ఒక పార్టీ
పేరు చూసింది,
నేతి బీర
సిగ్గుపడటం మానేసింది.
గీతమో సంగీతమో కాని
ఇంద్రజాలంమీద మోజు
వద్దని చెబుతున్నా
నా కలానికి.
రాత్రంతా
తపస్సు చేస్తే
చీకటికి
ఒక సూర్యుడు దొరికాడు.
వర్షం ఒక్కసారి కురిస్తే
అంతా సంతోషం,
కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే
అందరికీ దుఃఖం.
మచ్చల చంద్రుడు
నీ కెందుకు!
పూర్ణ కాంతి సూర్యుడితో
పద ముందుకు!
చంద్రుడు చీకటితో
పోరాడటం లేదు,
కల్తీ వెలుతురు
పొలాలు పండించలేదు!
భూమి
దేవుడు,
చెట్టు
భక్తుడు.
పిల్లల్ని
పనిలో పెట్టకు,
పూజకు
మొగ్గల్ని ముట్టకు!
నవ్వటం
కష్టం కాదు,
ఇప్పుడు మనం
ఏడ్వటమే నేర్చుకోవాలి.
అస లిప్పుడు మనం
బతికున్నామా,
మన శవాలమీద పడి
మనమే ఏడవాలి.