
అలవాటు
కొత్త సంవత్సరం మొదలైనప్పుడు మామూలుగా అందరూ తీసుకునే తీర్మానాల గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా! మరి ఆ తీర్మానాలను అమలులో పెట్టాలన్నా, ఆతర్వాత వాటిని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకున్నా ఏం చెయ్యాలో కూడా చర్చించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఒక్క తీర్మానాలు తీసుకోవటంతోనే సరిపోదు, వాటిని అమలులో పెట్టాలి కదా! అప్పుడే అవి అలవాట్లలాగా మారతాయి. అవునా? అసలు మనం అలవాటు అన్న పదాన్ని చాలాసార్లు వాడతాం. అయితే అసలు అలవాటంటే ఏమిటి? దేన్ని అలవాటు అని అంటారు?
ఒకే పనిని తరచుగా, పదేపదే చేస్తూ వుంటే అది మన బుర్రలో బాగా గాఢంగా నిలిచిపోయి, ఆతర్వాత మన ప్రమేయం ఏమీ లేకుండానే మన చేతిలో ఆ పని జరిగిపోతూ వుంటుంది. అంటే ఆ పని చేయటం మనకి ఒక అలవాటుగా మారిందన్నమాట. అందుకే అప్రయత్నంగా ఆ పనిని మనం చేసేస్తూ వుంటాం. దీన్నే అలవాటు అంటారు. అయితే ఈ అలవాట్లు కూడా అన్నీ ఒకేలాగా వుండవు. కొన్ని మన ప్రమేయం ఏమీ లేకుండానే అలవాట్లులాగా మారిపోతాయి. ఆ పని అసలు ఎప్పుడు ఒక అలవాటులాగా మారిపోయిందో కూడా మనకి తెలీదు. అంత నిశ్శబ్దంగా, యాంత్రికంగా అంతా జరిగిపోతుంది. రెండు, మూడు రోజులు ఒకే సమయానికి నిద్ర లేస్తే, నాలుగో రోజున అప్రయత్నంగానే అదే సమయానికి మెలకువ వచ్చేస్తుంది. దానికి మనం ఏమీ కష్టపడక్కరలేదు. కానీ ఇంకొన్ని అలవాట్లు వుంటాయి. మనం ఎంతో కష్టపడి, కావాలని పరిశ్రమ చేస్తే తప్ప అవి అలవాట్లలాగా మారవు. ప్రత్యేకించి ఆ అలవాట్లు చేసుకోవటం మనకి ఇష్టం లేనప్పుడు ఇంక ఆ కష్టం గురించి చెప్పనే అక్కరలేదు. ఉదాహరణకి, పొద్దున్నే నిద్ర లేవటం మనకి ఇష్టం లేదనుకోండి, ఇంక అప్పుడు దాన్ని బలవంతంగా అలవాటుగా మార్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా మనోబలం, క్రమశిక్షణ వుంటే తప్ప అలాంటి ఇష్టం లేని, కష్టమైన అలవాట్లు (ఇష్టం లేకపోతే మరి కష్టంగానే అనిపిస్తాయి కదా!) చేసుకోలేము.
అసలు ఆమాటకొస్తే ఏ అలవాటైనా, ఇష్టం వున్నదైనా, లేనిదైనా, ఏదైనా సరే, మొదట్లో చాలా కష్టంగానే వుంటుంది. ఆతర్వాత అతి సులభం అయిపోతుంది. అంతేకాదు, ఆ పనిలో మనకి ప్రతిభ కూడా వచ్చేస్తుంది. ఉదాహరణకి సంగీతాన్ని తీసుకోండి. సంగీతం నేర్చుకోవటం మొదలెట్టినపుడు అది కష్టంగా అనిపించవచ్చు. కానీ పాడగా, పాడగా, దానిలో మనకి ప్రతిభ చేకూరుతుంది. సులభంగా కూడా అనిపిస్తుంది. కంఠస్వరం ఆ దేవుడిచ్చేది. దాన్ని మనం మార్చుకోలేము. కానీ పాట అలా కాదు. అలవాటుగా సాధన చేయగా చేయగా బాగా పాడగలిగే ప్రతిభను పెంచుకోగలం మనం. అవునా? అంతేకాదు, అలవాటు ఇంకో అపురూపమైన వరాన్ని కూడా మనకి ఇస్తుంది. అదేమిటో చెప్తాను. పియానో, వయోలిన్, కీబోర్డు, హార్మోనియం, వీణ లాంటి ఎన్నో సంగీత వాయిద్యాలని చాలామంది సంగీతకారులు చూడకుండానే వాయించేస్తారు. దీనికి వారి సాధన చేసే అలవాటు, అది తెచ్చిపెట్టిన వారి ప్రతిభ, దానికోసం వారు చేసే పరిశ్రమ, ఇవన్నీ నిస్సందేహ కారణాలు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరెప్పుడైనా టైపు చేసే వాళ్ళని చూసారా? వాళ్ళు కూడా అంతే! చాలామంది కళ్ళతో చూడకుండానే అప్రయత్నంగా, చకచకా టైపు చేసేస్తూవుంటారు. వారి కళ్ళు టైపు చెయ్యాల్సిన subject matter వైపు వుంటాయి. వేళ్ళు మాత్రం చకచకా టైపు చేసేస్తూ వుంటాయి. దీనికి కూడా వారి అలవాటే కారణం. అంటే అలవాటు ఇలాంటి ప్రత్యేకమైన ప్రతిభలని కూడా ఇస్తుందన్నమాట. అన్నమాటేమిటి? ఉన్నమాటే!
ఏదైనా ఒక మంచి కారణం వుంటే అలవాట్లు తేలికగా ఏర్పడతాయని విలియం జేమ్స్ అనే ఒక అమెరికన్ తత్వవేత్త, అంటే, ఫిలాసఫర్ అన్నారు. ఉదాహరణకి వ్యాయామం చేయటం వలన ఆరోగ్యం మెరుగవుతుందని అంటే అప్పుడు బద్ధకాన్ని వదిలించుకుని వ్యాయామం చెయ్యాలని అనిపిస్తుంది. ఆతర్వాత అది ఒక అలవాటుగా మారిపోతుంది. స్కిన్నర్ అనే ఇంకో ఫిలాసఫర్ అలవాటుకి ఏదైనా బహుమతి తోడైతే అది ఎక్కువ కాలం నిలుస్తుందని అన్నారు. అంటే వ్యాయామం చేయటం వలన నిజంగానే ఆరోగ్యం బాగుపడిందనుకోండి. ఇంక అప్పుడు వ్యాయామం చేయటానికి వారి ఉత్సాహం ద్విగుణీకృతమవటానికి, నిజంగానే ఆ అలవాటు ముందుముందు శాశ్వతమవటానికి ఎక్కువ అవకాశం వుంది. అవునా?
అందుకే మనం వ్యాయామం, యోగ, శ్వాసకు సంబంధించిన అనేక ఎక్సరసైజులు, చివరికి సింపుల్ గా నడక అయినా సరే, ఇలాంటివి ఏవైనా క్రమం తప్పకుండా చేసే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటే మంచిది. అలాగే వున్న ఆదాయాన్ని మించకుండా ఖర్చు పెట్టడం, ఉన్నంతలో కొంత దాచడం, మన ఆదాయాన్ని నీతిగా ఎక్కువ చేసుకునే ప్రయాస చెయ్యటంలాంటి మంచి ఆర్ధిక అలవాట్లు, కష్టపడి, నిజాయితీగా, శ్రద్ధతో పనిచేయడం, ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను వృద్ధి చేసుకునే ప్రయత్నాలలాంటి వృత్తిపరమైన అలవాట్లు, ఎప్పుడూ సకారాత్మకమైన ఆలోచనలతో క్రమశిక్షణ, అనుశాసనాలతో, శ్రద్ధాభక్తితో మన మనసులను కల్మషరహితంగా వుంచుకుంటూ, పరోపకారం చేసే మానవతాపరమైన అలవాట్లు, శరీరాన్ని, మనసుని కూడా పాడుచేసే చెడు వ్యసనాలకు దూరంగా వుంటూ, ఇంట్లో కుటుంబాన్ని, బయట చుట్టూ వున్న సమాజాన్ని ప్రేమిస్తూ, నిజాయితీగా అతి సాధారణమైన జీవితం గడుపుతూవుండే సాధారణ పౌర అలవాట్లు, ఇవన్నీ మనందరికీ అవసరమే!
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఒక పని చేసే అలవాటు గాఢంగా గట్టిపడిన తర్వాత ఇంక ఆ పని ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో మనకి ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతుంది. రోజూ నిద్ర లేవగానే పళ్ళు తోముకోవటం మనం అప్రయత్నంగానే మొదలుపెడతాం. అలాగే అప్రయత్నంగానే ఆ పని ముగియగానే ఇంక ఆపేస్తాం. ఇది అలవాటు వలన జరిగేదే కానీ ప్రయత్నపూర్వకంగా, సమయం చూసుకుంటూ చేసేది కాదు. మన మెదడులో వుండే కొన్ని ప్రత్యేకమైన neurons మన అలవాట్లచే ప్రేరేపింపబడటం వలన ఇలా అవుతుంది.
ఇంకో విషయం ఏమిటంటే ఒకసారి ఒక అలవాటు స్థిరం అయిన తర్వాత సాధారణంగా అది ఎప్పుడూ ఒకే లాగా వుంటుంది. అంటే ఎవరైనా ఒకేలాగా నడుస్తారు, మాట్లాడతారు, రాస్తారు. అందుకే, సాధారణంగా అలవాట్లు అంత నిలకడగా నిలబడతాయి కాబట్టే, మీకు గుర్తుండేవుంటుంది, చేతివ్రాత నిపుణులు, ఎవరిదైనా సరే, వారి చేతివ్రాతని చూసి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలరు. అంటే, అలవాట్లు ఇంక మారవని నా ఉద్దేశం కాదు. కానీ దాన్ని మార్చుకోవటానికి చాలా ప్రయత్నం కావాలి. అందుకనే అలవాట్లు గట్టిపడుతున్నప్పుడే చాలా జాగ్రత్తగా స్వపరిశీలన చేసుకుంటూ వుండాలి. కొంచెం అటు ఇటు గా వున్నట్లు ఏమన్నా అనుమానమొస్తే ఏమాత్రం సందేహం లేకుండా, అప్పుడే, వెంటనే, వాటిని మార్చుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. మొక్కై వంగనిది మాను అయింతర్వాత వంగుతుందా అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదా!
అలవాటైన పనులు మనం త్వరగా ముగించగలం. తప్పులు లేకుండా చెయ్యగలం. కష్టపడకుండా, తేలికగా చెయ్యగలం. ఆలస్యం ఏది లేకుండా ఎవరైనా అడిగిన వెంటనే లేదా మనం అనుకున్న వెంటనే చెయ్యగలం. కాలాయాపన జరగదు. అలసట వుండదు. ఇతరుల సహాయం కానీ, మార్గదర్శకత్వం కానీ ఏదీ లేకుండానే మనంతట మనమే చెయ్యగలం. అంతేకాదు, బాగా అలవాటైన పని చెయ్యటానికి పెద్ద ఆలోచన, ప్రయత్నం, ఏదీ అక్కరలేదు. అంతా చకచకా జరిగిపోతుంది.
కానీ ఈ అలవాట్ల వలన కొన్ని చిక్కులు కూడా వున్నాయి. అలవాట్లు బాగా బలపడితే ఇంక వాటిలోంచి బయటపడటం చాలా కష్టం. ఒక్కొక్కసారి చెడు అలవాట్లని తెలిసినా కూడా వాటిని మార్చుకోవటం మనిషికి ఇష్టం వుండదు. అంతేకాదు, ఏదన్నా ఒక అలవాటు గాఢంగా బలపడితే ఇంక దాని చుట్టూ మన ఇతర పనులని అల్లుకుంటాం. మనం రోజు చూసే టివి కార్యక్రమం మిస్ కాకూడదని ఆ సమయాన్ని ఫ్రీ గా పెట్టుకోవటం కోసం మన మిగిలిన పనులన్నిటినీ ఆతర్వాతో, ముందో చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. అంటే ఆ అలవాటుకి మనం బానిసలయ్యామన్నమాట. వాటిల్ని వదులుకోవడానికి, కనీసం మార్చుకోవటానికైనా సరే, మనం సిద్ధంగా లేవన్నమాట. అంతేకదూ! ఇక్కడ ఇంకో చిక్కు కూడా వుంది. ఒక్కొక్కసారి అలవాటైన పనులు చెయ్యకపోతే దాని వలన వేరే తలనొప్పిలు మొదలవుతాయి. అలవాటైన వేళకి తినకపోతే ఆకలి చచ్చిపోయి కొంతమంది మళ్ళీ తర్వాత తినలేరు. అలాగే అలవాటైన వేళకి నిద్ర పోలేకపోతే ఇంక మళ్ళీ నిద్రపట్టక బాధపడతారు కొందరు. అలాగే అలవాటైన పని ఆ వేళకి చెయ్యకపోతే ఇంక వేరే ఏ పనీ చెయ్యటానికి మనస్కరించదు మరి కొంతమందికి. ఇదంతా అలవాటుకి వున్న బలం. ఈ అలవాట్లను మనం అదుపులో వుంచకపోతే అవి మనల్ని వాటి గుప్పెటలో నొక్కి ఇంక మనల్ని బయటపడనీయవు. కొత్త ఆలోచనలని, కొత్త అలవాట్లని మన దగ్గరకు రానీయవు. మన అభివృద్ధికి ఆటంకాలని సృష్టిస్తాయి. అందుకే ఈ అలవాట్లు రెండు వైపులా పదును వున్న కత్తిలాంటివి.
అందుకే ఆ అలవాట్లకు వున్న బలాన్ని మనం మన మంచికి వాడుకోవాలి. అంటే అసలు అలవాట్లు చేసుకునేటప్పుడే మంచివాటిని ఎంచుకుంటే అప్పుడు ఇంక ఏ చింతా వుండదు. ఒక గట్టి తీర్మానంతో ఒక అలవాటుకి బీజం వేస్తె అది ఒక పెద్ద మొక్కలాగా మారటానికి చాలా అవకాశం వుంది. అంతేకాదు, ఆ మొక్క చక్కగా పుష్పించి, ఫలించటానికి కూడా చాలా సంబంధం వుంది. ఒక అలవాటు మొదలుపెట్టిన తర్వాత ఇంక ఎలాంటి అవరోధాలు రానివ్వకూడదు. ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది మానేయాలి అన్న కోరికతో ఏవో కుంటిసాకులు వెతికే ప్రయత్నాలు మానాలి. ఎందుకంటే ఆ సాకులు అక్కడితో ఆగవు. ఇవాళ ఒకటైతే రేపు ఇంకోటి. అలా ప్రతిరోజూ ఏదో ఒక సాకు దొరుకుతూనే వుంటుంది. అలాగే మన మంచి తీర్మానాలని అమలుపరిచే అలవాట్లకు భంగం కలిగించే పరిస్థితులను కల్పించుకోకూడదు. మితంగా భుజించి, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు చేతికి అందేలాగా పది తినుబండారాలను పెట్టుకుంటే ఏం లాభం? మరి మనిషన్నవాడికి కొంచెమైనా చిత్తచాపల్యం సహజం కదా! అందుకని మంచి అలవాట్లని కొనసాగించే మన ప్రయత్నాలకి మనమే చేజేతులా ఎటువంటి ఆటంకాలని కలిగించుకోకూడదు.
అలాగే ఏదన్నా చెడు అలవాటుని వదిలించుకోవాలి అనుకున్నప్పుడు, ఆలస్యం అమృతం విషం అన్నారు, వెంటనే ఆ సన్నాహాలు మొదలెట్టేయాలి. ఏమో, ఏ నిముషంలో మనసు ఏ తీరున మారుతుందో, ఎవరికి తెలుసు? అవునా? అసలే అనేక బలహీనతలు అతి సులభంగా చుట్టుముట్టే సమాజంలో బతుకుతున్నాం మనం. అలాగే ఆ చెడు అలవాటుని సమర్ధించేవారి సాంగత్యంలో వుంటే ఇంక ఆ అలవాటు ఎలా వదులుతుంది? సిగరెట్లు మానేయాలి అనుకున్నప్పుడు అస్తమాను పొగ తాగేవారి స్నేహంలో వుంటే ఇంక ఆ అలవాటును మనం ఎలా మానగలం? ఇంకో విషయం ఏమిటంటే ఏదన్నా చెడు అలవాటుని మానేయాలంటే దాన్ని ఒకేసారి హఠాత్తుగా మానేయటం కంటే దాని బదులు ఏదన్నా ఇంకో మంచి అలవాటుని ప్రారంభించి, ఆతర్వాత ఆ చెడు అలవాటుని మానేయటం మంచిది. అస్తమాను టివి చూడటం మంచిది కాదు, మెల్లిగా ఆ అలవాటుని మానుకోవాలి అనుకున్నప్పుడు, టివి కట్టేసి వుత్తగా కూర్చుంటే కాస్సేపటికి విసుగ్గా అనిపించి, మనసు చలించి మళ్ళీ టివి చూడాలి అనిపిస్తుంది. దాని బదులు టివి కట్టేయగానే కాస్సేపు నడిచిరావటానికి బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ టివి కోరిక ఇంక మనల్ని బాధించదు. అందుకే ఒక చెడు అలవాటు స్థానంలో ఇంకొక మంచి అలవాటుని వుంచితే అప్పుడు ఆ చెడు అలవాటుని వదిలించుకోవటం తేలిక అవుతుంది అని నాకనిపిస్తోంది. అవునా?
ఇప్పుడు మనందరికీ తెలిసిపోయింది, ఏదన్నా ఒక పనిని పదేపదే చేస్తే అది అలవాటుగా మారుతుంది అని. అలాంటి అలవాట్లలోంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వ్యక్తిత్వం విధివిధానాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మంచి అలవాట్లు వుండటం చాలా ముఖ్యం. మనం మొదటినుండి మంచి అలవాట్లను చేసుకుంటే ఇంక తర్వాత వాటిని మార్చుకోవటం, లేదా మానుకోవటం, మళ్ళీ కొత్తగా మంచి అలవాట్లని ఏర్పరుచుకోవటానికి తిప్పలు పడటం లాంటి సమస్యలేవీ వుండవు. ఎందుకంటే మంచివైనా, చెడు అయినా అలవాట్లని మార్చుకోవటం, వదిలించుకోవటం చాలా కష్టం. అందులోను చెడుకి శక్తి,, ఆకర్షణ చాలా ఎక్కువ కూడాను. చెడు అలవాట్లు పట్టుకుంటే ఒక పట్టాన మనిషిని వదలవు. అందుకే మన పెద్దవాళ్ళు చెడు అలవాట్ల జోలికే అసలు వెళ్ళద్దు అని అన్నారు. దురదృష్టం ఏమిటంటే చెడు అలవాట్లు చేసుకోవటం చాలా తేలిక, కొండ మీద నుండి కిందకి దొర్లటం ఎంత తేలిక? కానీ మళ్ళీ కొండ ఎక్కాలంటే మాత్రం ఎంతో కష్టపడాలి. అవునా? అలాగే చెడు అలవాట్లని వదిలించుకోవటం చాలా కష్టం. ఇంక మంచి అలవాట్లకోస్తే దీనికి పూర్తిగా విరుద్ధం. మంచి అలవాట్లు చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే మంచికి దారి ఎప్పుడూ కఠినంగా వుంటుంది కదా! కానీ వాటిని వదిలేయటం మాత్రం చాలా తేలిక. అయినా మనిషి తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు కాబట్టి ఈ విషయంలో కూడా మనిషే గెలుపు సాధిస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పని కష్టమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. అవునా? అయినా అసలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. అందుకే అసలు చెడు అలవాట్ల జోలికే వెళ్ళకపోతే సరి, ఇంక ఎటువంటి సమస్యా వుండదు కదా!
ఇక్కడ ఒక్కవిషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మనం మంచి అలవాట్లు చేసుకోవటం కేవలం మనం సత్ప్రవర్తనతో మంచిగా వుండటానికి, అంతేకానీ ఏ దోషము లేకుండా, అంటే perfect గా వుండటానికి కాదు. John Stainbeck అనే ఒక అమెరికన్ రచయిత ‘Now that you don’t have to be perfect, you can be good’ అన్నాడు. ఆలోచిస్తే ఎంత చక్కగా ఒక నిజాన్ని పలికాడు అనిపిస్తోంది కదూ? Perfect గా వుండాలి అన్న తాపత్రయాన్ని వదిలేసుకుంటే మనమందరం ఎటువంటి మానసిక ఒత్తిడి అనుభవించకుండా, కనీసం కొంచెంగా అన్నా మంచిగా వుండగలమేమో! అవునా?
సరే, ఇందాకటి నుండి ఏదో ఆ అలవాటు, ఈ అలవాటు అంటూ మీతో ఏదేదో చెప్తూనే వున్నాను. అసలు కొత్త నెల మొదలయిందంటే మీతో ఇలా కబుర్లు చెప్పటం నాకు బాగా అలవాటయిపోయింది. మరి ఇది మంచి అలవాటో, చెడు అలవాటో మీరే చెప్పాలి. ఈలోపల నేను మాత్రం ఇంక ఇప్పటికి ఇంతటితో ఆపి, వచ్చే నెలదాకా మీదగ్గర సెలవు తీసుకుంటాను. సరేనా?
తెలిసినట్లే అనిపించినా, ఇంకా తెలుసుకువాలనిపించేలా అలవాటు చేసుకోవడం, గిరవాటు వేసుకోవడం గురించి అలవోకగా చెప్పేసారు రాధికా నోరి.
నేను ముందు రోజూ ఏదో ఒకటి (మంచివే సుమా) చదవడం అలవాటు చేసుకోవాలి:)
చాలా చక్కటి వ్యాసం
చాలా విశదంగా… తెలిసినట్టే అనిపించినా మళ్ళీ తెలుసుకోవాలనుకునేలాగా అలవాటు అలవాటు చేసుకోవడం, గిరవాటు వేసుకోవడం గురించి అలవోకగా చెప్పేసారు రాధిక నోరి.
ముందు నేను రోజూ ఏదో ఒకటి (అంటే…మంచివే సుమా! )చదవడం అలవాటు చేసుకోవాలి.:)
మంచి “రాయిపై”
చాలా చాలా బాగా చెప్పావు/రాసావు అక్కా.


చాలా బాగా చెప్పారు రాధికా గారు. నిజానికి నేను కూడా ఎన్నో అనుకుంటాను కానీ కార్యాచారణ శూన్యం.
మీ వ్యాసం నన్ను మారుస్తుందని ఆశ పడుతున్నాను. Thank you