
రాముడు -- రాయప్రోలు సీతారామశర్మ
ప్రభవించి బ్రహ్మాండభాండాధినాథుడే ధర బాలరాముడై వరలువాడె, పయనించిమునివెంట పతియౌచుమిథిలనే శృంగారరాముడై చెలగువాడె, పదముంచిమునిజనభద్రతాసిద్ధికై వనవాసరాముడై బ్రతుకువాడె, అడుగిడిలంక దైత్యాధిపుంగూల్చి వీరాధిరాముడై వెలుగువాడె , పలువిధములసేవలతోడ ప్రజలమదిని నిలువ పట్టాభిరాముడై మెలగువాడె ఆహ! సుగుణాభిరాముడైయలరుచుండు నతడె కోదండరాముడే కొలుతుమదిని. కొమరుడేరీతిగాక్షోణినుండవలయు అటులుండెనే రాము డణుకువగను, అగ్రజుండేరీతి అవనినుండవలయు అటులుండెనే రాముడాదరమున , పతియె యేరీతిని వసుధనుండవలయు అటులుండెనే రాము డవనిజయెడ, నేతయే యేరీతి నేలనుండవలయు అటులుండె రాముడే న్యాయముగను, ధర్మ పక్షపాతి మర్మమన్యములేక కర్మ ఫలము కోరి క్ష్మా మెలగక లక్ష్యమగుచు గీత లక్షణముల కుర్వి పొలిచె రామవిభుడు పూతయశుడు.
ఆవిరైపోతున్న బాల్యం -- పి. లక్ష్మణ్ రావ్
బొంగరమంటే తెలియని
నా బుజ్జిగాడికి
బొంగరాలాట నేర్పాలని
గోళీలంటే తెలియని
నా చిన్నోడికి
గోళీలాట చెప్పాలనే ఉంటుంది !
తాటికాయల్ని చక్రాల బండిని చేసి
నా పిల్లల్ని ఊరంతా తిప్పాలని
గాలి పటాల్ని చేసి పక్షుల్లా
మైదానంలో ఎగురవేయించాలనే ఉంటుంది !
జామతోటలో పళ్ళనెలా దొంగిలించాలో
ఏటి ఒడ్డున ఇసుకగూళ్ళు కట్టడమెలాగో
శిక్షణ ఇవ్వాలనే ఉంటుంది !
చెలమలు తీసి మంచినీటిని తాగడం
చెరువుల్లో చేపల్లా ఈదడం
నేర్పాలనే ఉంటుంది
వర్షంలో వాళ్ళను తడిపేయాలనే ఉంటుంది !
ఏక మొత్తంగా
బాల్యం రుచులన్నీ తినిపించాలనే ఉంటుంది !
కానీ.......
కాన్వెంట్ జైలుకి
పుస్తకాల బస్తాలను మోసుకుంటూ
చదువుల సంకెళ్ళతో
ఒళ్లంతా బందీల్ని చేసిన
ఈ పోటీ ప్రపంచంలో .........
వారి బాల్యాన్ని
అయిష్టం గానే ఆవిరి చేయడం
అనివార్యపు చర్యే అయిపొయింది !
విద్యలతల్లికి
పిల్లల బాల్యాన్ని నైవేద్యం చేస్తే
వారి భవిష్యత్తు బంగారమౌతుందనే
ఆశల పల్లకి ఎండమావియై ఊరిస్తుంటే
అయిష్టంగానే
అందరితో పరిగెత్తడం అలవాటైపోయింది !
బాల్యానికి ఉరివేస్తున్న
తలారులు తల్లిదండ్రులౌతుంనందుకు
ఆవిరైపోతున్న బాల్యానికి
ప్రత్యక్ష సాక్షులు అమ్మానాన్నలౌతుంనందుకు
ఎవరికి వాళ్ళం
ఆత్మావలోకనం చేసుకోవాల్సిందే !
శాపంగా మారిన పోటీతత్వం
సమిధల్ని చేస్తున్న అత్యాధునికతలనుండి
పిల్లల్ని విముక్తుల్ని చేసి
బాల్యాన్ని పునరుద్ధరించాలనే
ఉద్యమం చేపట్టాల్సిందే !
గజల్ ఖండగతి -- అచ్యుతానంద బ్రహ్మచారి
వదరుబోతులతోడ వాదించగాలేము.
నదీప్రవాహాన్ని ఎదురీదగాలేము.
ఇనుము విరిగినపూని కని యతుకగావచ్చు,
మనసు విరిగిన దాని మనమతుకగాలేము.
వరదవెల్లువ కడగి సరిగ నాపగవచ్చు,
విరులతావుల వ్యాప్తి పరగి ఆపగలేము.
పునుగు పిల్లిని అడవి పూని వెతుకగవచ్చు,
చెనటునెప్పుడు మనము చేరి మార్చగలేము.
జారచోరులపట్టి వారి నాపగలేరు,
శౌరికొలుచుట బ్రహ్మచారి నాపగలేము.
ఇది నిజమైతే! -- సముద్రాల హరికృష్ణ
అధికారపు అధికాకారం
ఊరిస్తోంది, కైవశానికి కవ్విస్తోంది!
ఉన్నది ఇంతగ కన్పడుతోంది
లేనిది ఇటు ఇటు రమ్మంటోంది!
దాసోహపు వందిమాగధీయం
చెవుల కమ్రృతవర్షీయమౌతోంది
ఏ అద్దం పట్టలేని అహంకారం
హద్దు లేని తలలతో పెరిగిపోతోంది!
కత్తికిపనిలేకుండా ఉంచద్దంటున్నది
తుత్తునియల నాట్యంభేషంటున్నది
బాగున్నవి ఊరక చెరపమంటున్నది
నే చేయనిదంతా ఓగనిపిస్తున్నది
గుడిసెలు నేలకె బరు వనిపిస్తున్నది
పాలరాతి నునుపది మరిపిస్తున్నది
మేడ పై నుంచి ఊరంత, ఉన్నదంత
కూడనిదిది,తుడిచేయాలనిపిస్తున్నది!
గతమంతా తప్పుల తడకై తోస్తున్నది
చరిత్ర పుటలలో దూకేసి దూరేసి
పవిత్ర కథలను వల్లేయించేసి
అనిష్ట నిజాల నడుగున ఖననం చేసేసి
నా పీఠం పునాది సీలలు బిగించేసి
భయభక్తుల రసాయన మెక్కించేసి
ప్రచార గణాల గడీల స్థాపించేసి
అబద్ధ ప్రవచన వరుసల హోరెత్తిం చేసి
నా సార్వభౌమత్వం చాటేయాలని పిస్తోంది!
***
కానీ ఏ మొద్దు నిద్దురలో చొర బడిందో
ఒక కల వచ్చేసింది,అంతా మార్చేసింది
ఆ దేవుడే దయతో రప్పించాడో
మా తాతే ఆప్యాయపు ఈ రూపం దాల్చాడో!
అధికారం నాకిప్పుడు ఝళిపించే కత్తే కాదు
అధికారం నాకిప్పుడు భయపెట్టే శక్తే కాదు
నా చేతికి చిక్కిన అద్భుత దీపం
పదిమందికి ఊరట నిచ్చే హస్తం
నా జాతిని సేవించే మహదవకాశం
దంతపు మేడలు దిగి పంచన కూచుని
పేదల బతుకుల వెల్గుల నింపే సూర్యం
నా పై నమ్మకముంచి నా పల్లకి మోసిన
బోయీ చెమటల తుడిచే వరం!
నా అన్నలు,తమ్ములు,అక్కలు,అమ్మలతో
నా యీ బలం పంచుకునే పర్వ దినం!
నీటికి ఐదామడలు నడిచే నా చెల్లెలి
కాలి నెప్పులు తగ్గించే భగీరథాశీ ర్వాదం!
పొట్ట పట్టుకు మైళ్ళావల వలసకెళ్ళే తమ్ముల
నూరడించి వెరవు చూపే మహ రాజమార్గం!
దుక్కి దున్ని,అందరి కన్నమిచ్చే
రైతు కష్టం తెలిసి ఆర్చే, ఆపన్న దివ్యకరం!
నా జాతి జనులకు,నా భరత భూమికి
నా జన్మజన్మల ఋణం తీర్చే సువర్ణయోగం!
భయపెట్టాలనుకున్న నా కిపు డే భయమూ లేదు
నన్ను చూసి జడవాల్సిన దెవ్వరి కేమీ లేదు
నా అధికారం నాదే,మీ హక్కులు మీవే
మీరిచ్చినదేగా ఈ ఎత్తుల కోట, కత్తుల కవచం!
***
ఓ మిత్రులారా,ఇది మన అందరి ఉమ్మడి శక్తే
నాదని విర్రవీగాడో ఎవరైనా,వాడి కిక అధోగతే!
ఇదంతా నా కల నేర్పినదే,నేనిపుడే నేర్చినదే
మీరిక చూస్తా రధికారపు ప్రసన్న రూపం, తథ్యం!
ఇదేమి లోకం - ఇదేమి శోకం -- శ్రీపాద సుబ్రహ్మణ్యం
కార్చిచ్చు కారడవులను
కాల్చి వేస్తుంటే
వరదలై పొంగి నదీమ తల్లులు
నగరాలను ముంచి వేస్తుంటే
ఇదేమి లోకం
ఇదేమి శోకం
భూమాతలో భాగం కోసం
ఏళ్ళ తరబడి కక్షలు కార్పణ్యాలతో
రక్తసిక్తం చేస్తుంటే
రాజ్యాధి కారం కోసం
రణతంత్రపు టెత్తుల
పేరుతో ఎదురొచ్చిన వారిని హత్యలు చేస్తుంటే
ఇదేమి లోకం
ఇదేమి శోకం
శకటాల వేగన్ని అదుపులో పెట్టలేక
ఆవేశంగా అమాయకుల ప్రాణాలు
అర్ధాంతరంగా గాలిలో కలిసి పోతుంటే
నిండా పదహారు నిండని
బాలికలను తేలికగా చంపేసి ఆత్మహత్యలుగా
చిత్రీకరించుకు పోతుంటే
ఇదేమి లోకం
ఇదేమి శోకం
నేరాలు ఘోరాలు చేస్తూ
నిమ్మకు నీరెత్తి నట్లు
నటనలు సాగించే అధికార గణాల లోని
రాక్షస గణాల గుణాలు ఇంతేనా
పోయే టప్పుడు ఏవీ పట్టుకు పోమని తెలిసినా
సర్వ జన సౌభ్రాతృత్వం
ఆలోచించ కుండా ఇంతేనా
ఇదేమి లోకం
ఇదేమి శోకం?!