కృతజ్ఞత
అమెరికాలో ప్రతి సంవత్సరం నవంబరు నెలలో వచ్చే నాలుగో గురువారంనాడు Thanksgiving అని పెద్దగా ఒక పండగ లాగా జరుపుకుంటారు. పండగ రోజుల్లో మన కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా కాలం గడిపినట్లు అమెరికాలో కూడా ఆ రోజున దూరాన వున్న కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట కలిసి సంతోషంగా వుంటారు. చాలా ఏళ్ళ క్రితం అమెరికాకు వలస వచ్చినవారు అక్కడి స్థానిక ప్రజలతో కలిసి ఆ భగవంతుడు తమకిచ్చినవాటన్నిటికీ కృతజ్ఞతలు సమర్పించుకోవడంతో అమెరికాలో ఈ సంప్రదాయం మొదలైంది. అమెరికా ప్రజలకి క్రిస్మస్ లాగా ఇది కూడా ఒక పెద్ద పండగన్నమాట. నాకు ఈ పండగ వెనక వున్న భావం చాలా నచ్చుతుంది. భగవంతుడు మనకు ఇచ్చినవాటికి కృతజ్ఞతలు సమర్పించటం అన్నది చాలా మంచి పని. మనం ప్రతి రోజూ ఈ పని చేస్తూనేవుంటాము. కాకపొతే అమెరికాలో అన్నిటికీ ఒక రోజంటూ కేటాయిస్తారు కాబట్టి (Mothers’ Day, Fathers’ Day లాగా) దీనికి కూడా నవంబరులోని నాలుగో గురువారాన్ని ఎన్నుకున్నారు. అంటే వుత్త రోజుల్లో ఆ పని చేసినా చేయకపోయినా, కనీసం ఆ రోజైనా తప్పకుండా చేస్తారని దాని వుద్దేశం.
నేనెప్పుడూ అనుకుంటాను, మనకెవరైనా, ఎంత చిన్నదైనా సరే, ఏదైనా సహాయం చేసినపుడు దానికి మనం కృతజ్ఞతగా వుండకపోతే అది చాలా పాపం. దాన్ని ఏ దేవుడూ మెచ్చడు. దానికి శిక్ష ఏమిటంటే మనకి మళ్ళీ అవసరం వచ్చినపుడు ఇంక ఏ సహాయాన్ని ఏ దేవుడూ మనకి అందివ్వడు. ఇది చాలా న్యాయమైన విషయం. ఎందుకంటే ఒకసారి ఇచ్చినదానికి మనం విలువని ఇవ్వనప్పుడు ఇంక మళ్ళీ దాన్ని ఎవరైనా ఎందుకిస్తారు? ఎందుకివ్వాలి? అలా కాకుండా, కష్టాల్లోనే కాకుండా సుఖాల్లో కూడా మనం అనుక్షణం ఆ భగవంతుడికి కృతజ్ఞతగా వుంటే ఇంక అవసరమైనప్పుడు మనకి సహాయం అందదేమో అన్న భయం అన్నది వుండదు. అందుకే కష్టాల్లో వున్నప్పుడు సహాయం కోసం ప్రార్థనలతో పాటు అంతకు పూర్వం అందుకున్నవాటికి కృతజ్ఞతలని కూడా మర్చిపోకుండా వుండటం చాలా అవసరం.
ఇది కొంచెం కష్టమైన విషయమే! ఎందుకంటే ఈ రెండూ విభిన్నమైన భావాలు. ఒకే సమయంలో రెండింటినీ మనసులో దాచాలంటే కొంచెం కష్టమే మరి. భయం, బాధ, అయోమయం, నిరాశలతో పాటు సంతోషం, సమర్పణ, ఆరాధన, ఆశలు కూడా ఒకేసారి మనసులో అమరటం, కొంచెం....., ఉహు, కొంచెం కాదు, చాలా కష్టమైన విషయమే! పైగా మంచైనా, చెడైనా, మనం ఎప్పుడూ ఎలా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే అస్తమానూ వచ్చే అవకాశం కూడా చాలా వుంది. అందుకే ఎప్పుడూ శుభం పలకమని, శుభం ఆలోచించమని మన పెద్దవాళ్ళు చెప్పారు. అప్పుడు తథాస్తు దేవతలు తథాస్తు అంటారు అని కూడా అన్నారు. అందుకే ప్రార్థనలతో పాటు కృతజ్ఞతలు కూడా మనసంతా నిండివుండటం చాలా ముఖ్యమైన విషయం.
కొంతమంది వుంటారు, వారికి దేవుడితో చెప్పుకోవటానికి ఎప్పుడూ ఫిర్యాదులే వుంటాయి కానీ కృతజతలన్నవి ఏవీ వుండవు. ఎందుకంటే, వారెప్పుడూ వారి కష్టాల కళ్ళద్దాలని కొంచెం సేపు కూడా విడిచిపెట్టరు. కాస్సేపు వాటిని పక్కకు పెడితే అప్పుడు తమ దగ్గర లేనివాటికంటి వున్నవి కాస్త కళ్ళకి కనిపిస్తాయి. మర్చిపోయిన కృతజ్ఞతలు గుర్తొస్తాయి. అంటే దేవుడిని ఏమీ అడగకూడదని నా వుద్దేశం కాదు. మనకేమిటి ఎప్పుడు కావాలో అన్నీ ఆయనకు తెలిసినా మనం అడగటంలో ఏమీ తప్పు లేదని నా అభిప్రాయం. కానీ ఆయన మనకు అదివరకే ఇచ్చివాటిని మాత్రం మరచిపోకూడదు సుమా! అవునా? అందుకే అస్తమానూ జీవితాన్ని కష్టాల కడలిలాగా కాకుండా కృతజ్ఞతల అమృత భాండం లాగా చూడటం నేర్చుకోవాలి. ఎందుకంటే కడలి లోంచే కదా అమృతం పుడుతుంది? ఇంకో విషయం ఏమిటంటే ఆ దేవుడి దయ అనుభవించిన తర్వాత అది ఎంత పెద్దదో, దాని ముందు మన సమస్యలు ఎంత చిన్నవో మనకు తెలుస్తుంది. అప్పుడు కృతజ్ఞతా భావం అప్రయత్నంగానే మన మనసులలోకి వచ్చేస్తుంది. అందుకే కృతజ్ఞత అన్నది మనకు లేనివాటిని కాదు, మన దగ్గర వున్నవాటిని గుర్తు చేస్తుంది.
ఒకసారి ఒక బిచ్చగాడిని చూసి ఒకాయన నీకు కొన్ని వేలు ఇస్తాను, నీ కళ్ళు ఇస్తావా అని అడిగాడట. అతను ఇవ్వనంటే అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తాను కాళ్ళు ఇస్తావా అని అడిగాడట, అది కూడా అతను ఇవ్వనంటే అలాగే అన్ని అవయవాలకు అంతకంటే డబ్బు ఇస్తానని అన్నాడుట. అప్పటికి ఆ బిచ్చగాడు అస్సలు ఒప్పుకోకపోతే అప్పుడు ఆయన అన్నాడట, ఇన్ని వేల విలువ చేసే అవయవాలు దగ్గర పెట్టుకుని నీ దగ్గర ఏమీ లేదని బిచ్చం అడుగుతున్నావెందుకు, కష్టపడి సంపాదించుకోరాదా అని మందలించాడట. చాలాసార్లు మనం చాలా విషయాలని granted లాగా తీసుకుంటాము. జీవితంలో అనుకోని అవాంతరం ఏదన్నా వస్తే అప్పుడు వాటి విలువ, ప్రభావం మనకు తెలుస్తుంది. మనం ఆ దేవుడికి ఎంత కృతజ్ఞతగా వుండాలో కూడా మనకు అప్పుడు బాగా తెలుస్తుంది.
నాలుగేళ్ళ క్రితం మనందరం కోవిడ్ కబంధహస్తాల్లో చిక్కి నలిగిపోయాము. ఆఫీసు పని ఇంటినుండి చేస్తూ గడిపాము. రోజూ భోజనాలు చేస్తున్నపుడు బయట ప్రపంచంలో ఇంత అల్లకల్లోలం రేగినా కూడా ఆరోగ్యం, ఆయువు, వుద్యోగం, ఇంటి నుండి బయట అడుగు పెట్టకుండా రోజూ బల్ల మీదకి భోజనం, ఇవన్నీ అందిస్తున్నావు, భగవంతుడా, నీకు కోటి కోటి కృతజ్ఞతలు, నమస్కారాలు అని అనేక ప్రార్థనలు చేసేదాన్ని. ఇలాగే మీరందరూ కూడా చేసే వుంటారు. అందుకే చివరికి ఆ కోవిడ్ కి తన ఓటమిని ఒప్పుకుని, తోక ముడవక తప్పలేదు. అంతేకాదు. కోవిడ్ చాలామంది ప్రాణాలను, ధనసంపత్తులను, ఆఖరికి కొంతమంది జీవనోపాధులను కూడా పొట్టన పెట్టుకుంది. నిజమే! కానీ మనందరికీ కొంత మంచిని కూడా చేసింది. మనిషి ఎంత పురోగతిని సాధించినా మన నియంత్రణలో లేనివి చాలా వున్నాయన్న చేదు పాఠాన్ని ముందు మనకి ఇంకోసారి గుర్తు చేసింది. రీసర్చ్ కి ప్రేరేపించి మన సైంటిస్ట్ ల మేధని ఇంకా పదును పెట్టింది. ఆ తర్వాత జూమ్ లో అంతర్జాలం లో జరిగే అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలద్వారా
ఈ అనంతమైన ప్రపంచాన్ని చిన్నదిగా చేసేసి, సప్తసముద్రాలని దాటించేసి, దూరదూర ఖండాల్లో, దేశాల్లో వుంటున్న మనల్నందరినీ దగ్గర చేసింది. వీటన్నిటికీ కూడా, అంటే, అంత చెడులో కూడా ఇంత మంచిని మనకి అందించిన ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
అయితే ఈ కృతజ్ఞతలన్నవి కేవలం ఒక్క భగవంతుడికే కాదు, మన సాటి మనుషుల పట్ల కూడా చూపించాలి మనం. సంఘంలో నలుగురి మధ్య మసలుతున్నప్పుడు ఏదో ఒక కష్టకాలంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరి దగ్గరినుండి సహాయ సహకారాలు అందుకోకుండా ఎవ్వరికీ జరగదు. రాముడంతటి దేవుడికే కోతుల సహాయం తప్పలేదు. అందిన సహాయానికి కృతజ్ఞతలు ప్రకటించడం మన కనీస బాధ్యత. మానవ రూపుదాల్చిన మన దేవుడు, రాముడు ఈ సూత్రాన్ని తాను స్వయంగా పాటించి మనందరికీ నేర్పాడు. అన్ని వేళ్ళు ఒక్కలాగా వుండవు. కానీ అన్నీ కలిస్తే శక్తివంతమైన పిడికిలిగా మారి ఎక్కువ బలాన్ని కూర్చుకొంటాయి. అందుకని ఒకరంటే ఇంకొకరికి ఎప్పుడూ విశ్వాసం, గౌరవం, పొందిన సహాయానికి కృతజ్ఞత వుండాలి.
కృతజ్ఞతలను వ్యక్తం చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. ముందు మన మనసుకి చాలా సంతోషం కలుగుతుంది. ఎదుటివారు మనకు చేసిన సహాయాల ఋణాలు మనం ఎటూ తీర్చుకోలేము. కనీసం మన కృతజ్ఞతలను వారికి వ్యక్తపరిస్తే మన మనసులలోని భారం కాస్తన్నా తగ్గుతుంది.
మనకి సంతృప్తి, సంతోషాలు కలుగుతాయి. ఒక్క మనకే కాదు, మనం కృతజ్ఞతలు ఎవరికి వ్యక్తం చేసామో వారు కూడా ఆనందితులవుతారు. అంటే మనం ఇరువైపులా సంతోషాన్ని పంచి, పెంచుతున్నామన్నమాట. ఇద్దరి మధ్య సంబంధబాంధవ్యాలు ఇంకా గట్టి పడతాయి. వారు మనకి చేసిన సహాయాలు మనలో వూపిరిని పోస్తే, వారికి మనం ఇచ్చే ప్రశంసలు, మెచ్చుకోలు వారికి సంతోషాన్ని, తమ మీద తమకి ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తాయి. మనకి శక్తిని, శాంతిని కూడా ఇస్తాయి. ఎందుకంటే అవసరమైనప్పుడు కృతజ్ఞతలు వ్యక్తం చేసి మనలో మానవ సహజమైన భావాలున్నాయని, మనలో మానవత్వం వుందని మనం ఋజువు చేసుకుంటాము. అంతేకాదు, కృతజ్ఞతా భావం పరానుభూత సానుభూతిని, అంటే empathy ని కలుగజేసి ఎదుటివారి మీద ఈర్ష్యాద్వేషాల లాంటి నకారాత్మకమైన భావాలని తుంచివేస్తుంది. సహనాన్ని, దయ, కరుణలని మనలో ఎక్కువ చేస్తుంది. నేను నేనుగా ఏమీ కానని, పరస్పరాధారంలోనే మానవ మనుగడ, సమాజ పురోగతి దాగివుందని మనకి గుర్తు చేస్తుంది. కృతజ్ఞత అన్నది మనం ఏదన్నా కొనుగోలు చేసినపుడు ఆ దుకాణంలో దొరికే రసీదు లాంటిది. ఎదుటివారి సహాయానికి, మంచితనానికి మనం ఇస్తున్న రసీదు అన్నమాట. దానిని వ్యక్తం చేస్తున్నామంటే మనలో లేనిదానిని మనం స్వీకరిస్తున్నామన్నమాట. ఎదుటివారి గొప్పదనాన్ని అంగీకరిస్తున్నామన్నమాట. ఇది ఎంత చక్కటి భావన! వినయం, సహనమే కదా మనిషికి ఆభూషణాలు! అంటే కృతజ్ఞత అన్నది కేవలం ఒక్క భావనయే కాదు, ఒక పరిపూర్ణ మానవ స్వభావానికి కావలిసిన అతి ముఖ్యమైన ఒక అంశం. మన మానసిక ఒత్తిడులను తగ్గించి, మన మనోభారాలను దించి, మన మనసులకు శాంతిసుఖాలను ఇచ్చి, మన మనోకల్లోలాలను రూపుమాపే ఒక మానసిక వ్యాధి నిరోధక శక్తి. అది కష్ట సమయాలను ఎదుర్కోవడమే కాదు, వాటిని దాటుకుని ఎదిగే మార్గాలను కూడా మనకు సూచిస్తుంది. ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు, కృతజ్ఞతా భావాలు వున్న పౌరులు సమాజ సమృద్ధికి కారణమవుతారు. అలాంటి సమాజంలో ఎదుటివారి మీద గౌరవం, కృతజ్ఞతా భావమే కానీ వారితో ఎటువంటి అకారణంగా పోటీలు వుండవు. కాబట్టి ఒకరంటే ఇంకొకరికి ఎటువంటి కక్షలు, కావేషాలు వుండవు. అలాంటి సమాజాలతో కూడిన దేశం తప్పకుండా అభివృద్ధిని సాధిస్తుంది.
ఇలాంటి కృతజ్ఞతని మన జీవితంలో నింపుకోవటానికి చాలా మార్గాలు వున్నాయి. మొదటిది, ఏమాత్రం సంకోచం, తడబాటు లేకుండా చక్కగా మన కృతజ్ఞతలని ఎదుటివారి ముందు స్పష్టంగా వ్యక్తపరచడం. కృతజ్ఞతలు ఇచ్చేవారిని, స్వీకరించేవారిని, ఇద్దరినీ సంతోషపరిచే ఈ ప్రక్రియ అన్నిటిలోకి చాలా ఉత్తమమైనది.
ఒక చిన్న డైరీ లాంటి పుస్తకంలో ప్రతిరోజూ మనం ఎవరెవరికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో ఒక పట్టికలాగా రాసుకుంటే ఇంక మనం మరచిపోయే ప్రమాదం వుండదు. దానితోపాటుగా, అప్పుడప్పుడు అదంతా మనం చదువుకుని గుర్తు చేసుకుంటూవుంటే, మనసుకి ఎంతో శాంతిగా వుంటుంది. ఆ భగవంతుడు మనమీద ఎంత దయావృష్టి కురిపించాడో మనకి ఇంకోసారి అవగతమవుతుంది. ఎందుకంటే అవసరమైనప్పుడు ఆ దేవుడు ఈ భూమ్మీదకు అనేక రూపాలలో దిగి వచ్చి మనందరికీ రకరకాల సహాయాలు చేస్తూవుంటాడు. అంతేకాదు, ఒకవేళ పొరపాటున మనం ఎవరికన్నా కృతజ్ఞతలు వెంటనే చెప్పటం మరచిపోతే మన జ్ఞాపకశక్తిని ఒక్కసారి ఈ డైరీ తట్టి లేపుతుంది. మన బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది.
ఎప్పుడైనా జీవితంలో మనం అనుకున్నట్లు జరగకపోతే ఏమాత్రం అసంతృప్తిని పొందకుండా వుండటాన్ని ఈ కృతజ్ఞతే మనకు నేర్పుతుంది. ఎందుకంటే ఏదన్నా మనం కోరుకున్నది మనకి దొరకనపుడు ఆ నిముషంలో మనకు అసంతృప్తి కలిగినా, అది కూడా మన మంచికే అని ఆ తర్వాత మనకి తెలుస్తుంది. ఎందుకంటే అంతకంటే మంచిదాన్ని మనకోసం ఎంచుకొని ఆ దేవుడు మన దగ్గర నుండి దాచిపెడతాడు. అది మనకి దొరికిననాడు మొదట మనం కావాలని కోరుకున్నది మనకి అప్పుడు చిక్కకపోవటం మన మంచికే అని మనకి తెలుస్తుంది. అప్పుడు మనకి తప్పనిసరిగా ఆ భగవంతుడు గుర్తొస్తాడు. అదృశ్యంగా ఆయన చేసిన సహాయానికి మన మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది.
కృతజ్ఞత అన్నది మన జీవితానికి మెరుగు పెట్టే ఒక నగ వంటిది. ఈ ప్రపంచంలోని అద్భుతాలన్నిటితోను మనల్ని ముడి పెట్టే ఒక ఇంద్రజాలపు దారపుపోగులాంటిది. జీవితం అంటే మనకున్న దృష్టికోణాన్ని మార్చివేసే ఒక మంత్రదండంలాంటిది. అది గుట్టుగా మన మనసులో దాగివుండే ఒక భావనే కాదు, మన ఆచరణలో కూడా తొంగిచూసే ఒక పవిత్రమైన కార్యం. లేనిదాని విలువని దించి, వున్నదాని విలువని పెంచే
ఒక అపురూపమైన సంతృప్తి. ఇది కేవలం ఒక నైతిక లక్షణమే కాదు, మన మానసిక వ్యాధి నిరోధిక శక్తి. మన మనసులని, జీవితాలను సకారాత్మకతతో నింపివేసే ఒక అమృతభాండం. మన శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించి, మనకు శాంతిసౌఖ్యాలను ప్రసాదించే ఒక దివ్యమైన ఔషధి.
కానీ, కొంతమందికి కృతజ్ఞత సహజంగా రాదు. ఆమాటకొస్తే ఎప్పుడూ ఎంతో వినయంగా ఒదిగి వుండేవారికి కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత గుర్తుకు రాకపోవచ్చు. ఇలాంటప్పుడే నేను ఇందాక చెప్పిన 'కృతజ్ఞతా డైరీ' మనకు బాగా సహాయాన్ని చేస్తుంది. అలాంటి సమయాల్లో మనం కొంచెం గుర్తు పెట్టుకుని, కొంచెం కష్టమైనా సరే, ప్రయత్నం చేసి ఈ కృతజ్ఞతని మన జీవితాల్లోకి వచ్చేలాగా చేస్తుంది. ఎందుకంటే శూన్యం లోంచి అక్షయంలోకి ఈ కృతజ్ఞతే మనల్ని నడిపిస్తుంది.
రండి. మనం కూడా ఈ అద్భుతమైన వరాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. లేదు, రాదు అన్న పదాల్ని మన నిఘంటువుల్లోకి అసలు రాకుండా చేద్దాం. ఈ నెలలో వచ్చే thanksgiving రోజున మనం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడితోపాటు మిగిలిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంటా, బయటా అంతా ఆశ, నమ్మకం, విశ్వాసాలతో నింపేద్దాం. అసలు జీవితం అంటేనే ఆశ, విశ్వాసం కదా! కొంచెం ఆలోచించండి. మనందరికీ, మన జీవితాల్లో, కృతజ్ఞతలు వెల్లడించడానికి ఎంత చిన్నదైనా సరే, ఏదో ఒకటి తప్పక దొరుకుతుంది.
అవునా? మరి మీరు నాతో ఏకీభవిస్తారా? సరే, మీరు ఆలోచిస్తూవుండండి. ఈలోపల నేను మీదగ్గర సెలవు తీసుకుని మళ్ళీ వచ్చే నెల కలుస్తాను. అప్పటిదాకా సెలవు.