Menu Close
సాహితీ ప్రక్రియ - గజల్...
- దినవహి సత్యవతి -

వాలుకనుల వయ్యారీ పూబోణివె నెరజాణా!
చిరునగవులు చిలికేటీ మహరాణివె నెరజాణా!

నిన్నుజూసి మనసుపడీ, ఊసులాడ తలచితినే,
సోయగాల చిందించే విరిబోణివె నెరజాణా!

రమణీయము నీరూపే, కమనీయము నీహొయలే,
నీప్రేమతొ మురిపించే భామమణివె నెరజాణా!

హంసగమన నీనడకలొ రాజసమే చిందేనే,
అనురాగము కురిపించే అలివేణివె నెరజాణా!

సత్యముగా నినుమించీ సుందరియే యిలలేదే,
నిత్యమల్లి సొగసులున్న సిరులమణివె నెరజాణా!

హొయలొలికే నీరూపే ఊరించెనె వన్నెలాడి!
నినుగాంచగ నయనాలే తపియించెనె వన్నెలాడి!

నాణ్యమైన నడుముదాన, వన్నెచిందు మేనిదాన,
నిన్నుగాంచి తనువంతా పులకించెనె వన్నెలాడి!

అందాలా వాలుజడకు సొగసుగూర్చె జడకుప్పెలె,
హొయలెంతో అలవోకగ చిందించెనె వన్నెలాడి!

అంతులేని అనురాగం సోగకనుల కురిసెనులే,
చిలిపిచూపు మదినితాకి మురిపించెనె వన్నెలాడి!

సత్యముగా నినుకౌగిట బంధించగ మనసాయెను,
నినువలచీ నాజన్మయె తరియించెనె వన్నెలాడి!

******
(నాణ్యము = నాజూకు)

--- సశేషం ---

Posted in July 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *