సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
పేదవాని కోపం పెదవికి చేటు
ఆముదాలవలస అనే గ్రామంలో అనంతయ్య అనే పెద్ద భూకామందు ఉండేవాడు. అతడికి వంద ఎకరాల పొలం ఉంది. అతడి దగ్గర పొలం పనులు చేయడానికి పదిమంది పాలేర్లు, సుమారుగా యాభై అరవై మంది కూలీలు ఉండేవారు. అతడు వారి చేత పని చేయించుకోడంలో దిట్ట. ఎవ్వరినీ ఒక్కనిముషం కూడా విశ్రాంతి తీసుకోనిచ్చేవాడుకాదు. ఉదయం అల్పాహార సమయంలోనూ, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనాల సమయం లోనూ హడావిడి చేస్తూ 'కానివ్వండి! కూలి ఇచ్చేది తినను కాదు. త్వరగావచ్చి పనిలోకి వొంగండి!" అంటూ వారిని అదిలించేవాడు. పాపం అతడి కేకలకు భయపడి కూలీజనం త్వరత్వరగా ఇంత తిన్నామనిపించి లేచేవారు. అయితే వారికి అతడి భార్య భవానమ్మ మంచి రుచికరమైన సాంబారూ, పచ్చడీ మజ్జిగా పంపేది. దాన్ని కూడా అనంతయ్య పడనిచ్చేవాడుకాదు. అంత రుచికరమైన పదార్ధాలు పెడితే వారు కడుపునిండా తిని నిద్రపోతారు. తగ్గించు" అనేవాడు.
భవానమ్మ మాత్రం "ఈ విషయంలో మీరేం పట్టించుకోకండి. వాళ్ళు కాయకష్టం చేస్తేనే మనం హాయిగా తింటున్నాం. ఇంత మేడా, మిద్దే కట్టుకుని మన ధాన్యాన్ని గాదేల్లో నింపుకుని సొమ్ము చేసుకుంటున్నాం. పనిచేయించుకోడం మీవంతు, భోజనం పెట్టడం నావంతు. ఈ విషయనికి రాకండి" అని ఖరాఖండీగా చెప్పాక, ఇహ లాభంలేదని అనంతయ్య వారు భోజనం చేసే సమయంలో దగ్గరుండి అదలించేవాడు.
అతడివద్ద నిజాయితీగా పనిచేసే నాగప్ప ఒకమారు జ్వరపడి, అనంతయ్య సెలవీయనందున ఆ జ్వరంతోనే పనిలోకి వచ్చాడు. రోజూలా హుషారుగా పనిచేయలేకపోయాడు. అనంతయ్య గమనించి "ఏం నాగప్పా! పనిదొంగవయ్యావు. ఊ కానీ. లేకపోతే కూలీలో కోతవేస్తాను." అని బెదిరిస్తూ వెంటపడ్దాడు. ముసలి తల్లీ తండ్రీ, తమ్ములూ చెల్లెళ్ళే కాక వాని దిక్కులేని అత్తా మామా కూడా అతడి కూలీ డబ్బులపైనే ఆధారపడి తింటుండటాన యజమాని మాటలకు భయమేసిన నాగప్ప ఆ రోజు మధ్యాహ్న భోజనానికి కూడా వెళ్లకుండా పని చేయసాగాడు.
అనంతయ్య పెద్ద పాలేరు రామయ్య ఇది చూసి "ఏమైంది నాగప్పా! భోజనం చేయకుండానే పని చేస్తున్నావు? రారా ఇంత తిని పనిచేయి" అని పిలిచాడు. దానికి నాగప్ప దుఖాఃన్ని ఆపుకుని పెదవి కొరుక్కుంటూ "ఏముందయ్యా! జ్వరం రావటాన పని త్వరగా చేయలేకపోతున్నాను. త్వరగా చేయలేదని భూకామందు కోప్పడుతున్నాడు. అందుకే తిండి మానేసి ఆ సమయంలో కూడా పని చేస్తున్నాను." అన్నాడు. దానికి రామయ్య "నాగప్పా! పేదవాని కోపం పెదవికి చేటని వినలేదా! మన భూకామందు కోప్పడనివాడెవ్వడు? దాని కోసం తిండిమానేస్తే నష్ట మెవరికి, రారా భవానమ్మగారు ఎంతో ప్రేమగా వండించి పంపించే భోజనం చేయి. నీ జ్వరమంతా ఇట్టే మాయమైపోతుంది. ఆ తల్లిని చూసి అంతా ఈయన మాటలు పట్టించు కోడంలేదు. లేకపోతే ఏమయ్యేదో, రారా" అని చేయి పట్టుకుని భోజనానికి తీసుకెళ్లాడు రామయ్య నాగప్పని.