“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018, గాంధీజయంతి నాడు ప్రారంభమైన తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః).
ప్రారంభించిన వారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ఆం. ప్ర., ప్రస్తుతం ఫ్రీమాంట్ నగర వాసి. అదే ప్రాంతంలోని సాహిత్య ప్రియులు శ్రీ వేణు ఆసూరి, ఉభయభాషావధాని, శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గార్లు కార్యనిర్వాహకులు.
ప్రారంభమైన వేళావిశేషమేమిటో కానీ, ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు, విమర్శకులు అద్భుతమైన రచనలతో సంచికను పరిపుష్టం చేస్తున్నారు... వారంరోజుల్లోనే ఒక మంచి సాహిత్య పత్రికగా రూపొందింది..
అందులోంచి ప్రతినెలా ఏర్చి, కూర్చిన రచనలను ‘సిరిమల్లె’ పాఠకులకు అందించాలని సంకల్పించాం...మొదటగా అక్టోబర్ నెలలోని ఆణిముత్యాలు...ఆయా రచయితల అనుమతితో....మీకోసం .....
చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
"నాది", "ఇది నాది" అన నేర్చినాను పుట్టి,
"నాది" అని ఎన్నిటినొ పొందినాను కాని
"నాది" అనుటయే గరళమై నాకు నరక
మగు నటంచు నే నెరుగలేనైతి స్వామి!
నేను-
మానవతన ఆరడుగుల విగ్రహాన్ని
మూడడుగుల సుఖాసనంలోకి చేర్చి
పుష్పాలంకారాలు, ధూపదీపాలు
సహస్ర నామాలు, మంగళ హారతులు లేని
నిరాడంబర మనస్కతతో
కనురెప్పల్ని వాల్చితే
తనువు, మనసు కాస్త మారాం చేసినా
నా విగ్రహంలో నిగ్రహం ఆవిష్కృతమవుతుంది.
అవును,
కనుదోయి చీకటి తెర మాటున
ఆలోచనలను అల్లుకుంటూ పోకుండా
గతాలను కనటం, వినటం మానేస్తే
బయటి ప్రపంచం తప్పుకుంటుంటుంది.
అప్పుడు,
నా‘తనం’లో
కొన్ని క్షణాలు
తలను స్పృశిస్తాను
భుజాలను తడుముతాను
ఛాతీ విరుస్తాను
గుండెను పలకరిస్తాను
ఉదరాన్ని కౌగలించుకుంటాను
కుండలినితో స్నేహం చేస్తాను
ఇదంతా నా భౌతిక రూపంలోని
‘అన్నమయ కోశ’ స్పృహనే కదా!
***
స్పృహ ‘దృష్టి’గా మారి-
ఉచ్ఛ్వాస నిశ్వాసలపై నాతనాన్ని నిలిపితే
మందగిస్తున్న శ్వాసక్రియ తెలుస్తుంటుంది
గుండె లయ శక్తి తెలుస్తుంటుంది
ఉదర క్రియల వేడి తెలుస్తుంటుంది
రక్తప్రసరణ వేగం తెలుస్తుంటుంది
ప్రతీదీ శక్తిగా పరిణమించటం తెలుస్తుంటుంది.
ఈ జీవ - శక్తి - ప్రాణ త్రయ ప్రస్థానం
‘ప్రాణమయ కోశ’ కార్యకలాపమేగా!
***
నా ‘ధ్యాస’లో
మూడొంతుల రక్తం మెదడుకు మేతవుతోంది
గుండె తోడిన అంతటి ఫోర్స్ సిగపట్టవుతోంది
ఆరడుగుల కాయ నియంత్రణకు
అంతలా శక్తి వినిమయం జరగాల్సిందే.
ధ్యాసే ‘ధ్యానం’గా సాగుతున్నా-
కాళ్లు చేతులు తమ ఉనికిని చాటుకుంటున్నాయి
వెన్నెముక విల్లులా విచ్చుకుంటోంది
మెడ తిల్లానాకు తాళం వేస్తోంది
అవును.
నా ధ్యాస భౌతికాన్ని వీడలేదు
నా మనసు నాలోకే ప్రవహిస్తోంది
‘నేను’ ఇంకా ‘మనోమయకోశా’న్నే!
***
ఏమిటీ ఆలోచనలు? ఎక్కడికీ పయనం?
కళ్లు మూసుకున్నా బుద్ధి నిలవటం లేదు
ధ్యాస నిష్క్రమిస్తున్నా స్పృహ విశ్రమించటం లేదు
శూన్యం కావాలన్నా మనసు సహకరించటం లేదు
ఏమిటీ ధ్యాస? ఎందుకీ స్పృహ? ఎక్కడిదీ స్మృతి?
సాధనలో ‘గమనిక’ సాధ్యమవుతోంది
గమనికతో ‘విచక్షణ’ పెరుగుతోంది
నా మైండ్‌ను ‘హయ్యర్ మైండ్’ అధివసిస్తోంది
అవును, ‘నేను’ ‘విజ్ఞానమయ కోశా’న్ని.
***
నేను-
ధ్యాసనూ కాను, ధ్యానాన్నీ కాను
స్పృహనూ కాను, స్మృతినీ కాను
గమనికనూ కాను, గమనాన్నీ కాను
అవ్యక్త అనుభూతిగా పరిణమిస్తున్నాను
జ్ఞాన విజ్ఞాన పరిధులు దాటుతున్నాను
అహాన్ని సంయమనాన్ని జత చేస్తున్నాను
నీ - నా హద్దులు చెరిపేస్తున్నాను
ఓహ్
ఇహ పరాలు సంయోగిస్తున్నాయి
నా తనం తరంగమై యోగిస్తోంది
నా ముందు నేనే!
శూన్యంలో నేనే!
ఎక్కడికీ ప్రస్థానం?
విస్తృతమౌతూ, దిగంతాలకు వ్యాప్తమౌతూ
విశ్వమూలాలను చేరుకుంటున్నాను
మానవ మూలాలను ఏరుకుంటున్నాను
నా ఈ ఆనందం ఎక్కడిది?
అవునవును
నేను ‘ఆనందమయ కోశాన్ని’ కదూ!
***
ఇప్పుడు - నేను
నా తనానికి ప్రత్యూష పవనాన్ని
నా అస్తిత్వానికి బ్రాహ్మీ ముహూర్తాన్ని
యౌగికత్వ తపోవనాన్ని
నిర్వికల్ప వహాపర నిర్వాణాన్ని
నేను
శూన్యత నుండి శుద్ధత్వంలోకి యోగిస్తుంటే-
హయ్యర్ ఇంటలిజెన్స్ నా ఆత్మస్పృహ
సమాధ్యవస్థనే నా మృత్యు స్పర్శ
ఆ ఆలింగనంలో దక్కింది ప్రాణకుంభం
ఈ విశ్వ కుండలినితో ‘నేను’ సంపూర్ణం
ఈ మానవ కుండలినిలో ‘నేను’ పూర్ణం
అవును,
యౌగిక ప్రస్థానంలో నేను-
‘స్థితి’కి అతీతం కావాలి
‘కాలా’నికి అతీతం కావాలి
‘జననా’నికి అతీతం కావాలి
‘జ్ఞాన’ ‘విజ్ఞానా’లకు అతీతం కావాలి
‘ధ్యాస’కు అతీతం కావాలి
‘ధ్యానా’నికి అతీతం కావాలి
అప్పుడే- నేను
ప్రజ్ఞాన ప్రపూర్ణాన్ని!
విశ్వ కౌశలాన్ని!
‘ఆది’వాసిని!!
పొమ్మంటే యాడికి వోదును కొడ్క.
నీ బాంచను నువ్వు దప్ప దిక్కు లేందాన్ని బిడ్డా,
ముసలిదాన్నిరాయ్యా.
కాల్ రెక్కలు మూలకు
వడ్డదాన్ని, నీ కాల్మొక్కుతా పొమ్మనకు నాయనా.
నిన్ను బడిలో షరీకు జేయనికి
రాళ్ళు వలగ్గొట్టా కూలికి పోతి.
నీ బడి పీజులు కట్టనికి నడుమంతా వొంగా నాట్లు ఎయ్యనికి కైకిలి వోతి గాదు బిడ్డా.
నీ బుక్కులు పొస్తకాలు కొననికి
పుస్తె అమ్మి పసువుకొమ్ము కట్టుకుంటి,
నీకు అంగీ లాగు కొననికి దొరసానమ్మ ఇంట్లో బాసాండ్లు తోమనికి బోతీ,
ఎన్ని జేసితి కొడ్క.
ఒక్కటైన యాదికి అస్తలేద నాయనా,
కైకిలి పైసలన్ని ముంత లో ఏసి
పోచమ్మ పోటో ఎనక దాసి నీ కొడుకు బడికి పొంగ దినాము
పది పైసలు ఇస్తానుకున్న.
నీ అయ్య కల్లు తాగానికి నా బొక్కలన్ని ఇరగ్గొట్టి దాసిన
పైసలన్ని గుంజుకువోతే ఆకిట్లో
గూసోని వలవలా ఎడిస్తీ గాని
యాడికన్నబోయిన్న బిడ్డ.
గిట్లనే నెల కింద వొమ్మంటే సెల్లె కాడికి వోతే యారాన్లు నవ్వుతారు మల్లోసారి రాకు
అని బుక్కెడంత బువ్వ గూడ వెట్టక గడప లోపల్కెల్లే సాగదోలింది నీకెరుకే.
గిప్పుడు వొమ్మంటే ఇంక్యాడికి బోతా, నేను సచ్చినంక బొందవెట్టే కాడ దప్ప నాకు జాగేది కొడ్క.
నీకిది న్నాయం కాదు నాయన,
నువ్వు దప్ప
నాకు దిక్కేది రా తండ్రి.
నీ ఇంటి కుక్కకేసినట్టు జరంత
కూడు పాడేస్తే ఓ మూల పడిఉండేదే.అమ్మంటే.
ఈడనే నీ ఇంటి పనిమనిషి లెక్క పానమిడుస్తా గానీ
పాణం పోయేదాక నిన్ను
సూడకుంటా బతకాలేను రా కొడ్క.
ఇంత జెప్పిన నీకు దయ రాకవొతే పోతాలే నాయనా.
నా నసీబు మంచిగ లేదనుకుంట గంతే..
నేను కూలీ దాన్ని గద కొడ్క.
నయాపైసా నీకియ్యకపోతి,
బేడెత్తు బంగారం దాసక పోతి,
ఇంత బూమి జాగ ఉంచకవోతి,
కోపమెట్టుకోక బిడ్డా,
రాసియ్యనికి నా తానా ఏముంది కొడ్క?
నీ మ్యానత్త ఎములాడా రాజన్న పలారామిస్తే ఇగో కొంగున మూడేసి తెచ్చిన.
తీసుకోరా నాయన...
నీ కడుపు నిండితే నీ అమ్మ కడుపు సల్లవడతది.
వయసుదేముంది
(అనువాద కవిత)
-- మూలం: అతల్ బిహారీ వాజ్ పాయ్
-- అనువాదం: కల్లూరి కృష్ణకుమారి
ఇల్లెలాగైనా ఉండనీ
ఇంటిలో ఓ మూల
నవ్వులుపూయడానికో చోటు తెరచి ఉండనీ
దినకరుడెంత దూరంలోనైనా ఉండనీ
తానిల్లు చేరటానికో దారి మాత్రం ఉండనీ
అపుడపుడు డాబా పైకెక్కి
చుక్కల తప్పక లెక్కించు
సాధ్యమైతే చేతులు చాచి
చందమామనే అందుకోడానికి యత్నించు
మనుషులతో కలసి మెలసి ఉండాలనిపిస్తే
ఇంటి పక్క ఓ పొరుగు కూడా తప్పకుండనీ...
వాన చినుకుల్లో తడిసిపోనీ...
హుషారుగా గంతులు వేసేయనీ...
వీలైతే పిల్లల్ని ...
కాగితప్పడవలు చేసివ్వు, వదిలేయనీ...
ఎప్పుడైనా తీరికుంటే,ఆకాశం నిర్మలంగా ఉంటే..
ఓ గాలి పటాన్ని నింగి కెగరేయి
కుదిరితే, పోటీలుపడి చేసేయ్ చిన్న లడాయి
ఇంటి ముంగిట ఓ చెట్టు నుంచుకో
చెట్టుపై పిట్టల
మాటల ఆలకించుకో
ఇల్లెలాగైనా ఉండనీ
ఇంటిలో ఓ మూల
నవ్వులకో చోటు మిగిలి ఉండనీ
కావాలంటే ఎటువైపైనా గడుపు
ఇంటినంతా సంబరంగా నిలుపు
వయసులో ప్రతి దశా ఒక మజా
చేజారి పోనీకు నీ వయసు మజా
సదా వెచ్చటి గుండె నుంచుకో జనాబ్!
ముఖంపై ఆ ఉదాసీనతెందుకు?
కాలం గడచిపోతూనే ఉంది
వయసెలాగైతేముంది!?
* * *
(घर चाहे कैसा भी हो..
उसके एक कोने में..
खुलकर हंसने की जगह रखना..
सूरज कितना भी दूर हो..
उसको घर आने का रास्ता देना..
कभी कभी छत पर चढ़कर..
तारे अवश्य गिनना..
हो सके तो हाथ बढ़ा कर..
चाँद को छूने की कोशिश करना .
अगर हो लोगों से मिलना जुलना..
तो घर के पास पड़ोस ज़रूर रखना..
भीगने देना बारिश में..
उछल कूद भी करने देना..
हो सके तो बच्चों को..
एक कागज़ की किश्ती चलाने देना..
कभी हो फुरसत,आसमान भी साफ हो..
तो एक पतंग आसमान में चढ़ाना..
हो सके तो एक छोटा सा पेंच भी लड़ाना..
घर के सामने रखना एक पेड़..
उस पर बैठे पक्षियों की बातें अवश्य सुनना..
घर चाहे कैसा भी हो..
घर के एक कोने में..
खुलकर हँसने की जगह रखना.
चाहे जिधर से गुज़रिये
मीठी सी हलचल मचा दिजिये,
उम्र का हरेक दौर मज़ेदार है
अपनी उम्र का मज़ा लिजिये.
ज़िंदा दिल रहिए जनाब,
ये चेहरे पे उदासी कैसी
वक्त तो बीत ही रहा है,
*उम्र की एेसी की तैसी...!¡!*
(Atal Bihari Vajpayee)
ఉదర ప్రమిదలో
హృదయం నుండి భ్రుకుటిదాక
నీ శ్వాసస్పర్శ రగిలించే జ్యోతి
నాభినుండి అడుగు దాక వేడి
అరికాళ్ళలో వెచ్చగా కంపించే నాడి
నరనరాల్లో ప్రకంపనల జలపాతం
వెన్నెముకలో ఓ వెలుగు వాక ఊర్ధ్వగమనం
నుదుట నీ నాలుకకొస దిద్దే చల్లటి తిలకం
మెడవంపుపై చిరుముద్దు బహూకరణం
నిలువెత్తున లేచే మెరుపుతీగల విద్యుత్తేజం...
సఖీ! హతం కాని హృదయరాగానికి జీవం పోసే నీ స్పర్శ
నాసాగ్రం దాకా రగిలిస్తున్న వేడిని నీ ఒడిలో వర్షిస్తాను,
నీ పరిమళం నింపే చల్లదనాన్ని నిలువెల్లా అనుభవిస్తాను
నీ మ్రోల 'నీనేను' 'నానేన'ని రెండుగా విడిపోతాను
నేను నా అన్న చోటే తారట్లాడుతూ ఆగిపోతుంటాను
నీకోసం మైమార్చి స్వప్నాంతరంలోకి తరలిపోతుంటాను
స్వప్నమైనా-జాగృతైనా
నీ ధ్యానమే నా యోగం
నాయోగమే నీ సంయోగం,
నీ-నా లుగా విడిపోని సమ్యక్ యోగం
స్వస్వరూప అంతర్యానం!స్వర్గారోహణం!
"నాభినుండి అడుగు దాక అంటే పాదం దాక అనేనా అర్థం,? మైమరచి కి బదులు మైమార్చి అని తప్పుగా టైప్ చేశారా, లేక మైమార్చి అన్న ప్రయోగమే సరైనదని మీ ఉద్దేశ్యమా? దయచేసి వివరించమని కోరుతున్నాను." అని మిత్రులు ఎలనాగ గారు విడిగా అడిగారు. యోగశాస్త్ర కవిత(?) కాబట్టి వారికి నేనిచ్చిన సమాధానాన్ని,ఇతర మిత్రుల సౌలభ్యం కోసం దిగువ పెడుతున్నాను.
లేదు డాక్టర్ గారూ, కావాలనే మై మార్చి వేశాను...
ఈ జీవితమే ఒక స్వప్నమైనప్పుడు, జననాంతర స్థితి స్వప్నాoతర స్థితే కదా! దానికి దేహం(మై) మార్పు తప్పదు కదా!...
నాభినుండి అడుగు దాకా అంటే, నాభి వద్దనున్నది మణిపూర చక్రం. అడుగు అంటే ఆసనం వద్ద ఉన్నది మూలాధార చక్రం. జననేంద్రియం వెనుక స్వాధిష్ఠానం. హృదయం వద్ద అనాహత(హతం కాని అని అందుకే వాడాను)చక్రం. కంఠం వద్ద విశుద్ధం. భ్రుకుటి స్థానంలో ఆజ్ఞా చక్రం. ఈ ఆరింటినీ అనుసంధించేది కుండలినీ యోగం. ఆమె కుండలినీ శక్తి. నాలో నిండి, నన్ను బ్రతికించేది. ఆమెను ఎరుకతో పొందడమంటే స్వస్వరూపం లోకి అంతర్యానమే కదా! ఆత్మ తన 'స్వ'స్థితి లోకి 'గ'మించడమే స్వర్గం, ఆ స్థితి నందుకోవడం స్వర్గారోహణం!