Menu Close
Radhika-Nori
రాధికారుచిరం
రాధిక నోరి

చిరునవ్వు

పెద్ద వంక వున్నా కూడా అందరికీ అత్యంత మనోహరంగా కనిపించేది ఆ నెలవంక. అలాగే తిన్నగా వున్న పెదవులను వంకర తిరిగేలా చేసి, అంతటితో ఆగక వాటిని విచ్చుకునేలా కూడా చేసి, అందరి మనసులలో వున్న వంకరలు పోగొట్టేదే చిరునవ్వు. అది సంతోషాన్ని ప్రకటించుకునే ఒక సార్వత్రిక భాష, జీవసంబంధమైన ఒక యూనిఫారం. అందుకే చిరునవ్వుకు వారు, వీరు అన్న తేడాలు లేవు. అది అందరినీ ఒకేలాగా ఆనందంలో ముంచెత్తుతుంది. ఒకేలాంటి అందం అందరి ముఖాలకు పులుముతుంది. ఒకేలాంటి హాయిలో అందరినీ ఓలలాడిస్తుంది. ఒకేలాంటి సామరస్యం అందరిలోనూ వ్యాపింపచేస్తుంది. అందుకే ఎవరికైనా సరే, చిరునవ్వు చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది.

మనతో పరిచయమైన తర్వాత కానీ ఎదుటివారికి మన గురించి తెలియటం, వారికి మనం నచ్చటం జరగదు. కానీ ఏమి పరిచయం లేకుండానే ఎదుటివారిని యిట్టే బుట్టలో వేయగల శక్తి ఈ చిరునవ్వుకు వుంది. ఎందుకంటే చిరునవ్వుతో వున్న ఎవరి ముఖాన్ని చూసినా మనం మన మనసులో వున్న నకారాత్మక భావాలను మర్చిపోతాం. వారి చిరునవ్వుతో మనం కూడా చేతులు కలిపేస్తాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మా లాను సర్వీసు చేసే అబ్బాయి ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా ఇదుగో, అదుగో అంటాడే కానీ సమయానికి రావటం మాత్రం ఎప్పుడూ జరగదు. ఫోన్లు చేసినా జవాబు వుండదు. ఇరుగు పొరుగువారు మా లాను గురించి ఆక్షేపణ చేస్తారేమో అని నాకు భయంగా వుంటుంది. అందుకని ఎప్పటికప్పుడే నాకు అతని మీద మాత్రం గొంతుదాకా కోపం వచ్చేస్తూ వుంటుంది. కానీ అతని చిరునవ్వుతో కూడిన ముఖం చూస్తే మాత్రం నా కోపాన్ని నేను వెంటనే మర్చిపోతాను. చాలా ఘాటుగా చివాట్లు వేయాలని వేసుకున్న ప్లానులన్ని అతని నవ్వు ముఖం చూడగానే మాత్రం హుష్ కాకి అయిపోతాయి. వెంటనే ఇంత ఆలస్యం చేస్తే ఎలా అంటూ ఏదో మెల్లిగా గొణుక్కుంటాను కానీ కఠినంగా అతన్ని ఏమీ అనలేను. అతని నవ్వు ముఖమే దానికి కారణం. చిరునవ్వులో ఆ మహిమ వుంది. మన మనసులో వున్న నకారాత్మక భావాలను చెరిపేసి మనల్ని కూడా ఏవో ఆనంద లోకాల్లోకి తీసుకుపోతుంది.

అంతేకాదు, చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది. ఒకరిదగ్గర నుండి వేరొకరికి చప్పున వ్యాపిస్తుంది. అయితే అంటువ్యాధులు మనుషులను చంపేస్తే ఈ అంటువ్యాధి మాత్రం వారిని బతికిస్తుంది. ఎవరి చిరునవ్వును చూసినా కారణం తెలీకపోయినా సరే, అప్రయత్నంగా మన పెదవుల మీద కూడా వెంటనే చిరునవ్వు పాకుతుంది. కారణం చెప్పకుండా ఏమిటా పిచ్చి నవ్వు అని మనం అంటూనే వుంటాము కానీ నవ్వటం మాత్రం ఆపము. నవ్వుకు అంత చకచకా వ్యాపించే లక్షణం వుందన్నమాట.

అసలు నవ్వటమన్నది మనం ఎక్కడా నేర్చుకోనక్కరలేదు. మనం అమ్మ పొట్టలో వున్నప్పుడే నవ్వటం మొదలుపెట్టేస్తామట. గర్భవతుల మీద ultrasounds చేసినపుడు గర్భంలో వున్న బిడ్డ పెదవుల మీద నవ్వు మొలవటాన్ని డాక్టర్లు ఎప్పుడో గమనించారు. అందుకనే బిడ్డలు పుట్టిన వెంటనే ఏడ్చినా, ఆతర్వాత చక్కగా నవ్వుతారు. సాక్షాత్తు ఆ భగవంతుని రూపాలైన పసిపిల్లల బోసినవ్వుల్లో మనకు నిజంగా ఆ దేవుడే కనిపిస్తాడు. అవునా? మనం కూడా ప్రతిరోజూ, ప్రతిసారి అనుకోకుండానే ఆనందపడిపోతూ వుంటాము. ఏమీ కారణం లేకుండానే, అప్రయత్నంగానే, చిన్న చిన్న విషయాలకే నవ్వేస్తూ వుంటాము.

నవ్వు ఎంతో హాయిని కలిగిస్తుంది. మనసంతా తేలిక చేస్తుంది. మన మనసులో దాగిన భయాందోళనలని మాయం చేస్తుంది. మనసుని, మెదడుని కూడా తేలికచేసి బిపి, గుండెజబ్బుల లాంటి వాటిని తగ్గిస్తుంది. మన mood ని సరిచేసే హార్మోనులను శరీరంలో ఎక్కువ అయ్యేట్లు చేస్తుంది. అలాగే భయాందోళనలను తగ్గించే హార్మోనులను కూడా శరీరంలో ఎక్కువ అయ్యేట్లు చేస్తుంది. శరీరంలో వున్న కండరాలు అన్నీ relax  అయ్యి మెదడులోంచి బాధ, ఆందోళనలాంటి భావాలన్నీ మటుమాయం అయ్యేలాగా చేస్తుంది. అందుకే నవ్వు ఎప్పుడూ ఆనందంగా వుండేవారి ఆయువుని పెంచుతుంది. నవ్వుతుంటే అసలు మనకే బాగుంటుంది. చూసేవారికి ఇంకా బాగుంటుంది. ఆమధ్య నేను ఒక పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాటతో పాటు ఆమె నవ్వు ముఖం చూసి నేను ముగ్ధురాలనైపోయాను. ఆ నవ్వు వలన ఆమె ముఖానికి, ఆ పాటకి కూడా ఎంతో అందం వచ్చింది అనిపించింది. ఆ పాట కూడా అలాంటిదే! చాలా ఆనందంగా సాగిపోయే పాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే నవ్వుతున్నవారితో పాటు ఆ నవ్వును చూస్తున్న వారు కూడా ఆ నవ్వును పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇది నవ్వులో వున్న మహిమ.

పశ్చిమ దేశాల్లో అపరిచితులను కూడా చిన్న చిరునవ్వుతో పలకరించడం ఒక సంప్రదాయం. నేను అమెరికా వచ్చిన కొత్తల్లో దీన్ని చూసి చాలా ముచ్చటపడేదాన్ని. తెలిసినవారు, తెలియనివారు అన్న తేడా లేకుండా అందరిపట్లా స్నేహ భావం, ఎంత మంచి సంప్రదాయం అనుకునేదాన్ని. ఇండియాలో వున్నప్పుడు దీనికి వ్యతిరేకంగా వుండేది అక్కడి పధ్ధతి. ఇప్పుడేమన్నా మారిందేమో కానీ, ఆరోజుల్లో మాత్రం తెలియనివారిని చూసి నవ్వటం అమర్యాదగా, వెకిలితనంగా పరిగణించేవారు. అందులోనూ ఎవరైనా ఆడపిల్ల అలా చేసిందంటే ఇంక చెప్పనే అక్కరలేదు. ఆ అమ్మాయిని నానా మాటలు అనేవారు. కానీ అపరిచితులతో స్నేహానికి చిరునవ్వు ఒక చక్కటి ఆహ్వానం. మాటల అవసరం లేకుండానే పలకరింపులని చిలకరించే చక్కటి, తియ్యటి ఆయుధం మనసులోంచి వచ్చిన చిన్న చిరునవ్వు. కొత్తవాళ్ళతో స్నేహాన్ని కలుపుతుంది. పాత స్నేహాన్ని మరింతగా పెంచి, పరస్పర బంధాలను మరింత గట్టి పరుస్తుంది. అసలు ఎవరైనా మనకు దగ్గరవాలంటే చిరునవ్వు అన్నది ఒక pre-requisite కాబోలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడూ చిరునవ్వుతో వుండేవారిని అందరూ ఇష్టపడతారు కానీ చికాకుగా విసుక్కుంటూనో, కోపంగా కసురుకుంటూనో వుండేవారికి దగ్గరవ్వాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? అసలు చిరునవ్వు లేని ముఖం స్నేహరహితంగా, వికర్షణగా వుంటుంది కదూ! ఇంక ఎవరైనా దగ్గరయ్యే అవకాశమే లేదు. అవునా? మీరే చెప్పండి, నవ్వుతూ, అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవారితో స్నేహం చెయ్యాలని ఎవరికుండదు? మనకు తెలీకుండానే మన చిరునవ్వు అందరికి ఒక నిశ్శబ్ద ఆహ్వానాన్ని పంచుతుంది కదూ!

ప్రఖ్యాత హిందీ సినిమా నటుడు శ్రీ అనుపమ్ ఖేర్ కాశ్మీరులో ఒక బ్రాహ్మణ  కుటుంబానికి చెందినవాడు. వారిది పెద్ద కుటుంబం. కానీ అప్పట్లో అంత వున్న కుటుంబం కాదు. అయినా ఇంట్లో అందరూ ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా వుండాలని వారి తండ్రిగారు చెప్తూ వుండేవారట. ఎందుకంటే డబ్బు ఏమీ ఖర్చు కాకుండా చవకగా దొరికేది ఒక్క నవ్వే అని వారందరూ నమ్మేవారట. సంపద లేకపోయినా సంతోషానికి కొరత వుండకూడదు అని వారి అభిప్రాయం. అది నిజమే అనిపిస్తుంది నాకు. హాయిగా నవ్వుకోవడానికి కానీ ఖర్చు వుండదు కదా! అలాగే ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా అత్యంత అందంగా కన్పించటానికి కూడా అతి సులభమైన మార్గం చిరునవ్వే!. కల్లాకపటం ఎరుగని స్వచ్ఛమైన చిరునవ్వు ఎవరి ముఖాన్నైనా సరే, చాలా ఆకర్షణీయకంగా చేస్తుంది. కేవలం ఆకర్షణీయంగానే కాదు, వాళ్ళ వయసును కూడా తక్కువ చేసి చూపిస్తుంది. ఎందుకంటే అలసటని, ఆందోళనని మర్చిపోయి, మనసు తేలిక కాగా మనసారా హాయిగా నవ్వగలిగినప్పుడు ఆ హాయి అంతా ముఖంలో ప్రతిఫలిస్తుంది. అందుకే అంత అందం, ఆకర్షణ వస్తాయి ముఖంలోకి. మరి వయసు తక్కువ అయినట్లు కాక ఇంకెలా కనిపిస్తారు? అందుకే అందంగా కనిపించటానికి కష్టపడి, ధనం వెచ్చించి, రకరకాల దుస్తులు ధరించి, మేకప్పులు చేసుకుని అనేక తంటాలు పడే బదులు ఒక చిన్న చిరునవ్వుని ప్రదర్శిస్తే అది తెచ్చే అదనపు అందం, ఆకర్షణ, వెదజల్లే వెలుగులు, విరజిల్లే స్నేహ సుగంధాల గురించి ఇంక చెప్పనే అక్కరలేదు. ఆ వెలుగుల జిలుగులు చుట్టుపక్కలనంతటినీ కళ్ళు మిరుమిట్లుమనేట్లు చేస్తాయనటంలోనూ, ఆ సుగంధాల సౌరభాలు పరిసరాలన్నిటిని ఘుమఘుమ లాడిస్తాయనటంలోనూ ఏమాత్రం అతిశయోక్తి లేదు సుమా!

చిరునవ్వు కేవలం స్నేహానికి ఆహ్వానమే కాదు, ఇంకా చాలా భావాలను చెప్పకనే చెపుతుంది. ఎదుటివారి అభిప్రాయానికి మన సమ్మతి, సద్భావన ఒక చిన్న చిరునవ్వు ద్వారా అతి తేలికగా, మౌనంగా ప్రకటించవచ్చు. ఎదుటివారు బాధలో వుంటే మన సానుభూతిని, సపోర్టుని, ఓదార్పుని ఒక చల్లని, చిన్న చిరునవ్వు  ప్రకటించినంతగా వేయి మాటలు కూడా చెప్పలేవు. అంటే అది ఒక free therapy లాంటిదన్నమాట. అలాగే ప్రేమ కూడా.  మన మనసు లోయలలోని ప్రేమను బయటకు వెల్లడి చెయ్యటానికి వెయ్యి మాటలు అక్కరలేదు. ఒక్క చిన్న చిరునవ్వు చాలు. మనం సినిమాలలో చూస్తూ వుంటాము. తన ప్రియుడు ప్రేమ ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రేయసి పది మాటలు మాట్లాడదు. మౌనంగా చూస్తూ, సిగ్గుపడుతూ చిన్నగా ఒక చిరునవ్వుని ప్రదర్శిస్తుంది. అంతే! మనకు అర్థం అయిపోతుంది ఆమె సమాధానం ఏమిటో. అలాగే కొంచెం ప్రతికూల భావాలను కూడా చిరునవ్వు ద్వారా ప్రకటించవచ్చు. తిరస్కారం, విసుగు, ఇబ్బంది, చికాకు, ఇలాంటి వ్యతిరేక భావాలను కూడా చిరునవ్వు చక్కగా, సున్నితంగా ప్రకటించగలదు.

ఒక చక్కటి చిరునవ్వుకు వెల కట్టలేము, అయినా దానికి ఏమీ వెల చెల్లించనవసరం లేదు. అది ఫ్రీగా మనకు లభిస్తుంది. అయినా అందరికీ  కొల్లలు పంచుతుంది. దాన్ని ఇచ్చినవారికి ఏమీ కొరత కలగకుండా దాన్ని పొందినవారిని భాగ్యవంతులను చేస్తుంది. చిరునవ్వులు అందుకొని భాగ్యవంతులు కాలేకపోయినవారిని, చిరునవ్వులు అందించి పేద అయినవారిని ఎక్కడా మనం చూడము.

చిరునవ్వు, ప్రేమింపబడటం పరస్పరాధారాలు. అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందింస్తూ వుండేవారిని ప్రేమించలేనివారు ఎవ్వరు వుండరు అనటంలో అతిశయోక్తి లేదు. అలాగే ఎదుటివారి అభిమానం, ప్రేమని పొందటానికి చిరునవ్వు మంచి రహదారి అనటంలో కూడా ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే స్నేహంతో పాటు ప్రేమకి. సమ్మతికి, సంతోషానికి, ఆత్మబలానికి, అంగీకారానికి, ఆహ్వానానికి, సంతృప్తికి, సకారాత్మతకి, కృతజ్ఞతలకి కూడా చిరునవ్వు ఒక చిహ్నం. అందుకే చిరునవ్వు పరిచితులు, అపరిచితులు, ముఖపరిచితులు, మిత్రులు, శత్రువులు, అందరితోనూ సమానంగా పంచుకోవచ్చును.

మన చిరునవ్వు వలన ఎదుటివారికి ఎంత లాభమో మనకు కూడా అంతే లాభం. అందంగా, ఆకర్షణీయంగా, స్నేహశీలురుగా కనిపించటంతోపాటు మన మనసులోని అనేక రకాల ఒత్తిడులు తగ్గి, సకారాత్మకత పెరిగి మన ఆరోగ్యం కూడా  మెరుగవుతుంది. చిరునవ్వు శారీరక అందంతోపాటు మనిషి వ్యక్తిత్వంలోని దృక్పధాన్ని కూడా మెత్తబడేలాచేసి, విస్తారమయ్యేలాగా చేస్తుంది. మన మనసులోని నిస్సారతని, కోపాన్ని, నకారాత్మకతని, నిరాశ, నిస్పృహలని తగ్గించి, ప్రేమని, క్షమని, సహనాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.

అపరిచితులకు మన చిరునవ్వు స్నేహానికి ఆహ్వానాన్ని అందిస్తుంది. మనతో సంభాషణలో పాలు పంచుకుంటున్నవారికి మన శ్రద్ధని, ధ్యాసని, అంటే attention ని తెలియచేస్తుంది. బాధలలో నలుగుతున్నవారికి మన ఓదార్పుని అందిస్తుంది.  కోపంలో రగులుతున్నవారిని శాంతింపచేస్తుంది. సంఘర్షణలలో నలుగుతున్నవారి ఆత్మతాపాన్ని తగ్గిస్తుంది. ఏకాంతంలో మనలో మనమే చిరునవ్వులు చిందిస్తుంటే అది మన ఆత్మసంతృప్తిని సూచిస్తుంది. జీవితం పట్ల మనకున్న విశ్వాసాన్ని, సకారాత్మకతని ఇంకోసారి నిరూపిస్తుంది.

నేను ముందే చెప్పినట్లు ఒక చిరునవ్వు ఎంత విలువైనదంటే దానికి వెల కట్టలేము, కట్టగలిగినా దాన్ని చెల్లించలేము, దోచుకోలేము, అరువు తీసుకోలేము, దాచిపెట్టలేము, దాన్ని విరివిగా వెదజల్లటమే మనం చేయాల్సిన పని. ఎందుకంటే చిరునవ్వు మన మనసులని కలిపి, మన ఆత్మలని పెనవేసి, మనందరి మధ్యా  గాఢమైన తియ్యటి బంధాలను అల్లే ఒక సుకుమారమైన దారం. దారం సుతారమైనా, ఒకసారి ముడి వేసిందంటే బంధం గాఢంగా పెనవేసుకుని అతి దట్టంగా అల్లుకుంటుందనటంలో  ఏమాత్రం అనుమానం లేదు.

కోపాన్ని ప్రదర్శించటానికి ముఖంలోని చాలా కండరాలు కదలాలి, కానీ చిరునవ్వుకు కాదు. రండి, మనందరం ఇప్పటినుండి ఎప్పుడూ నవ్వుతూనే  వుందామని నిర్ణయించుకుందాము. కలతలు, కష్టాలు లేని మానజీవితమే లేదు. అలాగే మనందరి దైనందిక జీవనంలో కూడా ఎన్నో సంఘర్షణలు. కానీ వాటన్నిటినీ మన తియ్యటి చిరునవ్వు ఆయుధంతో మనం ఓడించేద్దాం. సరేనా? ఎందుకంటే చిరునవ్వంటే కష్టాలకి చాలా భయం. దానికి కారణం ఏమిటంటే చిరునవ్వు బలం ముందు తాము ఓడిపోతామని వాటికి బాగా తెలుసు. అలాగే చిరునవ్వు కూడా మనిషికి ధైర్యాన్ని నేర్పి బలవంతులుగా చేస్తుంది.

సరే, మీరందరూ ఈ విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ మంచి, తియ్యటి చిరునవ్వులు ఒలకపోస్తూ వుండండి. ఈ లోపల నేను మీదగ్గర నుండి సెలవు తీసుకుని మళ్ళీ వచ్చే నెల వేరే కబుర్లతో మీ అందరి ముందుకి వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in February 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!