
కొత్త సంవత్సర తీర్మానం
ప్రియమైన పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మతాల్ని బట్టి పండగలు మారుతూ వుంటాయి. ప్రాంతాల్ని, దేశాల్ని బట్టి కూడా పండగలు మారుతూ వుంటాయి. కానీ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా కూడా సరే, ప్రపంచంలోని మనుషులందరూ తప్పకుండా పెద్ద ఎత్తున జరుపుకునే పండగ మాత్రం ఒకే ఒకటి. అదే ప్రతి సంవత్సరం వచ్చే జనవరి ఒకటి, నూతన సంవత్సరం. మనం ఇంగ్లీషులో చెప్పుకునే New Year. మరి కొత్త సంవత్సరం అనగానే అన్నీ కొత్త కొత్తవి మన దగ్గర చేరతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు. ఈ నిర్ణయాలనే మనం కొత్త సంవత్సర తీర్మానాలు, అంటే New Year resolutions అని అంటాము. మనకి తెలీకుండానే 2024 ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మనం గమనించేలోపే 2025 వచ్చేసింది. దానితోపాటు కొత్త సంవత్సరపు తీర్మానాలు తీసుకునే సమయం కూడా వచ్చేసింది.
అయితే ఈ కొత్త సంవత్సర తీర్మానాలు అవసరమా? వీటి వలన ఏమన్నా లాభం వుంటుందా? ఈ తీర్మానాలు అందరూ చేస్తారా? అలా ప్రశ్నించుకుంటూవుంటే ఆ సమాధానాలన్నీ వెదికే ముందు నాకేమనిపిస్తోందంటే అసలు కొత్త సంవత్సరం అనగానే అందరికీ మొట్టమొదటగా గుర్తొచ్చేవి ఈ తీర్మానాలే! ప్రతివాళ్ళూ ఈ తీర్మానాల గురించే మాట్లాడుకుంటూ వుంటారు. ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏదో ఒక విషయం గురించి తీర్మానాలు తీసుకోవటం ఒక సంప్రదాయం లాగా అయిపోయింది. ఎవరైనా ఎప్పుడైనా ఏ నిర్ణయము తీసుకోకపోతే వారేదో సంప్రదాయాన్ని పాటించకుండా మన పురాతనమైన పద్ధతులని భంగపరచినట్లు పరిగణించటం పరిపాటి అయిపోయింది.
ఈ తీర్మానాలు ఏవన్నా కావచ్చు. దేన్ని గురించన్నా కావచ్చు. సాధారణంగా అందరిలోనూ చాలా జనాదరణ పొందినది బరువు తగ్గటం. వ్యాయామం చేయటం.. ఇంక పొగ తాగటం, మద్యపానం లాంటి దురలవాట్లని వదిలించుకోవటం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం, వంట బాగా చెయ్యటం నేర్చుకోవటం, వాలంటరీ పని చెయ్యటం, ఇలాంటివాటిల్లో ఏదన్నా కావచ్చు. విద్యార్థులైతే మంచి మార్కులు తెచ్చుకోవటం, ఫలానా చదువులో లేక కాలేజ్ లో అడ్మిషను తెచ్చుకోగలగటం లాంటివి వుంటాయి.
వాటిల్లో ఏవైనా సరే, లేక వేరే ఇంకేవైనా కూడా సరే, కొత్త సంవత్సరంనాడు తీసుకునే నిర్ణయాలు మన పాతలోని లోపాల్ని సవరించి మన కొత్తని మెరుగుపరుస్తాయని. దానికి తగిన గమ్యాలని మనకి నిర్ధారిస్తాయని మన ఆశ. మనల్ని మనం ఒక better version గా మార్చుకునే అవకాశం అన్నమాట. మన జీవితంలో ఏ భాగంలో లోపాలున్నాయో, ఆ భాగాన్ని సవరించుకుని, బాగుపరుచుకోవాలనుకోవటంలో ఏమీ తప్పు లేదు. దానికి ఈ కొత్త సంవత్సరపు తీర్మానాలు బాగా పనికొస్తాయి. మనకోసం కొత్త గమ్యాలను సిద్ధం చేస్తాయి. మరి ఆ గమ్యాలని చేరుకునేందుకు ఏం చెయ్యాలో మనమే నిర్ణయించుకోవాలి. మన గమ్యం మనకి చేరుతుందా లేదా అన్నది మన ప్రయత్నాలపై ఆధారపడివుంటుంది. కొంతమంది గమ్యాలని అందుకోలేకపోయినా కూడా అంతగా పట్టించుకోరు. కానీ అలాంటివారికంటే కొత్త సంవత్సరపు తీర్మానాలని నిలబెట్టుకున్నవారు చాలా ఆనందంగా వున్నారని రీసెర్చి ఋజువుచేస్తోంది.
మరి అలా మనకు మనమే చేసుకున్న ఆ వాగ్దానాలని నిలబెట్టుకోవాలంటే, ఆ ఆనందాన్ని మనం పొందాలంటే మన తీర్మానాల విషయంలో కొంత జాగ్రత్త కూడా ముందు మనం తీసుకోవాలేమో అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే, నేను కొన్ని వుదాహరణలు చెప్తాను వినండి. మన తీర్మానాలలో ముందు స్పష్టత వుండాలి. ఉదాహరణకి కొత్త సంవత్సరం తీర్మానం అనగానే సాధారణంగా మనం అందరం వెంటనే వినే విషయం శరీర బరువు గురించి. లావు తగ్గి, శరీరం సన్నబడాలని, ప్రతివాళ్ళూ కోరుకుంటారు. కానీ నేను బరువు తగ్గాలి అని తీర్మానించుకోవటం కంటే ఒక ఆరు నెలల్లో లేదా ఒక ఏడాదిలో నేను పది కిలోలు లేదా ఇరవై కిలోలు తగ్గాలి అని స్పష్టంగా తీర్మానించుకోవటం చాలా మెరుగైన నిర్ణయం. ఎందుకంటే మొదటిది చాలా జనరల్ గా వుంది. కానీ రెండోది చాలా నిర్దిష్టంగా, అంటే specific గా వుంది. మన వుద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. మన వుద్దేశపూర్తిలో మనం ఎంతవరకు అభివృద్ధి సాధించాము అన్నది మనం కొలుచుకోగలిగేటట్లు, అంటే measurable గా వుంటే మంచిది. ఇది గమ్యం జనరల్ గా కంటే నిర్దుష్టంగా వుంటేనే సంభవం.
అలాగే ఒక నిర్దుష్టమైన సమయ పరిధులను నిర్ణయించుకోవటం కూడా ముఖ్యమని నాకు అనిపిస్తూ వుంటుంది. ఎందుకంటే, మీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఏదన్నా ఒక పని మొదలుపెడితే అది మంచి ఫలితాలని చూపించకపోతే మాత్రం ఇంక ఆ పని చెయ్యటంలో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే ఒక end date ని పెట్టుకుని ఆ సమయం లోపు మన గమ్యాన్ని అందుకోవాలి అనుకుంటే అప్పుడు మన ఏకాగ్రత బాగా కుదురుతుంది. దాని వలన మన ప్రయత్నాలు కూడా బాగా మెరుగుపడే అవకాశం వుంది. అందుకే వుదాహరణకి నేను బరువు తగ్గాలి అని తీర్మానించుకునే బదులు నేను ఒక ఏడాదిలో పది కిలోలు తగ్గాలి అని తీర్మానించుకోవటం చాలా తెలివైన నిర్ణయం.
ఇంకో విషయం. మన తీర్మానాలు, నిర్ణయాలు కేవలం మన పరిశ్రమ మీదనే ఆధారపడాలి. అప్పుడే వాటిని మనం పొందగలం. ఎందుకంటే అప్పుడే కదా వాటి మీద మనకి నియంత్రణ వుంటుంది! ఇతరుల మీద మన నియంత్రణ ఏమీ వుండదు కదా! ఒక ఆరు నెలల్లో నేను నటించిన సినిమా blockbuster అవ్వాలనో, నేను ఒక మగ లేదా ఆడపిల్లను కనాలనో, నాకు లాటరీ తగలాలనో తీర్మానించుకుంటే ఎంత హాస్యాస్పదంగా వుంది? ఎందుకంటే ఇవన్నీ మన ఒక్కరి వల్ల అయ్యే పనులు కావు. అసలు మన చేతిలో లేను కూడా లేవు.
ఇప్పుడు నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది. మన కొత్త సంవత్సరపు తీర్మానాలు ఎంత సహేతుకరంగా, అంటే ఎంత reasonable గా, ఎంత వాస్తవితకు దగ్గరగా, అంటే ఎంత realistic గా వుంటే ఆ తీర్మానాలు తీర్చుకోడానికి కూడా అంత దగ్గరగా వుంటాము. ఒక ఆరు నెలలలో వంద కేజీల శరీర బరువు యాభై కిలోలకి పడిపోవాలనో లేదా హఠాత్తుగా కోటికి పడగలెత్తేంత ధనరాశులు సంపాదించగలగాలనో తీర్మానించుకుంటే ఎలా వుంటుంది? ఆ తీర్మానం తీసుకుంటున్నపుడే అవి పరాజయం పొందుతాయని తెలిసిపోతూవుంటుంది. అవునా? అందుకని ఇలాంటి అసాధ్యమైన కోరికలు కోరుకుని అవి తీరలేదని బాధపడే కంటే అసలు కోరుకునేటప్పుడే సరిగ్గా ఆలోచిస్తే మంచిది కదా! ఇక్కడ అందరికీ ఒక్క హెచ్చరిక. దీని అర్థం మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోకూడదని, కష్టమైన పనులు తలపెట్టకూడదని నా వుద్దేశం కాదు. అలా అని మరీ ఆకాశాన్ని దించేసేయాలనుకోవటం, నక్షత్రాలని తుంచేసేయాలనుకోవటం అవివేకం కదూ?
నాకు ఇంకో విషయం కూడా అనిపిస్తోంది. మనం ఏదన్నా సాధించాలని తీర్మానించుకునే ముందు దానికి తగిన కారణం కూడా బాగా ఆలోచించుకుని వుండటం ఆ తీర్మాన పూర్తికి చాలా దోహదం చేస్తుందని నాకు అనిపిస్తోంది. వుత్తగా బరువు తగ్గాలి అని కోరుకునే బదులు నా లావు వలన అనారోగ్యం పాలవుతున్నాను, నా కుటుంబ బాధ్యత సరిగ్గా వహించగలగటం కోసం నేను సన్నబడాలి అని తీర్మానించుకుంటే అప్పుడు ఆ తీర్మాన పూర్తికి పరిశ్రమ చెయ్యటానికి ఎక్కువ పట్టుదల, మరింత ప్రేరణ లభిస్థాయి అని నా నమ్మకం.
మీరు నమ్మరేమో కానీ ఒక్కొక్కసారి మన తీర్మాన పూర్తిలో మన స్నేహితులు, కుటుంబ సభ్యులే వారికి తెలీకుండా మనకు ఆటంకాలు కల్పిస్తారు. అందుకని మన తీర్మానాల సంగతి వాళ్ళకి తెలియచేసేస్తే అప్పుడు ఇంక ఏ చింత వుండదు. ఉదాహరణకి మనం సన్నబడాలని, బరువు తగ్గాలని కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్తగా వుంటూ కృషి చేస్తున్నామనుకోండి. ఇది తెలీని మన స్నేహితులు మనల్ని అవి, ఇవి తినమని బలవంత పెడుతూవుంటారు. వారికి తెలీకుండానే మన మనోనిర్ణయాలు సడలిపోయేటట్లు చేస్తూవుంటారు. అందుకని వారికి కూడా మన వుద్దేశం సంగతి చెప్పేస్తే అప్పుడింక ఏ ఆటంకము, భయమూ వుండదు.
ఒకవేళ ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు మన వుద్దేశ పటుత్వం జారి, మన మనోబలం తగ్గే దురవకాశం వుంది. దీనికి మానవ సహజమైన బలహీనతలు కావచ్చు. క్షణం తీరిక లేని మన దినచర్యలు కావచ్చు. ఏ కారణం చేతనైనా సరే, మన ఉద్దేశపూర్తి కాకపొతే ఇంక అప్పుడు మనమీద మనకే నమ్మకం పోయే ప్రమాదం వుంది. మన వల్ల ఏ పనీ కాదని, మనకేమీ చేతకాదని మనల్ని మనమే తిట్టుకునే పరిస్థితికి వచ్చేస్తాం. మళ్ళీ ఇంకోసారి వేరే ఇంకేదన్నా తీర్మానం తీసుకోవాలనిపించదు. అలాంటప్పుడే స్థిమితంగా, శాంతంగా ఆలోచించాలి. మనల్ని మనమే నిందించుకుని, శిక్షించుకోకూడదు. Piedmont లోని Thomas Chapman Family cancer wellness centre లో పని చేసే Dennis Buttimer అనే విజ్ఞానవేత్త ఒకాయన, మనిషి పరాజయానికి ముఖ్య కారణం మనల్ని మనమే అవసరానికి మించి విమర్శించుకోవడం అన్నారు. అందుకని అంత స్వీయకఠినత్వం కూడదు. అంతేకాదు, మరి దీనికి వ్యతిరేకంగా పరిస్థితి వున్నప్పుడు, అంటే, మన తీర్మానపూర్తి అయినప్పుడు మనల్ని మనం చక్కగా అభినందించుకోవాలి. బహుమతులు ఇచ్చుకోవాలి. అప్పుడే మళ్ళీ రానున్న ఇంకో కొత్త సంవత్సరంలో ఇంకొన్ని కొత్త తీర్మానాలు చేసుకోవటానికి మంచి ప్రేరణ లభిస్తుంది.
ఈ ప్రపంచంలో ఏ మనిషి పరిపూర్ణుడు, అంటే perfect, కాడు. అనేక లోపభూయిష్టమైనది ఈ మానవ జీవితం. అలాంటప్పుడు గతించిన ఏడాదిలో ఏమి లోపాలు జరిగాయో, ఏ తప్పుల వలన తన గత సంవత్సరపు తీర్మానాలని సాధించలేకపోయాడో వాటిలోంచి పాఠాలు నేర్చుకుని, ప్రస్తుత కొత్త సంవత్సరంలో ఒక తెల్ల కాగితంపై కొత్తగా మళ్ళీ ఇంకో జీవితపు కొత్త కధని మొదలుపెట్టాలనుకోవటం ఏమీ తప్పు కాదు. కొత్త కొత్త తీర్మానాలు తీసుకుని స్వీయాభివృద్ధికి పాటుపడటం చాలా మంచిది. దాని వలన మనలో వున్న శక్తిసామర్త్యాలన్నీ బయటకు వస్తాయి. కొత్త సంవత్సర తీర్మానాలంటే ఆ రాబోయే ఏడాదిలో మనం సాధించపోయే గొప్ప గొప్ప పనులకి ఒక blue print అన్నమాట. గతించిన ఏడాదిలో అపజయాలని మర్చిపోయి, కేవలం వాటిలోంచి పాఠాలను మాత్రమే నేర్చుకుని, కొత్త సకారాత్మకతతో, కొత్త వూపిరి, ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు వెయ్యటమన్నమాట. అంటే ఈ కొత్త సంవత్సర తీర్మానం మనకి ఒక reset button లాంటిదన్నమాట. ఇది ఎవరిమీదో గెలుపు సాధించటం కోసం కాదు. అందరి మీద మన అభిజాత్యాన్ని నిరూపించటం కోసం అసలే కాదు. కేవలం మనకోసమే! మనలో అభివృద్ధిని సాధించటం కోసం మాత్రమే!
మన జీవితాన్ని ఆనందంగా గడపాలంటే దాన్ని మనుషులతో కానీ, వస్తువులతో కానీ ముడిపెట్టకుండా కేవలం మన గమ్యాల వైపు మాత్రమే తిప్పాలని Albert Einstein అన్నారు. అందుకే ఈ కొత్త సంవత్సరంలో మనందరం మంచి మంచి నిర్ణయాలని తీసుకుందాం. వాటిని సాధించటం కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. మనందరి కొత్త సంవత్సర తీర్మానాలన్నీ ఫలించి మనం కోరుకున్న విజయాలన్నింటినీ మనం సాధించగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంక వచ్చే నెల దాకా నాకు సెలవు ఇప్పిస్తారా?