Menu Close
సాహితీ ప్రక్రియ - గజల్...
- దినవహి సత్యవతి -

గజల్ : 7
***
ప్రియతముడే కోరివచ్చె కాంచవేమె ఓ సుదతీ!
చెంతజేరి అనురాగము పంచవేమె ఓ సుదతీ!

ప్రేమనంత మాలగట్టి తెచ్చెనులే నీకోసమె!
వలదనుటకు కారణమెదొ చెప్పవేమె ఓ సుదతీ!

అందమైన బంధములో చిలిపి తగవులుండునులే,
అలుకమాని సఖుని చెంత చేరవేమె ఓ సుదతీ!

చిరునగవులు చిందించీ ప్రేమజల్లు కురిపించవె!
అతడే నీ సర్వస్వమని పలుకవేమె ఓ సుదతీ!

సత్యమైన ప్రేమయనెడి సౌభాగ్యమె నీదాయెనె!
కానుకయదె అమూల్యమని తెలుపవేమె ఓ సుదతీ!
***

గజల్: 8
***
ప్రియునికొరకు విరహంతో వేగెనులే సౌగంధిక!
క్షణమునొక్క యుగముగాను గడిపెనులే సౌగంధిక!

మనోహరుని మధురమౌ ఊసులన్ని తలపుకొచ్చె,
హృదయవీణ మౌనముగా మీటెనులే సౌగంధిక!

తోడెపుడూ నిలుతుననే తేనెవంటి పలుకులవీ,
బాసలన్ని తలచుకొనీ మురిసెనులే సౌగంధిక!

ప్రియసఖునీ రాకకొరకు ఎదురుచూసె అభిసారిక,
మధురోహల ఊయలలో ఊగెనులే సౌగంధిక!

సఖునిప్రేమ సత్యమనీ నమ్మెనులే బేలవలే!
జీవితమే అర్పించీ వేచెనులే సౌగంధిక!
***

--- సశేషం ---

Posted in October 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *