మినీకవిత్వానికి లక్షణం క్లుప్తత అయితే అందాన్నిచ్చేది కొసమెరుపు. అది ఏ ప్రక్రియ అయినా చెప్పదలుచుకున్న విషయాన్ని ఒకలా చెప్తూ చివర్లో మలుపు తిప్పి కొసమెరుపుతో వహ్వా అనిపించడం ఒక రకం..లేదా అభివ్యక్తిని కొసమెరుపుతో సంపూర్ణత చేకూరేలా చెప్పి మెప్పించడం ఒక రకం.
గమనిస్తే, ఇటీవల వెల్లువెత్తుతున్న లఘు కవితా ప్రక్రియలు ఎక్కువగా నానీ ల తరహాలో నాలుగు పాదాలు కలిగి ఉంటున్నాయి. అదే సమయంలో నానీలలా అక్షరాల సంఖ్య పై ఆధారపడి కాక మాత్రా నియమాలతో లయను సాధిస్తూ అదే సమయంలో అంత్యానుప్రాసాలంకారం ద్వారా శబ్ద సౌందర్యాన్ని సాధించేలా రూపు దిద్దుకున్న ప్రక్రియలు అనేకం ఉన్నాయి.
ఆ కోవకు చెందిన మరో అందమైన చిన్ని లఘు కవితా ప్రక్రియ "షాడోలు". ఈ ప్రక్రియ రూపకర్త శ్రీ దేవ యనగందుల. వీరు ఖమ్మం నివాసి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ దర్శిని మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. సాహితీ వనం వాట్స్ అప్ గ్రూపు ద్వారా కవులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే షాడోల కొరకు ప్రత్యే గ్రూపును ప్రారంభించగా విశేష సంఖ్యలో కవులు తమ సృజనలను షాడోల వేదికపై పంచుకుంటున్నారు. 35 మంది పైగా కవులు, ఒక్కొక్కరు 50 చొప్పున షాడో లతో తయారుచేసిన సంకలనం డి.టి.పి. పూర్తి చేసుకుని సిద్దంగా ఉంది.
నాలుగు పాదాలు, మాత్రా నియమం, అంత్యానుప్రాస, కొసమెరుపు మాత్రమే కాక కవినామ ముద్ర కూడా ఉండడం షాడోల ప్రత్యేకత. దీనివలన కవితను చూసినంతనే అది ఎవరి సృజనో గుర్తించడం సులభతరమౌతుంది.
ఇన్ని నియమాలూ చాలా చిన్న చట్రంలో ఇమిడిపోగలగడం సృజించబూనిన కవులకు బాగుంటుంది.
షాడోల ప్రత్యేకత ఏమిటంటే ప్రాస పదాలతో కూడిన చిన్ని చిన్ని పాదాలు కావడం వలన ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండగలవు.
ఈ ప్రక్రియ కాదు, ఏ ప్రక్రియ అయినా సరే కేవలం నియమాలు పాటిస్తూ కవిత్వీకరణ లోపించేలా రచిస్తే అది ఆత్మ లేని దేహంలా శోభను, సంపూర్ణతను ఇవ్వదు. ఉత్తమ కవిత్వం అనిపించుకోదు. కవులంతా ఈ విషయం గుర్తెరిగి సంఖ్యపై కాక నాణ్యతపై శ్రద్ద పెడితే ఉత్తమ కవిత్వం వెలయించిన వారవుతారు.
చక్కని కొసమెరుపుతో సందేశాత్మకంగా వెలుగులు చిమ్మే షాడోలకు నీడ అని అర్ధం వచ్చే షాడో అని పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే దేవయ్యగారు చక్కని సమాధానంతో ఆకట్టుకుంటారు.
"కవిత్వమనేది నిరంతర అధ్యయనం, సామాజిక చైతన్యం, పరస్పర అవగాహన, భావుకతలతో మెరుగుపడే బంగారం లాంటిది. కవినామ ముద్ర వలన చూచినంతనే షాడో సృజించింది ఎవరో చెప్పెయ్యవచ్చు. అలా కవి ముద్ర నీడలా కవితను వెన్నంటి ఉంటుంది కనుకే ఈ ప్రక్రియకు షాడో అని పేరు పెట్టడం జరిగింది. 3 పాదాల్లో విషయం చెప్పి నాలుగో పాదంలో తాత్విక చింతన లేదా చమత్కృతితో ముగించాలి." అన్నారు.
ఇప్పుడు షాడోలు ప్రక్రియ నియమాలు ఒకసారి చూద్దాం.
- ఇది 4 చిన్ని పాదాలు గల సాహిత్య ప్రక్రియ.
- 1,2,3 పాదాలకు అంత్య ప్రాస ఉటుంది.
- 4వ పాదం కవినామ ముద్రతో ముగించాలి. ప్రాస ఉండదు.
- 1,2,3 పాదాలలో ఒకో పాదానికి 7 మాత్రలు చొప్పున ఉంటే 4 వ పాదంలో కవినామంతో కలిపి 12 మాత్రలుండాలి.
- 1,2,3 పాదాలలో ఒకో పాదానికి 8 మాత్రలు చొప్పున ఉంటే 4వ పాదంలో కవినామంతో కలిపి 14 మాత్రలుండాలి.
ఇప్పుడు పాఠకులకు మరింత అవగాహన కోసం నేను సృజించిన కొన్ని షాడోలను మీకు ఉదాహరణగా ఇస్తున్నాను.
ఒక్క నేరం
జైలు ద్వారం
బతుకు ఘోరం
తప్పు చేయకు రాధికా!
పద వినోదం
కడు ప్రమోదం
జనామోదం
మెదడుకు మేత రాధికా!
బతుకు చిన్నది
బంధమున్నది
వీడలేనిది
ముదిమిలోనూ రాధికా!
బతుకు చిన్నది
కోర్కె పెద్దది
అంతులేనిది
సాగిపోవును రాధికా!
స్నేహ ధర్మం
వాలి ఖర్మం
యుద్ద మర్మం
రామ చరితం రాధికా!
శాంతి మంత్రము
బాపు తత్వము
వాంచనీయము
పుడమికోసం రాధికా!
పదవిని వలచి
నీతిని విడిచి
డబ్బులు పంచి
అదో గెలుపా? రాధికా!
క్రింది విధంగా జై శ్రీకృష్ణ శతకం రచించాను.
నరుడు బెదిరెను
మనసు చెదిరెను
రథమునొదిలెను
యుద్దమొద్దనె రాధికా!
ప్రేమ పాశం
పెంచె క్లేశం
ఈ వినాశం
వల్ల కాదనె రాధికా!
ఆప్తులెవరోయ్
నేస్తులెవరోయ్
జగము మాయోయ్
కృష్ణ వచనము రాధికా!
గీతసారము
గొప్ప పాఠము
పూజనీయము
విశ్వ నరులకు రాధికా!
ఈ విధంగా రామ చరితం, వేసవంటే, మొ. విభిన్న అంశాలతో కూడా సృజించవచ్చు. లేదా ఒకో షాడో ఒకో అంశంతో రచించవచ్చు.
మరి తప్పకుండా మీరూ ప్రయత్నిస్తారు కదూ. పిల్లలకు ప్రాస పదాలు అలవాటు చేయడానికి కూడా ఇది ఉపయుక్తమని మరువకండి.
వచ్చే నెల మరో ఆసక్తికరమైన ప్రక్రియ వివరాలతో మిమ్మల్ని పలకరిస్తాను.అప్పటివరకు షాడోలు సృజించండి. ధన్యవాదములు.
ప్రక్రియ ఏదైనా మీరు ముంటు సాహిత్యసేవ చేయడం ముదావహం రాధిక గారు. నేడిలా షాడోలని మీదైన అంశంో చక్కగా రక్తి కట్టించారు. మీకు అభినందనలు మేడంగారు.
రాధిక గారు సాహిత్య ప్రక్రియలలో చాలతేలికగ,చాల సమర్థవంతంగ
రాయగలిగిన ప్రక్రియ షాడో.ఇది నేను కన్న సాహిత్యకల.దీనిని అనేకమంది కవులు ఇటంగ సమర్థవంతంగా సృజించారు.ఇంకా సృజిస్తూనే వునారు.
ఈ ఆధరణకు కృతజ్ఞుడను.మీలాంటి ఆదర్శ కవి రచయితల ఆదరణతో మరెందరి కవులకో చేరువ కావాలని మనఃపూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.అభినంనలతో మీ దేవ యనగందుల🌹🌹🌹🌹
షాడో అనగానే మధుబాబు గారి డిటెక్టివ్ నవలలోని హీరో షాడో గుర్తుకొస్తాడు.
షాడోలు అనే ప్రక్రియ గురించి చక్కగా వివరించారు . రాధికారాణి గారు సృజించిన షాడోలు పసందుగా ఉన్నాయి.
రాధికా అంటూ తనను తాను ప్రేమతో ఆప్యాయంగా పిలుస్తూ తనకు మాత్రమే జీవిత సత్యాలను లఘుకవితలో చెబుతున్నట్లు కవితలను సుందరంగా అక్షరబద్దం చేయడము, కవయిత్రి సమాజాన్ని పరికించిన తీరు పరిశీలనఫలితాలను ఇతరులకు అందిస్తున్న తీరు చాలా బాగుంది.
రాధికా రాణి గారు చాలా చక్కగా వివరించారు.సూపర్.