గజల్ : రదీఫ్ : ప్రణతులిడుదు!
మిశ్రగతి : 7-6-7-6
*****
ప్రమథగణముల అధిపతియౌ గజాననుడికి ప్రణతులిడుదు!
దుష్టశిక్షణ చేయుమనుచు దయామయునికి ప్రణతులిడుదు!
మూషికవాహనుడతండులె, ఉండ్రాళ్ళంటె ప్రియమటలే!
మదిని కొలిచెద, జయమునీయ ఉమాసుతునికి ప్రణతులిడుదు!
చవితి దోషము బాపుమయ్య, భక్తవత్సలుడవీవయ్య!
విఘ్నములు తొలగించుమనుచు మహోదరునికి ప్రణతులిడుదు!
పదములంటియు శరణంటిని, దిక్కుయతడని నమ్మితినే!
కలతలు బాపి, కరుణజూప హేరంబునికి ప్రణతులిడుదు!
సత్యవ్రతుండు, జ్ఞానదాత, గౌరీసుతుడు గుజ్జురూపి!
నా పూజలను గొనుమనుచూ శివపుత్రునికి ప్రణతులిడుదు!
గతి : తిస్రగతి : 6-6-6-6/ అంత్యప్రాస
******
ఇనకులేశ భక్తితోడ మదిని నిన్ను నిలిపియుంటి!
కన్నులార దర్శించే భాగ్యమునే కోరియుంటి!
చరణమంటి మ్రొక్కితినే శరణంబిక నీవెయనుచు,
శరణార్థిని కాచెదవని హృదయమందు నమ్మియుంటి!
కలతలన్ని బాపునట్టి దీనబంధు నీవేలే!
కష్టములను తీర్చునట్టి భవుడీవని తలచియుంటి!
బ్రతుకు నావ నడిపేటీ బాంధవుడవు శ్రీరామా!
రామచంద్ర బ్రోవుమనుచు మనసారా పిలిచియుంటి!
సత్యముగా భక్తుడైన రామదాసు బ్రోచినావు,
ముక్తినొసగి ననుబ్రోవ వచ్చెదవని వేచియుంటి!