Menu Close
SirikonaKavithalu_pagetitle

నాకు తెలుసు
కనిపించాలనే అనుకుంటావు
కానీ
దగ్గరకు రానీవు
నీ ఇబ్బంది ఏమిటో నాకు తెలుసు

అన్నీ చూస్తూ కూడా అలా
బెల్లం కొట్టిన రాయిలా
మన్ను తిన్న పాములా
ఇంకిపోయిన ఏరులా
మంకు వీడని మనిషిలా
ఎందుకున్నావని అడుగుతా ననేగా

నా మీదే ఒట్టుపెట్టుకొని చెపుతున్నా
నిన్ను నేనేమీ అడగను
అధికారలాలసతకు
ఆజ్యమెందుకు పోస్తావని అడగను
కళ్ళు నెత్తికెక్కినవారికోసం
ప్రపంచాన్నే
పైనెందుకు నడుపుతావనీ అడగను
అణిగి మణిగి ఉన్న ఆకులను
అణిచే ప్రయత్న మెందుకనీ అడగను
వైరాగ్యానికీ వైభోగరాగాలకూ
ఏకాశ్రయత్వం ఎందుకని అడగను
ఒట్టుతీసి గట్టుమీద పెట్టమని
గుట్టుగా నువ్వే అడిగినా
ససేమిరా అనే అంటాను

నాకు బాగా తెలుసు
నీదొక లోకం
పురుషార్థాలూ అంతశ్శత్రువులూ
చేయీ చేయీ కలుపుకొని
చెలరేగుతున్న లోకం
పాండిత్యమూ పామరత్వమూ
చెట్టాపట్టాలతో
చెలిమి చూపుతున్న లోకం
కొండలకూ లోయలకూ మధ్య
కొట్టుమిట్టాడుతున్న లోకం
ఆనందమూ అసంతృప్తీ
క్షీరనీరన్యాయంగా చేరువైన లోకం
ధర్మాన్ని వెతుకుతూ మోక్షం
మోక్షాన్వేషణలో ధర్మం
తలమునకలై తపిస్తున్న లోకం
నీ లోకం ..
నీకే మచ్చికైన లోకం..

నీ లోకంలో
నీతికి భిక్ష లేదు
అవనీతికి శిక్ష లేదు
ఎవడి కర్మఫలం వాడిది
ఎవడి అనుభవబలం వాడిది
అప్పటి గీతకు
ఇప్పటి ఉదాహరణం నీ లోకం
రేపటి కలియుగాంతానికి
ఇప్పటి అంకురార్పణం నీ లోకం

గుండె గూటిలో...
సందడిలా పరుచుకునే భావమేదో
చెట్టును విడిచిన పిట్టలా
రివ్వున ఎగిరిపోగానే..
గోడకు వేలాడుతున్న గడియారం
ఎప్పటినుండో కాచుకున్న శత్రువులా
ఉన్నపళాన
నా మీద పడి దాడి చేస్తుంది
పదునైన తన ముళ్ళను
గుండెలో కర్కశంగా దించుతుంది..
అంతే... అదే మొదలు..
క్షణమొక కల్పమై..
సిలువలా నా మ్రోల నిలుస్తుంది..

నింగిలో కదిలిపోయే మబ్బులు
సందేశాలు మోస్తామంటూ
నేలమట్టుకు వంగి నడుస్తున్నా..
తలపులు ఉడిగిన మనసు మాత్రం
చెవిలో సీసాన్ని నింపుకొని
మౌనాన్ని ఆలింగనం చేసుకుంటుంది

సూర్యుడు చూరుకి అటుగా దొర్లిపోయాక
నాలుగుగదుల మధ్య నలుగుతున్న ఒంటరి మనసు
కలత నిదురతో కలతపడుతూ
చివరికి సర్దుబాటై సంధి చేసుకుంటుంది

కలలో ఏదో కొండగాలి
నీ దేహ పరిమళాన్ని మోసుకొస్తుంటే
ప్రేమకారే నీ చేతివేళ్ళు
నా చెక్కులని స్పృశించినట్లైన ఆలాపన
నాలుగు చుక్కల అమృతం తాగిస్తుంటే..
చచ్చి బ్రతికినట్లుగా
ఉలిక్కిపడి లేచిన ఆశ
నీకై చుట్టూరా తేరిచూస్తుంది
మెలకువ మళ్లీ చురియై కోస్తూ హింసిస్తుంటే..
ఒక్క క్షణంలో వరించిన శూన్యం
ఊటలుడిగిన నా కళ్ళలో
మళ్లీ పూడికలు తీసి పోతుంది...
అభావంగా నే నింగికేసి చూస్తుంటే..
ఎక్కడో చంద్రునికి దవ్వున
మంచు తెరచాటు మాటున
నిలుచున్న
ఒంటరి రిక్క
అందుకున్న విరాగపల్లవులు
శ్రుతిపుటలను మీటుతుంతే...
ఆ పల్లవులకు అంతులేని  చరణాలను ఆశువులుగా రాసిస్తూ...
విరహాలను శ్వాసిస్తూ...
చిరకాలం భాసిస్తూ....
శూన్యంతో భాషిస్తూ...
నేను...

నా జీవిత పుస్తకంలో
మొదటి పుటలోని
అర్థవంతమైన తొలి వాక్యానివీ ,
చిట్టచివరి  పుటలోని
యే అర్థమూ లేని కడపటి వాక్యానివి
కూడా  నువ్వే ....

ఈ రెండు వాక్యాల నడుమ  ...
అసంబద్ధ అసంగత
వాక్యాల దొంతరని నేను !

కలిసున్నట్టే ఉన్నాం గానీ
నెమ్మదిగా నిశ్శబ్దం ఆవహించి
శూన్యాన్ని పరిచయం చేసింది కాలం!
ఒకానొక మౌనాన్ని నింపి
మనను దూరం చేస్తుంది గమనించావా?

హిమనీనదమై
నాలో నీవు ప్రవహించడం మొదలై
నా జ్ఞాపకాలు బాధలు భయాలు ఆశలు కోర్కెలు అందాలు ఆనందాలు
చెట్టు గుట్ట నదీ చెరువు
అలలు అలలై ఎగసే సముద్రం అన్నీ
నీ సృజనస్పర్శలో తడిసి
కురిసిన మస్తిష్క ధారలై
భావచిత్రాలవడం
నాకింకా గుర్తుంది

తిరగవేసే ప్రతి పేజీ
కదలిన ప్రతి కదలిక
ప్రతి పుట ప్రతి నిమిషం
ప్రతి సందర్భం
ప్రతి శబ్దము ప్రతి అనుభూతి
నీ చైతన్య కాంతిలో మెరిసిన
అక్షర వర్ణాలే!

నీ ఈ దూరం
ఎందుకని ప్రశ్నించే అవసరంలేని సత్యంలో
నన్ను మిణుగురు పురుగును చేసి
అనంతాకాశంలో నిలబెట్టిన కాలపు చేతనమూ గుర్తుంది

ఉపయోగమో వ్యర్థమో
తెలియదుగానీ
ఈ ఎడబాటు మాత్రం అందంగా లేదు!

నీ పరిష్వంగనలో కొత్తగా మొలకెత్తిన నాకు
ఎన్ని వందల వేల రంగులద్దావో నువ్వు...
కంటి రెప్పలలో  ఇమిడి
ఎన్నెన్ని కొత్తకిరణాలై పోతపోసుకున్నావో...
నాకెన్నెన్ని చిగుర్లై మొలిచావో...

కవిత్వమా...  అలా దూరంగా మెరిసి వెళ్ళిపోతున్నావెందుకు?!
నాలో స్పందనవైనది నీవే
స్తబ్దత వైనదీ నీవే...
నేను కేవలం ప్రేక్షకురాలిని
నీ ప్రేమికను
నీ కదలిక... నా తన్మయం
నీ భావావేశ వర్షధారల వెల్లువలో నేనొక తూగుతూ నడిచే పడవను మాత్రమే!!

Posted in May 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!