బాధ్యత
ఏదైనా విందు చెయ్యాలంటే రుచికరమైన వంటలకి కావాల్సిన సరుకులన్నీ ముందు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత వంట చేసేవారి నైపుణ్యం చూపించే సమయం వస్తుంది. అలాగే కబుర్లకి కూడా సరైన విషయాన్ని ముందు ఎంచుకోవాలి. ఆ తర్వాత మన రచనా నైపుణ్యంతో ఇంక విజృంభించాలి. సరే, బాగానేవుంది. అన్ని సిద్ధంగానే వున్నాయి, కానీ మనసులోనే ప్రశాంతత మాత్రం లేదు. ఏమి రాయాలో నిర్ణయించుకున్నాను కానీ మనసులోని ఆ విషయాన్ని కాగితం మీద పెట్టే ఏకాగ్రత మాత్రం కుదరటంలేదు. ఏవో ఆఫీసులోని చికాకుల వలన కొంచెం ఇబ్బందిగా, ఆ మాటకొస్తే ఇంకొంచెం కోపంగా కూడా వుంది. అసలు ఏమైందంటే నేను ప్రాజెక్టు మేనేజరుగా వున్న ప్రాజెక్టు నేను ఆశించినంత వేగంగా వెళ్ళటం లేదు. నాకు కేటాయించిన సమయంలో అది పూర్తి అవుతుందో లేదో అన్న భయం కూడా మొదలైంది నాలో. దానికి కారణం ఆ ప్రాజెక్టులో వున్న మిగిలినవారు వారి వారి పనులు వారికని కేటాయించిన సమయంలో చకచకా చేయటంలేదు. దీనితో ఆ తర్వాత నేను చెయ్యాల్సిన పనులు కుంటువడుతున్నాయి. అంటే వారి బాధ్యతారహితం నా బాధ్యతాపూర్తికి ఆటంకమవుతోందన్నమాట. అందుకే ఒక గ్రూపులో పనులను ఆ సభ్యుల మధ్య పంచుతున్నప్పుడు వారి వారి శక్తులను, బలహీనతలను గుర్తుపెట్టుకోవాలి. నేను అలాగే చేసాను అనుకున్నాను. కానీ బహుశా అది నిజం కాదేమో! లేక శక్తిసామర్ధ్యాలు వున్నా కూడా వేరే ఇంకేదో కారణం వలన వారు సరిగ్గా వారి పని చెయ్యలేకపోతున్నారేమో! ఏమిటో, అంతా అయోమయంగా వుంది. పోనీ గ్రూపు పెద్దది చేస్తే కూడా బాధ్యతలు పలచబడతాయి. అది కూడా మంచి ఆలోచనే! అలా చేస్తే ఏమన్నా లాభం వుంటుందా? కాకపొతే ఎక్కువమందికి బాధ్యత వహించటం, ఇంకా ఎక్కువమందిని ఒకే తాటిమీద నడిపించటం నాకు కొంచెం అదనపు బాధ్యత. కానీ పని సరిగ్గా జరగాలంటే ఇలాంటి మార్పులు ఇంక తప్పవేమో మరి!
ఎవరికి అప్పగించిన పనులను వారు సరైన సమయంలో సరిగ్గా చెయ్యటాన్ని బాధ్యతని సరిగ్గా నిర్వహించటం అంటారు. అంతేకాదు. ఆ పనుల ఫలితాలని, అవి అనుకూలమైనా, ప్రతికూలమైనా కూడా సరే, వాటిని స్వీకరించి వాటికి తగిన ప్రతిస్పందనని, అంటే reaction ని చూపించటం కూడా బాధ్యతలో ఒక భాగమే! అయితే బాధ్యత అంతటితో ఆగదు, అలాగే ఆ తప్పులలోంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టడం కూడా బాధ్యతలో ఇంకో భాగమే! అసలు దీనితోనే బాధ్యత పూర్తి అవుతుంది. ఇలా చెప్తోంటే నాకు ఈమధ్యనే ఈ దేశంలో జరిగిన ఒక రాజకియ సంఘటన గుర్తొస్తోంది. మన మాజీ రాష్ట్రపతి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆయన వ్యక్తిగత సురక్షాబాధ్యతకి కారణమైన జట్టు నాయకురాలు తన బాధ్యతని తను, తన జట్టు సభ్యులు సరిగ్గా నిర్వహించలేకపోయామని తన పదవికి రాజీనామా ఇచ్చారు. అంటే ఆవిడ తన బాధ్యతావిఫలత్వాన్ని పూర్తిగా స్వీకరించి దానికి పూర్తి బాధ్యతని తనే తీసుకున్నారు. ఇంక దీనిలోంచి నేర్చుకున్న పాఠాలను ముందు ముందు భవిష్యత్తులో ఆచరణలో పెడితే అప్పుడు ఈ మొత్తం సంఘటనకి సరైన ఫలితం వుంటుంది.
ఈ సంఘటన వలన నాకు ఇంకో విషయం తెలుస్తోంది. ఒక కుటుంబంలో అనుచితమైనది ఏదన్నా జరిగితే ఆ బాధ్యత ఆ కుటుంబ పెద్దకి ఆపాదిస్తారు. అలాగే ఒక రాజ్యంలో ఏది జరిగినా ఆ బాధ్యత ఆ రాజ్యాన్నేలే రాజుగారిది. ఒక సంఘం లేక జట్టులోని సభ్యులెవరైనా తప్పు చేస్తే ఆ బాధ్యత ఆ జట్టు నాయకుడిది/నాయకురాలిది. అలాగే పిల్లలు చేసిన తప్పులకి అందరూ వారి తల్లితండ్రులనే అంటారు. సరిగ్గా పెంచలేదని ప్రతివాళ్ళూ చటుక్కున, చాలా తేలికగా అనేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన విషయమైనా ఇది మాత్రం ప్రస్తుత లోకరీతి. ఈ విషయంలో ఆలోచించాలి అని ఇలా ఎందుకు అంటున్నానంటే, రక్షణ విభాగం కాబట్టి ఆవిడ ఇచ్చిన ఆదేశాలని ఆ జట్టులోని వారందరూ పాటించితీరాలి, పాటించకపోతే శిక్షలకి గురి అవుతారు కాబట్టి తప్పకుండా పాటిస్తారు కూడా, కానీ తల్లితండ్రులు చెప్పినట్లు పిల్లలు వింటారన్న గేరంటీ ఏమున్నది? మరి అంతమాత్రానికి పిల్లలు చేసే తప్పులన్నింటికీ తల్లితండ్రులే బాధ్యులు అంటే ఎలాగ? అయినా ఇప్పుడీ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వేరే అంశం. మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం ఇది కాదు కదా! ఏ విషయం గురించి కబుర్లు మొదలెట్టానో ఆ విషయాన్ని పక్క దారులు పట్టించటం అంటే నా బాధ్యతని నేను మరచినట్లే కదా!
సరే, ఈ విషయాన్ని ఇంకో కోణంలోంచి చూస్తే, అంటే మంచి ఫలితాల గురించి ఆలోచిస్తే అప్పుడు మనకు ఏవిధమైన ఫిర్యాదులూ వుండవు. నిన్ననే నేను చూసిన superstar singer ప్రోగ్రాం ఒకటి ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. ఆ ప్రొగ్రాంలోని పిల్లలందరూ చాలా బాగా పాడుతున్నారు. వారి కెప్టెనులు అందరూ అంత బాగా పాడే పోటీదారులని ఎన్నుకున్నందుకు చాలా గర్వపడుతున్నారు. అంటే వారు తీసుకున్న బాధ్యతను వారు సరిగ్గా నిర్వహించగలిగారని అందరూ ఆనందిస్తున్నారు. ఇక్కడ కోరుకున్నది జరిగింది, అనుకున్న ఫలితం లభించింది. అందుకే అందరూ బాధ్యతను స్వీకరించి ఆనందాన్ని పంచుతున్నారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగానే వుండవు కదా! ఏది ఏమైనా, ఫలితాలు ఎలా వున్నా తాము చేసిన పనులకు పూర్తి బాధ్యతను వహించటం, ఎవరికైనా సరే, న్యాయమైన ప్రవర్తన.
ఈ బాధ్యతాయుక్తమైన ప్రవర్తన మనిషికి చాలా సహాయం చేస్తుంది. క్రమశిక్షణని, పరిశ్రమని నేర్పుతుంది. మంచి అలవాట్లకు పునాదులను వేస్తుంది. నలుగురిలో మన మీద నమ్మకాన్ని పెంచి, అందరిలోనూ మనకి మంచి పేరుప్రతిష్ఠలను సంపాదించిపెడుతుంది. సమాజంలో పరపతిని పెంచుతుంది. ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థితిస్థాపకతని, అంటే resilience ని నేర్పుతుంది. సహనాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో విజయాలకు సోపానాలు వేస్తుంది. మన ప్రవర్తనకి, నిర్ణయాలకు, మంచైనా, చెడైనా, వాటి ఫలితాలకు సంపూర్ణ బాధ్యతని వహిస్తాము కాబట్టి ఎదుటివారి దృష్టిలో మన గౌరవం పెరుగుతుంది. మన బాధ్యతలని సరిగ్గా, సంపూర్తిగా నిర్వహించటానికి మన శాయశక్తులా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము కాబట్టి మాట నిలబెట్టుకోవటం కోసం నిజాయితీగా పరిశ్రమ చెయ్యటం బాగా అలవాటయిపోతుంది. ఇది చాలా మంచి అలవాటు.
అందుకే బాధ్యతాయుక్తమైన వ్యక్తులెప్పుడూ తమ పరాజయాలను ఒక సవాలులాగా తీసుకుంటారు కానీ తమ అపజయాలకు ఎదుటివారి మీద నెపం ఎంచటానికి వంకలు వెదకరు. అసలు పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చెయ్యటానికి కావలిసిన పథకాలన్నింటినీ ముందే పకడ్బందీగా వేసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా తమ పధకాలను మార్చాల్సివస్తే చివరి నిముషం దాకా ఆగకుండా ఆ పనేదో ముందుగానే చేసేస్తారు. ఎట్టి పరిస్థితులలోను అన్న మాట తప్పరు. సమయానుపాలన చెయ్యటం ఎన్నటికీ మరువరు. తమ బాధ్యతలను ఎప్పుడూ వాయిదాలు వెయ్యరు. వాటిని చిత్తశుద్ధితో నిర్వహిస్తారు, అంతేకానీ ఎప్పుడూ ప్రగల్భాలు పలకరు. తమ భావుకతను నియంత్రణలో పెట్టుకుని ఎప్పుడూ objective గా ఆలోచిస్తారు. క్రమశిక్షణతోపాటు ఆత్మనియంత్రణని కూడా తప్పనిసరిగా పాటిస్తారు. తాము చేయవలసిన అనేక పనులను తెలివిగా prioritize చేస్తారు. ఎదుటివారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తమ ప్రవర్తన ద్వారా సంపాదిస్తారు కానీ తమ వుపన్యాసాల వల్ల కాదు. పరిస్థితులను ఎదుటివారి మీద తోసేసి వాటి దుష్ఫలితాల నుండి తప్పించుకోవటానికి దారులు వెతకరు. ఒకవేళ తెలిసో తెలియకో ఏవన్నా తప్పులు జరిగిపోతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిల్ని సవరించుకోవటానికి తమ శాయశక్తులా కృషి చేస్తారు. తమ బాధ్యతలు ఎంత పెద్దవైనా, ఎంత అత్యవసరమైనా, ఎంత ముఖ్యమైనవైనా, న్యాయాన్ని, చట్టాన్ని ఎన్నటికీ మరువరు. చూడండి, ఎన్ని మంచి లక్షణాలో! ఇవన్నీ మనిషికి బాధ్యతే నేర్పుతుంది.
ఆడ అయినా, మగ అయినా, చిన్న అయినా, పెద్ద అయినా, ప్రతివారికి కొన్ని బాధ్యతలు వుంటాయి. ఒక పౌరుడిగా ఓటు వెయ్యటం, పన్నులు సరైన సమయంలో కట్టటం, అధికార ఆస్తులను సంరక్షించటం, అకారణంగా గలభాలు, గలాటాలలో పాల్గొనకపోవడం, సంఘవిద్రోహ చర్యలేవి చెయ్యకపోవడం, సంఘ నియమాలని పాటించడం, ఇలాంటివన్నీ పౌర బాధ్యతలు. సమాజం దగ్గర నుండి మనకు తెలీకుండానే మనం కళ్ళకు కనిపించని ఎన్నో లాభాలు పొందుతాం. ఎంతో సురక్షణని పొందుతాం. మరి అలాంటప్పుడు ఆ సమాజం పట్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు వుంటాయి కదా! సమాజంలో మన పాత్రని మనం బాధ్యతాయుక్తంగా వహించటం మొదటిది. అసలు తక్కినవన్నీ దాంట్లోనే దాగి వున్నాయి. సమాజ విద్రోహ శక్తులను అణచివేయటంలో ప్రభుత్వానికి సాయపడటం, సమాజ సభ్యులందరితో కలసిమెలసి వుండటం, వీలైనంతవకు సమాజసేవ చేయటం, సమాజ పురోగతికి పాటుబడటం, ఇవన్నీ ఒక సమాజ సభ్యుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత.
అలాగే బిజినెస్ సమాజ సభ్యులకి కూడా వారికి తగిన బాధ్యతలుంటాయి. లాభాలు రాబట్టుకోవడమే మా ముఖ్యోద్దేశం అని అనుకుని ఇంక వెనక ముందు ఏమీ ఆలోచించకుండా, మనం తీసుకునే నిర్ణయాల వలన సమాజానికి ఏమన్నా అపాయం జరుగుతుందేమో అన్న జంకు గొంకు కూడా ఏమీ లేకుండా, తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం, ఇవన్నీ బిజినెస్ సమాజ సభ్యులకు బాధ్యతారహితమైన విషయాలు. దాని వలన వారికి తాత్కాలికమైన లాభాలేవన్నా వస్తాయేమో కానీ ఆ బిజినెస్ లకు ప్రజలలో మంచి పేరు మాత్రం వుండదు. ఆ కంపెనీలతో బిజినెస్ చెయ్యటానికి, వారి వస్తువులను కొనటానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఒక సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే సమాజస్పృహ లేని బిజినెస్ లు, తెలిసో తెలియకో తమ స్వార్థం కోసం సమాజ ద్రోహం చేసే బిజినెస్ లతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం చాలామంది ప్రజలకు ఇష్టం వుండదుట. అందుకే లాభాల కోసం బిజినెస్ చెయ్యటంలో తప్పు లేకపోయినా బాధ్యతారహితంగా చెయ్యటం మాత్రం చాలా తప్పు.
మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా మన బాధ్యతలను మాత్రం కొంచెం కూడా మరువరాదని, అలా చేస్తే అది పెద్ద పాపం తో సమానమని మహాత్మా గాంధీ అనేవారు. పరిశ్రమ లేకుండా వచ్చిన ధనం, మనస్సాక్షిని మరచి పొందిన ఆనందం, మానవతని మరచిన విజ్ఞానం, మంచి వ్యక్తిత్వం లేని జ్ఞాన సంపద, ఎటువంటి నియమాలు, సిద్ధాంతాలు లేని రాజకీయాలు, నైతికతని మరచిన వాణిజ్యం, నిస్స్వార్థ చింతన లేని ఆరాధన, ఈ ఏడు రకాలైన పాపాలు మన బాధ్యతలను మరచిన లక్షణాలే అని బాపు అనేవారు.
ఇలాగే అనేక రకాలైన బాధ్యతల సంకెళ్ళలో మనిషి జీవితం ఎప్పుడూ బందీ అయివుంటుంది. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సమాజ సభ్యుడిగా, ఒక దేశపౌరుడిగా శరీరంలో ప్రాణం వున్నంత వరకు ఈ సంకెళ్ళను ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రేమికులకు వాళ్ళ మధ్య ప్రేమని పెంచుకునే బాధ్యత, భార్యాభర్తలకు వాళ్ళ మధ్య ప్రేమని రక్షించుకునే బాధ్యత, ప్రతి కుటుంబపెద్దకి తన కుటుంబ సభ్యులందరినీ ఒకే తాటి మీద నడిపే బాధ్యత, అలాగే ఆ కుటుంబసభ్యులందరికి తమలో తాము కలసిమెలసి వుండాల్సిన బాధ్యత, విద్యార్థులందరికీ కేవలం చదువు మీద ధ్యాస పెట్టి శ్రద్ధగా చదువుకోవాల్సిన బాధ్యత, వుద్యోగస్తులందరికీ క్రమశిక్షణతో నిజాయితీగా పని చేసే బాధ్యత, పిల్లలు, చిన్నవాళ్ళందరికీ కుటుంబంలోని వృద్ధులైన తల్లితండ్రులను, మిగిలిన పెద్దవారందరిని ప్రేమగా, గౌరవంగా చూసే బాధ్యత, ఇలాంటి రకరకాల బాధ్యతలలో అందరి జీవితం అనుక్షణం ముడిపడివుంటుంది.
అయితే ఈ బాధ్యతల నిర్వహణ అందరూ ఒకేలాగా చెయ్యరు. ఎందుకంటే అందరి పధ్ధతి ఒకేలాగా వుండదు. అలాగే అందరి ఆలోచన కూడా ఒకే మార్గంలో సాగదు. కొంతమంది బాధ్యతను కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. వారి వ్యక్తిగతమైన బాధ్యతలే కాకుండా వారు వున్న గ్రూపు బాధ్యతలు కూడా వీరు తమ భుజస్కంధాల మీద వేసుకుంటారు. అంతేకాదు, వీరు perfectionist లు కూడా. ఒక్క తామే కాదు, అందరూ కూడా ఆ పనిని ఏ వంక లేకుండా చెయ్యాలని వీరు ఆశిస్తారు. అక్కడే వస్తుంది చిక్కంతా. ఒకప్పుడు నేనలాగే వుండేదాన్ని. Group performances ఇస్తున్నప్పుడు ఒక్క నేనే కాదు, నాతోపాటు మిగిలిన అందరూ కూడా తప్పులు లేకుండా పాడాలని కోరుకునేదాన్ని, కానీ అలా జరిగేది కాదు. ఇంక వారి అపశృతులన్నీ మొత్తం performance మీద ఎక్కడ చెడు ప్రభావం చూపిస్తాయో, పాట ఎక్కడ పాడవుతుందో అని నా blood pressure పెరుగుతూవుండేది. ఒక టీము సభ్యురాలిగా తన టీము performance బాగా వుండాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ దానికోసం తనకు సంబధం లేని బాధ్యత తన నెత్తి మీదే వుంది అని అనుకోవటం తప్పు. అయినా composer గారికి లేని తాపత్రయం నాకెందుకు? ఆతర్వాత అది పూర్తిగా అనవసరం, అర్థం, పర్థం లేని తెలివితక్కువతనం అని గ్రహించి నన్ను నేను మార్చుకున్నాను. Perfect గా పాడాలి అన్న సూత్రాన్ని కేవలం నా వరకే పరిమితం చేసుకున్నాను. ఇతరుల బాధ్యత నాది కాదు అని గ్రహించాను. ఎందుకంటే గ్రూపు లీడరును నేను కాదు. అందుకని ఎవరి బాధ్యతను వారికి వదిలేయటం కూడా అందరి బాధ్యత సుమా!
ఇంకో రకం మనుషులు వుంటారు. వీళ్ళు ఎల్లప్పుడూ ఎదుటివారికి సహాయం చెయ్యటం తమ బాధ్యత అనుకుంటారు. అందుకని అస్తమాను ఇతరులకి ఎలా సహాయం చెయ్యాలా అని తెగ సతమతమైపోతూ వుంటారు. పరోపకారం మంచిదే, కానీ అది మన మీద అంత ఒత్తిడిని తీసుకురాకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే ఎవరికైనా సహాయం చెయ్యాలి.
సరే, ఇంకో రకం, వీళ్ళకి ఎప్పుడూ అందరికంటే తాము ఒక అడుగు ముందు వుండాలన్న తాపత్రయం. ఎందుకంటే అప్పుడే తమ image బాగుంటుందని, అందరిలోనూ తమ ఆధిక్యత ఋజువవుతుందని, గౌరవం పెరుగుతుందని, ఎలాంటి పని అయినా దాన్ని సానుకూలపరిచే బాధ్యత చక్కగా పూర్తవుతుందని వీళ్ళ అభిప్రాయం. దానికోసం, పాపం, ఎల్లప్పుడూ తెగ సతమవుతూవుంటారు.
మరో రకం వుంటారు. వీరు తమ బాధ్యతలను కొంచెం ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. ఒకవేళ అనుకున్న ఫలితం లభించకపోతే తమకు తామే ఏదో అన్యాయం చేసుకున్నట్లు నలుగురిలోనూ చిన్నతనంగా ఫీల్ అవుతారు. తమ బాధ్యతారాహిత్యానికి చాలా సిగ్గుపడతారు. అప్పుడు వీళ్ళు పడే మనస్తాపానికి ఇంక అంతే వుండదు.
ఇంకో రకం, వీళ్ళ బాధ్యత కొంచెం పరిమితంగా వుంటుంది. అంటే తమకి మాత్రమే తాము బాధ్యులు, ఇతరులకు కాదు అని వీళ్ళకి తెలుసు, అందుకని తమ వున్నత ఆశయాలను కేవలం తమ వరకే పరిమితం చేసుకుని మనశ్శాంతిని పొందుతారు. దీనిలో ఏమీ తప్పు లేకపోయినా అప్పుడప్పుడు అది కొంచెం స్వార్థం లాగా అనిపించే ప్రమాదం వుంది. ఎదుటివారి బాధ్యతలలో తలలు దూర్చక్కరలేదు. కానీ మరీ నన్ను ముట్టుకోకు అన్నట్లు, ఎదుటివారికి సహాయ సహకారాలు కావాలని తెలిసినా కూడా ఏమీ పట్టనట్లు వుండటం కూడా మంచిది కాదు కదా!
ఇంకోరకం, వీళ్ళు ఏదైనా సరే, అసలు బాధ్యత తీసుకోవటానికే భయపడతారు. ఎందుకంటే ఏ బాధ్యత తీసుకుంటే ఏ ఆపద ముంచుకు వస్తుందో, ఎక్కడ తమ బాధ్యత విఫలం అవుతుందో, ఏ చెడ్డపేరు వస్తుందో, ఎదుటివారి దృష్టిలో తమ విలువలు తగ్గిపోతాయేమో అని వీళ్ళకి భయం. అందుకే వీళ్ళు అస్తమానూ ఎవరినన్నా అనుసరించటాన్ని ఇష్టపడతారు. తమంతట తాము ఏ బాధ్యతా తీసుకోరు.
ఇంకొంతమంది వుంటారు, వీళ్ళు న్యాయానికి, చట్టానికి వారిదే బాధ్యత అనుకుంటారు. ఎక్కడ ఏ అన్యాయం, అపరాధం జరిగినా దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని, సమాజంలో నుండి వాటిని రూపుమాపడానికి కంకణం కట్టుకుంటారు. ఈ సమాజంలోని కుళ్ళు, కుతంత్రాలన్నీ కేవలం తామొక్కరు లేకపోవటం వల్లనే మరీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని అధికమైన, అనవసరమైన బెంగ పడిపోతూవుంటారు. నిజాయితీపరులైన పోలీసువారు, మిలిటరివారికి తామేమీ తీసిపోమని వాళ్ళు అనుకుంటారు.
ఇలా బాధ్యతలు రకరకాలు. అయితే అవి తీర్చుకునే మనుషులు, వారి ఆలోచనా విధానాలు, బాధ్యతాపాలనలలో వారు పాటించే రీతులు మాత్రం అనేకానేకం.
అందుకే బాధ్యతల బరువులను మోయగలగటం, వాటిని సరిగ్గా నిర్వహించగలగటం ఈ ప్రపంచంలోకెల్లా అతి కష్టమైన పనులు అని అంటాను నేను. తండ్రి మాటను నిలబెట్టాలన్న బాధ్యతను, ప్రజలను కన్నబిడ్డలలాగా చూడాలి అన్న బాధ్యతను, రామరాజ్యంలో ప్రతివారికి, ఆఖరికి ఒక చాకలివాడికైనా సరే, సరిసమానమైన హక్కులు ఇవ్వాలన్న బాధ్యతను, ధర్మపాలన కోసం తనవారిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి వెనుకంజ వేయకూడదన్న బాధ్యతను, వీటినన్నిటిని మర్చిపోలేదు కాబట్టే రాముడు దేవుడయ్యాడు. అవునా?
నేను రాముడంతటి గొప్ప వ్యక్తిని కాను. కానీ మీతో ప్రతి నెలా కబుర్లు చెప్తానన్న నా బాధ్యతను మాత్రం ఈ నెలకి తీర్చేసుకున్నాను. అమ్మయ్య, ఈ నెలకి నా బాధ్యత ముగిసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన కబుర్లు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను
మరి వచ్చే నెల దాకా సెలవు. సరేనా?
****సశేషం****
ముందుమాట
సిరిమల్లె పాఠకులందరికీ రాధిక నోరి వినమ్ర ప్రణామాలు. నా కథల ద్వారా మీ అందరికీ ఇంతకుముందే నేను పరిచయమున్నా, ఆ పరిచయాన్ని ఇంకొంచెం గట్టిపరుచుకోవాలన్న ఆశ ఏదో గాఢంగా నన్ను చుట్టుముట్టింది. అంతేకాకుండా కథల పరిచయమిదివరకే అయిపోయింది కాబట్టి, ఈసారి ఏదైనా వేరే విధంగా మీ ముందుకు రావాలని ఆ ఆశ కాస్తా ఒక పేరాశ లాగా మారిపోయింది. అంతటితో ఆగకుండా, అంటే, కేవలం మీ అందరి ముందుకి రావటం మాత్రమే కాకుండా మీ అందరి మనసుల్లో గాఢమైన తిష్ఠ కూడా వేయాలని ఆ పేరాశ కాస్తా ఇంకో దురాశ లాగా కూడా మారిపోయింది. సరే, ఆశో, పేరాశో, దురాశో, ఏదైతే ఏం, ఒక కోరికన్నది మనసులో పుట్టినప్పుడు ఇంక అది తీరేదాకా మనసులో అలజడే కదా! అందుకని ఆ అలజడిని శాంతపరుచుకోవటం కోసం ప్రతి నెలా మీతో కబుర్లాడదామని నిర్ణయించుకున్నాను. అయితే దేని గురించి కబుర్లు అని సంకోచపడుతున్నారేమో కదూ! అబ్బ, మరీ అంత అనుమానమా? కబుర్లు అన్న తర్వాత బోలెడన్ని విషయాలు దొరుకుతాయి మనకు. మనందరి జీవితాలలో బోలెడన్ని మలుపులు. నిత్యం మనందరం ఎదుర్కొనే అనేక అవరోధాలు. అనుక్షణమూ మనకు తారసపడే ఎన్నో అనుకోని సమస్యలు. ఏదో మనకు తోచినట్లు వాటిని పరిష్కరించుకోవడానికి మనం పడే రకరకాల తిప్పలు. ఇదే కదా జీవితం అంటే! వీటన్నిటి గురించే కబుర్లాడుకుందాం. సరేనా? ఏమో! యధాలాపంగా మనం చెప్పుకునే ఆ కబుర్లలోనే ఏవైనా తియ్యటి, రుచికరమైన, తేలికైన పరిష్కారాలు మనకు దొరుకుతాయేమో! సరే, ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు కదా! అవునా? మరి ఇంక ఆలస్యం ఎందుకు? నాతో మీరు, మీతో నేను, కలిసి చేద్దాం మనం ఈ ప్రయాణాన్ని. పదండి మరి.
రాధిక గారి రచన బాగుంది.. కబుర్ల ప్రయాణానికి నేను సిద్దం.