్థను స్థాపించి నేటికీ అలుపెరుగక కృషి చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని, భాషా పరిజ్ఞానాన్ని, అన్నమయ్య పదత్వాన్ని అందిస్తున్న ఈ సంగీత సరస్వతి మన శాక్రమెంటోకు విచ్చేసి ఒక చక్కని కార్యక్రమం చేయడం నిజంగా మనకు ఒక గొప్ప వరమనే చెప్పవచ్చు.
ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి ఎంతో మంది స్థానిక తెలుగువారు వివిధరూపాలలో తమ వంతు సహాయాన్ని అందించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమ సూత్రధారులు శ్రీయుతులు నటరాజ్ గుత్తా మరియు రాం కోమటి. సహకరించిన వారు; శ్రీమతి రజని, శ్రీయుతులు ఈశ్వర ఘోరకవి, రవి దాట్ల, వేణు ఆచార్య, మధు బుడమగుంట, ప్రభాకర రావు, సీతారం, శ్రీనివాస్, సుధీర్ మరియు ప్రహ్లాద. దాదాపు 250 మంది ప్రేక్షకుల మధ్యన జరిగిన ఈ సంగీత విభావరి మనందరికీ ఒక మరపురాని అనుభూతి.
చివరగా శ్రీమతి రజని గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.