కవిత్వం -- డాక్టర్ రవూఫ్
గూట్లో దీపాన్ని వెలిగిస్తాను;
దీపమంటే దీపం కాదు,
పగటి సూర్యుడో
లేదంటే రాత్రి చంద్రుడో నన్న మాట!
అంతే .....
14 వేల మైళ్ళ దూరాన
ఆ పశ్చిమ దేశాన గర్తపురి ఆవిష్కృతమౌతుంది.
అక్కడ కురుస్తున్న వానే
ఇక్కడ విప్పారిన హరివిల్లు
ఔతుంది.
కవికి ఒక ఊరూ ఒక పేరంటూ
ఏదీ ఉండదు.
కొండొక చోట కొండో యేరో
నిశ్చలం గానో ప్రవహిస్తూనో
చేర పిలుస్తుంది.
కొన్ని గుసగుసల మసక కాంతుల
చీకటి సితార్ ని పలికిస్తుంది
ఆకాశం!
'ఆ రహస్య సాంధ్య గీతమే
కవిత్వమూ, జీవితమూ .... '
తుడిచేస్తూ ఉంటుంది కడలి
ఆ తీరం వెంట
పీతలు గీసిన నైరూప్య చిత్రాన్ని!
సంజ కెంజాయ కాన్వాస్ పైన
అస్తమిస్తూ సూర్యుడూ
ఉదయిస్తూ చంద్రుడూ ఒలికిన
రంగుల 'ట్రే' లో ముంచిన
కుంచెని అందుకుంటా నంతట
నేను!
వసంత వర్ణన -- దేవీదాస్
నవ్వులపువ్వులoదుఱిమినాట్యవిలాసము జూపునట్టి యీ
మవ్వపు దేవకన్నెను సుమంగళిగా నొనరింప మిన్నులం
దెవ్వరికో " కుహూ " యని వచింతువు స్వాగత మెంతదానవే ?
నవ్వులకైన రాడొకొ ? సనాతనుడైన విభుండు కోకిలా !
మధురములైన భావ సుకుమార విశేషములందు సారమున్
మథనము చేసి తీసిన సనాతన రాగ కళానుభావమే
విధమున సుంతలోనెవినిపించెద , వింతటి సిద్ది నొంద నే
యధిపు డనుగ్రహించె గురునారసికోయనె దెంత ధన్య వో !
పుడమి తల్లికి ఒళ్లంతా గాయాలు...!! -- కొప్పుల ప్రసాద్
ఎత్తయిన పర్వతాల సుందర రూపంతో
అందమైన నడకల నదుల సోయగం తో
విశాలమైన వక్షస్థల మైదానాలతో
చూడ చక్కని సుందర శిల్ప లావణ్యమైన నేలతల్లి..
నేడు పుడమి తల్లికి ఒళ్లంతా గాయాలు
కాలుష్యపు క్యాన్సర్ తో సతమతమవుతూ
స్వచ్ఛమైన గాలి లేక వెంటిలేటర్ పై జీవిస్తుంది
మనిషి పెట్టిన విషం తిని అలమటిస్తుంది..
ప్రాణులకు స్తన్యం ఇచ్చినటువంటి తల్లి
ఎదపై పుండ్లతో నిత్యం బాధపడుతూ
సహజత్వం కోల్పోయి కురూపి గా మారెను
అందమైన అమ్మ ఆకారం కళ హీనంగా తయారయ్యే..
ఎన్నో జీవులకు గర్భం ఇచ్చిన మాతృమూర్తి
వారి పోషణకై నిరంతరము తపించిన కన్నతల్లి
అణు విస్ఫోటాలతో తల్లడిల్లుతుంది
ఆకలికి ఆహారం కరువై విలవిలలాడుతుంది...
పుడమి కనక గర్భము తో తులతూగుతుంటే
ఆశపరులు త్రవ్వి ధనము పోగు చేస్తుంటే
తనువంతా చిల్లులు పడి సతాయిస్తుంటే
నిత్యం మౌనంగా మూగ రోదన చేస్తూ జీవిస్తుంది..
విశ్వంలో అందమైన అపురూపం నా భూగ్రహం
నేడు అనాథలా తయారై తిరుగుతుంది
అందులో పుట్టి ప్రత్యామ్నాయం చూస్తున్నాం
నేడు మనుగడ కోసం ప్రకృతిని ఆశిస్తున్నాం...
దాహం అంటే నీరు ఇస్తుంది జీవులకు
ఆకలంటే అన్నం పెడుతుంది సర్వప్రాణులకు
సచ్చే వరకు మోసి తనలోనే కలుపుకుంటుంది
ఏమిచ్చి తీర్చుకోగలం ఈ నేల తల్లి రుణం....
చిన్న మొక్క నాటి ప్రేమగా పలకరించండి
ఆనందంగా మొక్క నాటి అపురూపంగా పెంచండి
స్వచ్ఛమైన గాలిని పుడమి తల్లికి అందించండి
నేల తల్లికి బలం చేకూర్చే వనాన్ని సమకూర్చండి..
ఒంటరిగా ... -- స్వాతి శ్రీపాద
ఒంటరిగా ఒక్కసారి నీతో నువ్వు
సమస్త విశ్వాన్నీ వదిలి
కాస్సేపీ బాల్య యుగంలోకి తొంగి చూస్తే
హడావిడిగా పక్కకు విసిరేసిన చిత్రం ఒకటి కళ్ళకు కడుతుంది
అంచులు సానపెట్టి కాస్తవిరిగిన చందమామ అద్దపు ముక్కలా
తొక్కుడు బిళ్ళాడుతూ దాచుకున్న పింగాణీ వలయపు మెరుపుల్లో
విశ్రమించిన పసితనం ప్రతిబింబం
ఊహగా ఆక్కడ ఒంటి కాలిపై నిలిచే ఉంది.
సగం చదివి వదిలేసిన స్వప్న సామ్రాజ్ని
పుస్తకం పుటల మధ్య
రాజ్యమేలిన కలల సామ్రాజ్యం
కాలానికి చెదిరిపోక
ముని వేళ్ళ మీద అడుగులు కూడదీసుకుందుకు
వినయంగా చేతులొగ్గి ఎదురుచూస్తూనే ఉంది.
ప్రవాహాలు ప్రవాహాలుగా సాగే నూతనపోకడల్లో
ఒక సువిశాల ప్రపంచం
మేఘాలు పిగిలినట్టు
నవ్వుల కుంభవృష్టి కురిపిస్తూ
కదిలి పోతున్న పుటల శబ్దంలో
అస్పష్టంగా దృశ్యాలూ అక్షరాలూ
చేతులు పట్టుకు ఎగిరిపోతూ
మనో వీధుల్లో బొమ్మకడతాయి
ఈ వీధి భాగోతం ఎప్పటికప్పుడు కొత్తే మరి
జీవితం ప్రదర్శించే గారడీ నిత్య నూతనమే.