Menu Close
Vempati Hema photo
పుణ్యానికి పోతే ... ! (కథ)
-- వెంపటి హేమ --

"ఏమయిందిరా శశీ! ఎందుకంత పరాగ్గా ఉన్నావు?" అన్న అమ్మ పలకరింపుతో ఉలిక్కిపడ్డాను. అస్తమయ సంధ్య వేళ గుడికి వెళ్లి వచ్చిన అమ్మ ప్రసాదం పట్టుకుని నా ఎదురుగా నిలబడి ఉంది.

ప్రసాదం కోసం చెయ్యి పడుతూ అన్నా, "అమ్మా! రఘునందన్ ని అరెస్టు చేశారట!" ఒక్కసారిగా నా బాధకు మూలమేమిటో అమ్మ ముందు వెళ్ళగక్కాను.

"రఘునందన్ అంటే ఎవరు! నీతోపాటు చదువుకున్న ఆ అబ్బాయికదూ" అంది అమ్మ రఘుని గుర్తుచేసుకుంటూ.

"ఔనమ్మా! వాడే. పోలీసులు ఒక్క ఫోన్ కాల్ కి ఒప్పుకున్నారుట. వెంటనే వాడు నాకు ఫోన్ చేసి గబగబా జరిగిందంతా చెప్పి నా సాయం అడిగాడు."

రఘునందన్ నా క్లాసుమేటు, రూమ్ మేటు కూడా. అప్పట్లో మా ఊరు ఇంత బాగా ఎదగలేదు. వేరే ఊరు వెళ్లి గది అద్దెకు తీసుకుని ఉంటూ కాలేజీలో చేరా. రఘునందన్ నా గదిలోనే ఉండేవాడు, సగం అద్దె ఇస్తూ. వాడూ నా క్లాసే! ఇంటర్ మొదలు డిగ్రీ పూర్తి చేసేవరకూ అయిదు సంవత్సరాలు ఒకే రూంలో ఉండి కలిసి చదువుకున్నాము. ఒకే ప్రాణంగా బ్రతికాము. డిగ్రీ చేతికి వచ్చాక మా దారులు వేరయ్యాయి. నేను లా చదవడానికి వెడితే, MA, M Phil చదివాడు. అక్కడితో చదువు పూర్తి చేసి సొంత ఊరిలోని కాలేజిలోనే లెక్చరర్ అవ్వాలని వాడి కోరిక. ఇంతలో ఈ ఉపద్రవం! జైలుకెళ్లిన వాడిని మినిస్టర్ని చేస్తారుగాని, క్రిమినల్ అని ముద్ర పడితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు.

అమ్మ మళ్ళీ అడిగింది, "ఇంతకీ  నీ నేస్తం ఏమి తప్పు చేశాడుట?"

"లేదమ్మా, ఏ తప్పూ చెయ్యలేదు. మంచికి పోతే చెడ్డ ఎదురుగా వచ్చింది. వాడు చాలా మంచివాడమ్మా."

"అయ్యో! అలా ఎలా జరిగిందిరా!" ఆశ్చర్యంగా చూసింది అమ్మ.

"ఆదో పెద్ద కథమ్మా" అంటూ నేను చెప్పడం మొదలుపెట్టా...

"ధర్మో రక్షతి రక్షితః" అన్నది ఒక ఆర్యోక్తి.. ధర్మాన్ని రక్షించిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది - అని దాని అర్థం. "శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" అంటే ధర్మ సాధనకు శరీరమే మూలం - ఇది మరో సూక్తి! "ప్రాణాశ్రితం ఇదం కాయం!" ఈ శరీరం ప్రాణాన్ని ఆశ్రయించుకుని బ్రతికి ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడే కదా శరీరానికి ఒక విలువ, గుర్తింపు ఉండేది! మరో మాట ఏమిటంటే "అన్నగతః ప్రాణం" తిండి లేకపోతే ప్రాణం ఎక్కువ రోజులు నిలువలేదు - అన్నది ప్రత్యక్ష సత్యం.

ఒరేయ్ శశీ! ఇదంతా చూస్తూంటే నీకేమనిపిస్తోందిరా? అన్నం ఉంటేనే ధర్మం ఉంటుంది అనిపించడం లేదా? ఇప్పుడు ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఆకలి బాధేరా" అనేవాడు రఘునందన్.

అతికినా అతక్కపోయినా రకరకాల సూక్తులను ఒకచోటికి చేర్చి, ఒక సందేశాన్ని సృష్టించడం అన్నది రఘుకున్న అలవాట్లలో ఒకటి. సూక్తులన్నిటినీ క్రోఢీకరించి నా నేస్తుడు రఘు అంటాడు,

"ధర్మాన్ని రక్షించాలంటే ముందుగా ఆకలి రక్కసిని చంపితే చాలు. దేశం సుభిక్షంగా ఉంది - అంటే ఎవరికీ ఆకలి బాధ లేదని కదా అర్ధం. ఎప్పుడైతే ఆకలిబాధ లేకుండా పోతుందో అప్పుడు ధర్మం దానంతటదే వర్ధిల్లుతుంది."

"అరే బాబూ! ఇది కలియుగంరా! మనిషిని పట్టి పీడించేది ఆకలి ఒకటే కాదు, ఇంకా చాలాఉన్నాయి. తన ప్రభావం చూపించి ప్రలోభపెట్టేది మరొకటుంది, అదేరా - (దుర్)ఆశ" అని చెప్పేవాడిని. ఆకలి అవసరమైన వాటి కోసం ఏడిస్తే, ఆశ అక్కరలేని వాటికోసం ఏడుస్తుంది."

రఘునందన్ ని తల్లితండ్రులు ఆదర్శాలు నూరిపోసి పెంచారు. నిజం చెప్పాలంటే వాడు చాలా మంచి వాడు. ఎవరైనా ఆకలితో బాధ పడుతున్నారనిపిస్తే వెంటనే తన దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చేసేవాడు చదువుకునే రోజుల్లోనే. అలా ఇచ్చెయ్యడం వల్ల, వాళ్ళ నాన్న ఇచ్చిన పాకెట్ మనీలో వాడు తిన్నది చాలా తక్కువ ఉండేది. వాడు తన చేష్టకు "దరిద్ర నారాయణసేవ" అని పేరు పెట్టుకున్నాడు.

ఎప్పుడైనా స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లాలన్నా టిక్కెట్టు కొనడానికి చాలినన్ని డబ్బులు వాడి జేబులో ఎప్పుడూ ఉండేవికావు. కొందరు స్నేహితులు వాడిని ఆటపట్టించేవారు, "ఒరేయ్, రఘు! నువ్విచ్చిన డబ్బులతో నీ దరిద్రనారాయణులలోని దరిద్రం వదిలిపోయిందని అనుకోకు; అదెక్కడికీ పోలేదు, వాళ్ళని వదలి వచ్చి నిన్ను పట్టుకుందిరా" అని హేళన చేసేవారు.

మరికొందరు, "అవసరంలో ఉన్నట్లు కనిపించేవారందరూ నిజంగా అవసరంలో ఉన్నవారు కారు. బద్దకస్తులు, సోమరి పోతులూ. కాయకష్టం చెయ్యడానికి ఇష్టపడక అడుక్కోడాన్నే వృత్తిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్లకి ఇచ్చిన డబ్బు అపాత్రదానం ఔతుంది. నువ్వు వాళ్ళ సోమరితనాన్ని పోషిస్తున్నావు - అన్నమాట! అది మంచిది కాదు. తన్నుమాలిన ధర్మం మొదలు చెడిన బేరమౌతుంది. కర్ణుడంతటివాడు అలాగే నష్ట పోయాడు. అర్థం చేసుకో" అంటూ హితబోధ చేసేవారు. అన్నీ శ్రద్దగా వినేవాడు. కానీ ఎప్పటిలాగే ఉండేవాడు.

నాకూ చెప్పాలని ఉండేది, కానీ తాను నమ్మిన సూక్తిని వాడు బ్రహ్మరుద్రాదులు కాదన్నా పట్టించుకోడు. వాడి తత్త్వం నాకు తెలుసు కనుక నేనేమీ మాట్లాడే వాడిని కాదు. నాకు వాడితో కలసి సినిమాకు వెళ్లాలని ఎప్పుడు అనిపించినా ఇద్దరి టిక్కెట్లు నేనే కొనేవాడిని.

డిగ్రీ పూర్తి చేశాక మేము విడిపోక తప్పలేదు. న్యాయ శాస్త్రం చదవడానికి నేను లా కాలేజీలో చేరాను. వాడు లిటరేచర్ లో M A , M Pil చేశాడు, వాళ్ళ ఊరి కాలేజీలో లెక్చరర్ అవ్వాలన్న కోరికతో.

నేను చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టా. నాకు ఉద్యోగం వచ్చింది. వృద్ధులైన తల్లితండ్రుల్ని విడిచి వేరేచోటుకి వెళ్లకుండా, సొంత ఊరిలోని కాలేజీలో లెక్చరర్గా చేరాలనుకున్నాడు. వాడి చదువు పూర్తయ్యింది, కానీ ఖాళీలు లేక వెంటనే వాడికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సంవత్సరం నుండి నిరుద్యోగిగానే ఉన్నాడు. ఇప్పుడు కాలేజీ వృద్ధిచెంది కొత్త లెక్చరర్స్ కావాల్సి రావడంతో, ఇన్నాళ్లు గడిచాక ఇప్పుడు వాడికి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది ఊళ్ళోనే ఉన్న కాలేజీ నుండి. తల్లిదండ్రులకు చాలా సంతోషమయ్యింది, ఉద్యోగం పేరుతో కొడుకు తమని వదలి వెళ్లి పోకుండా, ఇక్కడే ఉంటాడు ఈ ఉద్యోగం కనక వస్తే - అనుకున్నారు. ఆ రోజు రఘు ఇంటర్వ్యూకి బయలుదేరాడు.

వాడు ఇంటర్వ్యూకి వెడుతూండగా బజారు వీధిలో నాలుగు వీధుల కూడలిలో పేవుమెంటు మీద ఒక అడుక్కుంటున్న ముసలి ఆమె కనిపించింది వాడికి.

ఎముకలపైన తోలు కప్పినట్లుగా ఉంది ఆమె శరీరం. చర్మం ముడతలు పడి దయనీయంగా ఉంది ఆమె రూపం. వయసు ఎనభైకి పైమాటే అనిపిస్తుంది. ఆమెను చూసిన వాళ్లకి. వేసవి కావడంతో ఎండ తలను మాడ్చేదిగా ఉంది.

అన్నం తిని రెండు రోజులయ్యింది - అన్న ఆ బిచ్చగత్తె మాట సూటిగా వచ్చి ఆ దారిన పోతున్న రఘునందన్ హృదయాన్ని తాకింది. అంతే! వాడి హృదయం ద్రవించిపోయింది. తన్ను తాను మర్చిపోయాడు. ఇంటర్వ్యూ విషయం గుర్తుకి రాలేదు. వెంటనే బ్రతిమాలి, బామాలి ఆటో మీద ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఇంటిదగ్గర ఆమెకు రాజోపచారాలు చేశాడు. ఆమెచేత వెచ్చని నీటితో స్నానం చేయించి, కట్టుకోడానికి తన తల్లి చీరా జాకట్టు ఇచ్చాడు. కమ్మని భోజనం పెట్టించాడు. పడుకోడానికి మెత్తని పక్క చూపించి ఆమెను పడుకోమని చెప్పాడు. ఈ పనులన్నిటికీ వాడికి తల్లిదండ్రులు కూడా సహకరించారు.

ఒక అనాధ స్త్రీ కి సాయం చేయగలిగినందుకు ముగ్గురూ తృప్తిపడ్డారు. కానీ, ఆ పెద్దామెకు మాత్రం ఆ మెత్తని పక్కపై నిద్రపట్టలేదు. ఆ రాత్రంతా ఆమె ఏదో తెలియని అలజడితో నిద్ర పట్టక కొట్టుమిట్టాడింది.

మరునాడు కొంతమంది పోలీసులను వెంటబెట్టుకుని, ఒకతను అక్కడకు వచ్చాడు. పోలీసులు రఘుని అరెస్టు చేసి చేతులకు అరదండాలు వేశారు.

రఘు పోలీసుల్ని అడిగాడు, "ఏమిటి నేను చేసిన తప్పు."

పోలీసుల వెంట వచ్చిన అతను జవాబు చెప్పాడు, "నువ్వు మా అమ్మను కిడ్నాప్ చేశావు" అన్నాడు.

"కిడ్నేపా?" తెల్లబోయాడు రఘు, "ఆమె తానొక అనాధనంటూ అడుక్కుంటూంటే, నిజంగానే అనాధ అనుకుని జాలిపడి, ఇంటికి తీసుకువచ్చి, భోజనంపెట్టి ఆమెకు సంరక్షణ చేశాను. అంతేగాని ఆమెను నేను కిడ్నాప్ చెయ్యలేదు. నువ్వుండగా ఆమె అనాధనంటూ చెప్పుకోడం ఏమిటి" అని అడిగాడు.

ముసలమ్మ కొడుకు ఖస్సుమన్నాడు. "ఆమె నా తల్లి, ఆమె సంగతి నేను చూసుకుంటా. మధ్యలో నీకెందుకు."

రఘుకు తిక్కరేగింది, మంచికిపోతే చెడు ఎదురైనందుకు.

"కొడుకు బ్రతికి ఉండగానే ఈ వయసులో ఆమె ఎండలోపడి, తాను అనాధను అని చెప్పుకుంటూ అడుక్కోవలసిన అవసరం దేనికి" అని అడిగాడు ముసలమ్మ కొడుకుని.

"అది మా స్వవిషయం. మధ్యలో నువ్వు కల్పించుకుంటే మాటదక్కదు, జాగ్రత్త" అన్నాడు అతడు కోపంగా.

"నోరు మూసుకోండి ఇద్దరూ. ఈ వాదనలన్నీ తరువాత కోర్టులో చేసుకొందురుగాని" అంటూ పోలీసు తన అధారిటీ చూపించాడు.

అంతలో లోపలనుండి ముసలమ్మ వచ్చి కొడుకు పక్కకు చేరింది. "ఏమిటి ముసలమ్మా! ఈయన నిన్ను కిడ్నేప్ చేశాడా? అంటే - బలవంతంగా లాక్కొచ్చాడా ఇక్కడకు?" అడిగాడు పోలీసు ముసలమ్మని.

"ఔను బాబూ. నేను రానన్నా కూడా, బలవంతంగా తీసుకొచ్చాడు ఇక్కడకు. నా కిక్కడ ఏమీ బాగాలేదు. నేను నా కొడుకుతో వెళ్ళిపోతా" అంది ఆమె.

తెల్లబోయాడు రఘు. ముసలమ్మ మాటలతో రఘు దోషి అయ్యాడు.

ముసలమ్మ కొడుకు వెంట వెళ్ళిపోగా, రఘుని తమ వెంట తీసుకుపోయారు పోలీసులు.

"ఒకసారి FIR ఫైల్ చేశాక, నువ్వు దోషివో, నిర్దోషివో తేల్చి చెప్పే తీర్పు రావాలంటే కోర్టు ఎక్కాల్సిందే" అంటూ.

"అమ్మా ఇదీ కథ. నా ప్రాణమిత్రుడు ఇప్పుడు అనవసరంగా జైలు పాలయ్యాడు. నేను రేపు ఉదయమే బయలుదేరి వెళ్లి, అసలు విషయమేమిటో తెలుసుకుని, బెయిలైనా ఇప్పించి వాడిని బయటికి తీసుకువస్తా" అన్నా.

అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూటాయి. "మంచికి పోతే చెడు ఎదురొచ్చింది" అన్న సామెత ఊరికే రాలేదు. రకరకాల జీవితానుభవాల్లోంచే పుట్టాయి సామెతలు - అంటారు. ఇలాంటిదే నేను నీకో చిన్న కథ చెపుతా విను" అంటూ అమ్మ చెప్పడం మొదలుపెట్టింది...

"అప్పుడు నువ్వు పసి పిల్లాడివి. ఆ సమయంలో మీ నాన్న భీమవరంలో పని చేస్తూండేవారు. అక్కడ మనం ఒక పాతకాలపు పెంకుటింట్లో అద్దెకు ఉండేవాళ్ళం. పెద్దపెద్ద అరుగులతో రోడ్డుకి పక్కనే ఉండేది ఆ ఇల్లు. రోజూ ఒక సైకిల్ రిక్షావాడు మన అరుగు పక్కన తన రిక్షా ఆపుకుని, ఎదురుగుండా ఉన్న సందులోకి వెళ్లేవాడు. ఎప్పుడైనా నేను గుమ్మంలో కనిపిస్తే,

"మీకు రిక్షా కావాలంటే నాకు చెప్పండమ్మా" అనేవాడు. దగ్గరలో ఉన్న వాళ్ళ ఇళ్ళకేగాని ఎప్పుడూ సైకిల్ రిక్షా ఎక్కి వెళ్లేటంత దూరం నేను వెళ్ళనూ లేదు, అతని రిక్షా ఎక్కనూ లేదు. నిజానికి ఆ అబ్బి పేరేమిటో కూడా నేను అడగలేదు. కేవలం ముఖ పరిచయం మాత్రమే!

ఒక రోజు ఆ అబ్బి ఒక స్టీలుగ్లాసు తీసుకుని వచ్చి, "అమ్మా! ఈ రోజు ఒక్క బేరం కూడా దొరకలేదు, పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు, ఈ గ్లాసు దగ్గర పెట్టుకుని, ఒక్క పది రూపాయలు ఇప్పించారంటే పిల్లలకు ఇంత తిండి దొరుకుతుంది" అని ఎంతో దీనంగా అడిగాడు. (ఇప్పటిలా కాదు, అప్పట్లో పది రూపాయలు ఇస్తే ఓమాదిరిగా కొంత సరుకు వచ్చేది.)

ఆ అబ్బి మాటలకు నా కడుపు తరుక్కుపోయింది. వెంటనే పది రూపాయలు తెచ్చి ఇచ్చి,

"నీ గ్లాసు నాకు వద్దు. నీదగ్గరే ఉంచుకో. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా బాకీ తీర్చు" అని చెప్పి అతన్ని పంపేశా. నాకు దణ్ణం పెట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు.

మరునాడు మన పనిమనిషి వస్తూనే నన్ను నిలదీసింది, "ఆ పాపిస్టోడికి (రిక్షావాడికి) మీరు డబ్బులు ఎందుకిచ్చారమ్మా? వాడిల్లు మా ఇంటికి దగ్గరే. వాడు రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని చితక బాదాడు. అంతేకాదు, ఆ పెద్దరుగుల ఇంట్లో ఉండే అమ్మ నాకు తాగడానికి డబ్బులిచ్చింది - అంటూ తందనాలాడడం మొదలుపెట్టాడు. తెల్లవార్లూ మాకెవరికీ నిద్రలు లేవు. అలాంటోడికి డబ్బిస్తే పాముకి పాలు పోసినట్లవుతుందమ్మా" అంటూ నాకు నీతులు చెప్పడం మొదలుపెట్టింది. తెల్లబోయా...

"పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారంటే ఇచ్చాను, లేకపోతే ఎందుకిస్తా? నాకేం తెలుసు ఆ అబ్బి ఇలాంటివాడని" అంటూ సద్ది చెప్పడానికి ప్రయత్నించా.

పనిమనిషి ఫకాలున నవ్వింది. "ఆడికి పిల్లా, పీచూ ఎవరూ లేరమ్మా. మీతో అలా అబద్ధం చెప్పాడా! బలే కంత్రీవోడు" అంది.

నా పేరు అల్లరి పాలవ్వడానికి ఇందులో నా తప్పేముంది చెప్పు! ఆ రోజంతా, ఆ అబ్బి పెళ్ళాం ఎవరో నాకు తెలియకపోయినా, ఆమె ఏడుపు నా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది. ఆ పాపంలో నాకూ పాలుందనిపించి భోరున  ఏడుపొచ్చింది." అంది మా అమ్మ కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ.

******

నేను వెళ్లి త్వరత్వరగా పావులు కదిపా.

పోలీసుల పరిశీలనలో తేలింది ఏమిటంటే, "ఆ ముసలమ్మ కొడుకు, కోడలు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారనీ, తిండికీ, గుడ్డకీ వాళ్లకి ఏలోటూ లేదనీ, ఆ కొడుకు అదనపు సంపాదనకోసం ముసలి తల్లిని ఉపయోగించుకుంటున్నాడనీ తేలింది. అతడు ప్రతిరోజూ తెల్లారేసరికి ముసలమ్మకు కాస్త చద్ది తినిపించి, బైక్ మీద తీసుకువచ్చి ఆ బజారువీధిలో నాలుగు వీధుల కూడలి దగ్గర పేవ్మెంటుమీద కూర్చోబెట్టి వెళ్ళిపోయి, మళ్ళీ సాయంకాలం వచ్చి, ఇంటికి తీసుకుపోయి, ఆమె అడుక్కున్న డబ్బులన్నీ తను తీసుకుని, ఆమెకు ఒక గ్లాసు సారాయి ఇచ్చి సంతోషపెడతాడనీ, ఆ సారాకు అలవాటు పడిన ఆమె, అది లేకుండా ఉండలేక, దానికోసం కొడుకు ఎలా చెపితే అలా వింటుందనీ తెలుసుకున్నారు.

ఎంక్వైరీలో రఘుకి "క్లీన్ చిట్" వచ్చింది. రఘుని చూసి పోలీసులు జాలిపడ్డారు.

"దానం, ధర్మం చెయ్యడం మంచిపనే, కానీ అవతలి వ్యక్తికి ఆ దానాన్ని స్వీకరించే అర్హత ఉందో, లేదో కూడా చూసుకుని మరీ దానం చెయ్యాలి. లేకపోతే మనం చేసిన దానధర్మాలు తోడ్పడేది అధర్మానికే" అంటూ పోలీసులు రఘుకి హితబోధ చేసి, తొలి తప్పిదంగా క్షమించి అతనిని వదిలేశారు.

****సమాప్తం****

Posted in March 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!