Menu Close
SirikonaKavithalu_pagetitle

ఎందుకో తెలియదు
నువ్వు పక్కనుంటే బాగుండనిపిస్తుంది

ఎలాంటి నువ్వు అని అడుగుతావా!?
నీ లాంటి నువ్వే

ఎందుకని చిలిపిగా నవ్వుతావా!?
నేను నేనులా ఉండేందుకే

అవును మరి
మెరుపు మెరిసిందని
ఆకాశం నీలాన్ని వదిలేస్తుందా !?
నిన్ను నింపుకున్నానని
నేను ఖాళీ అవుతానా !?
మెరుపు మెరుపే
నువ్వు నువ్వే

నువ్వూ నేనూ
పక్క పక్కన వున్నప్పుడు
మనం మనమే

పైడి బుస్కోటూ-గంటీలు -శకశక మెరువంగ!
శెట్టంత పిల్లగాడు-మస్తుగ ఎదురొచ్చె!
గుట్టంత దైర్నం- అడిగితే లేదని శెప్పనోడికి!
చరమం వలిశి - చేతుల పెడతడు!
అయితేమాయే! మాయ లోకం మన్నువడ!
కన్నతల్లి- ఉన్నవూరు యాది మరిశిరి !
గా తల్లికి కట్టం జరంత రికామిచ్చె!
అనుకున్నదో? లేదో? కట్టంగాని కట్టం మల్లొచ్చె!
అన్నదమ్ముల సందున- రవ రవ బుట్టె!
నడుమ పుట్టినోడు - దీటుగ నిలవడె!
మురిసినంత సేపు పట్టలేదవ్వకు!
ఏట్ల పారేసిన పిలగాడెదురుగచ్చె!
గంగల కలిసిందనుకున్న తప్పు గలమల కొచ్చె!
ఆడు-ఈడు కలబడితే ఎవ్వడేమైపోతడో?
కక్కలేక-మింగలేక అతలాకుతలమాయె!
కులం తక్కువోడని తిట్టెగీలోకం!
అయ్య-అవ్వ సేసిన తప్పుకు-తలొంచుకొనె!
మరుగు పొందు- ఆడి సావుకొచ్చె!
తప్పున పుట్టిన పోరడు-తకరారు చేయబట్టె!
కలిసి కాలమొచ్చి- పరాయిగమారిపోయె!
ఎవలనొదులుకోలేక - ఎక్కెక్కి ఏడ్చె!
యెతలు చెప్పూకోను- యెవలులేకపాయె!
అప్పటోలే- ఆ బిడ్డనే వదిలిపెట్టె!
సంతుకు- వంతబాడె!
ఎంతదైర్నముంటేంది?తెలివెంతుంటేంది?
అదును దెబ్బకు -అదిరి పడె!
--------
రవరవ= పోటీ, గలమల= దర్వాజాలకు, కలబడు= కొట్లాడుకొను, తకరారు= పేచీ; జగడం, అతలాకుతలం= చికాకు, యెతలు= బాధలు, సంతు= సంతానం.

ఆనాదిగా హైదవులం
అందరికి బంధువులం
కల్లా కపటంలేని వారం
పరమత సహనానికి వారధులం

చెట్టును, పుట్టను, రాయిని, రప్పను
దైవం అంటూ కొలిచేము
పరోపకారమే పరమావధిగా
మానవత్వానికి  వారసులం

ఆనాదిగా మనమంతా ఒక్కరం
ఎందరికో స్వాగతం అన్నాం
అప్పుడు మేము హిందువులం
ఇపుడు  మేము  బిందువులం

01. ఆ.వె
మంచి మనసు గలుగ మంచి జరుగు నీకు
మనసు కన్న గొప్ప మనకు నేది
మనసు వెన్న యైన మనిషి వన్నె పెరుగు
ఆలకించుమయ్య అమృత వాక్కు

2.ఆ.వె.
ధైర్య మున్న జాలు శౌర్య మదియె వచ్చు
ధైర్య సాహసాలు దగ్గరుంచు
కష్ట నష్టములను కడతేర్చ వచ్చును
ఆలకించుమయ్య అమృత వాక్కు.

3. ఆ.వె.
అధిక పుస్తకాల ననవసరము నీకు
మంచి గ్రంథములును మనకు జాలు
నుత్తమ మైన వాటి నుంచుము నీ కడ
ఆలకించుమయ్య అమృత వాక్కు

4. ఆ.వె.
ధర్మ శాస్త దీక్ష ధరణి యందు గలదు
రక్ష నిచ్చు నీకు రాముడల్లె
ధర్మ నిరతి తోడ దారి గనుము నీవు
ఆలకించుమయ్య అమృత వాక్కు

5. ఆ.వె.
దేహ మన్న నేమి, తెలుసునా సోదరా
తోలు తిత్తి యేను తోడు రాదు
దేని కయ్య నీకు దేహాభిమానము
ఆలకించుమయ్య అమృత వాక్కు

నిత్య ప్రవాహంలా కొట్టుకుపోవడమే
జ్ఞాపకాల వారధి లేదు మరి

ఉన్నదల్లా గుండె కొండల్లో
పుట్టిన జీవనది ఒక్కటే

ఎలా వచ్చినా ముందుగా
ప్రవహించి నన్ను చుంబించే
నా చిరకాల నేస్తం అది

నిన్నెప్పుడో దత్తత తీసుకున్నాను
అంటుంది

అవును...
నా తోడు, నీడ, గార్డియన్
అన్నీ తానే అయి
పొదివి పట్టుకుంది.

అక్షరానికి అక్షరానికి
మధ్య తానో సిరాగా చేరి
అక్షరాలను శుద్ధిచేసి
మాలిన్యాల్ని కడిగి
మచ్చలేని కాగితాన్ని
ఆ క్షణానికి అందిస్తుంది

కడపటి శ్వాసవరకు
తోడుగా నిలిచే ఓ బంధమైంది

Posted in October 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!