ఇపుడు “మనసులు”
నేలమీద కాదు-
అపార్టుమెంట్లలో,
ఆకాశంలో...
కురిసే మబ్బుకు
దమ్ము లేదు
కురవని మబ్బుకు
సిగ్గు లేదు.
నా మనసును నీవే
ఒలిచి తీసుకున్నావు,
మనసు లేదంటూ
నన్నే తిడుతున్నావు!
ప్రపంచ సాహిత్యం అంతా
ఒకవైపు పెట్టినా
వేమన పద్యమే
మొగ్గు చూపుతుంది.
ఆకలి జబ్బున్న
అధికారానికి
తిండి- మందు కాదు,
రోగం కుదర్చాలి.
గోడకు లేదు –
పైన వేసిన
రంగులకే
ఎక్కువ డాబు!
ఆశయాలు వల్లించేది
కంప్యూటరు,
ఆచరించి చూపించేది
ప్రింటరు.
మాతృభాష కోల్పోయిన
మనిషి చెట్టుకు
పువ్వులు లేవు
పండ్లూ లేవు.
నాలుగు దారులు చూడు,
నాలుగు సొంతంగా వేసుకో!
బాగా వెలుగున్న
దారిలోనే నడచుకో!
దేశం “ఏటీయం”లో
దొంగతనం చేస్తున్నవాళ్లు
“సీసీ కెమెరాలు”
ధ్వంసం చేస్తున్నారు.