డిసెంబర్ నెల క్రిస్టమస్ వారాంతం శెలవుల్లో రూమ్మేట్లు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నపుడు మహేష్ భట్ అడిగేడు రామారావుని, "మీరెప్పుడైనా ఓ అమ్మాయిని ప్రేమించారా?"
"ఎక్కడ? అమెరికాలోనా ఇండియాలోనా?"
"ఇండియాలోనే, ఇక్కడ నల్ల అమ్మాయిలని మనం ఎలాగా చూడం, తెల్లమ్మాయిలు మనకేసి చూస్తారేవిటీ?"
"ఎందుకు చూడరూ? కో అంటే కోటిమంది మనవాళ్ళు తెల్లమ్మాయిల్ని చేసుకోవట్లే?"
"కోటి మందా? హ, హ అంతవరకూ వద్దు భాయీ, నీ గురించి చెప్పు చాలు."
"అదో పెద్ద కధ. నా గురించి అలా ఉంచి మీరు ప్రేమించారా, ఆ విషయం చెప్పండి," భట్ ని అడిగేడు రామారావు.
“నేనో అమ్మాయిని ప్రేమించడం వరకూ నిజమే కానీ ఇంట్లో ఇద్దరికీ అక్షింతలు పడ్డాయ్, దాంతో పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది. మొదట్లో మర్చిపోవడం కష్టం అనిపించింది కానీ రెండేళ్లకి సర్ది చెప్పుకున్నాం."
“కులం గొడవా?”
“అబ్బే మా వాళ్ళే, కానీ వేరే దెబ్బలాటలు వాళ్ళ కుటుంబం గురించీ, ఆర్ధికంగా పరిస్థితుల గురించీ వగైరా వగైరా.”
"అమ్మాయి బావుంటుందా?" రామారావు అడిగేడు.
"తావలచింది రంభ అని కదా నానుడి?” మహేష్ భట్ చెప్పేడు నవ్వుతూ.
"పెళ్ళై ఉండొచ్చా? ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?”
“ఒకసారి మా ఇళ్లలో గొడవ అవగానే ఇద్దరం మర్యాదగా పక్కకి తప్పుకున్నాం. తర్వాత ఆవిడ గురించి తెలుసుకుని చేయగలిగేదేముంది? ఉద్యోగం మాత్రం చేస్తానని చెప్తూ ఉండేది. అందువల్ల ఏదో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు." మూర్తి నిట్టూర్చేడు. కాసేపటికి తేరుకుని రామారావుతో అన్నాడు, "ఇంక మీ కధ చెప్పండి మరి."
రామారావు చెప్పడం మొదలు పెట్టాడు.
* * * *
మూడో క్లాసులో ఉండగానే తల్లీ తండ్రీపోయిన రామారావుని పెంచుకోవడానికి మేనమావ తన ఇంటికి తీసుకొచ్చేడు వైజాగ్ అక్కయ్యపాలెం కి. వచ్చిన నాలుగు నెలలకే రామారావు పసిమనసుకి తెలిసొచ్చిన విషయం – తాను మావయ్య ఇంట్లో పిలవని పేరంటం. హోమ్ మినిస్టర్ గారు ఏమి చెబితే అలా నోరెత్తకుండా, సంసారం పాడు చేసుకోకుండా గుట్టుగా బతుకుదాం అనుకునే మామయ్య ఆవిడ చేతిలో ఓ తోలుబొమ్మ. వయసు పెరిగేక ప్రపంచ జ్ఞానం వంటబడుతూంటే రామారావు కు తెలిసొచ్చిన మరో విషయం తాను ఎంత త్వరగా మామయ్య ఇంట్లోచి బయటకి వెళ్తే తన బతుక్కీ, మామయ్య బతుక్కీ అంత మంచిది.
అయినా మొట్టమొదట తాను చేయాల్సింది తన కాళ్ళ మీద నిలబడి వీళ్ళ పంచనుండి బయటపడటం. లక్ష్మీ కటాక్షం అయితే రామారావుకీ మేనమావకీ లేదు కానీ సరస్వతి మాత్రం రామారావుని కాస్త బాగానే చూడ్డంతో ఇంజినీరింగ్ కాలేజీలో పడ్డాడు. యూనివర్సిటీ వాళ్ళిచ్చే కొంత ష్కాలర్ షిప్పూ, కొన్ని ట్యూషన్ లూ కుదిరాయి కాలేజీ గడవడానికి. ఇన్నాళ్ళూ తనని రాచి రంపాన పెట్టిన అత్త, తనకి ఇంజినీరింగ్ లో సీటు రాగానే ఇప్పుడు తనకి మిగిలిపోయిన చద్దన్నం మానేసి వేడి వేడి అన్నం వడ్డిస్తూ బంగారు గుడ్లు పెట్టే బాతులా చూస్తోందంటే దానర్ధం రామామావుకి తెలుస్తూనే ఉంది. ఏం మనుషులు, ఏం జీవితాలు? రోడ్డుమీద కుక్కలూ పందులూ కూడా దెబ్బలాటలాడుకోకుండా ఎంగిలి ఆకులు తినగలవేమోకానీ మనుషులు మాత్రం ఇలా జీవితాంతం కొట్టుకు ఛస్తూనే ఉంటారు కాబోలు. రామారావు ఇదంతా చూసి చూసి నిశ్చయం చేసుకున్న విషయం - డిగ్రీ చేతికిరాగానే రెక్కలిప్పుకుని విశాలాకాశంలోకి ఎగిరితే మళ్ళీ ఇటువైపు చూడాల్సిన అవసరం లేదు. అయినా నాలుగేళ్ళనగా ఎంత? ఇట్టే గడిచిపోవూ?
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం లో ఓ రోజు కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ ఎక్కుతూ యధాలాపంగా పక్కకి చూసిన రామారావుకి పక్కవాటాలోంచి బయటకొచ్చే అమ్మాయి కనిపించింది. కాలేజీకి బయల్దేరింది కాబోలు చేతిలో పుస్తకాలున్నాయి. “కొత్తగా దిగారా వీళ్ళు పక్క వాటాలో?” అనుకుంటూ రామారావు సైకిలెక్కేడు.
గంటపోయాక సివిల్ ఇంజినీరింగ్ క్లాసులోకి వెళ్తూంటే తన పక్కనుంచి మరో క్లాసులోకి వెళ్తూన్న ఈ అమ్మాయే మరోసారి కనిపించింది. తర్వాత తెల్సిన విషయాల ప్రకారం అమ్మాయి తనకన్నా తెలివైంది; తనకైతే సీటొచ్చినది సివిల్ బ్రాంచ్ లో కానీ అమ్మాయి చదువుతున్నది కంప్యూటర్ సైన్సు. పేరు కవిత, మొహం మీద బొట్టు చూసి తెలుగువాళ్లనుకున్నాడు కానీ కానీ ఇంటిపేరు షెనోయ్ అని వినేదాకా వాళ్ళు తెలుగువాళ్ళు కాదని తెలియలేదు.
ఎప్పుడైనా హల్లో హల్లో అనుకునే రామారావుకీ, కవితకీ మనసులు కలవడానికి మరో ఏడాది పట్టింది.
ఆ తర్వాత మూడేళ్లకి డిగ్రీ అయ్యి బి హెచ్ పి ఎల్ లో ఉద్యోగం సంపాదించాక భుజాలు పొంగి, నేరుగా కవిత నాన్నగారు శివరాం పనిచేసే ఆఫీసుకెళ్ళిపోయి చెప్పేసాడు – తాను కవితని ప్రేమిస్తున్నట్టూ.
కాసేపు ఆలోచనలో పడినట్టు కనిపించిన శివరాం రామారావుని బయటకి తీసుకెళ్ళి అన్నీ కూపీలాగాక అడిగేడు, “కుర్రాడివి, వృద్ధిలోకి రావాల్సినవాడివి, ఇంట్లో చెప్పావా?”
“మీరు సరేనంటే చెప్దామని…” నసిగేడు రామారావు, “వాళ్ళకి చూచాయగా తెలిసి ఉండొచ్చు లెండి. ఆమాత్రం తెలియదా, పక్క పక్క ఇంట్లో ఉంటున్నాం కదా?”
“నేను మా వాళ్లతో మాట్లాడి చెప్తాను లే. ప్రస్తుతానికి ఏ సంగతీ చెప్పలేను.”
మర్నాడూ, మరో రోజూ ఆలోచించి చెప్పాడు శివరాం షెనోయ్ రామారావు తో, “నీ సంగతి అమ్మాయి, మా ఆవిడతో మాట్లాడాను. ఈ సంబంధం కలిసేది కాదు ప్రస్తుతానికి. మర్చిపో.”
“పుల్ల విరిచి పారేసినట్టూ అలా ఎలా తేల్చేసారు సింపుల్ గా? కవితకి తెలిసిన విషయమే నేను తనని ప్రేమిస్తున్నట్టు. తనకీ ఇష్టమే అని చెప్పింది కూడా. ఇంతకాలం ఆగాను కూడా ఉద్యోగం వచ్చేదాకాను. ఎవడో అల్లాటప్పాగాడి లాగా ‘నన్ను ప్రేమిస్తావా లేకపోతే మొహం మీద ఏసిడ్ పోయమంటావా’ అంటూ ఏడిపించానా?”
“చెప్పాను కదా. మేము ఈ సంబంధం కుదరదని నిర్ణయించుకున్నాం. ఇంకేవుంది మాట్లాడ్డానికి?”
“మర్యాదగా వచ్చి మిమ్మల్ని అడిగాను. అడిగే ముందు కవితతో చెప్పాను కూడా. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారా? కారణం చెప్పకుండా ఎలా? లేకపోతే మీ ఇంటికొచ్చి అందరితో మాట్లాడతా మీ ఎదురుగానే. కవిత మేజర్ కనక మేమిద్దరం పెళ్ళి చేసుకుంటే మీరేం చేయలేరు….”
“కుదరదోయ్, నువ్వు కవితని తీసుకెళ్ళిపోయి పెళ్ళిచేసుకునే అంత సీను లేదు కానీ మాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి. ప్రేమ దోమా అంటున్నావు, కవితకి వేరే సంబంధం కుదిరిపోయి పెళ్ళి అయిపోయి ఉంటే ఏం చేసుండేవాడివి?”
“బ్యూటీ అండ్ ద బీస్ట్ అనే సినిమా చూసారా?” రామారావు అడిగేడు.
“ఏవిటీ? ఆ సినిమా సంగతి ఎందుకు ఇందులో అసందర్భంగా?”
“ప్రేమా దోమా అన్నారు కనక. ఆ సినిమాలో బీస్ట్ ని అందరూ అడుగుతారు, ‘అదేంటి ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటే సరే అన్నావు, ఆవిడవల్లే కదా నీకు మళ్ళీ పాత రూపువచ్చేది’ అని. దానికి బీస్ట్ ఇచ్చే సమాధానమే నేనూ చెప్పేది, “మీ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాతో పెళ్ళి అవకపోయినా ఆవిడ సంతోషంగా ఉంటే చాలు. నన్ను చేసుకోదు కదా అని ఆవిడకి అపకారం తలపెడతాననుకున్నారా?”
కాసేపు ఏదో ఆలోచనలో ఉన్నట్టూ ఉండి శివరాం “పెళ్లవక ముందు అలాగే అనిపిస్తుందిలే. దాన్ని ఆకర్షణ అంటారని పెళ్లైన రెండు మూడేళ్ళకి తెలిసి వస్తుంది. అయినా కుదరదని చెప్పాను కదా? నీకు మా అమ్మాయి ఎక్కడైనా సుఖంగా ఉండడమే కావాల్సింది అన్నావు కనక ఇంక దీనిమీద చర్చ అనవసరం. నీకు కారణమే కావాలిస్తే చెప్తున్నా విను, నీకు నా అన్నవాళ్ళు లేరు. ఇంట్లో మీ మామయ్య నిన్నెలా చూస్తున్నాడో ఊరంతా తెలిసినదే. అన్నింటికన్నా పెద్దవిషయం నువ్వు తెలుగువాడివి, మేము మాట్లాడేది కొంకణి. చెప్పక్కర్లేని మిగతా కారణాలు మావి మాకున్నాయి. ఇంక ఈ సంగతి ఇక్కడ ఆపుదాం.” రామారావుని మరో మాట మాటాడనీయకుండా శివరాం షెనోయ్ లేచిపోయేడు.
* * * *
“అదీ సంగతి. అలా కవిత దూరమైంది,” రామారావు చెప్పేడు.
“అమ్మాయ్ పెళ్ళైపోయిందా? తర్వాత కధ చెప్పేయండి మరి.”
“తర్వాత వాళ్ళు పూనే వెళ్ళిపోయారు. ఏమీ సమాచారం లేదు. నాలుగైదేళ్ళు అయిపోయింది. ఈ లోపున నేను ఆ ఉద్యోగం వదిలేసి సాఫ్ట్ వేర్ లో దిగి ఇలా అమెరికా వచ్చాను హెచ్ -1 వీసా మీద. ఇప్పుడు ఇంకో అమ్మాయితో మరోసారి పెట్టుకోవడానికి నాకు ఓపికా, కోరికా లేవు.”
“కవిత ఇప్పుడెక్కడుందో తెలుసా?”
”ఇంకా పూనాలో ఉన్నారో లేదో తెలియదు. అయినా ఇప్పుడెందుకా విషయం?”
“సరే ఇప్పుడో సరదా ప్రశ్న. కవితకి పెళ్లవలేదనుకుందాం. మీరు గూగిల్ మీద పడి ఎలాగో అలా ఎడ్రస్ సంపాదించి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు అమెరికా లో ఉన్నారనేసరికి శివరాం షెనోయ్ ఎగిరి గెంతులేసి పెళ్ళికి ఒప్పుకోడూ? అదటుంచితే, మీకు ఇంకా కవితని చేసుకోవాలని ఉందా? ఆ సంగతి చెప్పండి ముందు.”
“నేను శివరాం గారితో చెప్పినదే నా సమాధానం. కవితని నేను మనఃస్ఫూర్తిగా ప్రేమించాను. ఆవిడ ఒప్పుకుంటే నేను ఎప్పుడైనా సిధ్ధం. ఎడ్రస్ అదీ ఎలాగో ఒకలాగ సంపాదించ వచ్చు. అయినా…” రామారావు మనసులో మాట నానుస్తూ చెప్పేడు నవ్వుతూ.
“అయితే ఆవిణ్ణి కాంటాక్ట్ చేయడనికి సిద్ధమేనా? గూగిలించండి మరి” మూర్తి కూడా నవ్వేడు.
“ఇప్పుడు పాత విషయాలు అవన్నీకెలికాక మళ్ళీ ఎటుతిరిగి ఎటు వస్తుందో, ఎందుకొచ్చిన తలనెప్పిలెండి.”
“రామారావుగారూ ఓ మాట చెప్తాను వినండి. ఎప్పటికైనా ఎవరో పది నిముషాలు పెళ్ళిచూపుల్లో చూపించిన మనిషిని చూసి చేసుకోవడం కన్నా మీరు ఇష్టపడి ప్రేమించిన మనిషిని చేసుకోవడమే ఉత్తమం కదా?”
రామారావు అవునూ కాదూ అన్నట్టూ తలాడించాడు.
శెలవులు తర్వాత భట్ మరో సారీ రెండో సారీ గుర్తు చేసాక రెండు వారాలు కిందామీదా పడి తెలుసున్నవాళ్లకీ స్నేహితులకీ ఫోన్లు కొట్టి, పూనే లో ఉన్న కవిత ఎడ్రస్ సంపాదించి రామారావు ఆవిడకో ఉత్తరం రాసాడు. అయితే ఊహించని విధంగా రామారావు రాసిన ఆ ఉత్తరం శివరాం షెనోయ్ చేతిలో పడింది మొదట. అది కూతురి చేతిలో పడకుండా ఒకటికి రెండుసార్లు చదివి వాళ్ళావిడతో చర్చించేడు ఉత్తరం సంగతీ, ఆయన తనకున్న ఆలోచనానూ. ఆవిడ కళ్ళు విప్పార్చుకుంటూ, గుండెలమీద చేయి వేసుకుని నోరు వెళ్లబెట్టింది శివరాం చెప్పిన సంగతి విని. మొత్తానికి మరో వారం ఆవిడకి నచ్చచెప్పాక ఇద్దరూ కలిసి కూతురితో ఈ సంగతి చెప్పడానికి సిద్ధపడ్డారు.
మొదటగా కవితకి రామారావు అమెరికాలో ఉన్న సంగతీ అదీ చెప్పి ఉత్తరం చూపించేడు శివరామ్. కాసేపు మౌనంగా ఉన్నాక కవిత అంది, “మీ ఇద్దరికీ మతిపోయిందా, అతను వచ్చి చేసుకుంటానంటే నీకెవరూ లేరు, మేము కొంకణీ, నువ్వు తెలుగూ అంటూ అన్నీ మాట్లాడి పొమ్మన్నారు. ఇంత జరిగాక ఇన్నేళ్ళకి ఓ ఉత్తరం రాసాడు కనక ‘సరే రా, చూసి పోవచ్చు’ అని అడుగుతారా? అప్పట్లో నేను కూడా రామారావుని ఇష్టపడ్డాను కానీ అప్పుడు నా నోరు నొక్కేసారు మీరిద్దరూను. బుధ్ధీ జ్ఞానం ఉన్న ఏ మనిషైనా ఇలా చేయవచ్చా?”
“పాత విషయాలు ఎత్తకమ్మా, రామారావే ఇప్పుడు ఉత్తరం రాసాడు కదా మనకి, తప్పు ఏముంది ఇందులో?”
“మరి దినేష్ సంగతో?”
రామారావు ఓ గంట దినేష్ సంగతి ఏం చేయచ్చో ఎలా మేనేజ్ చేయచ్చో పూర్తిగా చెప్పేడు కవితతో. ఈ తతంగంలో మౌనంగా ఉన్న తల్లి అవును అందా, కాదు అందా అనేది కవితకి ఆవిడ మొహం చూస్తే తెలియలేదు.
మరో వారం ప్రతీరోజూ ఒకరి మీద ఒకరు అరుచుకున్నాక మౌనం. తర్వాత మళ్ళీ వాదనలు. చివరకి శివరాం ఓపిగ్గా వాదించి కూతుర్నీ, వాళ్ళావిడని ఒప్పించాక ఓ కాయితం తీసి ఉత్తరం రాశాడు రామారావుకి. రామారావు ఇండియా వచ్చినప్పుడు ఓ సారి పూనాలో తమ ఇంటికి వస్తే మాట్లాడుకోవచ్చనీ, లేకపోతే ఈ లోపున ఫలానా నెంబర్ కి ఫోన్ చేయొచ్చనీను.