Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

మన సంక్రాంతి - పాతూరి అన్నపూర్ణ

చలిపొద్దుల ధనుర్మాసం
ఆలయ ప్రాంగణం లో ప్రదక్షిణలు చేస్తూ
శ్రావ్యంగా వినిపించే
గోదమ్మ పాసురాల సుస్వరాలు
గమకాలలో నిండిపోతున్న
చలిగాలి వయ్యారాలు

గాజుల చేతుల గలగలలతో
తీర్చే రంగవల్లులు
ఇంతులు దిద్దిన పూబంతుల గొబ్బిళ్ళు
ముంగిట్లో కుప్పవోసిన సింగారాలు

అవనితల్లికి నులివెచ్చదనమిచ్చే
భోగిమంటల నిగారింపులు
హరిదాసు కీర్తనల అలరింపులు
గంగిరెద్దుల చిరుమువ్వల సవ్వళ్ళు
సంక్రాంతి పండించిన క్రాంతి
ఇంటింటినీ సంబరాలలో నింపింది

ఎడ్ల పందాలలో పెరిగిన రోషం
కోడిపందాల పౌరుషం
తెలుగువాడి మీసాన్ని మెలివేయిస్తున్నది
పసువులకు దిద్దేటి పసుపుకుంకుమలు
పౌష్య లక్ష్మికి పెట్టేటి చీరసారెలు
పెద్దలకు భక్తితో స్మరించి వదిలేటి తర్పణాలు
సంక్రాంతిని తెలుగింటి పెద్దపండగను చేశాయి

పండగంటే బ్రతుకులో పచ్చదనం పండించేది
పాడిపసువుకీ మనిషికీ మధ్య మమకారం
పెంచేది
ప్రకృతి కలిమిని మనిషికి పంచేది
మనుషులని మనసులని కలిపేది....

ధేనూత్సవము -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

ధేనువ్రతీ త్వమసి నిత్యమనన్యతంత్ర:
సేవా విధా వితరసీహ సుధాం బుధేభ్య:।
సా వాఙ్మయీ ప్రసవినీ భవితా శుభానాం
ధేనూత్సవేऽద్య సుకవే! తవ సుప్రభాతమ్ ।।

భావం: ఆర్య! ఓ సుకవి! మరి వేరు విధానమేమియు లేనివాడవై నిత్యం ధేనువ్రతుడవు ఔచున్నావు. ఆసేవా విధిలో పండితులకు అమృతమును పంచుచున్నావు.
ఆ వాఞ్మయరూపిణి అయిన ధేనువు నేడు ఈ ధేనూత్సవమున (కనుమ పండుగ నాడు) శుభములను ప్రసవించుచున్నది. గాంచుము. నీకు సుప్రభాతం.

నదీ తీరాన........... - స్వాతి శ్రీపాద

అడుగులో అడుగేసుకుంటూ
పక్కపక్కన నడుస్తున్నా
పాదముద్రలు మాత్రం శూన్యమే
శరీరం ఎక్కడ ఉన్నా మనసు మాత్రం
స్వప్న సీమల్లో అరవాలిన కళ్ళ అంచుల చివర
అర చేతుల తివాసీలపై మెత్తని లాలింపు ఆస్వాదనలోనే...

దుర్భిణీ పెట్టుకుని గాలించినా
అలవైకుంఠ పురం లాటి ఆ మూల
హృదయ సౌధాన, ఎంత గాలిస్తేనేం
కనిపెట్టడం ఎవరితరం
ఎవరిని వారే వెదుక్కునే సమయాల్లో
అందని దూరాలు తరలి రావడం ఎవరితరం?

లోలోపలి వెన్నెల పవనాల మధ్య
మయూఖాలై అలదుకునే
భావతరాంగాల సొరంగాలను దాటి
నాజూకు పులకరింతల గాజుల సడి మధ్య
కొత్త కావ్యాలు వికసించే
నదీ తీరాన
రెండు చేతులనిపించే
కాషాయపు వెలుగుల దోసిట

తలనుంచుకు
తనివిదీరా వీక్షించటం
సాయం సంధ్య ఏటవాలు నీరెండలో
ఈ సుఖం చాలదూ

“నేను” (దీర్ఘ కవిత) - విశ్వర్షి వాసిలి

నేను
మృత్యువును.
అస్తమయానికి
అంతస్తత్వమవుతుంటాను.
***
పుట్టుకనాడే
పురుడుపోసుకుంటాను
చివరి క్షణానికి
అదృశ్య ముహూర్త మవుతుంటాను
చివరికి
మౌనంగా నిష్క్రమిస్తుంటాను
క్షణం క్షణం
చివరి చేరువ అవుతుంటాను
జీవిస్తూ పరిణమిస్తుంటాను
నీడలా కడతేరుతుంటాను.

నన్ను దూషించె - అనుమండ్ల భూమయ్య

నన్ను దూషించె, నాతడు నన్ను కొట్టె,
అతడు నను మోసగించినా, డతడు నన్ను
తరిమినా డని నిత్యము తలచుచుండ
బ్రతుకు ద్వేష మందున మున్గి బండ లగును.

నన్ను దూషించె, నాతడు నన్ను కొట్టె,
అతడు నను మోసగించి నా డతడు నన్ను
తరిమినా, డని ఎడదలో తలపకున్న
బ్రతుకు ప్రేమలో సాగుచు పరిమళించు.

ద్వేషమును తొలగింపదు ద్వేష మెపుడు,
ద్వేషమును తొలగించును ప్రేమ యొకడె;
ఇదియె ధర్మము, శాశ్వత మ్మిదియె పథము;
ప్రేమ వృక్షమై కురియుము ప్రేమ పూలు.

ఇంద్రియసుఖముల నభిలషింతువేని,
కూలుదువు - మ్రోడు గాలికి కూలునట్లు;
కొండ నెంత గాలియు కూడ కూల్చ నట్లు
జాగరూకు నాకర్షణల్ జరుప వింత.

ధమ్మపదము (అనువాదం) - రామ్మోహన్ రావు

గజల్

నీ నవ్వులలోన అక్షరాలు ఒలుచుకుంటున్నా
నీ చూపులలోన పర్వతాలు తొలుచుకుంటున్నా

నీ మౌనంలోన ఎన్ని భావాలుదయించునో
నీ పాటలలోన సుస్వరాలు కొలుచుకుంటున్నా

దివిని వదలి భువికి దిగిన మేలిమిజవరాలి వో
నీదుసోయగాల సౌష్టవాలు మలుచుకొంటున్నా

పిలుపు చేరకుంటేనేం నేను అలసిపోతేనేం
అనుభూతులలోన సింగిడీలు తలచుకొంటున్నా

అలజడి లేకుంటె మనసు పరుగుతీయలేదుకదా
మోహన కలలోన సముద్రాలు గెలుచుకుంటున్నా

తువ్వాలు - రాజేశ్వరి దివాకర్ల

ఈ తువ్వాలు
మా పర్యావరణానికి ప్రతీక
ఆచ్ఛాదనకు ప్రాతిపదిక,
జవళి బజారులో కొత్త రకం 
చౌకములెన్ని వచ్చినా
మాకు పాత తువ్వాలే ఇష్టం.
ఈ తుండు గుడ్డ
తరతాల సంస్కృతిని పిండి 
ఆరవేస్తుంది.
నఖ శిఖ పర్యంతం తనువు గుట్టు నెరిగినా,
మౌనమే బంగారమని 
గోడ వారకు మిగిలి పోతుంది.
మా అవసరాలను ఆనవాలు కట్టి,
ఎక్కడున్నా వెతికి తెచ్చుకొనే విలువను మడత పెడుతుంది.
మాశుచి ముఖత్వానికి
రెండు చేతులా పొదవి పట్టుకొనే
నూలు దారాల పొత్తిక,
మన్నిక పెరిగిన కొద్దీ మెత్త బడుతుంది.
మృదులమైన కొద్దీ మనసుకు దగ్గరవుతుంది.
నాన్న చెంబు నీళ్ళను గుమ్మరించుకొని
తూరుపు దిక్కున నిలబడి
చేసే సూర్య నమస్కారాలకు
అంగ వస్త్రమై నడుముకు చుట్టుకొంటుంది.
అమ్మ తడి అడుగుల నద్దుకుంటూ,
వచ్చి చేరే వంటింట్లో
మేని చీర ఒల్లియగా
ఒద్దికను చూపుతుంది.
తాత భుజాన ఖండువాగా 
నుదుటి చెమటను ఒత్తుతుంది. 
పూజ, నోముల స్థాపనా కలశానికి 
మేలి వస్త్రమై అమరుతుంది.
వ్రత కథను వినిపించిన అయ్యవారింట్లో
ఆకలిని తీర్చేందుకు
సంభావనల బియ్యాన్ని మూట కడుతుంది.
దు:ఖవేళల కన్నీటిని తుడిచి
సాంగత్య మిస్తుంది. 
చీదు వేళల ముక్కును తుడిచి మూల పడుతుంది.
గాలికి వదిలేసినా సరే
మరల మన సేవకు తహ తహ లాడుతుంది.
నడి వీధి బిచ్చగత్తె చేతిలోని
శిశువుకు మాసికల బట్టగా వాలి జాలి గొలుపుతుంది.
పెద్ద మనుషులను సైతం చిన్న బుచ్చే వస్త్ర ఖండిక,
వర్గ భేదం చూపక
ఆత్మక్షాళన స్పర్శ నిస్తుంది. 
ఈ జీవుని వేదనల
ఉదయాస్తమయాలకు ,సహచారిణి తువ్వాలు ,
విశ్వమంతటినొక పల్లె పట్టుగ చేసి
మనుగడ మూలాల నెప్పుడు మరువ వద్దని
ఏక వసనరూపమై హెచ్చరిస్తుంది.

Posted in January 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!