తెలుగులో గజల్ ప్రక్రియ ప్రవేశం ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసుకునే ముందర గజల్ ఆవిర్భావం ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకుందాము...
గజల్ ఉర్దూ సాహిత్యంలోని ఒక సాహితీ ప్రక్రియ. పదవ శతాబ్దంలో ఇరాన్ లో గజల్ ఆవిర్భావం జరిగింది. పండ్రెండవ శతాబ్దంలో మహమ్మదీయ రాజుల ప్రాబల్యంలో మొగల్ రాజులు, ఇరానీయుల ఆచార వ్యవహారాలతో పాటు, గజల్ కూడా భారతదేశానికి తీసుకుని రాబడింది. ఉత్తరభారతదేశంలో అమీర్ ఖుస్రో ద్వారా గజల్ ప్రారంభమైందని కొంతమందీ, దక్కనులోనే మొదలైందని మరి కొంతమందీ అనడం జరిగింది. అన్య భాషలలో గజల్స్ ముఖ్యంగా, ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ, ప్రియుడు ప్రేయసిని గురించి వర్ణించడం, వారి విరహ వేదన... నేపథ్యంగా వ్రాయబడ్డాయి. హిందీలో భక్తి గజల్స్ కూడా వ్రాయబడ్డాయి. ఎంతోమంది కవులు భక్తి గజల్స్ వ్రాసి పాడిన వారు ఉన్నారు.
గజల్ ప్రక్రియ, తెలుగు సాహిత్యంలో 1963 లో అడుగు పెట్టిందని తెలుస్తుంది.
“వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది/ పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’.. 1965లో వచ్చిన తొలి తెలుగు గజల్‌లోని మక్‌తా ఇది. ఇది 14 ఏప్రిల్ 1965 ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో "ఉగాది గజల్" అన్న శీర్షికతో అచ్చయింది. గజల్ ను మాత్రా గణ బధ్దమైన గేయ కవితా ప్రక్రియగా కూడా భావించవచ్చును. శ్రీ దాశరథి కృష్ణామాచార్యులని తొలి తెలుగు గజల్ కవిగా పేర్కొంటారు. 'గజల్' అనే శబ్దానికి అర్థం “ఇంతులతో మంతనాలు" అన్నారు దాశరథి. "గజల్ అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపమని నైఘంటికార్థం" అని వివరించారు ఉర్దూ భాషా సాహిత్యవేత్తలు శ్రీ సదా శివ. అలాగే తెలుగులో మొదట గజల్ పాడినవారు పి.బి.శ్రీనివాస్. ఈ గాయకుడు దాశరథి వ్రాసిన గజల్ ను, ఈమని శంకర శాస్త్రిగారి సంగీతంలో పాడారు.
తెలుగులో గజల్ ను దాశరథి ‘మంజరి’ అని పిలిస్తే , పి.బి.శ్రీనివాస్ ‘వల్లరి’ అని పిలిచారు. గజల్ ప్రక్రియకి సామాజికతను ఆపాదించిన వారు డా. సి.నారాయణ రెడ్డి అని చెబుతారు.
అయిదున్నర దశాబ్దాల కిందట తెలుగులోకి వచ్చిన ఈ కవితా ప్రక్రియలో ప్రస్తుతం వందల మంది రచనలు చేస్తున్నారు. ఎంతోమంది వరిష్ఠ కవులు, తమదైన శైలిలో గజల్స్ వ్రాసి, తామే గానం చేసి, దేశవిదేశాలలో ఖ్యాతి గడిస్తున్నారు. దీనిబట్టి చూస్తే తెలుగు సాహిత్యాన్ని గజల్ సాహితీ ప్రక్రియ ఎంతగా ప్రభావితం చేస్తున్నదో అర్థమౌతుంది.
గజల్ ప్రక్రియ గురించి:
గజల్ కి సంబంధించిన అంశాలు, గజల్ వ్రాయడంలో ఉపయోగించే పదాలు లేదా వరుసల గురించి ...
మిశ్రా, షేర్, కాఫియా, రధీఫ్, తఖల్లుస్, మత్లా, మక్తా, గతి ...ఇత్యాది పదాలు చాలా తరచుగా గజల్ ప్రక్రియలో ఉపయుక్తమవుతుంటాయి.
గజల్, మాత్రా ఛందస్సు (గురువుని 2 మాత్రలుగా, లఘువుని ఏక మాత్రగా పరిగణించడం జరుగుతుంది) తో సంబంధం కలిగి ఉంటుంది. (గజల్ వ్రాయడానికి మాత్రా ఛందస్సు గురించిన పరిజ్ఞానం కొంతైనా ఆవశ్యకం).
ఒక గజల్ లో కనీసం 10 / 14/ 18...పాదాలు ఉంటాయి. ప్రతి పాదాన్నీ మిశ్రా అంటారు. రెండు మిశ్రాలు కలిపి అంటే ప్రతి రెండు పాదాలూ కలిపి, ఒక షేర్ అని పిలువబడుతుంది. అలా గజల్ లో కనీసం 5 నుంచి 7,9,11.... ఇలా 15 షేర్ల వరకూ ఉంటాయి. అయితే 31 షేర్లున్న గజల్ కూడా ఉన్నట్లు చరిత్ర చెప్తుంది.
మొదటి షేర్ ను మత్లా అనీ, చివరి షేర్ ను మక్తా అని అంటారు. ఏ షేర్ కి ఆ షేర్ స్వతంత్రంగా ఉంటుంది. అయితే గజల్లోని షేర్లన్నీ కూడా భావసమన్వయం కలిగి ఉంటే, ఆ గజల్ పాడడానికి అనువుగా ఉంటుంది.
షేర్ లోని చివరి పదాన్ని రధీఫ్ అనీ, దాని ముందున్న పదాన్ని కాఫియా అనీ పిలుస్తారు.
అన్ని షేర్లలో రధీఫ్ గా అంత్యప్రాస కలిగిన ఒకే పదం ఉంటుంది.
కాఫియా పదాలు అంత్యప్రాసను కలిగి ఉండాలి. అంత్యప్రాస నియమాలన్నీ కాఫియాలకు వర్తించబడతాయి.
అయితే అంత్యప్రాస గజల్ లో కాఫియాలు ఉండవు. రధీఫ్ నే కాఫియాగా కూడా అనుకోవచ్చును. అంత్యప్రాస గజల్స్ లో, అంత్యప్రాస కలిగిన భిన్నపదాలు రధీఫ్ లుగా ఉయోగించబడతాయి.
మొదటి రెండు షేర్లలోనూ కాఫియా రధీఫ్ లు తప్పనిసరిగా ఉండాలి.
ఆ తరువాతి షేర్లలో కేవలం రెండవ పాదం లో మాత్రమే కాఫియా మరియు రధీఫ్ ఉంటాయి.
గజల్ లోని చివరి షేర్ (చివరి రెండు పాదాలు) ను మక్తా అని పిలుస్తారు. ఇందులో ఏదైనా పాదంలో కవి తన పేరును తెలుపవచ్చు. దానినే తఖల్లుస్ అంటారు. అయితే పేరు కచ్చితంగా వాడాలన్న నియమం లేదు.
ప్రతి గజల్ లోనూ ఒక మత్లా మరియు ఒక మక్తా తప్పనిసరిగా ఉంటాయి.
కొన్ని గజల్ రెండు మత్లాలతో వ్రాయబడ్డాయి. అటువంటి గజల్స్ ని ‘హుస్న్-యె-మత్లా’ గజల్ అని పిలుస్తారు. దీనిలో రెండు మత్లాలు ఉంటాయి అంటే మొదటి షేర్ లోని రెందు పాదాలలో కాఫియా రధీఫ్ లు ఉండడమే కాకుండా రెండవ షేర్ లో కూడా రెండు పాదాలలో కాఫియా రధీఫ్ లు ఉంటాయన్నమాట. అంటే మొదటి రెండు షేర్లూ, కాఫియా రదీఫ్ లతో వ్రాయబడతాయి. మిగిలిన షేర్లు మామూలుగా కేవలం రెండవ పాదం లో మాత్రమే కాఫియా, రధీఫ్ లు ఉంటాయి.
సాధారణంగా గజల్ నిర్దిష్ట గతిలో వ్రాయబడుతుంది... తిస్ర, చతురస్ర, ఖండ, మిస్ర గతి...ఇవి గజల్ వ్రాయడంలో ఉపయోగించబడే భిన్నగతులు.
గజల్ మాత్రా ఛందస్సులో వ్రాయబడుతుంది. ప్రతి పాదంలోనూ సమ అక్షరాలు ఉంటాయి అంటే గురు లఘువుల మాత్రలు కలిపి గుణిస్తే ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య సమంగా ఉంటుందన్నమాట. అలా వ్రాయడం వలన గజల్ కి ‘గజలియత్’ అంటే ‘గజల్ తనం’ వస్తుందని అంటారు. అలా గజలియత్ ఉన్న గజల్స్ పాడితే వినడానికి మధురంగా ఉంటాయి.
గజల్ గతులు...
తిస్ర గతి : 6-6-6-6 : అంటే గజల్ పాదం లో నాలు పదాలు ఉన్నట్లైతే ప్రతి పదం లోనూ ఆరు అక్షరాలు ఉండాలి లేదా మొత్తం పదం లోని అక్షరాలు కలిపితే 24 ఉండాలి.
తిస్రగతిలో వ్రాసిన గజల్ స్వరూపం...
ప్రతీ షేర్ ... 6-6-6-6 / 6-6-6-6 మాత్రల పొందికతో, రెండు పాదాలు కలిగి ఉంటుంది. అలా కనీసం 5 షేర్లు ఉంటాయి.
ఖండ గతి : ప్రతి పాదం లోనూ ...5-5-5-5 మాత్రలతో వ్రాయబడుతుంది.
చతురస్ర గతి : 4-4-4-4-4-4-4-4 (8-8-8-8) : ఎనిమిది మాత్రల పదాలను వ్రాయడం అంత సులభం కాదు కనుక ఎనిమిది మాత్రలను 4-4 క్రింద కూర్చి, 4-4-4-4 చొప్పున రెండు పాదాలుగా వ్రాయడం జరుగుతుందన్న మాట. అంటే చతురస్ర గతిలో వ్రాసే గజల్ స్వరూపం...
చతురస్ర గతిలో షేర్ లోని ప్రతి పాదం లోనూ 8-8-8-8 అంటే 64 మాత్రలు ఉండాలి. దానినే కొంత సులభతరంగా ఉండడం కోసం...
మొదటి పాదం... 4-4-4-4 /4-4-4-4 & 4-4-4-4/4-4-4-4 మాత్రలు కలిగిన రెండు భాగాలుగా,
రెండవపాదం ... 4-4-4-4 /4-4-4-4 & 4-4-4-4/4-4-4-4 మాత్రలు కలిగిన రెండు భాగాలుగా…
మొత్తం నాలుగు పాదాలలో వ్రాయబడుతుందన్నమాట.
మిశ్ర గతి : రెండు విభిన్న గతులను మిళితం చేసి గజల్ వ్రాయబడుతుంది అంటే షేర్ లోని ప్రతీ పాదం 7-5-7-5 లేదా 5-4-5-4- లేదా 7-6-7-6...ఇలా మాత్రలను కలిగి ఉంటుంది. మిగిలిన గజల్ నియమాలన్నీ మిశ్రగతి గజల్ కి కూడా యథాతథంగా వర్తిస్తాయి.