గజల్ : తిస్రగతి
రదీఫ్: పరమేశా!
*****
దివ్యమైన నీ సన్నిధి విడువలేను పరమేశా!
నీ పదములె శరణంబిక, వదలలేను పరమేశా!
అహరహమూ నీనామమె స్మరియింతును భక్తితోడ!
మీరావలె భక్తిగీతి పాడలేను పరమేశా!
హృదయములో నీరూపును పదిలముగా నిలిపినాను!
జ్యోతిర్మయ, నీ చిత్రము గీయలేను పరమేశా!
నామొరలను ఆలకించి ననుకావగ రావేలా!
నీజాగును క్షణమైనా తాళలేను పరమేశా!
సత్యమైన నీదర్శన భాగ్యముకై వేచియుంటి!
మాయామయ జగతిన యిక బ్రతుకలేను పరమేశా!
గజల్ : ఖండగతి / 5-5-5-5
*****
లోకాలు పాలించు క్షేత్రుడే శ్రీకరుడు,
భక్తులను బ్రోచేటి ధీవుడే శ్రీకరుడు!
గోదాయె వరియించె శ్రీహరిని పతిరూపున,
ప్రేమతో దరిజేరు హంసుడే శ్రీకరుడు!
సక్కుబాయి నమ్మెను విఠలుడే దైవమని,
సేవగొని కరుణించు సాక్షుడే శ్రీకరుడు!
భజనతో మాధవుని కొలిచినది మీరాయె,
పూజగొని ముక్తినిడు స్కంభుడే శ్రీకరుడు!
సత్యమౌ భక్తినే మెచ్చేను అచ్యుతుడు,
కైవల్యమొసగేటి దైవమే శ్రీకరుడు!
*****
క్షేత్రుడు , హంసుడు, ధీవుడు, స్కంభుడు, సాక్షుడు = పరమాత్మ
శ్రీకరుడు, అచ్యుతుడు, విఠలుడు = విష్ణువు,