వుయ్ మిస్ యు -- కిలపర్తి దాలినాయుడు
ఎలా చెప్పడం
నీవు ఆదిమ స్నేహితురాలివి
ఎలా ఏడ్వడం
నీ సహచర్యం మర్చిపోలేనిది
ఏ నీడా లేని మాకు నీడనిచ్చావు
ఏ గూడూ లేనిమాకు గూటినిచ్చావు
ఆకలన్నాక కూడునిచ్చావు
దిగంబరత్వాన్ని కప్పి
దిగంతా,దాకా నా విజయపరంపరకు
దళాధి పతివి నీవేకదా!
ఎలా కృతజ్ఞత తెలుపగలం?
మా కంటి ధారలకు సాక్ష్యానివి
మా మింటి ధారలకు ఆహ్వానితరాలవు
పుడమితల్లి చర్మరుహానివి
పులకిత శుకపిక పక్షానివి
నిన్నెలా మరువగలం!
మాకు తెలిసినవి సంతాపసభలు పెట్టి
కన్నీరు పెట్టినట్టు నటించడం
ఆకాశానంటే కటౌట్లుపెట్టి
ఆత్మలకు శాంతి చేకూర్చడం!
మా కళ్యాణానికి కారకురాలవు!
మా నిర్యాణ కర్మక్రతువునకు
సహగామివి!
ఎలా?ఎలా? నిన్ను రక్షించగలము
పరమ స్వార్ధ పరులం
మేమే బతకాలన్న ఆశ!
మాకందినంతమేర "కూకటి వ్రేళ్ళతో"పెకళించడమే పనిగా
పెట్టుకున్నవాళ్ళం...
శ్వాసలను కత్తిరించి ఊపిరితిత్తులను
ఖాళీతిత్తులుగా చేసుకొనే దుర్మార్గులం!
నీవో
సహకారివి
సహనానివి
సస్యానివి
సవనవిధికి
సమిధవు
కవనానికి
కమ్మవు
పల్లెలకు పట్టుగొమ్మవు
పట్టణానికి పునాది పరచి
నగరానికి నాంది పలికినదానవు
ఐనా..................
పొమ్మనక పొగపెట్టాము
పొగగొట్టాల కోటలు కట్టాము
చుట్టు ప్రక్కల నిన్నులేకుండా
చాపజుట్టాము......
నిన్నెలా విస్మరించగలము
స్థన్యజీవులకు,వన్యజీవులకు
నువ్వు ఒక రకంగా అమ్మవే!
రథంపై మమ్మల్ని ఊరేగించావు
బండ్లపై మమ్మల్ని ఊరూరా తిప్పావు
సింహాసనం యిచ్చి సింహంలా బ్రతకమన్నావు!
నిన్నెలా వీడిపోగలం?
అమెజాన్లో ఉన్నా
ఆఫ్రికాలో ఉన్నా
ఆసియాలో ఉన్నా
ఆస్ట్రేలియాలో ఉన్నా
వెదకి వెదకి అంతమొందించిన
హంతకులం!
నువ్వు ప్రాణాలిచ్చేదానివి
మేము ప్రాణాలు తీసే వాళ్ళం
ఏదైతేనేం...
వుయ్ మిస్ యూ
చెట్టమ్మా!
సేవించకెట్లు ? -- సుప్రభ
*
వృందా వృత్తము- త, ర,ల
*
శ్రీకామకోటి పీఠ
శ్రీ కాలకంఠు రాణి
లోకేశి, చారుహాస
రాకేందుకోటి భాస
*
ప్రేమార్ద్ర భావయుక్త
కామేశ్వరాంకసంస్థ
వామాంగి, సాధుగీత
శ్రీమాత ప్రాణదాత్రి
*
క్షీరాబ్ది శేషసాయి
నారాయణుండు గూడ
శ్రీరాజరాజి నెంచి
గారమ్ము తోడ మ్రొక్కు
*
భారాల దించు తల్లి
వారించలేని శక్తి
కారామె సాటి యేరు
లేరామె మించు వారు
*
సామికా వృ. - ర,ర,ల
*
సామగానాల మెచ్చుఁ
గామితార్థాల నిచ్చు
నామరూపాల వేల
భూమిపైఁ బూజలందు
*
నేతగా నొప్పు నాతి
ధాతకున్ మాతయౌను
జోతలందించినంత
వ్రాతలం మార్చు తల్లి
*
శ్రీమహాదేవదేవి!
యామె ప్రేమంబుఁ గొన్న
బాములింకేమి యుండుఁ ?
దామసంబెట్లు నిల్చు?
*
"ప్రణుత" నూ.వృ. - న,త,హ
*
కనుక భావించి, మెచ్చి
తనను సేవించకెట్లు?
తనుపఁ బోకుండుటెట్లు?
ప్రణతులందించకెట్లు?
*
5:13 AM
3-19-2024
*
వృందా వృత్తలక్షణములను వేరొక పేరుతో పంపి మిత్రులొకరు మీయిష్టదేవత గూర్చి పద్యములను వ్రాయండి అని అడిగారు. నడక పరిచితముగా నున్నదని ముఖపుస్తకము, ఛందోగ్రంథములను పరిశీలించగా అది వృందా వృత్తముగా నేనింతకుముందు వ్రాసినదే నని తెలిసినది. ఆ సంగతి వారికి తెలియపరచిన తరువాత లోనున్న వారు పొంగించిన పద్యములు.
*
వృందా, సామికా లక్షణములు ఎత్తుగీతికి ( ఇం.సూ.సూ ) కూడా సరిపోతాయి
చిన్న చిన్నవి -- పద్మావతి రాంభక్త
కొంతమంది పెదవులతో
రాళ్ళు రువ్వుతారు
కొందరు
మౌనపు ముల్లు గుచ్చి
చంపుతుంటారు
పూలకు తెలుసా
పరిమళం గురించి
కొందరు మనుషులూ అంతే
కొలనులో జాబిల్లిని చూసి
అందుకుందామని
కొమ్మ వంగింది
ఆశల నది ప్రవహించిపోతుంటుంది
ఎక్కడ ఆనకట్ట వేయాలో
తెలుసుకోవడంలోనే ఉంది
కిటుకంతా
వేసవి ఎండ
కాల్చుకు తింటోంది
మల్లెల సౌరభం
మలాము రాస్తోంది
తనలోకి ఎగిరొచ్చే
మాయ మాటలను
అరిగించుకోలేక
గాలి కదల్లేక కూలబడింది
అందుకే ఇంత ఉక్కపోత
మామూలు అక్షరాలే
కొన్ని వజ్రాలు పొదిగితే చాలు
కవిత్వపు మెరుపులే
వెన్నెల ఎప్పట్లాగే వచ్చి
తలుపు తడుతోంది
మనిషే తన లోకంలో మునిగి
తీయడం మరచాడు
సముద్రాన్ని చేరాలని
నది తొందరపడుతుంది
తీరా చేరాక అదృశ్యమవుతుంది
జీవితపు పరుగూ
అంతే కదా
చిన్న విశ్వాసమే...!! -- కొప్పుల ప్రసాద్
అణువంతైనా చాలు ఆత్మవిశ్వాసం
నింగిన నంతా చుట్టి రావడానికి
పాతాళం శోధించి వచ్చినట్లు
రహస్యాలను ఇప్పి చెప్పడానికి..
కొద్దిగా అయినా చాలు నమ్మకం
వదులుకొన్న ఆశలను
చిన్న మొక్కకు నీరు పోసి పెంచినట్లు
చిగురాకులతో జీవం పొందడానికి..
రవ్వంత ప్రేమ చాలు
కరుడుగట్టిన హృదయాలకు
మలయమారుత గాలి తాకినట్టు
మనసులో స్వచ్ఛత చేకూర్చడానికి..
ఒక్క పిలుపు చాలు
అలిసిపోయిన వ్యక్తికి
మంత్రమై ఆ కట్టుకున్నట్లు
యంత్రమై ముందుకు కదలడానికి..
చిన్న ఓదార్పు చిక్కితే
కొన ప్రాణముతో ఉన్న మనిషికి
వెన్నెల కౌగిలి లభించినట్లు
నిత్య చైతన్య ప్రయాణానికి...
చిన్న ఆత్మీయమైన స్పర్శకి
శరీరమంతా పులకించి
ఎడారిలో మంచినీళ్లు దొరికినట్లు
తీయటి అనుబంధముతో సాగడానికి.