Menu Close
prabharavi

“కిరణాలు”

నూతన లఘు కవితా ప్రక్రియ…
నాలుగు పాదాలు,
ఏ పాదమైనా మూడు పదాలకు మించకుండా…

అంకితం

నాలో పూర్ణ భాగం
“ప్రభా”వతికి
ఈ “ప్రభారవి”

చిత్రాలు, పద చిత్రాలు
ముఖ్యం కాదు,
జనం గుండెల్లో కవి
సత్య చిత్రాలు గీయాలి.

కాగితం మీద రాసినా
కంప్యూటరు మీద కొట్టినా
ప్రజల మనస్సుల మీద
కవిత కనిపించాలి.

కుంకుడుకాయ- షాంపూ కాదు
అసత్యం చెప్పటానికి,
మురికి వదిలితేనే
నురు గిస్తుంది.

చనిపోతుంది మబ్బు
వర్షం బిడ్డను కని,
భూమి పడతి చేతుల్లో
క్షేమంగా పెట్టి!

మైకులకు
సొంత గొంతు ఉండదు,
ఎవడు ఎదురుగా ఉంటే
వాళ్ల గొంతు లవుతాయి.

పొడుచుకుంటున్న నాయకులకు
చొక్కాలు నలగవు,

దూరంగా ఉన్నా
ప్రజలకే గాయాలు.

చీకటి
కొత్తగా పుట్టదు,
వెలుతురు
కల్తీ కావటమే!

చాక్ పీస్ లో
సూర్యుడు కనిపించాడు
అందుకే
టీచరు నయ్యాను.

కుర్చీ
జాతీయ ఆస్తి,
కొన్ని కుటుంబాల వల్ల
దానికి బాగా సుస్తీ.

దొంగల కోసం
వేట కుక్కల్ని తెచ్చుకున్నారు
వాళ్ళే దొంగ లయ్యారు
ఊర కుక్కలుగా మార్చుకున్నారు.

Posted in January 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!