తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
మొహమాటానికి త్రాగానండి -
ముఖము కళ్ళు తిరిగాయండి
విందుల లోనే త్రాగానండి -
వాంతుల రభస అయ్యిందండి
గౌరవమంటు త్రాగానండి-
త్రాగుబోతుగా మారానండి
విలాసాలకు త్రాగానండి-
విలాపాలే మిగిలాయండి
ప్రతిష్ఠ కోసం త్రాగానండి -
అప్రతిష్ఠ పాలయ్యానండి
స్నేహంకోసం త్రాగానండి -
స్నేహం వైరం అయ్యిందండి
శక్తి కోసం త్రాగానండి-
నిర్వీర్యుడినై పోయానండి
ఔషధమంటు త్రాగానండి-
మందుకు బానిస నయ్యానండి
విశ్రాంతంటు త్రాగానండి-
వణుకుడు రోగం పుట్టిందండి
నిద్దుర లేమికి త్రాగానండి-
అందుకే కాటికి చేరానండి
ఆత్మ బోధ
ఇప్పుడిప్పుడే తెలిసిందండి-
త్రాగుడు తెచ్చిన ఇక్కట్లన్నీ-
త్రాగకూడదని మరి మనసున ఉంటే-
సందర్భాలే దరికి చేరవని
ఆరోగ్యంగా ఉండాలంటే -
ఆనందంగా ఉండాలంటే
ఆ త్రాగుడు గట్రా మానేయండి-
ఆడుతు పాడుతు జీవించండి....
ఆరోగ్య అవగాహనకై వ్రాసినది మాత్రమే.
నేను కొలువు చేసిన ఎన్.టి.పి.సి
ఉద్యోగులలో చనిపోయిన చాలామంది
ఈ మందు అలవాటు వలనే పోయినారు
మందు త్రాగడం వలన అనుకున్న లక్ష్యానికి భిన్నంగా జరుగుతుంది.
నేను వైద్యునిగా నా కర్తవ్యం
తెలియ చేయడం నా ధర్మం-
వినక పోవడం వారి ___ ర్మం.
కొసమెరుపు.. త్రాగుబోతులలో అధికంగా వైద్య వృత్తిలోని వారే.
కవి కవనము విను
("కవికృతిమథ శృణు" అనే సంస్కృత ఖండకావ్యానికి తెలుగు అనువాదం)
– కర్త – ఆచార్య రాణి సదాశివమూర్తి।
(వృత్తమ్ – జలదము। సర్వలఘువృత్తము। అనుష్టుప్ ప్రభేదము)
కవనము నుడువుచు
సవనము నడుపును
రవి వలె శశి వలె
భువి కవి చెలగును. ।।1।।
నిఖిలము భువనము
మఖ గృహమని శత।
మఖి ముఖసురలను
శిఖిముఖమున గను ।।2।। ।।కవనము।।
చిలుక పలుకు వల
దిల శుకముని వలె
తొలి చదువుల మన
కల కవనము విను ।।3।। ।।కవనము।।
కలచిన యెడదకు
నిల చిరు పదముల।
అలవలె సుఖమిడు
కల కవనము విను ।।4।। ।।కవనము।।
నిను నను కలుపును
ఘనమగు కవి నుడి।
వినుమిదె మరి మరి
మన చెలిమికి గుడి ।।5।। ।।కవనము।।
మరుడగు కవి తను
విరి యలుగుల గని।
తరలకమలముఖి!
సుర సుఖముల నిడు ।।6।। ।।కవనము।।
అరి భట గణములు
మరి మరి బెదరగ
శరముల కురియును
వర కవనము విను।।7।। ।।కవనము।।
మిల మిల నగవుల
పులకల మొలకల
తొలకరి మొయిలగు ।
కల కవనము విను।।8।। ।।కవనము।।
మయుడగు నజుడగు
దయగొను హరి యగు।
లయకర శివుడగు
హయవదనుడె కవి।।9।। ।।కవనము।।
భయముల భయమగు
నయముల నెలవగు
నియమము నిలుపగ
. పయనము గరపును ।।10।। ।।కవనము।।
భవితను నడుపగ
రవిగతి సమముగ।
కవితలు సరియగు
కవి కవనము విను।।11।। ।।కవనము।।
తలచిన సిరులిడు
నిల సురతరువిదె ।
గెలవగ మలుపిదె
పిలిచెను కవి విను ।।12।। ।।కవనము।।
నువ్వు నా చేతిని పట్టుకొని భుజం మీద తలా వాల్చనంతవరకూ నువ్వు స్నేహానివి..
తల వాల్చాక నువ్వు నీ తలపంటూ లేని ప్రియరాగానివి
నా తలపులకో ఆలంబన విభావానివి నా ఆత్మానుస్వరానివి
సుబ్బలక్ష్మమ్మ స్వరానికి విశుద్ద స్థానానివి
బాలమురళి విన్యాసాల్లా విస్తరిస్తున్న నాదతరంగానివి
సఖీ! నిన్ను నా గుండె దారుల్లో నడిపించడంలో
నా గుండె వేయి కన్నుల్తో నేలను చూస్తోంది
వేనవేల కన్నుల్తో నింగి చుక్కల్లో కలుస్తోంది
ప్రేమెంత భార రహిత బాధ్యతో నింగీ నేలకు చాటి చెబుతోంది
పూల గుండెల సఖీ, ఇంత పరవశం వద్దు
నువ్వెంత పరిమళం నింపినా, నరమండలం పై భరోసా పెట్టొద్దు
శివ శివా! హర హరా!
శ్రీ శైలవాసా!
గౌరీశ! పరమేశ!
కైలాసవాసా!
కవితగా నీ పేరు
గానమ్ము చేసెదను
కథలుగా నీ లీల
కథనమ్ము చేసెదను II శివ శివా II
తన కాలి చెప్పుతో
ఊడ్చి శుభ్రము చేసె
నోట నీటిని దెచ్చి
నిన్ను అభిషేకించె
వేట మాంసము దెచ్చి
వేడుకొని తినిపించె IIశివ శివా II
నీ కంటిలో నీరు
నిలువకుండగ కార
నిలువునా నీరయ్యె
నీకు తన కన్నిచ్చె
కన్నప్ప కగుపించి
కన్నప్పగించితివి IIశివశివాII
తిన్న డెరిగిన భక్తి
తిన్నడే ఎరుగు
చిత్తమున గల భక్తి
శివు డొకడె ఎరుగు
భక్తి నేలుట ఎట్లొ
భవు డొకడె ఎరుగు
శివ శివా! భవహరా!
శ్రీశైలవాసా!
గౌరీశ! పరమేశ!
కైలాసవాసా!
చెయ్యి ఇంకాస్త ముందుకు చాస్తే
ఆకాశం అందుకునేంతటి ఎత్తైన
కొండచరియ చివరన కూర్చుని
కాళ్ళూపుతూ చదువుకుంటున్న
చిన్నప్పటి డైరీ ఒకటి
చప్పున చేజారి పడిపోగా
తత్తరపాటుతో క్రిందికి చూస్తే
నా ముఖానికి ఇంచీల దూరంలో
గట్టిగా హారను కొడుతూ లారీ!
ఇంతలో ఎవరో రెక్కపట్టి లాగారు
లైట్లు వెలిగాయి, థియేటర్లో ఒక్కడినే ఉన్నా
చుట్టూ మెలితిరుగుతూ పాములు
ఉలిక్కిపడి ఎగిరి గంతేశాను
ఒక స్విమ్మింగ్ పూల్లో పడ్డాను
ఒక చేప నాతో ఏదో చెబుతోంది
"ఒరేయ్, పాలు తెమ్మన్నానా??"
"లాస్ట్ ఓవర్ అమ్మా, ఐదు నిమిషాలు"
వెయిటర్ లస్సీ తీసుకొచ్చాడు
హోటల్ నీళ్ళలో మునిగిపోతోంది
నేను రెక్కలు విప్పుకు ఎగురుతున్నాను
"ఆర్సీ, ఇన్సూరెన్సు ఉన్నాయా?"
"ఇంట్లో ఉన్నాయి సార్, ఈ వందా..."
తేనెటీగలు ముసురుకున్నాయి
ఎవరో గట్టిగా కౌగిలించుకున్నారు
ఉన్నట్టుండి హోరున గాలివాన
నన్నొక చిరుత వేటాడుతోంది
అడవిలో పూలన్నీ నలుపూ తెలుపూ
చిరుత క్రమంగా పెద్దదవుతోంది
నేను మళ్ళీ రెక్కలు విప్పాను
దూరంగా బడిగంట మోగుతోంది
వేయించిన వేరుశనగలు తింటున్నాను
నలువైపులా నిలువెత్తు అద్దాలు
ఒక్కసారిగా భళ్ళుమని పగిలాయి
ఎవరో వెక్కిరింతగా నవ్వుతున్నారు
మళ్ళీ దూరంగా ఏదో రణగొణ
అది చూస్తూండగా రొదగా మారింది
ఎవరో గట్టిగట్టిగా తలుపు తడుతున్నారు
కనురెప్పల కిటికీలు తెరచుకుని
తొలిసంధ్యాకిరణం పలకరించింది
కళ్లు నులుముకుంటూ
శ్రీమతిని కాఫీ ఇవ్వమన్నాను