నేను ... గర్భాలయ పలకరింతను -- విశ్వర్షి వాసిలి
నేను ఇలన కలను కలన అలను జీవితానికి స్వప్నజగత్తును. ఇల ఒక వాస్తవం కల ఒక వాస్తవం జీవనానికి కళాజగత్తును. •• నేను కల కంటాను. కలన రేపు కనుపాపల దోగాడుతుంది రేపటి వాస్తవం కదలాడుతుంది ఆత్మ కళ్ళలో కొలువుదీరుతుంది. వెలుతురు వేళ నన్ను వదలని ఆత్మ రాత్రయితే చాలు నాకలను చేరుతుంది కమ్మని నిజంలా మనసున నిక్షిప్తమవుతుంది జీవనయానానికి ఆలంబనగా స్థిరమవుతుంది. ••• కాలమానానికి కల కొమ్మచ్చి అవుతుంది ఆత్మసిద్ధికి కాలజ్ఞానం తోడవుతుంది స్వప్నానికి సాధన చేరువవుతుంది భూమిపొరల దాగిన విత్తు కల కలన కొమ్మ కొమ్మవుతుంది కల ప్రిదిలే వేళ పరిమళ మవుతుంది. •••• స్వప్నంలోని సుగంధం సుప్రభాతవేళ పరవాసన అవుతుంది ఫాలరేఖల పరవశ మవుతుంది కాలరేఖతో కాంతికిరణ మవుతుంది. ప్రత్యూషాన విత్తును జలబిందువులతో స్పృశిస్తుంటే గర్భాలయంనుండి పలకరించింది రేపటి శిశువుకు పిండమై ధ్యానమగ్నమైన వేళ మొక్కగా పరిణమించే దశలను నిలిపింది నా ఆత్మవాకిట ప్రకృతిబింబంలా. ••••• స్వప్నంలో నన్ను నేను చూసుకుంటుంటాను సాధనలో నా కళ్ళెదుట నేనుంటాను కొలమానాన వామనుడిలా పరిణామాన వానరునిలా పరిమాణాన మానవునిలా కాలమానాన దివ్యునిలా. జ్వలిస్తుంటాను అగ్నిలా ప్రచండమవుతుంటాను గాలిలా పదార్థమవుతుంటాను మట్టిలా స్థితమవుతుంటాను వాయువులా వాహిని నవుతుంటాను నీటిలా ఆకాశ మవుతుంటాను శూన్యతలా. •••••• కల ముగింపుకొస్తూ మనసును మేల్కొల్పుతుంది సాధన సారవంతమవుతూ శక్తిపాతమవుతుంది స్వప్న సాధనలు అభేద మవుతూ ఇహ పరాలు సమవేదిక లవుతాయి సహజాతా లవుతూ సహజసిద్ధు లవుతాయి బాహ్య అంతరాలు సమభాగిను లవుతాయి. ••••••• స్వప్నం నాకొక ఉపదేశం సాధన నాకొక ఉపాధేయం కల నాకొక జ్ఞానాలయం సాధన నాకొక ప్రయోగాలయం. •••••••• నేను ఇడ పింగళ సుషుమ్నల ప్రణవ దేహాన్ని దైహికనేత్రాలకు అందని స్వప్నదృష్టిని, యోగదృష్టిని వినగల కాంతిని, చూడగల చీకటిని స్పృశించగల పరాన్ని, స్వ ఇచ్చా పథాన్ని. ••••••••• స్వప్నం నాకొక గ్రంథాలయం ఏ అరనా ఏ పుస్తకం వుండదు మనసు శూన్య పత్రాల శ్వేతాక్షరాలను అందుకుంటుంది సాధనలో ఆత్మ నల్లకాగితాలపై తెల్లటి పదాలనే శబ్దిస్తుంది నిశ్శబ్దంగా భవిష్యత్తును నిర్వచిస్తుంటుంది. కృష్ణబిలను చేరుకొని జనన మరణ రహస్యాలను చేదుతుంటుంది విశ్వ వేదికన కాల వేదిక అవుతుంటుంది సృష్టి వేదికన పరంపరకు మూల మవుతుంటుంది మూలానికి అభేద మవుతుంటుంది.
జీవిత పరమానందం -- రాం ఎం.
జీవితమొక సాహసయానం
మనసుకు వయసుకు సోపానం
అలుపెరుగని ప్రస్థానంలో
అనుభవమొక అతులిత జ్ఞానం
అమ్మకడుపు ఉమ్మనీటితో
సంతరించు అనుగమనాదం
మారుతున్న ప్రగతి జగతిలో
ననలెత్తును నవ్యనినాదం
ఎత్తిన ప్రతిజన్మమేదియో
కొత్తతరువు పోలుట సహజం
స్థలకాలప్రభావ ప్రేరితం
జలవాయువుధరణి పోషితం
నరునినడక తీర్చుట కొరకే
పురాణేతిహాస సంపుటం
పరమార్థం తెలిసికొనుటకే
స్వీయాంతర తత్వశోధనం
అష్టమ జలనిధియే జ్ఞానం
అపారమతిసాంద్ర బంధురం
సాధనతో అందు మౌక్తికం
అది అనంతకాలశోధనం
అనివార్యం అంతిమకాలం
శిరోధార్యమవనీశీలం
ప్రకృతితో పరవశించుటే
నిక్కమైన పరమానందం
ప్రతి క్షణమూ ముఖ్యమైందే -- అరుణ నారదభట్ల
జీవితం ఒక పండగలా చూసుకోవడమే నాకిష్టం
ప్రవాహంలా వెంటే నడుస్తుంది
పుష్కలమైన అలల సముద్రం!
పాదాలు తడిపి వెళ్ళే ప్రతి అలా అందరికీ ఉండేదే...
కొన్ని హృదయాన్ని తాకితే
మరికొన్ని మొత్తంగా ముంచెత్తి వెళుతుంటాయ్!
తాకిన ప్రతి అలా ఆనందాన్నే ఇస్తుందని లేదు
తడిసిన బట్టలు ఆరేలోపే మరో ఉదృత అల...
సూర్యుడు భూగోళపు అంచు నుండీ
ఎర్రముఖంతో నవ్వుతూ వస్తాడని
గోరువెచ్చని ఎండకు ఆరుతూ
మేఘాలను లెక్కిస్తుంటాను
అవి ఈ ఆకాశానికి వేలాడి వేలాడీ
కురవలేక నీరసిస్తుంటాయి
ఈ రాక్షసికి నేనంటే భయంలేదని!
వాయుగుండాలు లోపలికి లాకెళ్ళినా
ఊదిన బెలూన్ లా నిండుగానే పొంగుతుంటా!
త్సునామీలు గుండెను ఎన్నిసార్లు బద్దలు కొట్టాయో...
ఐనా నేనుమాత్రం ఆ క్షణాల కల్లోలం తరువాత
కదలని సముద్రాన్నే ఔతుంటా...
నా హృదయానికి నేనెప్పుడూ ఋణపడే ఉంటా...నన్ను నన్నుగా నిలబెడుతున్నందుకు!!
కొన్ని సమయాలు --- పద్మావతి రాంభక్త
కొన్ని సమయాలంతే
వేసిన ప్రతి అడుగు
గాజుపెంకై దిగబడి
రక్తసిక్తమవుతుంది
బాధ పై మెట్టెక్కి
సలుపుతూ ఉంటుంది
కొన్ని సమయాలంతే
ఊపిరి బంధించబడి
ఆలోచనకు అడ్డుకట్ట పడి
నింగికి నేలకు నడుమ
పాదం సందిగ్ధంగా నిలబెడుతుంది
కొన్ని సమయాలంతే
చిమ్మ చీకటి కమ్మేసి
వెలుతురు జాడ
ఊహకు అందదు
తీరం కనుచూపు మేరలో
కనబడదు
***********************
కొన్ని సమయాలంతే
ఆనందం అంబరమంటి
లోకం పూలవనమై
పురి విప్పుతుంది
పరిమళపు నది
అమాంతం ముంచేస్తుంది
కొన్ని సమయాలంతే
ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న
ఆత్మీయహస్తం నులివెచ్చగా
కరచాలనం చేస్తుంది
నేనున్నానంటూ భుజం తడుతుంది
కొన్ని సమయాలంతే
కలల పొత్తిలిలో
ఒత్తిగిలినపుడు
వేకువరేఖ ఒళ్ళు విరుచుకున్నపుడు
కోయిల పాట
మెలకువ తలుపు తెరుస్తుంది
మనసు గాలిపటమై
గాల్లోకి లేస్తుంది
**************************
అన్ని సమయాలలోనూ
వాక్యం మనతో ఉంటుంది
సంతోషపు క్షణాలపై
మరింత అత్తరు చల్లి
రెట్టింపు చేస్తుంది
గడ్డ కట్టిన దుఃఖాన్ని కరిగించి
గుండెను తేలికపరచి
ఎగరేస్తుంది
కవిత్వం హృదయానికి
అమ్మలా
జోల పాడి జోకొడుతుంది
ఎందుకిలా చేశావ్...! -- డి.నాగజ్యోతిశేఖర్
చెప్పే వచ్చి ఉంటావుగా ఇంటి వద్ద...
సాయంకాలం కాసిన్ని నవ్వుల్ని పొట్లామ్ కట్టుకొస్తానని...
రాత్రికి వెన్నెల్ని తోడు తెస్తానని..!
అరుగుపై ఆడుకునే నీ చిట్టి చందమామలు ఉండుండి
వీధి గేటు వైపు చూస్తూనే ఉంటాయి...
నువ్వు తెచ్చే మిఠాయి కోసం!
నువ్వు దిద్దిన కుంకుమ రేఖ వాకిట్లో నిరీక్షిస్తూనే ఉంటుంది...
నీ అడుగుల చప్పుడు కోసం!
వాలు కుర్చీ చెప్పే ఊసులు రుచించక
నీ పిలుపుల తీపి కోసం
కడుపుతీపి ఎదురు చూస్తూనే ఉంటుంది!
పండక్కొచ్చిన రక్షాబంధనం
ఎప్పుడెప్పుడు 'నువ్వు మామవు కాబోతున్నావు' అనే కబురు చెప్పాలని
గుమ్మానికి తోరణమై రెప రెపలాడుతుంది!
చెప్పే వచ్చి ఉంటావుగా...
మరల వస్తానని!
నువ్వు ఉదయం హడావుడి గా చదివిన
వార్తా పత్రిక ...,
సగం తిన్న ఇడ్లీ...
నీ నవ్వుల్ని ముద్దాడిన కాఫీ కప్పు...
నువ్వు పాదులు కట్టిన పందిరీ...
అన్నీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి!
నువ్వొచ్చావు...!
నీ వెంట ప్రాణాన్ని మాత్రం తీసుకు రాలేక పోయావు...!
పక్క వాడి బండి దాటేందుకు ఎందుకంత ఆత్ర పడ్డావ్...
నువ్వు పాడాల్సిన లాలిపాటలూ...
నువ్వు తీర్చాల్సిన పచ్చని వాగ్ధానాలు...
నువ్వు మాత్రమే కట్టగల నీ ఇంటి పునాదులు...
ఇవేమీ ఆ క్షణం గుర్తుకు రాలేదా...?!
నువ్వు సాగించాల్సిన యాత్ర ఇది కాదని నీకు మాత్రం తెలీదు...?!
ఎవరు మాత్రం రోడ్డుపై ఇల్లు కట్టుకుంటారు...
ఆ మాత్రం సంయమనం పాటించలేక పోయావు...?!
ఇప్పుడు రోడ్డున పడ్డ నీ ఇంటికేం సమాధానం చెబుతావ్...?
నువ్వు కన్న, నిన్ను కన్న కలలకేం బదులిస్తావ్...?!
నువ్వంటే...
ఎన్ని హృదయ స్పందనలు...
మరెన్ని ఊపిరి పూలు...!
నువ్వు లేని వనంలో ఒంటరి పిచ్చుకలెలా బతుకుతాయి...!
ఒక్క క్షణం లేటైతే ఏమయ్యింది...
నీ పేరు ముందిలా 'లేట్' చేరకుండేది కదా!
ఓ జాతీయ రహదారులా నీ బతుకు పయనమలా సాఫీగా సాగిపోయేది గా!
చెప్పే వచ్చి ఉంటావ్ గా నేస్తం!
తిరిగొస్తానని!
మరి ఇంత 'వేగంగా' ఎందుకు దూరమై పోయావ్!
ఎందుకిలా చేశావ్...?!
జీవపు బండి
ముందుకు వెళ్లాలంటే
కాస్త వెనుక బడాల్సింది కదూ!