Menu Close
SirikonaKavithalu_pagetitle

అమ్మా... అమ్మోరు తల్లి
రావే... మా బంగరు తల్లి
కనికరించి కరుణ జూపి
మమ్మేలు వరాలవల్లీ।। అమ్మా ।।

రాయి రప్పల నుంచి రత్నాల వరకూ
వాన వాగు వంక మున్నేరు వరకూ
చెట్టు పుట్ట గుట్ట మెట్టసీమల వరకూ
ఎన్నెన్ని రూపాల వెలసేవు తల్లీ ।। అమ్మా ।।

తొమ్మిది నాళ్ళ పండుగ నేడే రావమ్మా
పిలిచికూర్చోబెట్టి దండాలెట్టేమమ్మా
గుండాల నీళ్ళివిగో తానమాడంగా
గండాల కడతేర్చు మదిదండలివె తల్లి।। అమ్మా ।।

మనుగడలో మంచిచెడుల అగరుపొగలనిచ్చేము
సుక్కలన్ని దివ్వెలుగా నీముంగిలి నిలిపేము
సంతోసపు పొంగళ్ళు ఆట పాట తేనియలు
ఆరగింపులివె తల్లీ వెలుగు తల్లివై రావే ।। అమ్మా ।।

చెలిమి కలిమి బలిమి నొక్క తాంబూలమునిచ్చేము
బతుకే కప్పుర హారతి పొగడ్త మంత్రపు పూవిది
మీ బిడ్డలమేమమ్మా మా తప్పుల మన్నించుమ
ఒక్క సారి కొలిచినా వందేండ్లు కాచు తల్లి ।। అమ్మా ।।

వశమే ? నీ స్తుతి పూర్ణ గీతశత మొప్పన్ వ్రాయ నీ రీతి నీ
త్రిశతిన్ సప్తశతిన్ మతిన్ బ్రతిగ బ్రాతిన్ దెల్గునై వెల్గు నా
వశ భాషన్ గుశలాన వ్రాసితిని సద్భావాలు డాలున్ గొనన్
దృశిదృష్టమ్ముగ, ఆత్మకూరు నిలయా శ్రీరాజ రాజేశ్వరీ !

భావము :- అమ్మా ! నిన్ను స్తుతించునది, పవిత్రమైనది. లయాత్మక మైనది యగు పద్యశతకమును ఇంత గొప్పగా ఒప్పుగా వ్రాయ నెవ్వని తరమగును. కాని నీ త్రిశతిని సప్తశతిని మదిలో భావించి వానికి ప్రతిగా వ్రాసితిని. ప్రేమతోడ కుశల మతి వై తెల్గు రూపమున వెలుగునట్టి నా నోటికి వశమై నట్టి భాషలో వ్రాసితిని. మంచిభావాలు ప్రకాశించు నట్లుగానూ ఆ మంచి బావాలు డాలును చేతబూని తమను తాము రక్షించు కొన సామర్థ్య ము కలిగిoచు కొనుటకు గాను వ్రాసితిని. ఇందలి భావాలు ద్రష్టలగు మహాత్ములకు మాత్రమే చక్కగా స్పష్టముగా సత్యరూపమున కనిపించ గలవు. కళా ద్రష్టలకు కావ్యకళ సాక్షాత్కరించగలదు.

ఆ కొండే ధ్యాన సముద్రం
నిశ్శబ్ద తరంగాలతో
పారేనదీ మౌనంగా కొండచుట్టూ
గిరి ప్రదక్షిణం చేస్తోంది
గ్రీష్మ నిట్టూర్పుల ఆవిరులు
బిందువులుగా పైపైకి ఎగురుతూ
జారుతున్నాయి ధ్యాన ప్రవాహంలో
చేరే ప్రతి నీటి బొట్టు
ఉనికి మరచి పోతోంది
కనిపించని ఆలోచనలనతో
ముప్పిరిన మబ్బుల్లా వున్న క్లేశాలు
చెదరిన మేఘాల్లా తేలిపోతున్నాయి.
ఆకొండే శ్రీ చక్ర రూపంగా దర్శన మిస్తూ భ్రూమధ్యంలోకి దృష్టిని చేరుస్తూ
గాలి బుడగలా తేల్చేస్తోంది.
నిస్తేజమైన జడత్వ నుంచి
చేతనత్వం లోకి..ఓ పయమనం
క్షణికమో శాశ్వితమో తెలియని వైనం...

ఎవరుకాదన్నారు పక్కనే ఉండే
మనిషికీ మనిషికీ మధ్య
ఇన్ని మైళ్ళ దూరాన్ని
ఉదయానికీ రాత్రికీ మద్ధ్య ఎన్ని వేల పరుగులు తీస్తేనేం
ఈ దూరం సూది మొనంతైనా తరగదేం?
ఎక్కడికక్కడ ఆగిపోయిన అడుగులు
ఎంత ఎదురుచూస్తేనేం
ఎలా దగ్గరవుతుంది దూరమైన అనుబంధం?

ఎక్కడుంది సమయం
అస్తమించని వెలుగుల గుప్పిట్లోనా
ఉదయం అవసరం లేని నిట్టూర్పుల కునికి పాట్లలోనా
పునాదులు లేకున్నా పైపైకి సాగుతున్న ఆకాశ హర్మ్యాలు
కుప్పకూలే ఒక వినాశనం లోనా
పుట్టక ముందే సమసిపోయే ఆలోచనల వలయం లోనా
నిన్ను చూసి జాలిగా నవ్వుకునే పగిలిన అద్దం ముక్కలోనా?

లిపిస్టిక్ పెదవుల కింద జారిపడితున్న మాటలవెనక
చిక్కు పడిన బ్రతుకులు సరి చేసుకోలేని భేష జాల్లో
ఎవరెక్కడున్నారో చూపుకానని దూరాల్లో చిక్కుకుని
బయటపడలేని పరితాపంలో
పక్కన ఉన్నది మనసో మట్టిగడ్డో తెలీకపోయాక
ఉన్నది చూపా చుప్పనాతి రూపమా?

ఎలా తగ్గుతుందిక మనసుకూ మనసుకూ మధ్య దూరం.

ఆ. వె.
ఒంటరాయె వృక్షమోపగ లేనట్లు
మొండి మోము బెట్టె యెండినట్టు
కైక బూనెనేమి కటిక చీకటి దాల్చి
ఆకులన్ని రాల్చె అలిగెనేమి?

కాల చక్రమెంత కనికట్టు జేసినా
కదిలి నిద్ర లేచి కలలు పండి
మనసు నిండ వెలుగు మారాకు చిగురింప
శిశిర మంత చైత్ర చిత్రమౌను!

ఆ.వె.
అమ్మ వోలె వృక్షమవని యందు నిలిచె
జీవమంత పోసి సేదదీర్చె
తనదు ఆశలన్ని తన్మయానవదలు
అమ్మ వోలె తరువు ఆకురాల్చె !

Posted in June 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!