పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
పేరాశ – నెత్తిన చక్రం
అనగనగా ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచీ కటిక దరిద్రం అనుభవించీ..అనుభవించీ విసిగి వేసారిపోయారు.
‘మిత్రులారా ఇలా ఎన్నాళ్ళు మనం దరిద్రంతో బాధపడతాము? దేశ సంచారం చేసి ధనం సంపాదించు కుందాము పదండి’ అన్నాడు అందులో ఒకడు.
నలుగురూ కూడబలుక్కుని ఒక రోజు బయలుదేరి కొన్నిరోజులు ప్రయాణించి ఒక నగరం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో బసచేశారు. కాలకృత్యాలు తీర్చుకుని ఆ ప్రక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు. దైవ దర్శనం చేసుకుని వెలుపలికి వస్తుండగా ఆ స్నేహితులకి ఒక యోగి తారసపడ్డాడు.
యోగి ముఖంలోని తేజస్సుకి ఆశ్చర్యపోయి వినయంగా ఆయనకు నమస్కరించారు యువకులు. వారి వినమ్రతకు సంతసించిన యోగి వారిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు.
ఆకలితో అలమటిస్తున్న స్నేహితులకు తన వద్ద ఉన్న ఫలాలు తినమని ఇచ్చి ‘నాయనలారా మీరెవరు? మీది ఏ ఊరు? ఎక్కడికి వెళుతున్నారు? ఇక్కడికెలా వచ్చారు?’ అని ప్రశ్నించాడు యోగి.
తమ గురించి ఆయనకు చెప్పి ‘స్వామీ! ఇన్నాళ్ళూ దరిద్రంతో అల్లాడిన మేము ఇకనైనా డబ్బు సంపాదించాలని ధృఢంగా నిశ్చయించుకున్నాము. మా కోరిక నెరవేరేవరకూ మా ప్రయత్నం ఎంతమాత్రం విడువము’ అన్నారు.
నలుగురి స్నేహితుల పట్టుదల, ఉత్సాహం చూసి మురిసిపోయిన యోగి వారికి పత్తితో (cotton) చేసిన నాలుగు వత్తులు ఇచ్చి ‘ఇవి తీసుకుని మీరు హిమాలయాల వైపుగా కదలి పొండి. ఇవి ఎక్కడైతే మీ చేతులలోంచి ప్రమాదవశాత్తూ జారిపడతాయో ఆ ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉన్నట్లు అర్థం. అక్కడ త్రవ్వి ఆ నిధి తీసుకుని వెళ్ళి సంతోషంగా జీవించండి’ అని ఆశీర్వదించి పంపాడు.
యోగి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి, నలుగురూ ఒక్కొక్క వత్తి తమ తమ చేతులలో భద్రంగా పట్టుకుని, ఆయన సూచించిన మార్గాన తమ ప్రయాణం కొనసాగించారు.
అలా వెళుతుండగా అనుకోకుండా ఒక యువకుడి చేతిలోంచి వత్తి జారి పడిపోయింది. యోగి చెప్పిన ప్రకారం అక్కడ త్రవ్వి చూడగా అంతులేని రాగి ( copper) నిధి దొరికింది.
‘మిత్రులారా రండి. మీరు కూడా పట్టుకెళ్ళగలిగేంత నిధి ఉంది. ఇది తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోదాము’ అన్నాడు ఆ యువకుడు.
తమ మిత్రుడి మాటలు లక్ష్యపెట్టక ముందుకు సాగిపోయారు మిగిలిన ముగ్గురూ. తనకు దొరికిన రాగి నిధిని తీసుకుని ఆనందంగా స్వగ్రామానికి పయనమై వెళ్ళిపోయాడు మొదటి యువకుడు.
మరికొంత దూరం ప్రయాణించాక ఇంకొక యువకుడి చేతిలోంచి వత్తి జారిపడింది. అక్కడ తవ్వి చూడగా వెండి నిధి దొరికింది. ఆ నిధి అందరం పంచుకుందామని ఎంత బ్రతిమిలాడినా వినక ముందుకు సాగిపోయారు మిగిలిన ఇద్దరూ. చేసేదేమీలేక తనకు దొరికిన వెండి నిధిని తీసుకుని సంతృప్తిగా ఇంటిదారి పట్టాడు రెండవ యువకుడు.
అలా ప్రయాణం కొనసాగిస్తుండగా మూడవ వాని చేతిలోంచి జారిపడింది వత్తి. అక్కడ త్రవ్వగా బంగారు నిధి దొరికింది.
‘మిత్రమా వెలకట్టలేనంత బంగారం. ఎన్ని తరాలు తిన్నా తరగని నిధి. నీకెంత కావాలంటే అంతా తీసుకో. ఇక వెనుకకి పోదాము’ అని బ్రతిమిలాడినా వినకుండా ‘మొదట రాగి, తరువాత వెండి, ఇప్పుడు బంగారం అంటే ఇంకా ముందుకు పోతే నాకు తప్పక వజ్రాల నిధి దొరుకుతుందనిపిస్తోంది. కనుక నేను రాను. అంతగా అయితే నువ్వు నీ బంగారంతో వెనుకకి మరలిపో ’ అన్నాడు నాలుగవవాడు.
‘సరే అయితే నీ ఇష్టం. వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేదాకా నీకోసం నేనిక్కడే ఎదురుచూస్తుంటాను’ అన్న స్నేహితుడి మాటలకి సరేనని వేగంగా తన దారిన తరలిపోయాడు నాలుగవ వాడు.
అలా నడిచి వెళుతుండగా ఎండవేడిమికి ఒళ్ళంతా చెమటలు పట్టి దాహం వేసింది ఆ యువకుడికి. నీటి కోసం ఆ చుట్టుప్రక్కలంతా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళాల్సిన దారి మర్చిపోయాడు.
‘ఏం చేయాలి ఇప్పుడెటు వెళ్ళాలి, తెలియటంలేదే?’ అని ఆలోచిస్తుండగా దీన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపించాడు. అతడి నెత్తిపై పెద్ద చక్రం తిరుగుతోంది. అతడి ఒంటిపై అక్కడక్కడా రక్తం మరకలు ఉన్నాయి.
అదేదో విచిత్రంగా అనిపించి తన దాహం సంగతి మర్చిపోయి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి ‘మిత్రమా నీవెవ్వరు? నీ నెత్తిపై ఆ చక్రమేమిటి?’ అని అడిగాడు ఆసక్తిగా నాలుగో యువకుడు.
ఆ మాటలు నోటినుంచి వెలువడ్డాయో లేదో, ఎదుటి వ్యక్తి నెత్తి మీద తిరుగుతున్న చక్రం వచ్చి ఈ నాలుగో యువకుడి నెత్తికి తగులుకుని నెత్తిపై తిరగడం మొదలుపెట్టింది.
అనుకోని ఈ పరిణామానికి నివ్వెరపోయిన నాలుగో యువకుడు ‘అయ్యో మిత్రమా ఇదేమి అన్యాయం?’ అంటూ కేకలు పెట్టాడు.
‘నేను కూడా నీలాగా అడగగానే ఈ చక్రం నా నెత్తిన చుట్టుకుంది. అప్పటినుండీ ఇలాగే ఇక్కడే ఉండిపోయాను’ అన్నాడు ఆ వ్యక్తి.
‘ఇదేమి వింత? ఈ చక్రాన్ని వదిలించుకునే మార్గం చెప్పు’ అన్నాడు విలపిస్తూ.
‘చేతిలో మహత్తుగల వత్తి పట్టుకున్న మనిషెవరైనా వచ్చి నువ్వు నన్నడిగినట్లే అడిగినప్పుడు ఈ చక్రం వెళ్ళి వాడి నెత్తిన చుట్టుకుంటుంది. అంతవరకూ నువ్విలా ఉండవలసిందే’
‘నువ్వెప్పటినుంచీ ఇలా ఉన్నావు?’
‘ఏమో తెలియదు. నేను దరిద్రంతో అల్లాడుతున్నప్పుడు నాకు ఒక మహత్తుగల వత్తి దొరికింది. దానిని తీసుకుని ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్నడిగినట్లే అప్పుడు ఈ చక్రం నెత్తిన తిరుగుతున్న మనిషిని అడిగాను. అంతే ఆ చక్రంవచ్చి నా నెత్తిన చుట్టుకుంది. అప్పటినుండి ఇక్కడే ఇలా ఉన్నాను. కాలమే మర్చిపోయాను.’
‘మరి నీకు ఆకలి దప్పులు లేవా?’
‘ఈ చక్రం నీ నెత్తిపై తిరుగుతున్నంతవరకూ నీకు ఆకలిదప్పులు తెలియవు. అత్యాశపరులకు చిక్కి ఈ నిధులు దురుపయోగం అవకుండా ఇలా ఆ దైవమే ఏర్పాటు చేసి ఉంటాడని అంటారు. మహత్తుగల వత్తులు చేతిలో ఉన్నవాళ్ళే ఈ ప్రదేశానికి రాగలరు. వారికి మాత్రమే ఆ నిధులు కనిపిస్తాయి. సరే మరి. నేను నా స్వగ్రామానికి వెళుతున్నాను. సెలవు’ అని అ వ్యక్తి వెళ్ళిపోయాడు.
తన మిత్రుడికోసం చాలా రోజులు ఎదురుచూసిన బంగారు నిధి దొరికిన యువకుడు, స్నేహితుడిని వెతుక్కుంటూ వచ్చి దుర్భర స్థితిలో ఉన్న అతడిని చూసి ‘ అయ్యో! ఏమిటీ దురవస్థ నీకు. నేచెపితే వినకుండా వజ్ర వైఢూర్యాలంటూ వచ్చి ఇలా ఆపద కొని తెచ్చుకున్నావా?’ అంటూ దుఃఖించాడు.
‘దరిద్రాన్ని వదిలించుకుందామని వచ్చి పేరాశకు పోయి ఈ చక్రం నెత్తిమీదకు తెచ్చుకుని దరిద్రాన్ని శాశ్వతంగా తలకు చుట్టించుకున్నానే!’ అనుకుని ఏడ్చాడు నాలుగో యువకుడు.