“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018, గాంధీజయంతి నాడు ప్రారంభమైన తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః).
ప్రారంభించిన వారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ఆం. ప్ర., ప్రస్తుతం ఫ్రీమాంట్ నగర వాసి. అదే ప్రాంతంలోని సాహిత్య ప్రియులు శ్రీ వేణు ఆసూరి, ఉభయభాషావధాని, శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గార్లు కార్యనిర్వాహకులు.
ప్రారంభమైన వేళావిశేషమేమిటో కానీ, ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు, విమర్శకులు అద్భుతమైన రచనలతో సంచికను పరిపుష్టం చేస్తున్నారు... వారంరోజుల్లోనే ఒక మంచి సాహిత్య పత్రికగా రూపొందింది..
అందులోంచి ప్రతినెలా ఏర్చి, కూర్చిన రచనలను ‘సిరిమల్లె’ పాఠకులకు అందించాలని సంకల్పించాం...మొదటగా అక్టోబర్ నెలలోని ఆణిముత్యాలు...ఆయా రచయితల అనుమతితో....మీకోసం .....
చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
పద్యాలు
పడిన నిలబెట్టి, పడకుండ బడికి పంపి,
గుడిని చూపించి, గురువుల ఒడికి జేర్చి,
పరమ ఋషులను తెలిపి, అక్షరము వైపు
నన్ను నడిపించు శక్తికి నతు లొనర్తు.
ప్రమిదలో తైలమును పోసి, వత్తి వేసి,
స్వామి! వెల్గించి, నీ వైపు వచ్చుచుండ
ఆరిపోయిన దిది, ముందు దారి కనను;
భంగపడితిని బయటి దీపమును నమ్మి.
స్వప్నంలో శ్రీరాముని దర్శించి త్రిజట పొందిన ఆనందానుభూతి:
పుత్రులను కోరి దశరథభూవరుండు
పుత్రకామేష్టి చేయగా పుట్టినట్టి
ఆ రమాధవు నా కన్నులార గంటి,
కంటి కనుగొంటి శ్రీరాము కలను గంటి.
'హరుని విలు నెక్కుపెట్టిన యట్టి రాజ
వరుడె నా కూతు సీతకు వరు' డటన్న
జనకు సభకేగి విలు విరిచిన మహా ప
రాక్రమ గుణశాలి యగు శ్రీరాము గంటి.
ఆ మునివరునితో నేగి, అస్త్ర శస్త్ర
ముల బడసి, తాటకిని జంపి, ముని యొనర్చు
యాగమును గాచి ఆశీస్సు లందుకొన్న
కమలదళనేత్రు
శ్రీరాము కలను గంటి.
కైక కోరిన విధముగా కారడవుల
కేగి ఋషుల క్షేమమునకై ఎల్ల రాక్ష
సులను దునిమి, శూర్పణఖను కలతపరచి
నట్టి శ్రీరామచంద్రు మహస్సు గంటి.
సీత నెచ్చోట గానక చెట్ల నడిగి
పుట్టల నడిగి, ఏడ్చుచు పోయి పోయి
శబరి ఆశ్రమ మ్మందు విశ్రాంతి బడసి
నట్టి రాము పదసరోరుహముల గంటి.
ఆంజనేయుడు మునుకొన అగ్నిసాక్షి
జేసి సుగ్రీవుతో చెల్మి జేసి, వాలి
నటు వధించియు కిష్కింధ కధిపు జేసి
న బలశాలి శ్రీరాము స్వప్నమున గంటి.
కార్తిక ద్వితీయ నక్త స్తుతులు
కం|| | రాధా దామోదరుని మ హోదధి శాయిని ఘన పురుషోత్తముని హరిన్ వేదాంతస్థుని హరు! గం గా ధారిన్ రుద్రు గార్తికంబున గొలుతున్! || 2.1 |
శా|| | శంఖ ధ్వాన గళం సుదర్శన ధరం కంజాత పాణిం హరిమ్! తేజో నీలగళం పరశ్వధ ధరం సారంగ పాణిం హరమ్! విశ్వోద్దీపక సత్య లోచన ధరౌ! శ్రేయస్కరౌ శ్రీహరౌ! ఈశ శ్రీశ సమాస కార్తిక మఖే రుద్రాభిషించామహే! || 2.2 |
అను|| | ఓంకార పితరం సాంబమ్! ఓంకార రస మచ్యుతమ్! ఓంకార బ్రహ్మణీ! వందే! ఓంకారాంత విహారిణౌ! || 2.3 |
మ|| | అతడే శంకరు డాది దేవు డతడే ఆమ్నాయ బీజాక్షరా లతడే విష్ణు వనంతు డబ్ధి శయనుం డామ్నాయ నామాత్మకుం డతడే ధాత! నితాంత సర్గ సరసుం డామ్నాయ గర్భుండున య్యతడే జ్ఞానము నోజమై వెలుగు 'సోహం' బన్న చిజ్జ్యోతియున్! || 2.4 |
సీ|| | నిగమ లతికల పందిళ్ల వేదిక పైన స్వర నాట్య మాడు దిక్ శాటి యొకడు! శ్రుతి శిరః కబరికా సుందర వేణికా నాగ తల్పంబుపై తూగు నొకడు! అమ్మల కమ్మ యౌ అన్నపూర్ణాంబికా సీమంత సిందూర స్వామి యొకడు! అందాల కమ్మ యౌ ఇందిరా దేవికి మందిరం బైనట్టి మది యొకండు! |
తే|| | మేన సమ భాగ మిచ్చిన మేటి యొకడు! లెస్స గుండె గూటి నిడిన ప్రేమి యొకడు! ఒకని లోన సంపూర్ణమై నుండు నొకడు! ఆత డొక్కడే ఎల్లరై అలరు ఒకడు! || 2.5 |
శివామృతలహరి
*శ్రీనాదాంతవిభావనీయపరమ*
*శ్రేయోనిధానా! త్రివే*
*దానుస్వారవిధాన! వైదికలతాం*
*తారూఢతత్త్వైకవి*
*ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవ*
*ధ్యానైకగమ్యా! స్వస*
*ర్గానూనస్థితిసంహృతిత్రితయము*
*క్తాకార! విశ్వేశ్వరా!*
*కలరూ పేర్పడరాని వైద్యుతలతా*
*కల్పంబవై పొల్చి, పెన్*
*వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళా*
*భిజ్ఞాస్పదభ్రూయుగీ*
*విలసన్మధ్యతలావతార! కరుణా*
*విస్తార! నాలోన ని*
*న్నెలమిం దాపము తీఱఁ జూచు టెపుడో*
*యీ, స్వామి విశ్వేశ్వరా!*
*నీవై యుంచెదు మంటినేల మొలకన్;*
*నీర్వోసి పేరాదటం*
*జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృ*
*త్సీమన్ వెలుంగై మము*
*న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్*
*నీలాభ్రధూర్జాటజూ*
*టీవిస్తీర్ణసురాపగాశివచిరం*
*టీరమ్య! విశ్వేశ్వరా!*
*ఓంకారాభిధమంత్రబంధశుభవ*
*ర్ణోర్జస్వలప్రౌఢిమా*
*లంకర్మీణ! భవార్తభక్తజన క*
*ల్యాణైకపారీణ! భా*
*వాంకూరశ్లథనైకదక్ష! దురిత*
*వ్యాఘ్రౌఘహర్యక్ష! య*
*స్తుంకారమ్మును జూపి బాపవె మనో*
*దుఃఖమ్ము విశ్వేశ్వరా!*
*సేవింతున్ నిగమాగమాంకితశుభ*
*శ్రీనామధేయున్, నినున్*
*భావింతున్ జతురాస్యకేశవనిలిం*
*పాదృష్టచూడాపదుం,*
*గావింతున్ భవదీయదాసజనకైం*
*కర్యంబు, నీ పాదరా*
*జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్*
*జీవింతు విశ్వేశ్వరా!*
*చిరమై శారదచంద్రికారుచిరమై*
*శీర్యణ్యగంగాశుభా*
*కరమై శాంతజితేంద్రియప్రకరమై* *కైవల్యమందారసుం*
*దరమై విద్రుతభక్తలోకదరమై*
*ధర్మానుసంధానసు*
*స్థిరమై పొల్చెడు వెల్గు నొకఁడే*
*సేవింతు విశ్వేశ్వరా!*
*నతభక్తార్ణవచంద్రమండలఘృణీ!*
*నైజాత్మయోగారణీ!*
*స్తుతకల్యాణమణీ! జటాటదమర*
*స్రోతస్వినీధోరణీ!*
*శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిర*
*స్సీమంతముక్తామణీ!*
*ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ!*
*ప్రార్థింతు విశ్వేశ్వరా.*
*గాలింతున్ నిను గాలిలోఁ, బృథివి, నా*
*కాశంబులో, నీటిలో,*
*లీలామేయ! వెలుంగులోన; నిజకే*
*ళీకల్పవిశ్వా! జగ*
*జ్జాలంబున్ మథియింతుఁ గాని, భవని*
*స్తారైకకేళీధృతిన్*
*నాలో నున్నది నీవు నేనని మదిన్*
*భావింప విశ్వేశ్వరా.*
*కల్యాణావహధర్మనిర్మలగుణౌ*
*కస్ఫూర్తి నీ జీవసా*
*కల్యంబుం బరమానురాగమయవీ*
*క్షాదీక్ష రక్షించి కై*
*వల్యానందమరందమత్తమధుప*
*వ్రాతంబుగాఁ దీర్చు వై*
*పుల్యప్రోజ్జ్వలదివ్యభావమహితాం*
*భోజాక్ష విశ్వేశ్వరా!*
*శర్వాణీరమణీమణీహృదయశ*
*శ్వత్పద్మభృంగాణ! నీ*
*నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌ*
*నిప్రాజ్ఞు లూహింప దృ*
*క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రో*
*వన్ రావె తండ్రీ! నను*
*న్నర్వాచీనవటద్రుమూలఫలవి*
*ద్యామూర్తి! విశ్వేశ్వరా!*
*శ్రీగౌరీకుచకుంభసంభృతలసత్*
*శ్రీగంధకస్తూరికా*
*భోగోరస్కుఁడ ! నిన్నుఁ గొల్తు, భుజగీ*
*భూషాక ! నీతో జనుః*
*ప్రాగల్భ్యంబు స్మరింతు, నీ కొఱకు న*
*ర్చాకర్మఁ గావింతు, నీ*
*కాగమ్యస్తుతిఁ జేతు, నిల్తుఁ గడ నీ*
*యం దేను విశ్వేశ్వరా!*
కవితలు
నేను - నా అంతరంగం
ఇజాల వల్మీకం నేను.
ఇజాల కతీతమైన నిజాన్నంటుంది నా అంతరంగం
నా భౌతికశరీరంతో తాదాత్మ్యం నేను
నీలోని "నేను" మంచుకొండ యొక్క ఔన్నత్యం.
నీ భౌతిక శరీరం ఆ కొండలో కరిగపోయే మంచు
ఆ ఔన్నత్యపు వెలుగునే నేనంటుంది నా అంతరంగం
నా జీవితం లో ప్రతి పనిలో కర్తనౌతానంటాను నేను
నీ పనితో మమైక్యం పొందిన ద్రష్టవే నువ్వు.
నీవొక కలానివి. వ్రాయనని మొరాయించకు.
నీవొక హలానివి. దున్నేవేళ హఠాయించకు.
నీవు ప్రకృతి పరీమళానివి. దిక్కులనిండనని నిభాయించకు.
అనుకూలించిన లేక ప్రతికూలించిన సమయమే కర్త
గెలుపు నీది కాదు. ఓటమీ నీది కాదు.
అన్ని సాధనాలున్న విజయసిద్ధిలో ఉత్తమసాధనంగా
కృతకృత్యత నీదే. అంటుంది అంతరంగం
ఉచ్ఛ్వాసలను, నిశ్శ్వాసలనూ లెక్కిస్తూ
నేను నేనుగా ఉన్నాననుకున్నాను నేను.
గతం ఉచ్ఛ్వాస. వర్తమానం నిశ్శ్వాస.
గాలిని కుంభించు. నిత్యవర్తమానాన్ని పండించు.
నీ చివరి శ్వాస తరువాత భవిష్యత్తు బంగారమే.
భావి తరాలు నీ శ్వాసలో శ్వాస నిలిపి లంఘిస్తాయి.
తమ జీవితాలను సతత వర్తమాన వసంతాలను చేస్తాయి.
అంటుంది నా అంతరంగం.
అంతరంగం మాటలు వింటున్నాను.
అనుసరిస్తే...??? ఒక్క క్షణం ఆలోచన
ఉహూ...
అందరికీ అహం అడ్డొచ్చిందంటారు.
నాకు నేనే అడ్డు పడ్డాను.
నా దారి నాది.
నా అంతరంగం దారి అంతరంగానిదే.
భవిష్యత్తు అడ్డం తిరిగింది.
వర్తమానం భూతంలో కలిసిపోయింది.
భూతం చరిత్ర అయ్యింది.
చరిత్ర దిద్దుకోలేని తప్పుల చిట్టా అయ్యింది.
స్నేహం
కొందరితో స్నేహం ఎంత కాలం దగ్గరగా ఉన్న చిగురించదు
కొందరితో స్నేహం కలిసిన కొద్ది నిమిషాల్లోనే అల్లుకుపోతుంది
కొందరితో స్నేహం నేను వద్దనే కుదేలేస్తుంది
కొందరితో స్నేహం
రెక్కలిచ్చి గగనాంచాలలో విహరింపచేస్తుంది
బ్రతుకుపరిధికి కేంద్రం కుటుంబం
వసుధేక కుటుంబానికి మూలసూత్రం స్నేహం
నాది నాదనుకొంటే మోహం
నాది కాదనుకొంటే స్నేహం
అక్షరాల స్నేహం అమరం
ఆర్జనల స్నేహం ఆమరణం
తప్పెవరిది ??
చిలుక పలుకులకే స్వెఛ్ఛ అంటే,
నివాసమే నిర్బంధమైతే,
హాక్కులకే సంకెళ్లయితే,
ఎదురు మాటే దేశ ద్రోహమైతే
మనిషి ఉనికే ప్రశ్నిస్తున్న కాషాయ భక్తిలో,
గోమూత్రంలో కాలుతున్న మానవ మాంసపు ముద్ద వాసనలలో,
ఇదే అరుణోదయమంటూ
నీడతోనే పోరాడుతూ
చీకట్లో చిందులేసే ఎరుపు మంటల్లో,
పంచ రంగుల, కృత్రిమ కాంతుల
అత్తరు కంపుల అంగ అంగాల అంగట్లో
ద్వంద నీతుల, యుద్ధ కాంతుల
మార్కెట్ మాయాజాలంలో,
ఇమడ లేక, ఊపిరాడక
ఆలోచన
ఆత్మహత్యకు ఒడికడితే...
ఆ తప్పెవరిది??
ప్రయోగ పద్యాలు
నవతరం
కళ్లల్లో కసి,
గుండెలో కొలిమి!
ఆకాశం పడేలా
అరే వీళ్లంతా
కెరటాలుగా ఎగసి
ఆవేశాన్ని
నింపారు గాల్లో -
లోలో రగిలే,
నరాలు పగిలే,
లోకాన్ని కాల్చే
మహాకీలల్లో
చలి కాగి ఊగి
చెలరేగే వీళ్లు
సామాన్యులా!
వీళ్లంతా అలలై
మహాజలధికే
విశ్వాసమిచ్చారు!
ఓ కల్లోలం తన
కోట్ల చేతులను
ఆకాశం ముఖం పైకి
నెట్టేలా పెల్లుబికారు
బాధితుల పాటే
వీళ్ళ ఖడ్గం
దిగంతాలేలే యువతే
మనందరి మనస్తాపాల్ని
మాడ్చెయ్యనీ
(నా 'వాగంకురాలు' కవితా సంపుటి నుండి)
నవతరం అనే శీర్షిక గల ఈ రచన చూడ్డానికి అచ్చం వచన కవితలా లేదూ? కాని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులో రెండు శార్దూల పద్యాలున్నాయని మీకు తెలుస్తుంది. గణాలు మ స జ స త త గ అనీ, 13 వ అక్షరం యతి స్థానమనీ కూడా పద్యప్రేమికులు గుర్తించగలుగుతారు. అదే విధంగా ప్రాస కూడా సరిపోయింది. ఇట్లాంటి ప్రయోగ పద్యాలతో నేను రెండు పద్య/వచన కవితా సంపుటాలను (మోర్సింగ్ మీద మాల్కౌన్స్ రాగం, కొత్త బాణీ) వెలువరించాను. ఇవి ఏకకాలంలో అటు వచన కవితలు, ఇటు ఛందోబద్ధ పద్యాలు! ఇట్లాంటి పద్యాలతో ఒక పుస్తకాన్ని నాకన్న ముందు ఆరుద్ర గారు రాశారు. నాకు తెలిసినంత వరకు వేరే ఎవరూ రాయలేదు. శ్రీశ్రీ గారు 'ఖడ్గసృష్టి'లో ఒకటో రెండో రాశారు. వరుసగా 12 పద్యాల ఛందస్సులతో ఒక వచన రచన (గల్పిక) కూడా రాశాను. ఛందోబద్ధ పద్యాల ఛందస్సుతో వచనరచన ఇంకెవరైనా చేశారా అన్నది నాకు తెలియదు.
నెట్టిల్లు
నేనిప్పుడు
ఇల్లు మారాను.
పుట్టినింటికి కొసరు దూరం
మెట్టినింటికిదొక
విస్తరణ క్షేత్రం.
నా విలాసం మీకు తెలుసు,
మీ సమూహంలోనికే కదా వచ్చాను!
చెలిమి శుభోదయం
మెలకువను తెచ్చింది.
మేలిమి సూక్తుల కలిమికి
కనురెప్ప విప్పుకొంది.
కాఫీ తాగే సమయానికి
బాల్యంలోని బడి స్నేహితురాలొకతె
వడి వడి దృశ్య ఘటక వాతెరల పిలుపులనిచ్చింది.
మాసిన ఛాయాచిత్రమొకటి
మనసు భిత్తికి తగిలింది.
గుసగుస లాడని
వార్తాలాపాలకు
చూపు అంచున చెవుల రిక్క తెరుచుకొంది.
ఎంతో కలివిడిగా ఉంది.!
నా పుట్టిన రోజుకు మీరు పంపిన
పూలగుచ్ఛం అందింది.
పరంపరల శుభాకాంక్షలకు
ఎద పరిమళించింది.
ఇక్కడ చాలా హడావుడిగా ఉంది.
అప్పుడే దీపావళి ప్రమిదల
మట్టి జ్ఞాపకం మొదలయింది
సత్య భామ పౌరుషానికి
భ్రూ శర మధ్యాన
నారీ వింటి విభ్రమం పొడమింది.
పాకరుచుల వితరిణి
రసనా కాంక్షలను విస్తరించింది.
ఇక్కడ సమయం ఇట్టే గడచిపోతోంది.
చెప్పడం మరచాను ,...
"ఈ గ్రంథాలయం "తెరచుకొంది.
సాహిత్య మిత్రుల తలపోతలకొక
వేదిక వెలసింది.
మీ పరిచయానికి,
ఇష్ట పడిన ఔదార్యానికి,
సరిదిద్దిన సందర్భాలకు,
వినిమయం చేసుకొన్న
అంతరంగాలకు,
అంతర్జాలరి వలకు చిక్కిన చేప
ఒక్క ఉదుటున
మెరుపు కలల
పన్నీటి చెరువుకు దూకింది.
నేనిప్పుడు నెట్టింట్లో కుశలంగాఉన్నాను.
చేతి రేఖల గుప్పిట అద్దంలో
ప్రపంచమంతా చుట్టు ముడుతున్నాను.
మళ్ళీ చూడాలి
అలా జ్ఞాపకాలను
నెమరువేసుకొంటుంటే,
తనకు తానే, ఏదో
సర్దిచెప్పుకొంటున్నట్లుంటుంది..
అలా శూన్యంలోకి చూస్తూ
తలాడిస్తూంటే,
అప్పుడెప్పుడో వేసుకొన్న ప్రశ్నలకు,
ఇప్పుడు తనకు దొరికిన సమాధానాలు
సరిచూసుకొంటున్నట్లుంటుంది..
ఆకలిదప్పులకు స్పందిస్తూ,
ఆలోచనల్లోనే మునిగితేలుతుంటే,
అంతర్యామిని దర్శించిన వాడు
అసలింకేదీ పట్టించుకోనట్లే ఉంటుంది..
మనమైనా
మనసు విప్పి మాటాడదామంటే,
అటువైపునుండి
మౌనం మాత్రమే ప్రతిధ్వనిస్తుంది..
ఆ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినా
అందుకోగల, అర్థం చేసుకోగల,
ఆవలి తీరం కనబడదు..
వేలమైళ్ళ దూరం నుండి తెచ్చి
ఎంత వెర్రి ప్రేమతో నాటినా,
చిరునవ్వు విత్తనం
ఇక్కడ మొలకెత్తడం లేదు..
అన్ని జాగ్రత్తలు తీసుకొని
అందరూ బాగా చూసుకొంటున్నా,
ఆ కొమ్మ మాత్రం
అంటుకట్టించుకొందామనే
చొరవను చూపడం లేదు..
పై పై రుగ్మతలకు కాదు,
మనసుకే మంచి పసరు మందు పట్టించాలి,
అట్టిట్టు తూలే ఆరోగ్యదీపపు ప్రమిదలో
ఆనందపు చమురును నింపాలి..
అవును,
ఆ సంజీవని పర్వతం దగ్గరకే తీసుకొని వెళ్ళి,
అదనపు ఆయుష్షును పోయాలి,
ఆజన్మాంతం సరిపోయేలా
అక్కడి గాలిని గుండెనిండా పీల్పించాలి..
ఒక్కసారి ఊరికి తీసుకు వెళ్ళాలి,
ఒక్క జీవితకాలాన్ని వెనక్కి పొందాలి,
అణువణువునా అమృతత్వాన్ని నింపుకొన్న,
ఆ "నాన్న"ను మళ్ళీ మళ్ళీ చూడాలి..