సర్వజ్ఞ వచనాలు (అనువాదం) – 2 ---- గంగిశెట్టి ల.నా.
మూ: మొసరు కడియలు బెణ్ణె౹ యొసెదు తోరువ తెరది౹ హసనప్ప గురువినుపదేశదిం,ముక్తి వశవాగదిహుదె సర్వజ్ఞ౹౹ (8) అ: ఎసగ మజ్జిగ చిల్క ౹ వెన్న గానెడి రీతి౹ మిసిమొల్కు గురునుపదేశమ్ముతో, ముక్తి వశము గాకుండునే సర్వజ్ఞ! మూ: హంది చందనద ౹ సుగంధవను బల్లుదె౹ ఒందను తిళియలరియద , గురువింగె నిందయే బహుదు సర్వజ్ఞ౹౹ (9) అ: పంది చందనపు౹ సుగంధమెరుగునె? లో బొందు బ్రహ్మమెరుగని గురుడు నిందయే నొందుగా సర్వజ్ఞ! మూ: దాన భక్తి గళల్లి౹ 'నాను' మరెదిరబేకు౹ నానెంబ రోగ నీగిదిగె, గురుబోధె తానె ఫలిసువుదు సర్వజ్ఞ౹౹ (10) అ: దాన భక్తుల లోన౹ 'నేను' మరచిపోవలె నేనన్న రోగమ్ము నీగినపుడె, గురుబోధ తానుగా ఫలియించు సర్వజ్ఞ! మూ: శ్వాన తెంగిన కాయి౹ తాను మెలబల్లుదె౹ హీనమనదవనిగుపదేశవిత్తడదు హాని కాణయ్య సర్వజ్ఞ౹౹ (11) అ: కుక్క కొబ్బరికాయ౹ మెక్కగా నేర్చునే? టక్కు మనుజునకుపదేశమిచ్చినా ఎక్కుడౌ హాని కాద సర్వజ్ఞ! మూ: కట్టిగెగళెరడన్ను౹ కట్టిట్టరేనహుదు౹ గట్ట్యాగి ఎరడు మథిసల్కె, బేగెయదు బెట్టె కొండంతె సర్వజ్ఞ౹౹ (12) అ: కట్టెలొక రెంటిని పెట్టి౹ గట్టితే ఫలమేమి గట్టిగా మథియించితే, పుట్టేటి అగ్ని చిట్టడివినే కాల్చుగా సర్వజ్ఞ! మూ: హసియ సమిధెయ తందు౹ హొసెదరుంటే కిచ్చు౹ విషయంగళుళ్ళ మనుజంగె, గురుకరుణ వశవర్తియహుదే సర్వజ్ఞ౹౹ (13) అ: పసిమికట్టెల తెచ్చి, యెసగి రాచిన నేమి విషయమగ్నులౌ మనుజులకు, గురుకరుణ వశవర్తి యగునటే సర్వజ్ఞ! (ప్రారంభంలోని ఈ గురుస్తుతి తగ్గి క్రమంగా ఇక సామాజిక అధిక్షేపంలోకి వస్తాడు.)
నేను ... సర్వమత మాతృకను – 2 ---- విశ్వర్షి వాసిలి
•2•
నేను
ఆత్మ క్షేత్రాన్ని
స్వయంభు రూపాన్ని
మునిపుంగవ వాసాన్ని
ఇచ్ఛకు తొలి ఆవాసాన్ని
అంతరింద్రియ సృజనత్వాన్ని
చీకటి నేపధ్యానికి సాక్షిసంతకాన్ని
శూన్య నేత్రానికి చిక్కిన జలవనరుని
అపార జలధిన స్థితమైన బీజాన్ని
అంకురప్రాయ అనంత గర్భాన్ని
నర అయన విశ్వ ఉదంతాన్ని.
••
పురుష తత్వ స్వీకారాన్ని
ద్వయానికి శ్రీకారాన్ని
స్త్రీపురుష ప్రవృత్తిని
సృష్టికి గుణాంకాన్ని
నింగీ నేలల వింగడింపును
పాదుకున్న అష్టదిక్కులను
కాల సంహితను.
•••
ఇహ పరాల సరిహద్దును
అహ చైతన్యాల సరిపద్దును
త్రిగుణాల సరిపొద్దును
పంచేంద్రియాల సరిపొత్తును
షట్చక్రాల శక్తి విలసనాన్ని
సప్తధాతువుల సశరీరాన్ని
జ్ఞాననేత్ర మహాబోధిని
సూర్యతేజ ఖగోళ ప్రాభవాన్ని
అగ్నిపునీత సంస్కృతిని
స్మృతిసహిత సంస్కారాన్ని
మనోవాక్కాయ సంహితను
అర్ధనారీశ్వర సంసారాన్ని
కొలమానంలేని మౌనాన్ని
కాలమానంలేని శూన్యాన్ని.
••••
శూన్యాన నెలకొన్న వాయువును
వాయువు నుండి వెడలిన గాలిని
వీవెన వాహికగా తేజోమయ కాంతిని
కాంతిన ప్రిదిలిన రంగుల విభవాన్ని
వర్ణసమీకృత జల వలయాన్ని
నీటినుండి పుట్టుకొచ్చిన వాసనను
వాసన ప్రేరణగా రుచిర జగత్తును.
అరుదుగా మారిందీ అపురూపం ---- అరుణ నారదభట్ల
ఆనందించడానికీ
మనసొకటి వుండాలి
సంతోషాన్ని వ్యక్తపరచడానికీ
వారిధి లాంటి సారధి మాటొకటీ కావాలి
హృదయం ఉప్పొంగినప్పుడో
తన్మయత్వం నిండినప్పుడో
తెలియకుండానే వొలికే కన్నీటికాంతి
లోలోపల మెరుపులద్దుకొని
నదిలా పలువరుసల్లో వొదిగి
పెదాలు సుధలు నిండిన
హరివిల్లులైనప్పుడు
మనసు ఆకాశాన
నక్షత్రాల లాంతరులు
అణువనువు నిండి
మది అంతరంగపు కాంతిపుంజమై
నన్నునేను మరిచిపోయినప్పుడు
తనువు సెలయేరై
ద్వీపాంతరవాసం నుండి
ఒక్కసారిగ వజ్రజలధార
వుత్తుంగతరంగమై
తడిపేస్తూ
కళ్ళలో మరో ప్రపంచాన్ని సృష్టిస్తుంది
ఎందరికుంటుందీ
ఆనందించే మనసు?
సుహృద్భావం గలవారికో
ఆస్వాదించే గణమున్నవారికో
గాలి తరంగమై
గగనపు విహంగమై
ప్రతిఫలిస్తూనే వుంటుంది మనసు
వినువీధిలో చలిస్తున్న ప్రశాంతచంద్రుడిలా!