కొన్నేళ్ల నుండి నేను చేసిన ప్రయత్నం ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రాలో బతికినప్పుడు తిన్న వంటకాలు ప్రయత్నం చేయడం. ఇందులోవే ఉప్పుడి పిండి, పిండి పులిహార, దోసావకాయ, వంకాయ కాల్చకుండా పచ్చడి వగైరా. చాలాసార్లు చేతులు కోసుకున్నాకా, కాల్చుకున్నాకా కొన్ని విలువైన విషయాలు అర్ధం అయ్యాయి. అయితే పెద్దగా చేతులు కోసుకోకుండా చేయగలిగే వంటలు కొన్ని ఉన్నాయి. ఇవి ఉపవాసం వంటలుగా ఆంధ్రాలో తిన్నట్టు గుర్తు – కొండొకచో పిండివంటగా పండుగలో తిన్నట్టూ గుర్తు. అయితే అమెరికా వచ్చాక ఇవి చేయడం కష్టాతి కష్టం అని తెల్సిపోయింది. యు-ట్యూబ్ లో చూసేసి పది నిముషాల్లో చేసేయొచ్చులే అనే తప్పుడు ఆలోచన వీటిని చేయడానికి పనికిరాదు. పది సార్లు చేసినా పదకొండోసారి తప్పుగా రావొచ్చు. అన్నింటికన్నా ముఖ్య కారణం గత అయిదారేళ్ళవరకూ వీటికి కావాల్సిన సరైన నూక దొరక్కపోవడం. తర్వాతది ఈ నూక చేయడానికి కొన్న గ్రైండర్ రెండుమూడు సార్లు పనిచేసాక మొరాయించడం. అతి దరిద్రమైన మూడో విషయం ఆ గ్రైండర్ పనిచేసినా దాన్ని క్లీన్ చేసుకోవడానికి గంటలకొద్దీ సమయం పట్టడం. ఏదో మూల నూక మిగిలిపోవడం, గ్రైండ్ చేసిన నూక జల్లించుకోవాల్సి రావడం, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ నూక వంటింట్లో నేలమీద పడడం, ఇల్లంతా వాసన, దుమ్మూ, ధూళీ వగైరా. ఈ విషయం లో కొత్తగా ఈ నూక అమ్మడం మొదలు పెట్టినందుకు పటేల్ వార్ని అభినందించాల్సిందే. నా పని మూడోవంతు దాకా తగ్గింది.
ఈ ఉపవాసం వంటలు రెండూ బొమ్మల్తో సహా పెట్టాను నేను ఎలా చేసి మొత్తానికి ఆంధ్రా టేస్ట్ తెప్పించగలిగానో చెప్తూ. మీరు చేయి తిరిగిన నలభీములైతే మీకు బాగా వచ్చి ఉండొచ్చు. ఏమిటి ఇందులో నీ బోడి అంటే ఈ విషయం చెప్పగలను – ఇవి నేర్చుకోవడానికి, సరైన టేస్ట్ తెప్పించడానికీ నాకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఉపవాసం వంటలు అని ఎందుకన్నానంటే ఏ మహాశివరాత్రి, ఏకాదశి నాడో ఉపవాసం చేసాక మొత్తం వంట వండరు సాధారణంగా – తక్కువ సమయంలో అయిపోయే ఒక వంటకం, ఓ గ్లాసుడు మజ్జిగా వీటితో ఉపవాసం అంతం చేస్తారు. రాబోయే కార్తీక మాసంలో, ఉపవాసం చేసే రోజులు ఎక్కువ కనక (నాలుగు సోమవారాలు, ఒక పౌర్ణమి, రెండు ఏకాదశి లు) ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని ఇవి రాసి పెట్టాను. కింద ఇచ్చిన రెండు వంటలకీ కావాల్సింది ఒకటే నూక. ఇది ఇప్పుడు పటేల్ లో దొరుకుతోంది – నాలుగు పౌన్ల పాకెట్టు ఆరు నుంచి ఎనిమిది డాలర్లలోపున. పేకెట్ మీద గమనించండి – “Parboiled” అనేది. వాళ్ళు తప్పుగా రాసినా సరే. రెండోది ఈ నూక సన్నపాటి నూక కాదు. నూక సరిగ్గా కనిపించడానికి పక్కనే మరో బొమ్మ పెట్టాను జూమ్ చేసి. ఇది ఉప్మా large grain నూక కూడా కాదు. ఇడ్లీ రవ్వ అనేక రకాలుగా దొరుకుతోంది కానీ అవన్నీ ఈ వంటకాలకి పనికిరావు. ఉప్మానూక పెద్ద సైజు నూకలాగా అమ్ముతారు కానీ అది ఈ బొమ్మలో చూపించినంత పెద్దది కాదు, ఆ నూకతో కూడా సరిగ్గా రావు ఈ రెండూ. కొన్ని షాపుల్లో కాఫీ గింజల గ్రైండర్ అమ్ముతారు దాంతో ఉప్పుడు బియ్యం కొనుక్కుని ఈ నూకలాగా బరకగా చేసుకోవచ్చు ఓ సెటింగ్ పెట్టుకుని. కానీ పైన చెప్పినట్టూ క్లీన్ చేసుకోవడం అదీ ఓ ప్రహసనం, తలనెప్పి. అందులోనూ ఉపవాసం చేసిన రోజు ఈ క్లీనింగ్ మరో కష్టం. ఓపిక ఉంటే మీ ఇష్టం.
ఉప్పుడు పిండి
దీనికి కావాల్సినవి ఇవి – పైన చెప్పిన రవ్వ (ఎలా తయారు చేసుకున్నా, కొనుక్కున్నా సరే), ఎండు మిరపకాయలు, తొక్కుతీసి సన్నగా తరిగిన అల్లం (ఈ తీసేసిన అల్లం తొక్కు తర్వాత టీ లో కలుపుకోవచ్చు ఇష్టం ఉంటే) , పోపు దినుసులు (పచ్చి శనగ పప్పు, ఛాయ మినప పప్పు అంటే నల్లటి తొక్కు లేకుండా తెల్లగా ఉన్నది, ఆవాలు), ఛాయ పెసరపప్పు (ఆకుపచ్చ తొక్కులేకుండా, ఒకటో రెండో కప్పులు; బొమ్మలో చూపించినది నేను వాడే పెసరపప్పు; దాని కొలత కాదు గమనించండి), కరివేపాకు, నూనె, ఉప్పు. కావాలిస్తే కొంచెం నెయ్యి లేదా “I can’t believe it’s not butter” అనేది రెండు చెంచాలు, కొవ్వు ఎక్కువ అనుకుంటే. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. మీ ఇష్టం వచ్చిన (ఉదా. ఆలివ్, నువ్వుల) నూనె వాడొచ్చు మామూలు వంటనూనె ఆరోగ్యరీత్యా మీరు వాడడం మానేసినట్టైతే. ఇందులో వేయకూడనివి కూడా ఉన్నాయి – పచ్చి మిరపకాయలు, పసుపు, జీలకర్ర. ఇవెందుకూ పనికిరావు ఉప్పుడు పిండిలో. పిండి చేయడానికి లోతు ఉన్న గిన్నె, కలపడానికి ఒక చిల్లుల గరిటె. ఈ బొమ్మలో చూపించినవి నేను వాడేది. మామూలు గరిటె వాడొచ్చు కానీ పిండి ముద్దలు ముద్దలుగా కలవకుండా ఉండడానికి ఈ చిల్లుల గరిటే మంచిది. లోతు గిన్నె అయితే కనీసం లోతు ఎనిమిది అంగుళాలు ఉంటే పిండి కలపడం సులభం. ఉడికే పిండి శరీరం మీద పడితే చర్మం ఊడి వస్తుంది. లేదా వేసుకున్న బట్టలు పాడవవడం ఖాయం. చివరలో పిండి ఉడికేటపుడు పైన పెట్టడానికి ఒక మూత కూడా దగ్గిర ఉంచుకోండి. ఇది నేను వాడిన గిన్నె, గరిటె, నెయ్యి బదులు వాడినది.
ఈ బొమ్మలో చూపించినట్టు మొదట నూనె వేసి పోపు, అల్లం ముక్కలూ, ఎండు మిరపకాయలూ, కరివేపాకు వేయించండి – దోరగా వేగే వరకూ. పోపు వేగుతున్నప్పుడు ఫోను మీద లేదా ఫేసుబుక్కుమీద కూర్చుంటే మాడిపోతుంది. అది నూనె తో సహా పారేసి మరోసారి మొదలుపెట్టాల్సిందే. వంటింట్లో మాడు కంపు ఎలా వదిలించుకుంటారో మీ ఇష్టం. పోపు వేగాక గిన్నెలో నీళ్ళు పోసి మరిగించండి పోపుతో సహా.
నీరు మరగడానికి హై లో పెట్టాను కుంపటి. బాగా మరిగి బుడబుడమని బుడగలు వచ్చేటపుడు రెండు చెంచాల నెయ్యి లేదా “I can’t believe it’s not butter” కలపండి. ఇది ఎందుకంటే మొత్తం పిండి ఉడికాక అట్టడుగున ఉన్న పిండి గట్టిపడి మాడిపోకుండా ఉండడానికి. దేశీ నెయ్యి కలిపితే వచ్చే వాసన అమోఘం కదా? ఉపవాసం చేసిన నాడు మరో వంద కాలోరీలు ఎక్కువ తింటే మాత్రం ఏమైంది? ఇప్పుడే ఉప్పు వేయడం మంచిది ఉజ్జాయింపుగా. బాగా కలుస్తుంది. అయితే ఇది Parboiled నూక కనక ఉప్పు తక్కువ వేయడం మంచిది. వంటలో నేను నేర్చుకున్న మరో పాఠం – ఏ వంటలో అయినా ఉప్పు తక్కువ వేస్తే తర్వాత కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే దాన్ని తగ్గించడం దాదాపు అసాధ్యం. మరో విషయం, ఉప్పు తక్కువ తింటే ఏమీ అవదు కానీ ఎక్కువ తింటే వచ్చే అనర్ధాలు అనేకం. అదీ గాక ఈ ఉప్పుడు పిండి తినేటపుడు కలుపుకునే అధరవు లో ఉన్న ఉప్పు పాళ్ళు మరీ ఎక్కువ. అది తర్వాత చూద్దాం. ఈ నెయ్యి, లేదా “I can’t believe it’s not butter” వేడినీటిలో బాగా కరిగాక ఇదే సమయంలో పెసరపప్పు కలపండి (ఒకటి/రెండు కప్పులు) గిన్నెలో. నీరు మరగడం తగ్గుతుంది పెసరపప్పు కలిపినపుడు. మరోసారి నీరు మరిగేదాకా కాసేపు వేచి ఉండండి. మరీ ఎక్కువ సేపు వేచి ఉంటే పెసరపప్పు ముద్దగా అయిపోతుంది. అందువల్ల బహు పరాక్.
రెండోసారి నీరు మరుగుతూంటే Parboiled బియ్యం నూక వేస్తూ గరిటె అలా కదుపుతూ ఉండాలి పిండి ఒకేచోట గట్టి పడిపోకుండా ఉండడానికి. ఎంత నూక వేయాలి అనేదానికి నేను నమ్ముకున్న ‘Rule of thumb’ ఇదీ. ఉప్మాలో వేసినట్టూ మొత్తం నీరు ఇంకిపోయేదాకా ఎప్పుడూ వేయవద్దు. నూక వేసాక కనిపించే నూక ఉపరితలం పైన రెండు అంగుళం వరకూ నీరు ఉండాలి. కారణం ఏమిటంటే ఈ నూక ఉడకడానికి నీళ్ళు అవసరం. మరోసారి నీరు మరగడం తగ్గుతుంది నూక వేసాక. ఇది బొమ్మలో చూపించాను. అలా కలుపుతూ ఉండండి మళ్ళీ నీరు మరిగేదాకా. మరుగుతుంటే నూక పైకి ఎగరడం గమనించవచ్చు. ఇప్పుడు చేయాల్సింది గిన్నె మీద మూత పెట్టి కుంపటి సెగ తగ్గించడం. దీనికి నేను వాడిన ‘లో’ సెట్టింగ్ ఇదీ. మూత పెట్టడం మర్చిపోకండి లేదా ఉడికే పిండి మీ మీదా, కుంపటి చుట్టూరా, వంట గదిలో నేలమీదా పడుతుంది.
ఇక్కడే ఎక్కువ సేపు వేచి చూడాలి మధ్య మధ్యలో కలుపుతూ. Parboiled నూక కనక ఉడికే సమయం కొంచెం ఎక్కువా తక్కువా ఉండొచ్చు. ఉప్మా రవ్వ ఉడికినట్టూ ఈ నూక వెంఠనే ఉడకదు. నీరు తక్కువైతే అసలు ఉడకనే ఉడకదు. ఇందులో ఎంత నూకా, ఎంత నీరు అనేవి ‘Trial and Error’ గా ఎవరికి ఎవరు నేర్చుకోవాల్సిందే. పైన చెప్పినట్టూ నా రూల్ – గిన్నెలో మునిగిన నూక ఉపరితలం పైన రెండు అంగుళాల వరకూ నీరు ఉంటే పిండి బాగా ఉడుకుతుంది. గిన్నె లో నూక వేసాక కనీసం సగం గిన్నె ఖాళీ ఉండేలాగ చూసుకోండి. ఎందుకంటే ఈ పిండి ఉడికాక ఉబ్బి మొత్తం గిన్నె అంతా ఆవరించవచ్చు.
పిండి ఉడికి నీరు ఇంకడానికి కొంచెం సమయం పడుతుంది. మరో సారి గరిటె తిప్పుతూ కలపండి పై నుంచి కిందకి, పక్కలనుంచీ అంతా పిండి పూర్తిగా కలిసేలాగ. అట్టడున ఉన్న పిండి పైకి, పైది కిందకీ వెళ్ళేవరకూ కలిపి కుంపటి కట్టేసి మూత పెట్టి ఉంచండి.
మరో పది నిముషాలు గడిచేసరికి ఉప్పుడు పిండి సిద్ధం. మళ్ళీ పైనుంచి కిందకి అంతా కలిసే లా గరిటె తిప్పండి. ఎంత బాగా కలిస్తే అంత మంచిది. కిందన కనిపించేది, టివీవారు చెప్పినట్టూ ఫైనల్ ప్రోడక్ట్! పెసరపప్పు గింజ, కొంత పిండి వేళ్లమధ్యకి తీసి నొక్కి చూడండి. అవి మెత్తగా ఉంటే మీరు ఉప్పుడు పిండి ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ కొట్టేసినట్టే. ఇదిగో మీ వీరతాడు. మెళ్ళో వేసుకుని అధరవుతో ఆరగించండి.
అథరవు – ఉప్మాలో పచ్చడీ, సాంబార్ కూడా కలుపుకునే వారు ఉన్నారు ఇడ్లీ, వడా, దోసెలలో నంజుకున్నట్టే. ఉప్పుడు పిండికి మాత్రం ఉన్న ఏకైక, సరైన, అద్భుత అథరవు తెలుగువాడు తినకుండా బతకలేని ఒకే ఒక అతి విలువైనది – ఆవకాయ. ఓ సారి ఎప్పుడైనా (ఇంతకు ముందు చూడకపోతే) ఈ ఆవకాయ సీసా మీద ఉన్న ‘ingredients’ అనేది చూడండి. సోడియం/ఉప్పు ఎంత ఉంది అందులో? దానితో పోలిస్తే అసలు మీకు ఉప్పుడు పిండిలో ఉప్పు వేయడం అవసరమా లేదా అనేది తెల్తుంది. ఈ ఆవకాయ తప్ప మరోటి ఏది కలుపుకుని ఉప్పుడి పిండి తిన్నా ఆ రుచి రాదు గాక రాదు గాక రాదు. మీకు కాలోరీలు అవీ చూసుకునే పరిస్థితి లేకపోతే ఈ వేడి వేడి ఉప్పుడి పిండి మీద నేయి వేసుకుని దర్జాగా లాగించవచ్చు. ఏ అధరవు అవసరం లేదు. చివరిగా మరోసారి చెప్పనీయండి, ఈ ఉప్పుడి పిండిలో పచ్చి మిరపకాయలు, పసుపూ, జీలకర్రా వేయకండి. వేసి చూద్దాం అసలు ఎలా వస్తుందో అనుకుని వంటకం పాడు చేసుకోకండి. ఆ రెండూ వాడి తీరాలి అనుకునే వారు కింద ఇచ్చిన రెండో వంటకం ప్రయత్నించండి.
పిండి పులిహోర
దీనికి కావాల్సిన నూక కూడా పైన చెప్పిన Parboiled ఇడ్లీ నూక. లోతు గిన్నె, గరిటే కూడా అవే. మిగతావి – పసుపు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు (పైన ఉప్పుడు పిండి చూడండి), వేరుశెనగ గింజలు లేదా జీడిపప్పు లేదా ఆ రెండూను, ఒక నిమ్మకాయ, ఓ స్పూన్ చింతపండు రసం, ఒక ఫంకా, పులిహోర కలడానికి చేతికి ఒక గ్లోవ్. ఉప్పు, మరోసారి ఆలివ్ నూనె; నెయ్యి లేదా “I can’t believe it’s not butter” అనేది రెండు చెంచాలు. నేను వాడినది బొమ్మలో చూపించిన శాకాహార వెన్న. ఫంకా ఎందుకో ముందు చూద్దాం. జీలకర్ర ఇందులోనూ వద్దు.
లోతు గిన్నెలో నీళ్ళు పోసి ఒకటి లేదా రెండు స్పూన్ ల పసుపు వేయండి. నీళ్ళు మరుగుతూటే నెయ్యి లేదా “I can’t believe it’s not butter” కలిపి అది పూర్తిగా నీటిలో కరిగాక ఈ Parboiled ఇడ్లీ నూక వేసి కలుపుతూ ఉండండి. ఇక్కడ కూడా ఈ నెయ్యి మొత్తం పిండి ఉడికాక అట్టడుగున ఉన్న పిండి గట్టిపడి మాడిపోకుండా ఉండడానికి. పైన ఉప్పుడి పిండిలో చెప్పిన “ఆఖరుగా నూక వేయడం” అనేది ఈ పిండి పులిహోరలో మొదటి పని. పోపు తర్వాత వేయవచ్చు. నూక వేసాక కలిపి, రెండు అంగుళాల మేర నీరు ఉంచి నూక బాగా ఉడకనీయండి. అయిందా? ఇది ఉడికి పచ్చగా ఇలా తయారౌతుంది.
కుంపటి చిన్న సెగమీద ఉంచి గిన్నె మీద మూత పెట్టి మరో ఐదు నిముషాలు ఉడికాక కట్టేయవచ్చు. ఇది తీసి ఫంకా ముందు పెట్టండి చల్లారడానికి. నూక ఉడికిందో లేదో చేత్తో పట్టుకుని చూడవచ్చు కూడా ఫంకా వాడే ముందు.ఇది చల్లారడానికి పావుగంటనుంచి అరగంట పట్టొచ్చు. చలికాలం కదా బయట డెక్ మీద పెట్టేస్తే ఐదు నిముషాల్లో అయిపోతుందని ఆ పని చేయవద్దు. గిన్నెలో కింద ఉన్న నూక గడ్డకట్టి వంటకం పాడౌతుంది. బయట పెడితే ఏ పక్షి రెట్ట దానిమీద పడుతుందో, ఏ కీటకం దానిమీదకి చేరి వేడికి శీఘ్ర వైకుంఠప్రాప్తి పొందుతుందో అంతా దైవాధీనం, మూత పెట్టినా సరే.
నూక చల్లబడేలోపు ఈ పులిహోరకి కావాల్సిన పోపు సంగతి చూద్దాం. ఈ పిండి పులిహారలో అల్లం ఉండదు గమనించండి. పోపు, వేరుశెనగ గింజలూ, జీడిపప్పు, పచ్చి మిరపకాయలు దోరగా వేయించాక, కుంపటి కట్టేయవచ్చు. ఉభయగోదావరి వాణ్ణి కనక ఈ ముక్క చెప్పితీరాలి. తూర్పుగోదావరిలో మిరపకాయలు అడ్డంగా తరిగే అలవాటు, పశ్చిమలో నిలువుగా తరిగే అలవాటు నేను గమనించాను. నిలువుగా తరిగే పులిహార కొంచెం ఎక్కువ పాళ్ళు కారం గా ఉంటుంది కూడా మిరప గింజలు కలవడం వల్ల. మిరపకాయలు ఎలా తరిగినా మాడిపోకుండా చూసుకోవాలి. కొంతమంది ఈ పులిహారలో పచ్చి, ఎండు మిరపకాయలు రెండూ వేస్తారు. మరి కొంతమంది సన్నగా తరిగిన పచ్చి మామిడి తురుమూ, కొబ్బరి తురుమూ కూడా కలుపుతారు. మిగతా మిగిలిన పని చింతపండు, నిమ్మ రసం తయారు చేయడం. నా మటుక్కి చింతపండు రసం షాపులో అమ్మేది సులభం. ఇది నేను వాడే రసం. కుడిపక్క బొమ్మ – నిమ్మరసంలో చింతపండు రసం కలిపినది.
మీకు నచ్చకపోతే చింతపండు నీళ్ళలో వేసి అది బాగా నానాక పిసికి రసం తీయడం మరోదారి. నిమ్మకాయ కోసి ఆ రసం – గింజలు లేకుండా - ఈ చింతపండు నీటిలో కలపండి. పులుపు ఎక్కువ కావాలంటే మరో నిమ్మకాయ దగ్గిర ఉంచుకోండి. చింతపండు రసం వాడితే నీటి ప్రసక్తి లేదు. ఈ రసంలో నిమ్మకాయ పిండేసి రెండూ బాగా కలపడమే. ఈ పని అయ్యేలోపు పోపు కాస్త చల్లబడి ఉంటుంది. లేకపోతే కాసేపు ఆగి ఈ నిమ్మ, చింతకాయ పులుసు పోపులో వేయండి పోపు చల్లారాక. పులిహోరకి కావాల్సిన ఉప్పు ఉరమరగా ఇప్పుడే ఈ పోపులో కలపడం మంచిది.
చల్లబడిన నూకని అదే గిన్నెలో ఉంచి మూడు నాలుగు చెంచాల ఆలివ్ నూన్ చిలకరించండి పైన చుట్టూరా. ఈ నూనె, పిండి బాగా కలవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేతికి గ్లోవ్ తొడుక్కుని, పైన చెప్పిన పోపు నిమ్మకాయ మిశ్రమం ఈ గిన్నెలో కలిపి మొత్తం చేత్తో కలపండి. ఈ చేతి తొడుగు లేకపోతే చేతికి అంటుకున్న పసుపు రెండు మూడు వారాల వరకూ వదలదు ఎంత తోమినా. గరిటె తో కలిపేద్దాం అని ప్రయత్నించకండి. మామూలు పులిహార అయితే గరిటతో కలపడం బాగానే ఉండొచ్చు కానీ పిండి పులిహారలో పిండి విడివిడిగా రాదు గరిటెతో కలిపితే. స్వంతంగా చేత్తో కలపడమే మంచిది. ఈ గ్లోవ్ చేసే మరో ఉపకారం పిండి ఇంకా వేడిగా ఉంటే చేయి కాలకుండా కాపాడుతుంది.
ఈ పిండి, పోపు కలపడం కూడా అంత సులభం కాదు. గిన్నె మొత్తం అంతా వేళ్లమధ్యన కలపాల్సి ఉంటుంది. లేకపోతే పులిహార ముద్దలు ముద్దలుగా వచ్చి ప్రతీ ముద్దకీ మధ్యలో తెల్లగా పిండి తేలవచ్చు. నేను ఇందులో నేర్చున్న మరో విషయం – ముందే పసుపు వేసి పిండి ఉడికించడం వల్ల మొత్తం పులిహార అంతా పసుపు సరిగ్గా కలుస్తుంది. అదే పోపులో పసుపు వేసి తర్వాత తెల్లగా ఉడికిన పిండిలో కలిపితే మొత్తం పులిహార అంతా ఒకే విధంగా కలపడం కనా కష్టం. ఇంతవరకూ వచ్చాక ఎక్కువ పులుపు కావాలనుకునేవారు మరో నిమ్మకాయ కోసి పిండుకోవచ్చు, ఇది కలిపేటప్పుడే
ఈ పై బొమ్మ ఫైనల్ ప్రోడక్ట్. పిండి పులిహోరలో అధరవు అంటూ ఏమీ లేదు. అయితే సౌర్ క్రీం (కొవ్వు లేనిది, తక్కువ ఉన్నది, లేదా మరోటి మీకు నచ్చినది) కలుపుకుని తినడం ఓ విధం. పెరుగు వడ్డించుకుని తినడం మరో విధం.
ఈ రెండు వంటలకీ ఇలా వండితే ఇన్ని కాలోరీలు మరో విధంగా అయితే తక్కువ కాలోరీలు అని నేనెప్పుడూ చూసుకోలేదు. హాయిగా తిని వ్యాయమం చేస్తున్నంతలో ఈ ఉపవాసం వంటలు ఏ హానీ చేయవు, ఇవి ప్రతీరోజూ తినేవి కాదు కనక. కనీసం పిజా, బర్గెర్లకంటే ఇవే అత్యుత్తమం కాలోరీల విషయంలో.
ఈ రెండు వంటలకీ Parboiled నూక ‘instapot’ లో లేదా ప్రెషర్ కుకర్లో ఉడకబెట్టవచ్చా అనేదానికి సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే ‘instapot’ లో ఎన్ని సార్లు అన్నం వండినా ఏదో ఒక రకంగా కిందన ఉన్న లేయర్ మాడిపోవడమో లేదా అన్నం ముద్దగా అయిపోవడమో అవుతోంది. అది ప్రయత్నించి విరమించుకున్నాను ఉత్తినే సమయం వృధా చేయడం ఇష్టం లేక. నూక ప్రెషర్ కుకర్లో ఎప్పుడూ ప్రయత్నించలేదు. కొత్త కొత్త ఉపకరణాలు వస్తూ ఉంటే కొత్త కొత్త కష్టాలూ, అనుభవాలు ఎదురవడం సర్వ సాధారణం కదా? మీరు ప్రయత్నించి చూసి ఉంటే చెప్పండి. నేను చేసిన ఈ వంటకాలు పిడికొట్టిన పాత పద్ధతుల్లో, కొన్నిసార్లు పూర్తిగా పాడయ్యాకా చేతులు కాల్చుకుని నేర్చుకున్న విధంగా. నేను నలుణ్ణీ కాదు భీముణ్ణీ కాదు కానీ నేను వండినది ఎవరూ పారేయకుండా, థూ అనకుండా తినగలిగేలాగా వండగలను అంతే. అందువల్ల ఇదే ఉత్తమమైన పద్దతి అని చెప్పలేను కానీ ఇది నేను చేసిన పద్దతి, ఇలా చేస్తే బాగా వచ్చింది నాకు. మీకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే నమస్కారం.
Bon Appetit లేదా శుభ ఉపవాస దీక్ష విరమింపు ఈ వంటకాలతో.
మాబామ్మగారు చాలా తరచుగా ఉప్పుడు పిండి చేసేస్తూ ఉండేవారు. దానితో ఇదేదో మహాసుభమైన వంటకం అన్ని అభిప్రాయం ఏర్పడింది.
మీ సచిత్ర వ్యాసం చదివాక ఉప్పుడు పిండి సరిగా చేయటం అంత ఆషామాషీ వ్యవహారం కాదని బోధపడింది.
పాకశాసనులైన శర్మ గారికి వందనాలు.