Menu Close
Radhika Nori
రాధికారుచిరం
-- రాధిక నోరి --

క్రోధం

ఆవేదన, ఆవేశం మనిషన్న తర్వాత ఎవరికైనా సరే, చాలా సహజం. మనం కోరుకున్నది దొరికినపుడు ఆనందించటం, లేనప్పుడు ఆవేదనకు లోనుకావటం కూడా చాలా సహజమే! ఆ ఆవేదన కొంచెం ఎక్కువైతే అప్పుడప్పుడు అది క్రోధంగా మారటం కూడా సహజంగానే జరుగుతుంది. మానవ భావాలు, ఎప్పుడు ఏది దేనిలోకి దారి తీస్తుందో, ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? కానీ మనందరికీ ఒక్కటి మాత్రం బాగా తెలుసు. ప్రేమ, దయ, సహనం, కరుణ లాంటి భావాలను మంచి భావాలుగాను, ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, కక్షలు, కావేషాలు లాంటి భావాలను చెడు భావాలుగాను మనందరం పరిగణిస్తాం. కానీ ఏ భావమైనా ఆ ఆ సందర్భాన్ని బట్టి దాని రూపురేఖలు మారిపోతాయని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకి, ప్రేమ మంచి భావం కదా అని అనుకుంటే అది తప్పు. అతి ప్రేమ మంచిది కాదు. పిల్లలకి క్రమశిక్షణ లేకుండా పోయి, వాళ్ళు చెడిపోయే ప్రమాదం వుంది. అలాగే ఈర్ష్య చెడు భావం అయినా కూడా, ఈర్ష్య అన్నది లేకపోతే ఇంక ఇతరులని మించాలన్న పోటీ భావం, దానికోసం ఎక్కువ పరిశ్రమ చెయ్యాలన్న పట్టుదల మనలో కలగనే కలగవు. చూసారా, మంచి అని అనుకున్నది చెడుగా మారింది. చెడు అని అనుకున్నది మంచిగా మారింది.  అందుకే ఏ భావమైనా దాన్ని మనం మలుచుకునే తీరులో వుంటుంది. క్రోధం కూడా అంతే! కానీ పాపం, క్రోధానికి మొదటినుండీ అప్రతిష్టే కదా! అందుకే క్రోధం అనగానే చప్పున మనకు చెడే గుర్తు వస్తుంది.

అయితే అసలు క్రోధం అంటే ఏమిటి? క్రోధమని దేన్ని అంటారు? అది ఎలా వుంటుంది? అసలు క్రోధమన్నది ఎవరికైనా ఎందుకు కలుగుతుంది? దాని వలన లాభమా, నష్టమా?

చికాకు కొంచెం హద్దులు దాటితే అది కోపంగా మారే అవకాశం వుందని నాకు అనిపిస్తూవుంటుంది. అయితే మరి చికాకు ఏమిటి? అదెందుకు వస్తుంది?

మనం కోరుకున్నది మనకు దక్కనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మన చేతిలో నియంత్రణ, అంటే control, ఏమీ లేకుండా మనకు ఇష్టం లేని సంఘటనలు అలా అలా ఘటిస్తున్నపుడు, ఏమీ చెయ్యలేని అసహాయతలో మనకు చికాకు వచ్చేస్తుంది. అది కొంచెం ఎక్కువై కోపంగా మారుతుంది. అంతే కాదు, మనకు ఇష్టంలేని మాటలు ఎదుటివారు అంటున్నప్పుడు, లేదా మనకు ఇష్టంలేని పనులు వారు చేస్తున్నప్పుడు కూడా మనకి కోపం వచ్చే అవకాశం వుంది. అసలే మనకి ఇష్టం లేనివన్నీ జరిగిపోతున్నాయన్న ఆక్రోశం ఒకపక్క మనల్ని విచలితం చేస్తూవుంటే ఈ కోపం ఇంకోపక్క నుండి మనల్ని ఆవేశపరుస్తూవుంటుంది. అంటే మన క్రోధం ఇతరుల తప్పులకు మనకు మనమే వేసుకున్న శిక్ష అన్నమాట. అంతేనా?

మరి శిక్ష అని ఎందుకంటున్నాను? ఎందుకంటే క్రోధం అంత సకారాత్మకమైన భావం ఏమీ కాదు. చిటికెలో వచ్చి పోయే చికాకు కావచ్చు, అలాగే కలకాలం నిలిచిపోయే కక్ష కావచ్చు, ఏదైనా సరే, క్రోధం మనిషిని రగిలిస్తుంది. అది ఎవరిమీద వస్తుందో వారిని మాత్రమే కాక ఆ క్రోధం వచ్చినవారిని కూడా నిలువునా దహించివేస్తుంది. అంతేకాదు, రకరకాలైన వేరే నకారాత్మకమైన భావాలను, అంటే భయం, అనవసరమైన సిగ్గు, ఆగ్రహం, అసహ్యం, కక్ష, పగ, ద్వేషం, ప్రతీకారం లాంటివన్నమాట, వాటిని కూడా రేకెత్తిస్తుంది. మనిషిని ఆవేశంలో ముంచి నేను ఒక మనిషిని అన్న నిజాన్ని మరిపిస్తుంది. శరీరం మీద నుండి స్పృహని లాక్కుని క్షణికావేశంలో మృగంలాంటి పనులన్నింటినీ మనకు తెలియకుండానే మనచేత చేయిస్తుంది. పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు. అలాంటిది మన పెదవులలోంచి మన మనసులో లేని మాటలను కూడా క్రోధం బయటికి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ మాటలను అన్నవాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కోపంలో అన్నారు కానీ అనాలని  అనలేదు కదా! కానీ ఆ మాటలన్నీ పడ్డవాళ్ళకి మాత్రం అలా అనిపించదు. ఆ ములుకుల్లాంటి మాటల గాయాలు వాళ్ళని బహుకాలం బాధపెడుతూనే వుంటాయి. దీనికంతా కారణం క్రోధమే!

ఇంకో విషయం. క్రోధం ఒక అంటువ్యాధిలాంటిది. ఒకరి దగ్గరి నుండి ఇంకొకరికి అది దావానలంలాగా చకచకా వ్యాపిస్తుంది. ఎలా అంటే, కోపంలో మనం ఎవరినన్నా ఏమన్నా అనకూడని మాట అంటే ఎంత శాంతమూర్తులైనా సరే, ఒక్కొక్కసారి వారికికూడా కోపం వచ్చేస్తుంది. అంటే ఒకరి క్రోధం ఇంకొకరికి క్రోధాన్ని కలిగించే వాతావరణాన్ని తేలికగా సృష్టిస్తుందన్నమాట. ఇది చాలా అపాయకరమైన అంటువ్యాధి సుమా!

అమెరికాలాంటి పశ్చిమదేశాల్లో అందరూ ఉద్యోగాలు చేసుకునే ఆఫీసు వాతావరణంలో క్రోధాన్ని ప్రదర్శించటం పూర్తిగా రద్దు. ఎవరైనా అలా చేస్తే వారి వుద్యోగాలు వెంటనే  వూడిపోతాయి. ఆఫీసులదాకా ఎందుకు? అందరూ షాపింగులు చేసుకునే షాపుల్లో కూడా అక్కడ పని చేసే ఎవరైనా కొనుగోలుదారులతో కొంచెమన్నా అమర్యాదగా కానీ, విసుగ్గా కానీ, కోపంగా కానీ ప్రవర్తించినా, లేక కొనుగోలుదారులెవరైనా వారి గురించి ఫిర్యాదు చేసినా వారి ఉద్యోగాలకి ఇంక నీళ్ళు వదులుకోవచ్చు. అంటే ఆఫీసు వాతావరణంలో కోపం, తద్వారా వచ్చే హింస పూర్తిగా రద్దు అన్నమాట.

ఈ అపాయకరమైన కోపాన్ని మనం వేరే సందర్భాలలో కూడా చూస్తూ వుంటాము. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా మన పనేదో మనం చేసుకుంటూవుంటే కూడా ఇతరుల కోపం వలన ఒక్కొక్కసారి మనం చిక్కుల్లో, వాటిని మించి అపాయాలలో కూడా, ఇరుక్కుపోతూ వుంటాము. Road rage అన్న మాటని మీరు వినేవుంటారు. నువ్వు మరీ నెమ్మదిగా కారు నడుపుతున్నావనో, లేక మాకంటే ఎక్కువ వేగంగా ఎందుకు వెళుతున్నావనో, లేక నాకు అడ్డంగా వున్నావనో, లేక నీ ముఖం అలా వుందేమిటి, నాకు నచ్చలేదు అనో, లేక వీటన్నిటిని మించి ఇంకేదో వేరే వింతైన  కారణం వలనో చటుక్కున తమ దగ్గరున్న తుపాకీలు తీసి, కోపంలో ఒళ్ళు తెలీక ఎదుటివారిని నిలువునా కాల్చి చంపేసినవారున్నారు. దీనికి హద్దులు తెలియని వారి అకారణ క్రోధమే కారణం. అంటే కోపంలో వారికి ప్రాణాల విలువ కూడా తెలీదన్నమాట. పూర్తిగా అదుపు తప్పిన కోపం అంటే దీన్నే అంటారు కదూ?

క్రోధం ఇలాగే మనుషులను మృగాలుగా, రాక్షసులుగా మార్చివేస్తుంది. గుండె జబ్బులు, రక్తపుపోటు, పక్షవాతం, మధుమేహం, కేన్సరు లాంటి జబ్బులను బహుమతులుగా ఇస్తుంది. అంతేకాదు, అనేక రకాలైన మానసిక వ్యాధులను కూడా ఇస్తుంది. ఆ క్రోధంలోనే ఇంకొన్ని రోజులు గడిపేస్తే ఇంకా ఆ వ్యాధుల సుడిగుండాలలో అందరినీ ముంచెత్తివేస్తుంది. అందుకే క్రోధం అపాయకరమైన అసలు వ్యాధి అంటాను నేను.

కోపంలో రగులుతున్న మనుషులు ఉత్తపుణ్యానికే అందరి మీద విసుగుని కురిపిస్తారు. అనవసరంగా అరిచి అందరినీ అల్లరి పెడతారు. సాటివారని కూడా చూడకుండా వారి మీద చెయ్యి చేసుకోవడానికి కూడా వెనుకాడరు. ధూమపానం, మధుపానం, మత్తుపదార్ధాల లాంటి అనేక వ్యసనాలకి బానిసలవుతారు. ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతారు. కుటుంబ సభ్యులను అలక్ష్యం చేసి సుఖ కుటుంబ జీవితానికి దూరం అయిపోతారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్ద సమస్యలుగా వూహించుకుంటారు. ఆఖరికి చట్టంతో కూడా వీరికి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని చేజేతులా తెచ్చుకుంటారు. చూసారా, క్రోధమెంతటి అపాయకరమైనదో!

అలాగే కొంతమందికి ఏదో కారణం వలన ఈ సమాజం మీద కోపం వుంటుంది. ఈ సమాజంలో తమకు ఏదో అన్యాయం జరిగిపోయిందని, తమకు రావలిసిన హక్కులు తమకు దక్కలేదని ఇలా వారు ఎప్పుడూ క్రోధంలోనే బతుకుతూ వుంటారు. నిరుద్యోగం, సామాజిక అసమానత, దారిద్య్రం, వలస రావటంలో వున్న ఇబ్బందులు, విదేశీయుల పట్ల చూపబడుతున్న తారతమ్యాలు, ఆఖరికి చట్టం కూడా చూపిస్తున్న పక్షపాతాలు, ఇలా ఏదో ఒక కారణం వలన వారి మనసు క్రోధంలో ఎప్పుడూ రగులుతూనే వుంటుంది. దానితో వారు ఎప్పుడూ ఏదో అశాంతితో చిన్నాభిన్నమవుతూవుంటారు. అస్తమానూ ఉత్తపుణ్యానికి గాలితో పోట్లాడుతూ వుంటారు.

ఈ క్రోధమన్నది ఒకొక్కసారి శారీరకం కావచ్చు. అంటే, ఒక కుర్చీలో బంధించి వుంచితే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగే వారిమీద చెయ్యి చేసుకుంటే కూడా ఎవరికైనా కోపం వస్తుంది. అలాగే క్రోధం జ్ఞానపరమైనది కావచ్చు. అంటే ఎదుటివారి మాటలలోని అర్థాన్ని మనం ఒక రీతిలో తీసుకుని కోపం తెచ్చుకుంటే, అసలు అర్థం వేరొకటి కావచ్చు. మన కోపానికి అసలు కారణమే లేకపోవచ్చు. కానీ మన అపోహల వలన మనకి మన కోపం సబబుగానే అనిపిస్తుంది, కనిపిస్తుంది. అది నిజం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు. అలాగే మన క్రోధం ఒక్కొక్కసారి మన ప్రవర్తన వలన కూడా రావచ్చు. మనకు తెలీకుండానే ఒక్కొక్కసారి మనం  ఎలాంటి వాతావరణాన్ని సృష్టించుకుంటామంటే మనం అల్లుకున్న ఆ వలలో మనమే ఇరుక్కుపోతాం. అలాగే మనం ఇతరుల నుండి ఏదో ఆశించి అది అందనపుడు కూడా క్రోధానికి గురయ్యే అవకాశం వుంది. నిజానికి దీంట్లో బహుశా ఆ ఇతరుల తప్పేదీ లేకపోవచ్చు. మనమే వారి గురించి అధికంగా ఆశించి వుండవచ్చు. మనం ఆశించేవి, అంటే మన expectations అన్నమాట, చాలా అర్థం,పర్థం లేనివిగా, అంటే unreasonable గా వుండి వుండవచ్చు. కానీ ఇవేమి మనకు అప్పుడు గుర్తుకు రావు. ఒక్క మన కోపం మాత్రమే గుర్తుంటుంది. అంటే మన రియాక్షన్స్ కి మనం ఎప్పుడూ ఎదుటివారిని తప్పుపడతాం, కానీ అసలు తప్పు మనలోనే దాగివుందని మనం గుర్తించం. అలా ఈ క్రోధానికి మూలం అనేక విధానాలలో వుంటుంది.

కోపం మానవ సహజమైన భావం. అంటే మనిషన్న తర్వాత ఎప్పుడో అప్పుడు కొద్దో గొప్పో కోపం రాక మానదు. కానీ కలకాలం అదే మనసులో పెట్టుకోకూడదు. ఎక్కువ కాలం కోపాన్ని మనసులో పెట్టుకుని అనుక్షణం పగ, ద్వేషమంటూ రగిలేవాళ్ళు అధములని, కనీసం కొన్ని రోజుల దాకా దాన్ని మరచిపోలేని వాళ్ళు మధ్యములని, అలా కాకుండా కోపాన్ని మరుక్షణమే మరచిపోయి ఎప్పటిలాగా సంతోషంగా వుండేవాళ్ళు ఉత్తములని మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని మానవ సహజమైన కోపం ఎప్పుడైనా మనకి వచ్చినా దాన్నినియంత్రణలో పెట్టుకుని వెంటనే మరచిపోవడం చాలా మంచిది. ఎందుకంటే ముందే చెప్పినట్లు క్రోధం మనిషికి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా నష్టం చేస్తుంది. శారీరకమైన, మానసికమైన అనేక జబ్బులను తెచ్చిపెడుతుంది. మనిషిని తికమక పెట్టి ఆ అయోమయంలో అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కుటుంబంలో కానీ, ఆఫీసులో కానీ, స్నేహితుల మధ్య కానీ, సమాజంలో కానీ కోపిష్టి అన్న చెడ్డ పేరు అతి తేలికగా సంపాదించిపెడుతుంది. ఏదో హంతకుడు, దొంగ లాగా కోపిష్టి అన్న ముద్ర కూడా మంచిది కాదు. క్రోధం మనిషిలో క్రమశిక్షణను, హేతుబద్ధతను (అంటే rationality ను), గ్రహణశక్తిని (అంటే comprehension ని) చంపేస్తుంది. మనిషి సంయమనం కోల్పోయి సరైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని కోల్పోతాడు. దృష్టిని సరిగ్గా కేంద్రీకరించలేక తన ఆలోచనాశక్తిని కోల్పోయి, తన భావోద్వేగతకు లొంగిపోతాడు. క్రోధం మనిషికి కేవలం రెండిటిని మాత్రమే ఇస్తుంది, ఎదుటివారిని ఎటాక్ చెయ్యటం, దానికి తనని తాను సమర్థించుకోవటం. అందుకే క్రోధం వలదు, వదిలేయటం మంచిది.

అలా వదిలేయడానికి నాకు తెలిసి కొన్ని మార్గాలున్నాయి. కోపం వచ్చినప్పుడు ముందు దాన్ని వ్యక్తపరచటం.  అంటే ఫలానా విషయంలో ఫలానా కారణం వలన నాకు కోపం వచ్చింది అని మనం  స్పష్టంగా  చెప్పేస్తే అవతలివాళ్ళు దాన్ని గ్రహించుకొని దానికి తగ్గట్లు ప్రవర్తిస్తారేమో! కొన్ని ప్రత్యేక బంధాలలో, ఉదాహరణకి, భార్యాభర్తలలో, taking for granted అన్న సూత్రం బాగా అమలులో వుంటుంది. అంటే ఇద్దరిలో ఎవరికి వారే అవతలివారి దగ్గర నుండి కొన్నిటిని తమ హక్కులుగా భావిస్తారు. అవి అనుకున్నట్లుగా, అనుకున్న సమయంలో అందకపోతే ఇంక వారి స్వాభిమానం దెబ్బ తింటుంది. ఇంకేముంది? ఆకాశం విరిగి మీద పడుతుంది. అందుకే ముందుగానే మన భావాలన్నీ ఎదుటివారి ముందు పూర్తిగా పరిచేస్తే అసలు ఈ తిప్పలే వుండవేమో! అందుకే కోపం వచ్చినపుడు కోపం వచ్చిందని, లేక రాకమునుపు వస్తోందని చెప్పేస్తే ........ చెప్పేస్తే ఎలా వుంటుంది?

ఇంకో పధ్ధతి కోపాన్ని అదుపులో పెట్టుకుని మనసులోనే అణచివేయటం. ఇది కొంచెం కష్టమైన పనే! అందరూ ఇలా చేయగలిగితే ఇంక లేనిదేముంది? ఈ ప్రపంచంలో ఇంక ఏ అశాంతీ వుండదు. కానీ ఈ పద్ధతిలో ఒక సమస్య వుంది. ఒకవేళ ఆ కోపం కేవలం తాత్కాలికంగా మాత్రమే అణగబడి వుంటే ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు అగ్ని పర్వతం బద్దలయినట్లు అది మళ్ళీ బయటికి బద్దలయే ప్రమాదం ఖచ్చితంగా వుంది. అది కన్నీళ్ళ రూపంలో కావచ్చు, సూటిపోటి మాటల రూపంలో కావచ్చు, చెవి కింద జోరీగ లాగా భరించలేని నస కావచ్చు, దురదృష్టం నెత్తిమీదకొస్తే హింస, నాశనం రూపంలో కూడా కావచ్చు. అలా కాకూడదని కోరుకుందాం.

ఇంకో పధ్ధతి ఏమిటంటే కోపాన్ని తగ్గించుకునే మార్గాలలో పయనించటం. ఉదాహరణకి, కాస్సేపు నడిచి (లేక పరిగెత్తి) రావటం. కొంచెంసేపు, కనీసం ఆ కోపం ఉధృతం తగ్గేదాకా, ఏమీ మాట్లాడకుండా మౌనం వహించటం, ఒకటి నుండి వంద దాకా అంకెలు లెక్కించటం, నెమ్మదిగా ఊపిరి తీసుకుని వదిలేయటం (ప్రాణాయామం చేయటం), ఆతురత (anxiety) ని  తగ్గించుకోవటం, ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లని వదిలేయటం, ఆధ్యాత్మిక చింతనని పెంచుకోవటం, కాస్త నిదానాన్ని అలవాటు చేసుకోవటం, ఇవన్నీ కోపాన్ని తగ్గిస్తాయి. గట్టిగా నవ్వేయటం కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి బాగా పనికొస్తుంది.

అన్ని గుణాల్లోకి కోపం లేకపోవటం చాలా ఉత్తమమైన గుణం. మనిషిని దేవుడిగా మార్చే గుణం. మా ఇంట్లో మా నాన్నగారు చాలా నిదానంగా వుండేవారు. అసలు కోపం అంటే ఏమిటో ఈయనకు తెలుసా అని అందరూ అనుకునేవారు. కోపం సంగతి దేవుడెరుగు, అసలు ఆయన గొంతు పెద్దది చేసి గట్టిగా మాట్లాడటం కూడా నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఆయనను అందరూ దేవుడనే అనేవారు. అంటే కోపం లేకపోవటం అన్నది దైవత్వంతో సమానమన్నమాట. మన పురాణాల్లో కోపం లేనివారు, లేక చాలా తక్కువ వున్నవారు ఎవరు అని ఆలోచిస్తే నాకు చటుక్కున ధర్మరాజు, శ్రీరాముడు గుర్తొస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో చిక్కు వుంది. అసలు కోపం రానివారికి ఖర్మ కాలి ఎప్పుడన్నాకోపం వస్తే మాత్రం ఇంక అప్పుడు ప్రళయమే వస్తుందట. నిజమే కాబోలు. అలాగే బాగా కోపిష్టివాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే వెంటనే దూర్వాస ముని, విశ్వామిత్రుడు మనసులోకి వచ్చారు. ఎంత గొప్ప ఋషులైనా, తమ కోపం వలన మాటిమాటికి అందరికి శాపాలు ఇచ్చి, ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేసినట్లు, వారు తమ తపోశక్తినంతా తమ క్రోధం వలన అలా అనవసరంగా ధారపోసుకున్నారు.

కానీ నేను ముందు చెప్పినట్లు కోపం అన్ని వేళలా చెడు కాదు. కోపం లేదని, అతి మంచివాడని ధర్మరాజుని శత్రువులు advantage తీసుకోలేదా? అందుకే కొంచెం కోపం కూడా వుండాలి అనిపిస్తుంది నాకు. స్వరక్షణకి కోపం చాలా ఆవసరం. చివరికి జంతువులు కూడా తమ రక్షణకి, తమవారి రక్షణకి కోపాన్ని ఒక ఆయుధంలాగా వాడుకుంటాయి. అందరినీ భయపెడతాయి. అలాగే ఎవరైనా మనం నచ్చని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తే అది కొంతవరకు మంచిదే! వాళ్ళు మన రియాక్షన్ గమనించి వాళ్ళ ధోరణి మార్చుకుంటారు. తమ పిచ్చి పిచ్చి వాగుడుని మానుకుంటారు, లేదా కనీసం తగ్గించుకుంటారు. అందుకే నేను అప్పుడప్పుడు నా కోపాన్ని కావాలని, కొంచెం సూచనగా, బయటికి ప్రదర్శిస్తూవుంటాను. లేకపోతే అవతలివారి ధోరణి ఇంక అలా అలా, ఏ ఆనకట్టలూ లేకుండా, కొనసాగుతూనే వుంటుంది. ఇంకో విషయం. కోపం మనిషికి శక్తిని, పట్టుదలని ఇస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు మనలో అంతకు ముందు లేని శక్తితో, పట్టుదలతో మనం దేనినైనా సాధించగలం. అంటే కోపం తన శక్తితో మనల్ని మన గమ్యం వైపు ముందుకి తోస్తుందన్నమాట. ఇతరులతో పోటీలు పడి ఏదన్నా సాధించాలంటే నిర్మాణాత్మకమైన, అంటే constructive కోపం, ఈర్ష్య అవసరమే! ఎక్కడైనా అవినీతి, అన్యాయం జరుగుతున్నప్పుడు వాటిని అరికట్టి సమాజాభ్యుదయం సాధించాలంటే కూడా మరి కోపం కావాలి కదా! ఇలా మంచి కోసం కోపాన్ని వాడుకుంటామంటే, అవును, కోపం మంచిదే! కోపం అవసరమే!

కానీ కోపాన్ని అంత నియంత్రణగా మరి వుపయోగించటం సాధ్యమేనా? సాధ్యమే! కొంచెం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. అందుకనే మన పెద్దవాళ్ళు ఆ పనిలో వున్న కష్టాన్ని గ్రహించారు కనుకనే అసలు ఆ కోపం జోలికి వెళ్ళద్దు అన్నారు. ఎందుకంటే ఎంత మంచి దాగివున్నా, దాన్ని సాధించటం, సరైన పద్ధతిలో దాన్ని వాడుకోవటం చాలా కష్టం కాబట్టి మనందరం కూడా కోపానికి దూరంగా వుందాం. కనీసం దానికి ప్రయత్నిద్దాం. ఇంక మానవ సహజంగా ఎప్పుడైనా కోపం వచ్చినా, దాన్ని సాధ్యమైనంతగా నియంత్రణలో అణిచివుంచి, వీలైతే దాన్ని సద్వినియోగపరుద్దాం.

తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతి!

చిన్నప్పుడు మనందరం సుమతీశతకంలోని ఈ పద్యాన్ని చదువుకున్నాము. వల్లె వేసాం. దానిలోని భావంతో మనందరం ఏకీభవించాము. అందుకే శత్రుసమానమైన ఈ క్రోధాన్ని మనందరం వదిలేద్దాం, కనీసం తగ్గించుకోవటానికి ప్రయత్నిద్దాం.

సరేనా? మరి నాతో మీరు ఏకీభవిస్తారా?

మీరు ఆలోచిస్తూ వుండండి. ఈలోపల నేను ఇప్పటికి మీ దగ్గర నుండి సెలవు తీసుకుని మళ్ళీ వచ్చే నెల కలుస్తాను. అంతదాకా సెలవు.

****సశేషం****

ముందుమాట

Radhika Noriసిరిమల్లె పాఠకులందరికీ రాధిక నోరి వినమ్ర ప్రణామాలు. నా కథల ద్వారా మీ అందరికీ ఇంతకుముందే నేను పరిచయమున్నా, ఆ పరిచయాన్ని ఇంకొంచెం గట్టిపరుచుకోవాలన్న ఆశ ఏదో గాఢంగా నన్ను చుట్టుముట్టింది. అంతేకాకుండా కథల పరిచయమిదివరకే అయిపోయింది కాబట్టి, ఈసారి ఏదైనా వేరే విధంగా మీ ముందుకు రావాలని ఆ ఆశ కాస్తా ఒక పేరాశ లాగా మారిపోయింది. అంతటితో ఆగకుండా, అంటే, కేవలం మీ అందరి ముందుకి రావటం మాత్రమే కాకుండా మీ అందరి మనసుల్లో గాఢమైన తిష్ఠ కూడా వేయాలని ఆ పేరాశ కాస్తా ఇంకో దురాశ లాగా కూడా మారిపోయింది. సరే, ఆశో, పేరాశో, దురాశో, ఏదైతే ఏం, ఒక కోరికన్నది మనసులో పుట్టినప్పుడు ఇంక అది తీరేదాకా మనసులో అలజడే కదా! అందుకని ఆ అలజడిని శాంతపరుచుకోవటం కోసం ప్రతి నెలా మీతో కబుర్లాడదామని నిర్ణయించుకున్నాను. అయితే దేని గురించి కబుర్లు అని సంకోచపడుతున్నారేమో కదూ! అబ్బ, మరీ అంత అనుమానమా? కబుర్లు అన్న తర్వాత బోలెడన్ని విషయాలు దొరుకుతాయి మనకు. మనందరి జీవితాలలో బోలెడన్ని మలుపులు. నిత్యం మనందరం ఎదుర్కొనే అనేక అవరోధాలు. అనుక్షణమూ మనకు తారసపడే ఎన్నో అనుకోని సమస్యలు. ఏదో మనకు తోచినట్లు వాటిని పరిష్కరించుకోవడానికి మనం పడే రకరకాల తిప్పలు. ఇదే కదా జీవితం అంటే! వీటన్నిటి గురించే కబుర్లాడుకుందాం. సరేనా? ఏమో! యధాలాపంగా మనం చెప్పుకునే ఆ కబుర్లలోనే ఏవైనా తియ్యటి, రుచికరమైన, తేలికైన పరిష్కారాలు మనకు దొరుకుతాయేమో! సరే, ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు కదా! అవునా? మరి ఇంక ఆలస్యం ఎందుకు? నాతో మీరు, మీతో నేను, కలిసి చేద్దాం మనం ఈ ప్రయాణాన్ని. పదండి మరి.

Posted in October 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!