ప్రేమ
మ. బలవంతంబుగఁ బ్రేమ ప్రే మనుచు నిర్బంధించి, వేధించి సం
చలనంబున్ సృజియించు జంతువులకున్ సామాజికశ్రేయమున్
విలువల్ నేర్పెడివార లెవ్వ రకటా! పెద్దల్ వచింపంగఁ జే
తల నొక్కించుక లెక్కసేయని యెడన్ దౌర్భాగ్యమే వ్యాప్తమౌ
ఉ. తప్పొనరించు వేళఁ దన తల్లియు సోదరి గుర్తురారు క
న్గప్పిన కోర్కెచీకటులు కానఁగ నియ్యవు మానవత్వమున్
జెప్పఁగలేని(1) జంతువులు చేయని దుష్కృతు లెట్లు సేతురో?
యెప్పగిదిన్ జరింతు రిఁక నింతులుఁ గన్యలు భద్రశీలలై?(2)
(1) చెప్పశక్యముకాని/మాట్లాడలేని
(2) రక్షింపబడిన శీలము కలవారై
కం. ‘సుడిగుండా’ లను చిత్రము
వడివడిగాఁ జూపి రపుడు బాధ్యతఁ దెలుపన్
సుడిగుండా లెటుఁ జూచిన
నడుగడుగున నేఁడు; వీని నణపఁగ నెట్లౌ?
కం. అప్పటికి లేని వసతులె
యిప్పటి శాపంబు లయ్యె; దృశ్యశ్రవణా
లెప్పుడు మంచిప్రవర్తన
తప్పక చూపించి జనహితంబునుఁ గూర్చున్?
కం. చితి పెట్టిన సంస్కృతికిని
మతి తప్పక నిలుతు రెట్లు మంచిపథాలన్?
ద్రుతమగు(1) బహుదుర్గతులే
ప్రతివాడను దాండవింపఁ బ్రగతి తరంబే?(2)
(1) త్వరితమగు (2) సాధ్యమా