Menu Close
SirikonaKavithalu_pagetitle

నువ్వదే ఎగబాకడం అంటావు
నేను దిగజారుడు అంటాను.
నీకు నిచ్చెనగా కనబడింది
నాకు పామునోరుగా తోస్తుంది.
నీకు అంతస్తులోనే అంతానూ..
నాకు అంతస్సులో!
రొమ్ములు గుద్దెయ్యడానికి
నీకు సహస్రహస్తాలు!
జనాన్ని కుమ్మెయ్యడానికి
నీకు వెయ్యికొమ్ములు!
తాటిచెట్టూ కల్లుకుండా
గద్దెపై ఉన్నట్టే నాకుంటుంది.
చిత్తుకాగితాల బస్తా
మంత్రాంగం జరుపుతున్నట్టే ఆనుతుంది.
అమీబా రాజ్యాంగం
పర్యవేక్షిస్తున్నట్టూ
గాలితిండ్లు
న్యాయాన్ని కాపాడుతున్నట్టూ
చీమలబారులసభలో
పంచదార రేణువులు
కొలువుచేసినట్టూ
నాకు అనిపిస్తుంది.
నిచ్చెనమెట్లు ఎక్కేస్తున్న
అసురలోకం నీది.
నేలపైనే ఉండిపోయిన
సురలోకం నాది.
నీ అంతరిక్షం
నాకెప్పుడూ పాతాళమే!

నేను పిట్టమ్మను జాలి చూపండి..!!

పిట్టమ్మగా మీకు పరిచితురాలను
నాగోడు నేడు నీకు తెలుసా?
నిల్వ నీడ లేని చిన్న ప్రాణి
అందమైన జీవుల్లో నేనొక పక్షిని..

అంతరించిపోతున్నది నా జాతి
అభయ హస్తము ఇచ్చి రక్షించండి
చింతలు లేని చిన్న జీవిని
చెంతకు చేర్చుకొని దీవించండి..

నా మనుగడ నేడు ఒక ప్రశ్నార్థకం
ప్రకృతిలో స్వేచ్ఛా విహంగం నేను
ఆకాశమంత నా చుట్టమే
అంతర్జాల మహిమతో నేనొక జీవస్తవం..

రేడియేషన్ నాకు ఒక శాపం
నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో
నా పూర్వీకులంతా సుఖ జీవులు
కాలం మార్పుతో కష్టాలెన్నో నాకు...

పచ్చని గూడుతో ప్రశాంత జీవనం
నా గూడే నాకు రక్షణ కవచం
నా అందమైన ఇల్లు నాకే సొంతం
నాలాంటి గృహం సృష్టిలోనే లేదు..

గడ్డి పూసలతో శాస్త్ర నిర్మాణం
ఇంజనీర్లకు సాధ్యము కానీ విజ్ఞానం
ఉయ్యాల లాంటి గృహం కొమ్మలకు తగిలించి
చిరుగాలుల ఊడిగముతో సంతోషంగా గడిపిన..

చిరుధాన్యాలతో చింతలు మరిచి ఆరగిస్తి
గుక్కెడు నీళ్లతో తృప్తి చెంది
అటక బండపై చెక్కర్లు కొడుతూ
ముద్దు ముద్దు మాటలతో మురిపించాను...

ఇంటి ముంగిట నేను శబ్దం చేస్తుంటే
పిట్టగోడపై నాట్యం చేస్తూ నడుస్తుంటే
నన్ను చూసిన మనిషి వినోదించే
నాలుగు గింజలు చల్లి ఆశీర్వదించే...

ఓ మనుషులారా మనసున్న మారాజులు
చిన్న ప్రాణిపై బ్రహ్మాస్త్రాలు వద్దండి
మా జాతికి ప్రాణ బిక్ష ప్రసాదించి
సృష్టిలో మాకు ఒక స్థానం కల్పించండి..

ఎంత తపమునాచరించె తరువులు మనకోసం!
సంతసాన్ని ప్రసాదించు తనువులు మనకోసం!

కడుపునిండ సంతోషం కలగాలని వానియాశ
పలకరించి పంచునుగద ఫలములు మనకోసం!

గుడికో మెడకో జడకో కూర్చుకోండి దండలనుచు
ఆహ్లాదంగా యిచ్చును అలరులు మనకోసం!

మానప్రాణరక్షణకైమన్నికగల దారాలను
మలచుకోండి మీరనుచును వలువలు మనకోసం!

దారిపొడవు నీడలనేదరిజేరగ రమ్మనమని
చల్లదనపు పందిళ్ళౌ దళములు మనకోసం!

పొలాలన్ని దున్నిదున్నియిలాతలము పంటలతో
తులతూగగ శాఖలిచ్చు హలములు మనకోసం!

శత్రుభయం జంతుభయంకలగకుండ చూడాలని
కరములకందించి యిచ్చు శరములు మనకోసం!

సిరిసంపదలింటజేర్చతమ మొదళ్ళుకోయండని
సుఖప్రయాణ సాధ్యతకై రథములు మనకోసం!

ఎండావానలకండగ కొంపలు నిర్మించు”దానా”
జనసమూహ నివాసమౌ పురములు మనకోసం!

వెన్నెల వెన్నెలా
ఎందుకలా కళతప్పావంటే
రాత్రంతా
పచ్చదనాన్ని పసిడికి
మెరిపించేదాన్ని
ఇప్పుడు కాంక్రీట్ మొక్కల మధ్య
ప్రవహించాల్సిన పాడుగాలమొచ్చిందని
ముఖం ముడుచుకుంది

మేఘమా మేఘమా
ఎందుకు కురవకుండా
సీతకన్నేసావే అంటే
అడవులను కొల్లగొట్టి మరీ
ఎడారి దారులు విస్తరిస్తున్నపుడు
తడంతా ఆరిపోయి
కుమిలిపోవాల్సిన
చెడ్డరోజులొచ్చాయని
వేడిగా బదులిచ్చింది

నదీ నదీ
కాసేపు గొంతెండిన గువ్వలా
మరికాసేపు ముంచెత్తే వరదలా
ఎందుకలా అతీవృష్టీ అనావృష్టీ
రూపుకడతావు అంటే
మనిషి ప్రకృతిని
ముక్కలుగా తరిగేసే
ప్రయత్నంలో తలమునకలౌతుంటే
నా ఉనికిని రక్షించుకునే దిక్కులేక
నన్ను నేను అదిమిపెట్టుకోలేని
దిక్కుమాలిన రోజులొచ్చాయని
దుఃఖంతో గరగరమంది

గాలీ గాలీ
ఎందుకలా కదలకుండా
స్తబ్ధుగా కూర్చున్నావంటే
కాలుష్యపొగలు పీల్చి పీల్చి
ఊపిరాడక ఉక్కరిబిక్కిరవుతున్నాను
అని బిక్కముఖంతో
బేర్ మంది

మనిషీ మనిషీ
ఎందుకింత కృూరంగా
ప్రవర్తిస్తున్నావంటే
ఇవేవీ నాకు పట్టవు
భూగోళాన్నంతా
మడతపెట్టి మింగేసినా
నా ఆకాశమంత ఆకలి తీరట్లేదంటూ
నింగీ నేలా బద్దలయ్యేంత
భయంకరంగా అరిచాడు

చివరి కన్నీటి చుక్క ఆమెకి వీడ్కోలు పలికింది
కలతల తలపులు
తలుపులు బిగించుకున్నాయి

స్పర్శను వీడి అత్తిపత్తి వికసించింది
చీకటి చివర ఉదయం మేల్కొంది
దీర్ఘ నిదురను దాటి తాను పసిడి తూరుపు అయింది

భయం చెరగు మాటునుండి
నక్కి నక్కి చూసిన కళ్ళు
నిశ్చల శిఖరాల మీద నిశ్చింత తరాజుల్లో
మౌనముద్ర వేసుకున్న చలువ చందనాలయ్యాయి

ఉక్కిరిబిక్కిరి చేసి వెళ్ళన ఓ పెద్ద కెరటం
వెనుకనే నురుగల నగవుల చిరు అలల ఆహ్లాదాలు
ఛిద్రమైన అణువు
వేల పరమాణువుల్లో తన నగు మోము చూసుకుంది

ఆ ఖాళీతనాలలో పూడ్చిన అంకురాలు
నేటి పూల వనాలై ఎదురొస్తుంటే

విశ్లేషించే నేర్పు పదునెక్కింది
ముసుగుల వెనుక మనుషుల లెక్క తేల్చుకుంది
కొత్త చిరునామాకి
అక్షరాంజలి అర్పిస్తున్న తాను

నేలజారే ఎండుటాకు కాదు
గొడ్డలి పోటు వెనుక చిగురించిన చైత్రం
గాలి గమకాలమీద కలలు వీణియ సవరించే
స్వేచ్ఛా విహారిణి.

పాఠం నేర్పించిన కాలం
ముందుకు పడే ఆ పాదాలతో కలిసి
తానూ పచ్చగా అడుగులు కదపక పోదుగా

Posted in April 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!