మన లోపల
వెలుగు నీడల యుద్ధం,
ఎప్పటికీ ముగియదు
అదే జీవితం.
వీధి కుక్కకు
అన్నం పెడతారు,
పిచ్చి దని తెలిస్తే
అందరూ కొడతారు.
మురికి ఊబి నుంచి
పైకి లేచొస్తాడు
స్వయం కృషి వల్లనే
సూర్యుడు.
దేహ పాత్రలో
పోసుకుంటున్న అనారోగ్యం
ముందే చూస్తే జ్ఞాని
పొర్లిపోయా కయితే అజ్ఞాని.
"పగలు"
ఏక వచనం వెలుతురు,
బహు వచన మైతే
చీకటి.
పాలు, దీపాలు
వెలుగుతూ బతు కిచ్చేవే,
ఒకటి లోపల,
ఒకటి బయట.
శ్రమ వల్ల
నరకం స్వర్గ మవుతుంది,
భ్రమ వల్ల
స్వర్గం నరక మవుతుంది.
పగలూ రాత్రి -
కవల పిల్లలు,
ఒకరిది తెల్ల చొక్కా,
ఒకరిది నల్ల చొక్కా.
నా కొడుకులు
ఎలా కొట్టుకుంటున్నారో
చెడబుట్టారు
నా చూపుడు వ్రేలుకు.
చీరల్లో నగల్లో
స్తీలను ముంచేశారు
తమ వేషాలు చూడకుండా
తెలివిగల మగాళ్ళు.