ఒకప్పటి గ్రామపెద్దగా
మన్ననలొందిన ఉపాధ్యాయుడు
నేడు అచేతన శిలయై
చీవాట్లు తింటున్నాడు!
మది మదిని
పదే పదే తడిమి తడిమి
జ్ఞానామృతాన్ని ఉగ్గు పట్టి అందించే
నడిచే గ్రంథాలయాలకు
ఆంక్షల చెదలు పట్టి పీడిస్తున్నాయి!
తన ముఖ కవళికలతో
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే మాస్టార్లు నేడు....
ఫేస్ యాప్ లో కథాకళి నృత్య ప్రదర్శనలిస్తున్నారు!
పిల్లలందరూ ప్రార్థనలో....
ఉపాధ్యాయులందరూ కన్నులు కొడుతూ హాజరులో.....
హతవిధీ...!
తన మేధో విచక్షణతో
కరోనా మహమ్మారి నుండి తప్పించుకున్నా....
అధికార ఒత్తిళ్ళకు
వేసవి తాకిడికి రాలిన పిట్టల్లా
బడిపంతుళ్ళు రాలిపోయారు
ఇంకనూ రాలిపోతున్నారు!
జాగు జంకుతో జరిగే
ద్విచక్ర వాహన ఆటుపోటుల గండాలకు
విగతజీవులైన గురువులెందరో..!
అజ్ఞానాంధకారం తొలగించి
విజ్ఞాన వెలుగులు పంచిన
మహోజ్వల జ్యోతులు
కాలహరణ భయంతో
కాలం చేస్తున్నాయి!
నిత్యము చరవాణితోనే
గురువుల శీల పరీక్ష
కానీ...
చేతిలో చరవాణి
కనబడితే శిక్ష!
నిరసనలు తెలిపే స్వేచ్ఛ
మాట్లాడే హక్కును కోల్పోయి
చరిత్రలను మార్చే గళాలకు
సంకెళ్ళు వేసి అపరాధులుగా
అవమానిస్తుంటే
మూగబోయిన గొంతుకలు
నిర్వేదంతో రోధిస్తున్నాయి!
కష్టపడి ఇష్టంగా చేరిన కొలువు
కొలిమిలా మండుతుంటే
తాళలేని గుండెలు ఆడలేక ఆగిపోతున్నాయి!
పాఠానికి పాఠ్య ప్రణాళికలకు మధ్య
సంధి చేయలేక
సుగ్రీవాజ్ఞను దాటలేక
ప్రతి చర్యలను
దినచర్యలో వ్రాస్తూ
అపనమ్మకపు నీడలో
చేవ్రాల తేదీలతో
ఋజువులు చూపిస్తూ
దినదినమొక పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ
షోకాజ్ అస్త్రాల ధాటికి
తీవ్ర ఒత్తిడికి లోనై
రాలిన ఉపాధ్యాయాభిన్యులకు
అశ్రునయనాలతో
నివాళులు అర్పిస్తూ ...