Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
ప్రార్థన
– అయ్యగారి సూర్యనారాయణమూర్తి –

సరస్వతీ కటాక్షము

సీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద
         సురనదీదిందీరశుభ్రగాత్ర
     సుకుమారసుకుమారశుకవారపికసార
         సుస్వరాక్షరశబ్దశోభ నీయ
     ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ
         పదబంధబంధురబంధువు లయి
     మనసార విని సారమును సారసమరంద
         మిందిందిరము వోలె నందుకొనఁగఁ
తే.గీ బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ నెందు
       సందియములేక కను భాగ్య మొంది మనుజ
       భవము తరియించు కవితానుభవముఁ బంచి
      మంచి కలిగించ నెంచి ప్రార్థించువాఁడ
      [శర=ఱెల్లు, దిందీర=నురుగు, బంధుర=ప్రియము]

భావము: శరత్కాలపు చంద్రుడు, మంచుబిందువుల హారము, మొల్లలు, ఱెల్లు గడ్డి,
            ఆకాశగంగ, నురుగు – వీని వలె తెల్లని శరీరముకల దేవి (సరస్వతి) మంచి
            కుమారుని యొక్క (నా యొక్క) కోమలము, ఎన్నో చిలుకల, శ్రేష్ఠమగు కోయిలల,
            వంటి చక్కని స్వరము కలిగిన శాశ్వతమగు/వర్ణములతో కూడిన శబ్దముల శోభ
            నాకు ప్రసాదించగా, కర్పూరము వలె నిర్మలమై గొప్ప రసము మఱియు లయ
            కలిగిన పదముల అల్లికలకు ప్రియమైన చుట్టాలై, మనసు నిండేలా కవిత్వమును
            ఆలకించి, కమలములలోని మకరందమును ఆస్వాదించే తుమ్మెదలవలె కవితా
            సారమును చదువరులు అందుకొనగా, ఎందులో అయినా విస్సందేహముగా మరమాత్మను
            ఎప్పుడూ దర్శించగల భాగ్యమును పొంది, నరజన్మ సార్థకమయ్యే కవితానుభవమును
            అందరికీ పంచిపెట్టి మంచిని కలిగించే ఆలోచనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.

వేంకటేశ్వరుఁడు

సీ. ఎలుగెత్తి పిల్చిన నేలుకొ మ్మంచును
            బరువెత్తి (1) చేరెడు పాలకుండు
      గళమెత్తి నామంబు గానంబు గావింప
           నిలువెత్తు దైవమై నిలుచువాఁడు
      కయిలెత్తి(2) శిరముపైఁ గైమోడ్పు సేయఁగా
          తెరలెత్తు(3) కృపఁ గాంచు దిక్కు తానె
      తనువెత్తు ప్రతిజీవితనుమనోబాధలఁ(4)
          గరమెత్తి(5) తఱిమెడు కన్నతండ్రి
తే.గీ. ఎత్తు శిఖరాల నెక్కలే కెవరు వేఁడ
        చిత్తమునుఁ జిక్కఁబట్టుక(6) చెంతఁజేర
        సరసహృదయుఁడు వేంకటేశ్వరవిభుండు
        కొండ దిగివచ్చు కొండంత యండ యగుచు
                 (1) పరుగెత్తి (2) చేతు లెత్తి (3) పొంగు
                 (4) ప్రతి ప్రాణి యొక్క శారీరక, మానసిక కష్టములను
                 (5) చెయ్యి పైకెత్తి (6) గట్టిగా పట్టుకొని


దేవీదర్శనవైవిధ్యము

సీ. ఒకపరి నుయ్యాల నూఁగెడు నింకొక్క
         పరి దరిఁ జేరెడు బాల యగుచు,
     నొకపరిఁ జిటుకుల(1) నుండు చాముండియై,
         కనకదుర్గాదేవిగా నొకపరి,
     జ్ఞానసరస్వతిగా నొక్కపరిఁ, గొల్హ
         పురలక్ష్మిగా నొక్కపరిని, రామ
     పత్ని సీతగ నొక్కపరి, నన్నపూర్ణగా
         నొకపరి, లలితగా నొక్కపరిని,
తే.గీ. మాత యాదిపరాశక్తి మమ్ముఁ గాంచి
        నికటప్రకటితవాత్సల్యసకలశుభద
         మంగళాయతరూపమ్ము మాకుఁ జూప
         నంచితసువర్ణసుమము(2) లర్పించువాఁడ
                  (1) చిటుకులగ్రామము, సంగారెడ్డి జిల్లా
                  (2) పొందబడిన మంచి అక్షరపుష్పాలు

********

Posted in February 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *