Menu Close
SirikonaKavithalu_pagetitle
జీవనోద్యానంలో... -- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ

అన్నం పక్వమయ్యాక
పాత్రను దించేస్తాం
మనసు పక్వమయ్యాక
క్యాలెండర్లు చించేస్తాం
వయసు అంకెల గారడీని వీక్షిస్తున్నా
మనమున్న చోటనే ఉంటుంటాం
మనః ఉద్యానవనానికి మనమే తోటమాలీ లవుతుంటాం
నిత్యం పూసే పూలను దండగా అల్లుకొని
రహస్య ఆముక్తమాల్యదలై జీవిస్తుంటాం

శ్రీశంకరభగవత్పాదాద్వైతసుధా -12 -- ఆచార్య రాణి సదాశివ మూర్తిః (సదాశివానందనాథః)

*అవతారిక*
ఉపాధిరహితమైన ఆత్మ స్వభావమెటువంటిదో ఈ సందర్బంలో చెప్పబడుచున్నది.

*శ్లోకము*
వినోపాధిం త్వేకో న హి భవతి చాత్మా వివిదిషుః
స్వసంవేద్యత్వం నో పరవిదురవేద్యత్వమపి నో।
స్వయం సంవేదోऽయం న చ భవతి సంవిత్పరభవం
ప్రకాశస్యాపేక్షా న చ భవతి భానాంతరరుచౌ।।

*భావము*
ఉపాధి రహితమై ఒంటరిగా నున్న ఆత్మ (శుద్ధచైతన్యము లేక బ్రహ్మము) తెలిసికొనవలెనను కోరిక కలది కాదు. దానికి తనను తాను తెలుసుకొనుట అనునది లేదు. తనకన్న భిన్నమైన (వేరొక) *జ్ఞాత* చే తెలిసికొన బడుటయూ లేదు. అది స్వయముగా జ్ఞానమే. వేరొక జ్ఞానమునుండి పుట్టినది కాదు. ఒక వెలుగు తాను వెలుగును అని తెలియబడుటకు వేరొక వెలుగును కోరదు.
*ఆత్మ అనగా శుద్ధజ్ఞానమే* అని ఇక్కడ తాత్పర్యము.

*విశిష్ట పద వివరణ*
*ఉపాధి* -
అన్యథా ఉన్న వస్తువు యొక్క అన్యథా కనబడే రూపము
ఉపాధి. ( *అన్యథా స్థితస్య వస్తునః అన్యథా ప్రకాశనరూపమ్ ఉపాధిః* ).
శుద్ధ జ్ఞాన రూపమైన ఆత్మ జగత్తుగా కనబడుచున్నది. ఆ విధంగా ఈ జగత్తు ఆత్మకు ఉపాధి అగుచున్నది.

విదురః - జ్ఞాతా - తెలిసికొనునది (వాడు)

చేనుకు పాశిన నాగలి .... -- దేవరాజు విష్ణు వర్ధన్ రాజు

ఓలపటి పసరం నాము రోగమొచ్చి సచ్చింది ..
ఎగుసాయం నాగు బెడితే నామోషీ బతుకు

అప్పు సప్పు జేశి దాపటి పసరం కొనటానికి ..
నవాబుపేట అంగడికి ...
తప్పుచేయని దొంగలెక్క ...

అంగట్ల పసరాలన్నీ పట్నం వచ్చిన పతివ్రతల్లా   పొట్ట పెకిలి...
షోరూముల బొమ్మల్లెక్క ...

బొర్రలు బొడ్రాయివతు నిగనిగ లాడినా ...
కంట్లె జీవుడు బొత్తిలకు కరువు ...

డొక్కలు ఈడ్సుక పోయిన గొడ్డుగూడ ..
కొనబోతే కొరివి .. అమ్మబోతే అడివి ..

ఆయిమన్న బొల్లెద్దు సరే అన్నట్లున్నా ...
కీసల వున్న రొక్కానికి సగం గొడ్డుకూడా రాదని ...సావు కబురు ...

పొద్దుబోకినాగాని గొడ్డు బ్యారం ...
ఎక్కడేసిన గొంగడి ఆక్కణ్ణే ...

మాపటి దూపకు రెండుశీషల కల్తీకల్లుతో ఉపశమనం ...

ఒట్టి శేతుల ఊరుమొకాన ...కాళ్ళీడ్సుకుంటూ
కాటికిబోయ్యేటోనోలె ....వుసూరనుకుంట ...

పసరం పొత్తు ఎగసాయానికి యాకడు దూడ్ .. నా గుండె గుభెల్లు ...

దొడ్లె దాపటి పసరం ...సొల్లుకారంగ..
ముండమోసిన రైతులెక్క ఒంటరిగా ...

పడుపునేరంమీద ఇడుపుకాయిదం తీసుకుని ...
తల్లిగారింటికి పాశిన ఆడిబిడ్డలా ..

"శేనుకు పాశిన నాగలి ..."

చెల్క ...అంగట్ల బొమ్మలా ...అమ్మకానికి ..
నేను ... పట్నవల్ల అడ్డమీద కూలిగా ...
మరో అవతారం ....

పుణ్య భూమీ .. కళ్ళు తెరు...

నా మాతృభూమి..! -- బెంగాలి -ఆంగ్ల మూలం: డా.ఆశిష్ సన్యాల్..,కలకత్తా -- అనుసృజన: డా.పెరుగు రామకృష్ణ

నిన్న రాత్రి
నిదురించేందుకు
నాలో నేనే దుఖించాను..

నా మాతృభూమిపై
విశ్రాంతంగా తల ఆనించి
నా తల్లి గురించి
అందమైన కలలు కనేవాణ్ణి...

ఈరోజు
ఎటు చూసినా రక్త పాతం...
హృదయం నుంచి సైతం రక్త స్రావం..
మళ్ళీ నన్ను నేను కోల్పోయి
శాప గ్రస్త చీకటినయ్యాను..

ఒకప్పుడు
మాతృ భూమి
నా కలల తోటలో..
వేల గులాబీలు
వికసించినట్లుండేది..

మరిప్పటి
ఈ అనిశ్చిత, అభద్రతా భావం
ఓ సర్ప పరిష్వంగం..
ఒక చెరగని శూన్యం ...

అనంత ఆకాశంలో
నక్షత్ర కాంతులీనే నా భారతం ..
నన్ను ఆదర్శాల కలలతేరునేక్కిస్తుంది ..
నీ ప్రేమతో మళ్ళీ
నాలో చాయారహిత
దీప జ్యోతిని వెలిగించు ...!

Posted in June 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!