క్షమ
జులై 7 వ తారీఖు ప్రపంచ క్షమా దినంగా పరిగణించబడుతోంది. అంటే ఆరోజు, మరియు ఆరోజు నుండి ప్రతివాళ్ళూ వారి కోపతాపాలను, పగద్వేషాలను మర్చిపోయి ఎదుటివారిని క్షమించి, తమ సంబంధ బాంధవ్యాలను సవరించుకొని తమ మధ్య తిరిగి స్నేహ సంబంధాలను నెలకొల్పుకోవాలన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే క్షమాగుణానికి వున్న ప్రాముఖ్యతని గుర్తించి ఏడాదిలో ఆ ఒక్క రోజుని క్షమకి కేటాయించారన్నమాట.
జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిచే ఏదో విధంగా మనందరం గాయపడినవారమే! బాధపడినవారమే! మరి అలాంటి సందర్భాలలో మనం ఎలాంటి ప్రతిస్పందన చూపించాలి? మనల్ని బాధపెట్టినవారిని ఏంచెయ్యాలి? ఒకవేళ తప్పు నిజంగా వారిదే అయివుంటే మరి వారి తప్పులను ఎలా స్వీకరించాలి? ఈ ప్రశ్నలన్నింటి సమాధానమే క్షమ.
తప్పులు చేయని మనిషంటూ వుండడు. మనం స్వయంగా ఏదైనా తప్పు చేసినప్పుడు అసలు దాని సంగతి ఎవరైనా మాట్లాడటం కూడా మనకు నచ్చదు. మన తప్పులు నలుగురిలో బట్టబయలయి మనల్ని నలుగురూ వేలెత్తి చూపించటం మనం భరించలేము. మరి అలాంటప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఎవరికైనా తెలిసేలోపే, గుట్టుచప్పుడు కాకుండా మన తప్పులు అట్టడుగున సమాధి అయిపోతే ఎంత బాగుంటుంది? ఒకవేళ ఎవరైనా మన తప్పులను తమ సూక్ష్మబుద్ధితో పసిగట్టినా, వాటి గురించి గోలచేసి అరవకుండా మౌనంగా మనల్ని క్షమించేస్తే ఎంత బాగుంటుంది? అప్పుడు మన తప్పులూ ఎవరికీ తెలీవు. అవతలివారితో మనకు ఎటువంటి శత్రుత్వం కూడా వుండదు. అవునా? సరిగ్గా ఇలాగే చాలామంది కోరుకుంటారు. మరి దీన్నే క్షమాకాంక్ష అంటారు.
అప్పుడప్పుడు అనుకోకుండా మన చేతిలో తప్పులు దొర్లిపోతాయి. వాటిని వెంటనే గుర్తించినా ఎలా సవరించుకోవాలో తెలీదు. అంతకంటే ముఖ్యం, ఎవరిపట్ల అవి జరిగాయో, వారితో మనం ఎలా ప్రవర్తించాలో తెలీని అసమంజసంలో వుంటాము. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, ఏం అనాలో, ఏం అనకూడదో, ఎలా క్షమాపణ చెప్పాలో, ఎలా చెప్తే బాగుంటుందో, ఏమీ తెలీని విచిత్ర పరిస్థితిలో ఇరుక్కుపోతాం మనం. కానీ క్షమ కావాలని మాత్రం మనకు తెలుసు. అంటే పరిస్థితి ఎంత జటిలంగా వున్నా క్షమకి వున్న శక్తి మాత్రం మనకి బాగా తెలుసన్నమాట.
క్షమ గురించి చెప్పాలంటే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం తప్పకుండా చెప్పాలి. అది ఏమిటంటే క్షమ ఇవ్వటం, తీసుకోవటం రెండూ కూడా చాలా కష్టమైనవే! మన శరీరం, మనసు గాయపడినపుడు, అదంతా పక్కకి నెట్టేసి, దానికి కారణమైనవారిని క్షమించి వదిలేయటం అంత తేలికైన విషయం కాదు. దానికి చాలా మాససిక శక్తి, ధారుడ్యం కావాలి. అలాగే మన తప్పుని ఒప్పుకుని, క్షమని ఎంత కోరుకున్నా కూడా తీరా అది అందే సమయంలో మనసు విచలం కాకుండా నిబ్బరంగా, సభ్యతగా దాన్ని స్వీకరించడం కూడా చాలా కష్టమైన విషయమే! అందుకే ఈ రెండూ కూడా దైవ లక్షణాలు అంటాను నేను. ఈ మాటలు క్షమని ఇచ్చినవారికి, తీసుకున్నవారికి బాగా అర్థం అవుతాయి.
కానీ ఎంత కష్టమైనా క్షమ అన్న భావనకు మన మనసులో చోటివ్వక తప్పదు. ఎందుకంటే క్రోధంతో, పగతో, ద్వేషంతో రగులుతున్న మనసులో శాంతికి, సంతోషానికి స్థానం లేదు. అనుక్షణం అశాంతిలో మునుగుతూ, క్రోధంలో రగులుతూ చిత్రవధ అనుభవించటం తప్ప ఆ మనసుకి ఇంకేవిధమైన విముక్తి వుండదు. దీనికి విరుగుడు కేవలం క్షమ మాత్రమే! క్షమ ఒక్కటే కోపంతో జ్వలిస్తున్న మనసు పై చల్లటి పన్నీటి జల్లులు కురిపించగలదు. శాంతి, సౌఖ్యాలను కురిపించగలదు. దూరమైన బంధుత్వాలను, మరుగునపడిన స్నేహాలను తిరిగి ప్రతిష్ఠించగలదు. అన్నిటికిమించి మనసుకి అమితమైన శాంతిని ప్రసాదించగలదు. పగలో వున్నప్పుడు ధ్యాసంతా ఎదుటివారు మనకు చేసిన అన్యాయం, అవమానాల మీద వుంటుంది. వాటి వలన మనకు కలిగిన బాధల మీద వుంటుంది, వాటికి ఎలా పగ తీర్చుకోవాలి అన్న యోజనల మీద వుంటుంది. కానీ క్షమ అలా కాదు. క్షమకి కోపతాపాలు, పగ, ద్వేషాలు, కక్షలు, కావేషాలతో పని లేదు. శాంతి, సుఖాలతోనే పని వుంది.
నాకు సాధారణంగా కోపం రాదు. కానీ ఏ కారణంవలనైనా వస్తే మాత్రం అది ఎవరి మీద వచ్చిందో వారి సంగతి ఏమో కానీ నాకు మాత్రం పరిస్థితి దుర్భరంగా వుంటుంది. ఏమీ తినబుద్ధి కాదు. నిద్ర పట్టదు. అనుక్షణం మనసు అశాంతిలో మునిగివుంటుంది. కోపం, బాధ, ఉక్రోషం, ఇలా అన్ని రకాల భావాలు ఒక్కటిగా కలిసి నామీద దండయాత్ర చేస్తున్నట్లుగా వుంటుంది. అప్పుడు నా దగ్గర వున్నవేవీ నాకు గుర్తు రావు, ఆనందాన్ని ఇవ్వవు. అయినా శాంతి లేని మనసుకి ఏం వుంటే ఏం లాభం? ఎంత వుంటే ఏం లాభం? కానీ నాకు ఎవరి మీద కోపంగా వుందో, వారు మాత్రం ఈ నకారాత్మక భావాలన్నిటికి దూరంగా బహుశా బాగానే వుండి వుంటారు. అసలు నా కోపం సంగతి వారికి తెలుసో లేదో కూడాను. చూసారా, కోపం వలన చివరికి ఎవరికి ఏం లభిస్తోందో గమనించారా? కోపంలో వున్న మనం మాత్రం వారికి నష్టం కలిగించామని అనుకుంటాం. కానీ కష్టం, నష్టం ఎవరికి కలుగుతోంది? ఎవరి ఆత్మ మలినమవుతోంది? ఎవరి మనసు విచలితమవుతోంది? విషం మనం తాగుతూ ఎదుటివారు చనిపోతారని ఆశించటం అంటే దీన్నే అంటారు కాబోలు.
అయినాకూడా క్షమలాంటి అతి సున్నిత భావాలను మనసులో నింపుకోవటం అంత తేలికైన పని కాదు. కోపం, ద్వేషం, పగలాంటి భావాలు చాలా ఘాటైనవి, చాలా శక్తివంతమైనవి. కానీ క్షమ మాత్రం అలా కాదు. అది చాలా నాజూకైన భావం. నిశ్శబ్దంగా తన పని చేసేసి, మనసుకు వూరటను కలిగించే చల్లటి లేపనం. మనసుకి పట్టిన చెదలని చెదరగొట్టి, స్వస్థతని కలిగించే దివ్య ఔషధం. మనలో తిరిగి శాంతిని పునఃస్థాపన చేసే సుపరికరం. కానీ ఈ మందుని వాడి రోగనివారణ చేసుకోవాలంటే ముందు రోగికి ఇష్టం వుండాలి. తన జబ్బుని నయం చేసుకోవటానికి సిద్ధంగా వుండాలి. చిందరవందర అయిన స్నేహాలను, బంధాలను పునరుద్ధించుకోవటానికి కోరిక, తపన వుండాలి. అప్పుడే రోగనివారణ సాధ్యం. జీవితంలో శాంతి, సుఖం సాధ్యం. మనసుకి తగిలిన గాయాలు మాని స్వస్థత చేకూరటం సాధ్యం. అందుకే Psychotherapy, Counseling లాంటివాటిల్లో ఈ క్షమా విధానాన్ని చాలా వాడతారు.
ఇంకో విషయం. ఎప్పుడైతే క్షమను మన మనసులలోకి, జీవితాల్లోకి రానిస్తామో అప్పుడే మన జీవితం మీద నియంత్రణ మన చేతిలో వుందన్నమాట. లేకపోతే ఈ నకారాత్మక భావాలు మన జుట్టుని తమ చేతిలోకి తీసేసుకుని మనల్ని నానా ఆటలు ఆడిస్తాయి. అందుకే క్షమకు మనసులో చోటిచ్చేవారు చాలా బలవంతులు. అప్రియమైన అనుభవాలను, అవమానాలను మర్చిపోయి తమకు గ్లానిని కలిగించినవారిని కూడా క్షమించగల పెద్దమనసు కలవారు. వారెప్పుడూ తమ మానసిక భావాలను పక్కకు పెట్టి తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు. తమ ప్రవర్తనను తమ మెదడు చెప్పినట్లు మలచుకుంటారు. అలాకాకుండా కోపతాపాలకు లొంగిపోయి చెడు మార్గాల్లో నడవటానికి సిద్ధమయేవారు చాలా బలహీనులు. వారు తమ నిర్ణయాలను తమ భావాల తాకిడికి వదిలేస్తారు. తమ ప్రవర్తనను తమ మనసులోని నకారాత్మక భావాలు చెప్పినట్లు మలచుకుంటారు. దీనివలన వారికి నష్టం తప్ప ఏమీ లాభం వుండదు.
క్షమ మన మనసులలో దయని, కరుణని, సానుభూతిని రేకెత్తిస్తుంది. ఎదుటివారి వాదనని సహనంగా విని, ఆకళింపు చేసుకోవటానికి, ఎదుటివారి ఆలోచనా దృక్పధాన్ని అర్థం చేసుకోవటానికి కనీసం ఒక్క క్షణమన్నా స్థిమితంగా ఆలోచించేట్లు చేస్తుంది. అసలు క్షమకు ఇది మూలసూత్రం. ఎదుటివారి మాటలకు, చేతలకు తొందరపడి ప్రతిస్పందన చూపించే బదులు శాంతంగా, సహనంగా వారు అసలు అలా ఎందుకు ప్రవర్తించారో ఆలోచించడంలోనే వున్నది అసలు కిటుకంతా. ఒకవేళ ఎదుటివారి మాటలు, చేతలు నిజంగా బాధ కలిగించేవిగా వున్నా కూడా క్షమ అందరి మధ్యా సయోధ్యను కూర్చుతుంది. నకారాత్మక భావాలను తరిమేసి, మలినాలన్నిటిని కడిగేసి, మన మనసులను, ఆత్మలను శుద్ధిపరిచే అద్భుత మంత్రం క్షమ. మరి మనసులు అంత శుద్ధిగా, సంతోషంగా వున్నప్పుడు ఇంక గుండెపోటులు, రక్తపుపోటులు లాంటి జబ్బులెందుకు వస్తాయి ఎవరికైనా?
క్షమని తమ మనసులలోకి రానివ్వనివారు జీవితంలో ముందుకు సాగలేరు. భవిష్యత్తుని చూడలేరు. ఎందుకంటే వారు భూతకాలంలో జరిగిన అవమానాలు, ఆశాభంగాలు, అప్రియ సంఘటనల వలయాలలో చిక్కుకుని ఆ గతంలోనే వుండిపోతారు. ఇంక వారికి అడుగు ముందుకు వేసి అభ్యుదయం అందుకోవటం ఎలా సంభవమవుతుంది?
అయితే ఇంత మంచిని చేసే క్షమాగుణం గురించి మనలో చాలా అపోహలు వున్నాయి. వాటిల్లో మొదటిది, క్షమ పిరికితనానికి మారుపేరు అని. శక్తి, సత్తా వుంటే పగ తీర్చుకోవాలి కానీ మనల్ని బాధించినవారిని క్షమ అంటూ అంత తేలికగా వదిలేస్తారేమిటి? అది పిరికితనం కాక బలం ఎలా అవుతుంది? అని కొంతమంది వాదించవచ్చు. కానీ మనం ముందే చర్చించుకున్నట్లుగా, పగ తీర్చుకోవటం కష్టమా, లేక పగని, అవమానాలని మర్చిపోయి వారిని క్షమించటం కష్టమా? ఏది ఎక్కువ కష్టం? క్షమించటమే కదూ? మరి మీరే చెప్పండి, ఎక్కువ కష్టమైన పనులు చేసేవారు బలహీనులు, పిరికివారు ఎలా అవుతారు?
ఇంకో అపోహ ఏమిటంటే క్షమించటానికి ఒక సరైన సమయం అంటూ వుంటుంది అని. తగిన సమయంలో మాత్రమే క్షమించాలి లేక ఒక మనిషిలో కొంచెమన్నా మంచి మార్పు వస్తేనే వారి పూర్వపు తప్పులను క్షమించాలి అన్న ఆంక్షలు పెట్టుకోవడం కేవలం తెలివితక్కువ మాత్రమే! ఎందుకంటే క్షమించటం కోసం మనం ఎదురుచూసే ఆ శుభ ఘడియ ఎప్పటికీ రానేరాదు. ఎందుకంటే ఎవరిలోనన్నా ఏదన్నా మార్పు రావాలంటే అది అంత తేలిక కాదు. దానికి చాలా సమయం పడుతుంది. అంతేకాక మనిషి అన్న తర్వాత తెలిసో, తెలియకో ఎప్పుడూ ఏదో ఒక తప్పు దొర్లుతూనే వుంటుంది. అవి పూర్తిగా ఆగాలి, అప్పుడే క్షమిస్తాను అని అనుకోవటం అవివేకం కదూ? అయినా క్షమించాలి అని అనుకున్న వెంటనే ఆ పని చేసేయాలి కానీ ఎవరినన్నా క్షమించటానికి ఈ సమయం పరిధులేమిటి? హాస్యాస్పదంగా లేదూ?
ఇంకో అపోహ ఏమిటంటే క్షమించటం. అంటే ఎదుటివారు చేసిన తప్పులను, లేక వారు చేసిన దూషణలను మర్చిపోవటమని. ఇది నిజం కాదు. ఎందుకంటే జరిగిపోయిన సంఘటనలు, వారి దుర్భాషలు మంత్రం వేస్తె మాయమయే విషయాలు కావు. అయినా మంచి మనసుతో ఎవరైనా వారిని క్షమిస్తే అది వారి అదృష్టం, ఎదుటివారి పెద్ద మనసు. అంతేకానీ వేరే ఇంకేమీ కారణం కాదు. వారికి లభించిన క్షమ వారి దుర్భాషలని, దురాగతాలని ఎన్నటికీ చెరిపేయలేదు.
అలాగే క్షమ లభించింది అంటే దాని అర్ధం వారి మీద ఎదుటివారికి మళ్ళీ నమ్మకం ఏర్పడింది అని కానీ, వారిరువురి మధ్యా సంబంధ బాంధవ్యాలు మళ్ళీ ఎప్పటిలాగానే సద్దుకుంటాయని కూడా అసలే కాదు. ఒకవేళ అలా జరిగితే మంచిదే! కానీ క్షమ దానికి దోహదం చేస్తుందని మాత్రం ఆశించకూడదు. అలా ఎవరైనా అనుకుంటే అది కూడా ఇంకో అపోహే!
అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటారు. అలాగే అర్ధించనిదే క్షమ కూడా లభించదని కొంతమంది అనుకుంటారు. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే! ఎందుకంటే క్షమ లభించింది అంటే అది కేవలం ఎదుటివారి మంచి మనసు వలనే లభిస్తుంది కానీ దాంట్లో వారు అడిగారా లేదా అన్న ప్రసక్తే వుండదు. దయామయుడైన ఆ భగవంతుడు మనం చేసిన అనేక పాపాలను మనం అడిగామనే క్షమిస్తున్నాడా? అలా అని క్షమని మనం ఒక హక్కు లాగా కూడా పరిగణించకూడదు. దాన్ని ఎవరి మీదా బలవంతంగా రుద్దకూడదు. నేను ముందే చెప్పినట్లుగా క్షమ అన్నది ఇచ్చేవారి పెద్ద మనసు వలన లభిస్తుంది, అంతేకానీ తీసుకునేవారి హక్కు ఎంతమాత్రమూ కాదు.
అలాగే క్షమకి పాత్రులైనవారికి మాత్రమే క్షమ లభిస్తుందని, లభించాలని కూడా ఎక్కడా ఎలాంటి నియమమూ లేదు. ఒకొక్కసారి, ఆమాటకొస్తే చాలాసార్లు అపాత్రులకే క్షమ లభిస్తుంది. దాని అర్ధం వారు తమ తప్పులను గ్రహించి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో తమ ప్రవర్తనను మార్చుకుంటారనే తప్ప ఇంకా మరిన్ని తప్పులు చేస్తారని, చెయ్యాలని మాత్రం అస్సలే కాదు.
అలాగే ఒకసారి క్షమ లభిస్తే ఇంక ఆ తప్పు నిరభ్యంతరంగా మళ్ళీ మళ్ళీ చెయ్యచ్చని ఎవరైనా అనుకుంటే అది కూడా పూర్తిగా అపోహే! ఎందుకంటే వారి మనసు లోంచి క్రోధాన్ని, బాధను తొలగించుకుని, మనఃశాంతి కొరకు ఎవరైనా ఎదుటివారిని క్షమిస్తారు కానీ అ క్షమ లభించిన తర్వాత వారిని మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చెయ్యమని దానికి అర్ధం ఏమాత్రమూ కాదు. క్షమని పొందినవారు దానిలోంచి అలాంటి తప్పు అర్ధాన్ని తీసుకోకూడదు.
మనందరం అతి సామాన్యమైన మామూలు మనుషులం. అందుకని కోపతాపాలు, పగ, ద్వేషాలలాంటి నకారాత్మక భావాలు అప్పుడప్పుడు మన మనసులలో మానవ సహజంగా చోటు చేసుకున్నా వాటిని వెంటనే వివేకంతో దూరంగా నెట్టేయాలి. ఎందుకంటే తప్పులు చేయటం మానవ నైజం. కానీ వాటిని క్షమించగలగటం మాత్రం దైవగుణం. శత్రువులు ఒక కన్ను పొడిచారని మనం వారి ఇంకో కన్ను పొడిస్తే ఏదో ఒకనాడు మొత్తం ఈ ప్రపంచం అంతా గుడ్డిదవ్వటం తప్ప ఏమీ ప్రయోజనం వుండదని మన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. అందుకే ప్రతి మనిషి ఈ క్షమాభావానికి తమ మనసులో చోటివ్వాలి.
దీని అర్ధం ఎంత పెద్ద తప్పుకైనా శిక్ష వుండకూడదని కానీ, ఎటూ దండన అన్నది లేకుండా క్షమ లభిస్తుంది కదా అని ఎలాంటి నేరమైనా చేసేయ్యచ్చని కానీ, ఎంతటి నేరం చేసినా ఇంక అడిగేవారే వుండరని, తప్పకుండా క్షమాపణ లభిస్తుందని ఇష్టమొచ్చినట్లు విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు అని కానీ అస్సలు కానే కాదు. తెలిసి తెలిసి నేరాలు, పాపాలు చేసి ఆ దేవుని క్షమకి కూడా పాత్రులు కానంత పాపాన్ని మూటకట్టుకోకూడదు.
అసలు క్షమని పొందినవారికి కూడా కొన్ని బాధ్యతలు వుంటాయి. ముందుగా వారు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే క్షమింపబడటం అనేది ఇంకొన్ని కొత్త తప్పులు చేయటానికి లైసెన్సు కాదు. వారు చేసిన తప్పులను గ్రహించి, స్వీకరించి, నిజమైన పశ్చాత్తాపంతో బాధపడి, భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పులేవి చెయ్యకూడదని గట్టి నిర్ణయం తీసుకుని దానికి బద్ధులై వుండటమే అ క్షమలోని పరమార్థం. అప్పుడే ఆ క్షమకి విలువ.
ఈ అవగాహన మనందరికీ వుండాలి. అలాగే క్షమకు వున్న ప్రత్యేక విలువ, వున్నత స్థానం కూడా మనందరం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. సహనం, క్షమలాంటి అత్యున్నతమైన గుణాలని పొందటానికి, వాటిని పెంపొందించుకోవడానికి మనం ఎప్పుడూ కృషి చేస్తూ వుండాలి. అవునా?
సరే, మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తూవుండండి. ఈలోపల నేను ఇంకో మంచి శీర్షికతో మళ్ళీ వచ్చే నెల మీ ముందుకు వస్తాను. సరేనా? అంతదాకా సెలవు.