Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

ఆకర్షణ

ఆమధ్య మా అబ్బాయి స్నేహితులు కొంతమంది మా ఇంటికి వచ్చారు. వాళ్ళలో ఒకమ్మాయి, ఒకబ్బాయి నా కళ్ళని బాగా ఆకట్టుకున్నారు. చూడటానికి ఇద్దరూ చక్కగా వున్నారు. గలగలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. కానీ వీటన్నిటితోపాటు వారి గురించి నన్ను ఆకట్టుకున్న విషయం ఇంకోటి కూడా వుంది. వారిద్దరి మధ్యా స్నేహంతో పాటు ఇంకేదో కూడా వుందని నాకు కొంచెం సేపట్లోనే గట్టి అనుమానం ఏర్పడిపోయింది. మాటిమాటికి ఒకరి వైపు ఒకరు చూస్తూ ముసిముసిగా నవ్వుకోవటం, ఏదో వంకన ఒకరిని ఇంకొకరు తాకటానికి ప్రయత్నించటం, ఒకరు ఏది మాట్లాడినా ఇంకొకరు దాన్ని సమర్థించటం, ఇద్దరి పరస్పర పొగడ్తలు, gestures, వారిద్దరిలో కనిపిస్తున్న ఏదో పరవశం, ఇదంతా చూస్తుంటే వారిద్దరి మధ్య వున్న ఆకర్షణ నాకు బాగానే అర్థం అయిపోయింది.

ఆకర్షణ అని ఎందుకంటున్నానంటే ఆ వయసులో వారి మధ్య ఇంక అంతకంటే ఎక్కువ ఇంకేదో వుంటుందని నాకనిపించటంలేదు. ఎందుకంటే ఆ వయసులో బాహ్య రూపానికి, వయసు తెచ్చే సహజమైన మెరమెరలకి ఆడ, మగ పరస్పరం ఆకర్షితులవటం చాలా సహజం. ఇంక అంతకంటే లోతైన భావాలు వారిలో కలగాలంటే దానికి కొంచెం సమయం, ఇంకొంచెం మానసిక పరిపక్వత కావాలి మరి. వారిద్దరూ ఎంత కాలం నుండి అలా వున్నారో నాకు తెలీదు, కానీ నేను ముఖ్యంగా చెప్పదల్చుకున్నదేమిటంటే ఆకర్షణ అన్నది చాలా బలమైనది. దానికి మొదటి సోపానం శారీరక రూపం. దానికి వయసు తీసుకొచ్చే సహజమైన మెరుపు, విరుపు, అలంకరణ తీసుకొచ్చే అదనపు అందం, చందం తోడైతే ఇంక ఆ ఆకర్షణ వెయ్యింతలు పెరుగుతుంది. మెల్లిగా ఆ ఆకర్షణ ఉధృతం కాస్త తగ్గిన తర్వాత అప్పుడు ఇంక అసలైన భావాలన్నీ బయటకు వస్తాయి. ఆకర్షణ శారీరక అందంతో ముడిపడి వుంటుంది కాబట్టి ఏ కారణం వల్లనైనా శారీరక అందం తగ్గగానే ఆకర్షణ కూడా తగ్గుతుంది. కానీ ప్రేమలో బలమైన బంధం వుంటుంది. అది ఆత్మతో పెనవేసుకుని వుంటుంది కాబట్టి శాశ్వతంగా వుంటుంది. దానికి శారీరక రూపంతో పని లేదు.

అసలు అందం అన్నది చూసేవారి దృష్టిని బట్టి వుంటుంది అని మనందరికీ తెలుసు. నామటుకు నాకు మనిషిలోని మంచితనం ముఖంలో ప్రతిఫలిస్తుంది అనిపిస్తుంది. అందుకే ఏ కల్మషము లేని మనసు, ఎవరిదైనా సరే, అద్దంలాగా తేటగా, సింపుల్ గా వుంటే వారి ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది నా కళ్ళకి. అందుకే బయటి అందం కంటే లోపలి అందం ముఖ్యం నాకు. కానీ అందరూ అలా ఆలోచించకపోవచ్చు.

సరే, బయటి అందం అయినా, లోపలి అందం అయినా, ఆకర్షణకి అందం బలమైన కారణం అని ఇప్పుడు మనకి తెలిసింది కదా! నా దృష్టిలో ఆకర్షణకి ఇంకో గట్టి కారణం శారీరక సామీప్యం, అంటే physical proximity. ఎందుకంటే చాలా సమయం ఒకేచోట కలిసి గడిపితే ఎవరికైనా మానవ సహజంగా మనసులో లేనిపోని భావాలేవో కలగడానికి చాలా అవకాశం వుంది. దీనికి ఉదాహరణగా నాకు మన సినిమా నటులు గుర్తొస్తున్నారు. చాలామంది నటులు, నటీమణులు సినిమా షూటింగుల వలన రోజంతా కలిసి ఒకరికొకరు చాలా సామీప్యంలో గడుపుతారు. బయట వూళ్ళలో లేదా విదేశాలలో జరిగే షూటింగులలో కూడా కలిసే వుంటారు. ఇలా రోజంతా సమయం కలిసి గడిపితే ఇంక మానసికంగా, అప్పుడప్పుడు శారీరకంగా కూడా దగ్గరయ్యే అవకాశం చాలా వుంది. అందరికీ అలా అవుతుందని కాదు. కానీ అలా అవడానికి అవకాశం మాత్రం చాలా వుంది. అందుకే మనం చూస్తూ వుంటాము, అందం, టాలెంట్, ధనం, మంచి కుటుంబం లాంటివన్నీ వున్న మన అవివాహిత నటులు లేదా నటీమణులు వారి తోటి నటులతో, లేదా నటీమణులతో, వారికి పెళ్ళయి, పిల్లలున్నారని తెలిసినా కూడా వారితో రకరకాల బంధాలలో ఇరుక్కుపోయి జీవితంలో పెద్ద తప్పుటడుగులు వేసి తమ career ని, జీవితాన్ని, చివరికి తమ సర్వస్వాన్నే కోల్పోతారు. ఇదంతా శారీరక సామీప్యంలో వున్న ఆకర్షణ వలన వచ్చిందే కదా!

మానవ స్వభావం ఎలా వుంటుందంటే వారిలాగా ఆలోచించేవారు, వారిలాగా ప్రవర్తించేవారు ఎవరికైనా వెంటనే నచ్చుతారు. దానికి విరుద్ధంగా వుండేవారు సహజంగానే ఎవరికీ నచ్చరు. అస్తమానూ అలా అవుతుందని కాదు, కానీ చాలాసార్లు అలా అవుతుంది. దాంట్లో ఏమీ తప్పు లేదు. మనందరం మామూలు మనుషులం. మరి మామూలు మనుషులలాగానే ఆలోచించించటం చాలా సహజం కదా! అస్తమానూ మన అభిప్రాయాలతో ఏకీభవించకుండా మనం ఏదన్నా కాదు, వద్దు అంటూ వాదులాటలు పెంచుకునేవారితో స్నేహం పెంచుకోవాలన్న ఆకర్షణ ఎవరికుంటుంది? అందుకే సామ్యము, అంటే similarity అన్నమాట, ఆకర్షణని పెంచుతుంది. అలాగే అసామ్యము, అంటే dissimilarity అన్నమాట, ఆకర్షణని తుంచుతుంది. అవునా?

అసలు ఆమాటకొస్తే ఆకర్షణకు శారీరక రూపానికున్న సంబంధం ఆకర్షణకున్న ఒక రూపం మాత్రమే అని, ఆకర్షణలో ఇంకా చాలా రూపాలున్నాయని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆకర్షణ ఒక్క శరీరం పట్ల మాత్రమే కాదు, వేరే విషయాల్లో కూడా వుండవచ్చు. వుండవచ్చు కాదు, వుంటుంది కూడా. రాత్రి పదకొండు గంటలకి ఒక పాట విని, ఒక రెండు గంటల తర్వాత, అంటే, దాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాతే అన్నమాట, నిద్రపోయిన రోజులున్నాయి. అలాగే ఎవరో ఒక నాటకం రాసిమ్మని అడిగారని, సమయం లేదు, రిహార్సల్స్ వెంటనే మొదలుపెట్టాలి అన్నారని, ఆఫీసుకి సెలవ పెట్టి ఇంటికి వచ్చి నాటకం రాసి ఆ రాత్రిలోపు వాళ్ళకి పంపించిన రోజులున్నాయి. ఇదంతా వాటి పట్ల నాకున్న ఆకర్షణ కాక ఇంకేమిటి? అంటే ఆకర్షణ కేవలం శారీరకమే కాదు, ఇతర విషయాలపట్ల కూడా వుండచ్చన్నమాట. అవునా? అలాగే నాటకాలలో, సినిమాలలో నటించాలని ఇంట్లోవారు వద్దంటున్నా వారికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయిన వారున్నారు. ఇది కూడా నటన పట్ల వారికున్న ఆకర్షణే కదా! మా అబ్బాయి వున్నాడు, చదువయిన తర్వాత ఆటలంటూ పరిగెడతాడు. అది వాడి ఆకర్షణ. అలాగే మనుషులందరికీ రకరకాలైన ఆకర్షణలు. కాకపోతే ఆట అయినా, పాట అయినా, రాతలైనా, ఇవన్నీ మంచి ఆకర్షణలు కాబట్టి ఫరవాలేదు. ఎవరికీ ఏమీ నష్టం లేదు. కానీ, అదే చెడు అలవాట్లలో ఆకర్షణ అయితే ఇంక అప్పుడు చిక్కులు తప్పవు. జీవితం నాశనం అవుతుంది. అసలు మంచివైనా కూడా సరే, హద్దుల్లో వుంటేనే వాటి అందం. లేకపోతే ఆ మంచి ఆకర్షణ కూడా చెడే చేస్తుంది. అవునా? సినిమాలు, నాటకాలు అంటూ ఆ ఆకర్షణలలో పడి వున్నదంతా ఆహుతి చేసుకున్నవారి గురించి కూడా మనం చాలా విన్నాం కదా!

అందుకే అసలు ఈ ఆకర్షణలలో పడకుండా వుండాలంటే మనం ఏంచెయ్యాలో, ఒకవేళ వాటిల్లో ఇరుక్కుంటే బయటికి ఎలా రావాలో కూడా తెలుసుకుని వుండటం మనకి చాలా ముఖ్యం. చెడు అలవాట్లలోని ఆకర్షణలో నిండా మునిగినవారికి కూడా ఆ ఆకర్షణ చాలా ప్రమాదకరమైనదని, దానిలోంచి ఎలాగైనా బయటకు రావటంలోనే తమ క్షేమం వుందని తెలుసు. కనుక ఫలానా ఆకర్షణ మంచిది కాదని గ్రహించటం మొదటగా చెయ్యాల్సిన పని. ఆతర్వాత దాని వైపు కూడా వెళ్ళకుండా మన మనసుని నియంత్రణలో వుంచుకోవటం వెంటనే చెయ్యాల్సిన పని. ఒకవేళ మానవ సహజమైన బలహీనతల వలన ఆ ఆకర్షణలకు లోనైనా వాటికి బానిస కాకమునుపే వాటిలోంచి బయటపడటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చెయ్యాలి. ఇంకో విషయం. ఆకర్షణ మంచిదే కదా అని అశ్రద్ధ చేసి వదిలేయకూడదు. ఎంత మంచివైనా ఆకర్షణలకు పూర్తిగా బానిస అవటం అస్సలు మంచిది కాదు.  జీవితంలో మన ప్రాధాన్యతలు, అంటే priorities, ఏవో మనం బాగా గుర్తిస్తే అప్పుడు ఇంక ఏ ఆకర్షణా మనల్ని ఏవిధంగానూ బాధించదు. మన ప్రాధాన్యతలు, వాటి హద్దులు బాగా గుర్తు పెట్టుకుని వాటి పరిధుల్లో వుంటే అసలు ఏ బాధ వుండనే వుండదు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఈ ప్రాధాన్యతలన్నవి ఎవరికి వారే  నిర్ణయించుకోవాలి. అలాగే వాటి ఆకర్షణలు కూడా.  అవి అందరికీ ఒకేలాగా వుండవు. అంతేకాదు, ఆకర్షణలు ఎప్పుడూ ఒకేలాగా కూడా వుండవు. మారిపోతూ వుంటాయి. అలాగే వాటి తీవ్రత కూడా మారుతూ వుంటుంది. ఎప్పటికప్పుడే వాటి వలయాల్లో చిక్కుకుపోకుండా అప్రమత్తతగా వుండాలి.

మనందరం మామూలు మనుషులం కాబట్టి ఆకర్షణలు, సంఘర్షణలు చాలా సహజం. కానీ మనందరం తెలివైనవాళ్ళం, మంచి చెడు పోల్చుకోగల విచక్షణ వున్నవాళ్ళం కాబట్టి, రండి, ఈ ఆకర్షణ దయ్యం ని ఓడించేద్దాం. ఎలా అంటే మంచివాటిని మన దగ్గరికి రానిద్దాం, కానీ వాటిని కూడా మళ్ళీ హద్దుల్లోనే వుంచేద్దాం. వాటి మీద నియంత్రణ మనకే వుండాలి, వుంది కూడా, వాటికి మన మీద కాదు. ఇది మనం క్షణం క్షణం ఋజువు చేద్దాం. సరే, ఇంక చెడ్డవాటి మాట చెప్పేదేముంది? వాటికసలు మన దగ్గర చోటే లేదు. అవునా?

ఏదో, ఇందాకటినుండి మీ అందరి దగ్గరా ఏవేవో కబుర్లు చెప్పేస్తున్నాను. అసలు మీ అందరితో ఇలా కబుర్లు చెప్పాలన్న ఆకర్షణ మరి నాక్కూడా వుంది కదా! సరే, ఒప్పుకున్నాను, కానీ దాన్ని అదుపులో వుంచుకున్నాను కాబట్టే నెలకొక్కసారే పలకరిస్తున్నాను. ఫరవాలేదు కదూ?

ఈ ఆకర్షణకి ఇంక ఇక్కడ ఆనకట్ట వేస్తూ ఇప్పటికి మీ అందరి దగ్గరా సెలవ తీసుకుంటాను. మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. అప్పటిదాకా ఈ ఆకర్షణకి ఆనకట్ట వేసేస్తూ, మరి అంతదాకా సెలవు.

********

Posted in April 2025, వ్యాసాలు

2 Comments

  1. డా. మూర్తి జొన్నలగెడ్డ

    రాధిక గారు,

    నమస్కారం. ఆకర్షణీయమైన అంశం. బాగా రాశారు.

    సినీ తారలు, సహోద్యోగులు మొదలగు వారు చాలా కాలం సామీప్యంలో గడపడం కేవలం శారీరక ఆకర్షణకే కాక, వారి ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి అర్థం చేసుకోవడం వల్ల అంతర్గత సౌందర్యాన్ని చూసి సంబంధం ఏర్పరచుకునే అవకాశం కూడా ఉందికదా!

    నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే, ఈ ఆకర్షణ ఇది అని ఒకే రకమైన కారణం చెప్పగలిగే అంత సులభమైనది కాదు, నిజ జీవితం అని. విశదీకరణ కోసం విడి విడిగా చెప్పవచ్చనుకోండి.

    మంచి, చెడు అన్నవి సాపేక్షంగానే ఉంటాయి కదా, అందు వల్ల, ఏ అలవాటైనా, మనం దానికి బానిస అవ్వనంత వరకు పరవాలేదు అని నా భావన. సూర్యుని వలన ఈ ప్రపంచం అంతా నడుస్తోంది కదా. అది మంచిది అనుకుందాం, అలాగని ఆ మంచి దగ్గరగా భూమి పయనిస్తే, మనందరం మాడి మసైపోతాంకదా! ఆకర్షణలు ఉండాలి, వాటినుంచి మనల్ని మనం నియంత్రించుకోుని నిరంతరం భూమి ఒక కక్ష్యలో తిరిగినట్లుగా ఆకర్షణలకు తగిన దూరం పాటిస్తూ, లబ్ధి పొందాలని నా భావన. పరిమితంగా తీసుకుంటే విషం ఔషధం అవుతుంది, పరిమితి మించితే ఔషధం విషం అవుతుంది. అందువల్ల నేనెప్పుడూ మంచి, చెడులను నిర్వచించి ప్రబోధించే బృహత్ ప్రయత్నం ఎపుడూ చేయలేదు.

  2. సీతామహాలక్ష్మి కాకాని

    నీ పాటలంత ఆకర్షణీయంగా ఉంది ఈ వ్యాసం. ఈ వ్యసనం (ఇలా మంచి మంచి వ్యాసాలు చదవడం) కూడా ఆరోగ్యకరమైనదే:)

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!