Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

తిరుమొహూర్

అంత అద్భుతమైన మధుర మీనాక్షీ ఆలయ దర్శనం తరువాత, అసలు మధుర రాజులు వైష్ణవాలయాలని పోషించారా? అన్న ప్రశ్న మనకి రాకపోదు. లేక శైవాగమం మాత్రమే అనుగమించారా, అన్న అనుమానం తీర్చుకోవడానికి మీనాక్షి ఆలయం నించి సుమారు 20 కి.మీ దూరంలో ఉన్న "తిరుమొహూర్" ఆలయానికి వెళ్ళాము. ఇది విష్ణు ఆలయం. ఇక్కడ ప్రధాన మూర్తిని "కాలమేఘ పెరుమాళ్" అని వ్యవహరిస్తారు. ఇక్కడ విష్ణువు 'ప్రధాన శయన' మూర్తిగా వెలిసి ఉన్నాడు. ఇది విష్ణుమూర్తి 108 దివ్యదేశాలలో ఒకటి. అంటే వైష్ణవులు తప్పక చూసి తీరవలసిన ఆలయం.

ఆలయ ప్రమాణం మీనాక్షి గుడి చూసింతరువాత చిన్నదిగా మనకి కనిపిస్తుంది. కానీ పెద్దదే. 1500 ఏళ్ల క్రితంనాటి గుడి. అంటే మీనాక్షి గుడి కంటే ప్రాచీనమైనది. చుట్టూ కొండలు, పొలాలు. ప్రధాన ద్వారం ముందే, తమిళంలో 'ఓం నమో నారాయణాయ' అని రాసి ఉంటుంది. ద్వారగోపురం 5 కలశాల ప్రమాణంలో ఉంటుంది. లోపలికి  అడుగుపెట్టగానే ధ్వజ స్థంభం ఉంటుంది. ఇత్తడితో చేసినట్లు ఉంటుంది. నేను ఇంకెక్కడా చూడని విధంగా ధ్వజ స్థంభం మీదే ఊర్ధ్వపుండ్రాలు చిత్రించబడి ఉన్నాయి. ఆ స్థంభం పైన కప్పుకేసి చూస్తే అందమైన రంగవల్లులు చిత్రించి ఉన్నాయి. కొద్ది అడుగులు ముందుకు వెళితే మొదటి ప్రాకార ద్వారం ముందు ఒక ప్రత్యేకమైన మకరతోరణం ఉన్నది. ఉండడం పెద్ద  ద్వారమే కానీ ఈ మకరతోరణంకూడా అంత పెద్దగానూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెపితే 15 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని ప్రత్యేకతేమిటంటే దీనిమీద కొన్ని వందల దీపపు సెమ్మెలున్నాయి. ప్రత్యేక రోజులలో ఈ సెమ్మెలన్నిటిలోనూ దీపారాధన వెలిగిస్తారుట. (మేము వెళ్ళినప్పుడు లేదు). అప్పుడు అందం ఊహించవలసిందే! అలా లోపలకి వెళితే ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి ఒక ఐదారు మెట్లున్నాయి. వాటికి రెండువైపులా ఏనుగు ముఖాలు, తొండాలు పైనుంచి కిందకి వచ్చి, కింద చుట్ట చుట్టుకున్నట్టుగా ఉంటాయి. అది చూడగానే ఒక భావోద్వేగానికి గురయ్యాను. గుంటూరులో మా ఇంట్లో ఒకప్పుడు ఇల్లు పాతగా ఉన్నప్పుడు మెట్లకి ఇలాగే ఉండేవి. చిన్నప్పుడు ఆ తొండాలమీద జారుతూ ఆడేవాడిని. ఆలయం లోపలకి వెడితే విష్ణుమూర్తి "కాలమేఘ పెరుమాళ్" రూపంలో శయన రూపంలో ఉన్నారు. ఆయన కాళ్ళ దగ్గిర లక్ష్మీదేవి, భూదేవి వెలిసి ఉన్నారు. ఆదిశేషుడి మీద అలవోకగా శయనించి ఉన్నారు.

గుడి ఇంకా బాగా శుభ్రంగా ఉంటే బాగుంటుందని మనకి అనిపిస్తుంది కానీ, ప్రభుత్వ అశ్రద్ధే దీనికి కారణమని ఎన్నిచోట్లో చెప్పారు. అర్చకులు వేదపండితులని నాకు చెప్పారు కానీ, వారు పూజలు చేసే విధానం, మంత్రోచ్చారణ ఇంకా బాగా చెయ్యచ్చనిపించింది.  బహుశ: ముందర ఈ ఆలయం చూసి తరువాత మీనాక్షి గుడికెడితే ఇలా అనుకుని ఉండేవాణ్ణి కాదేమో!

ఇక్కడ ప్రధాన ఆలయం గోడలమీద చెక్కిన స్తంభాలున్నాయి. అవి విడిగా కాక గోడలోనే భాగమన్నమాట. మీనాక్షి ఆలయంతో పోల్చకూడదు! ఆలయం వెనకపక్క ఎంతో అందమైన చెక్కడాలున్నాయి. స్తంభాలుకూడా చాలా అందంగా శిల్పచాతుర్యం ప్రతిఫలిస్తున్నాయి. కొన్ని ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు పక్కనే ఇంకొక ఆలయం ఉన్నట్లుంటే అటువైపెళ్ళాం -

దిగ్భ్రాంతి చెందాను! నేను ఎన్నడూ, ఎక్కడా చూడని "సుదర్శనాలయం" కనబడింది. ఎక్కడో భాస నాటకం ద్యూతవాక్యంలో సుదర్శనుడు ఒక భక్తుడిగా దర్శనమీయడం చదివానే గానీ, ఏ ఆలయంలోనూ, ప్రధాన దేవతగా అర్చింపబడడం చూడలేదు. ఇక్కడ "చక్రత్తాళ్వార్ " రూపంలో పూజలందుకుంటున్నాడు. చాలా బాగా అర్చన చేశారు అర్చకస్వామి. సుదర్శనుడు ఒక చక్ర రూపంలో ఉంటాడు. చక్రానికి చుట్టూతా చాలా పదునైన అంచులు చాలా ఉన్న జ్యోతి రూపాలు ఉంటాయి. అంటే నిప్పులు కక్కుతూ ఊచకోతకోసే సుదర్శన చక్రం - సినిమాల్లో మనకి అప్పుడప్పుడు కనిపించేది - అలా ఉంటుందన్న మాట. ఆ చక్రం మనకి పూర్తి వృత్తం లాగా కనిపిస్తుంది. విగ్రహం ముందు వైపు మధ్యలో సుదర్శనుడి విగ్రహం ఉంటుంది. పదహారు చేతులతో, చక్కటి కిరీటంతో ఎంతో అందంగా ఉన్నాడు. కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టి తల పంకించినట్లు ఉంటుంది. నాట్య భంగిఁమేమో అనుకున్నాను కానీ, ఎవరూ చెప్పలేకపోయారు. పీఠంతో కలిపి విగ్రహం నాలుగున్నర, ఐదు  అడుగులుంటుంది. అర్చకులు నన్ను దగ్గిరకి రానిచ్చారు. జాగ్రత్తగా చూస్తే ఇంకొక ఆశ్చర్యం! ఆ చక్రం మీదే గుండ్రంగా అధిదేవతలు చెక్కబడి ఉన్నారు. వాటిలో విష్ణుమూర్తి ఒకరు! అంటే తన భక్తుడు, ఆయుధదేవతా అయిన సుదర్శనుడికి విష్ణుమూర్తి పరివారదేవతన్నమాట! చాలా ఆనందిస్తున్న సమయంలో అర్చకులు ప్రదక్షిణం చెయ్యమన్నారు. వెనక్కి వెడితే ఆలయం గోడలో ఒక కిటికీ ఉన్నది. దానిలోంచి చూస్తే ఆ సుదర్శన చక్రం వెనుక "యోగ నరసింహు"డున్నాడు! ఇది ఇంకెక్కడా, ఇంకే గుడిలోనూ నేను చూడని విశేషం. చూసితీరవలసినది. ఈ రెండు విగ్రహాలకీ పంచెలు కట్టే తీరు చాలా బాగున్నది. నృసింహ స్వామికి పంచెకట్టు విధానమే సుదర్శనుడికి. అంటే ఆయనకీ, విష్ణువుకీ అబేధం!

నేను భారతదేశంలో చాలా ప్రదేశాలు చూసాను కానీ, (ఇంకా చాలా చూడాలి!) సుదర్శనుడికి ఇంత మంచి ఆలయం, నిత్య సేవలు, ఆకర్షణీయమైన మూర్తి ఇంకెక్కడా చూడలేదు. మీలో ఎవరైనా గమనించి ఉంటే నాకు తెలియజేస్తే ధన్యుణ్ణవుతాను.

ఈ ఆలయ ఆవరణలోనే ముందుపక్క ఎడమచేతివైపు ఒక చిన్న ఆలయం ఉన్నది. అది నరసింహాలయం. కోరలు బాగా కనిపిస్తూ, ఎవరికైనా భయం కలిగిస్తూ అభయం ఇచ్చే మూర్తిగా వెలిసిఉన్నారు. అక్కడ కూడా పూజ చేయించుకుని ఇంకొక అద్భుతమైన క్షేత్రానికి బయలు దేరాము.

### సశేషం ###

Posted in May 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!